Off The Record: ఆ కొత్త పలుకు వెనకున్న కారణాలేంటి? పదేళ్ళు ఎంపీగా పనిచేసినా… ఎక్కడా సౌండ్ చేయని లీడర్…. ఎమ్మెల్యే అయిన ఏడాదిన్నరకే ఎందుకు రీ సౌండ్ ఇస్తున్నారు? రకరకాల మాటలతో వివాదాలు రేపడం వెనకున్న రీజనేంటి? ప్రభుత్వాన్ని పొగిడిన నోటితోనే ఎందుకు విమర్శిస్తున్నారు? ఎవరా నాయకుడు? ఏంటా రివర్స్ రీ సౌండ్ స్టోరీ?
Read Also: JD Vance : ప్రధాని మోడీతో జేడీ వాన్స్ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై చర్చ
సిద్దిపేట జిల్లా దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి. ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో ట్రెండింగ్ పొలిటీషియన్ ఆయన. గతంలో రెండు సార్లు మెదక్ ఎంపీగా చేసినప్పుడు అసలు ఉన్నారా లేరా అన్నట్టు ఉండేవారు. పార్టీ అధికారంలో ఉన్నా ఎక్కడా వివాదాల జోలికి వెళ్లేవారు కాదు. ఇక 2023 అసెంబ్లీ ఎన్నికల టైంలో దుబ్బాక BRS అభ్యర్థిగా బరిలో ఉన్న ప్రభాకర్ రెడ్డి మీద హత్యాయత్నం జరిగింది. అప్పుడు కూడా ఆయన ఎక్కడా ఎవరి మీద ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. మొదటి నుంచి వివాద రహితుడన్న పేరుంది. కానీ… ఎమ్మెల్యేగా గెలిచాక మాత్రం ఈ సైలెంట్ లీడర్ కాస్తా… వైలెంట్ అయ్యారని అంటున్నారు. సొంత పార్టీ మీదే విమర్శలు చేయడం, ప్రభుత్వాన్ని పడగొట్టాలి అంటూ సంచలన కామెంట్స్ చేస్తూ రాజకీయాల్లో వివాదాలకు కేరాఫ్ అవుతున్నారు.
Read Also: YS Jagan: రేపు వైఎస్ జగన్ అధ్యక్షతన పొలిటికల్ అడ్వైజరీ కమిటీ తొలి సమావేశం..
అయితే, ఇటీవల అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత నియోజకవర్గ అభివృద్ధిపై కోసం సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు కేపీ. స్కిల్ యూనివర్సిటీతో పాటు, రెండు ఇంటిగ్రేటెడ్ హాస్టల్స్ ఏర్పాటు చేయాలని సీఎంని కోరగా ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు. స్కిల్ యూనివర్సిటీ కోసం చీకోడులో అధికారులు సర్వే చేశారు కూడా. అప్పడు కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ తమ BRS ప్రభుత్వం పాలించిన పదేళ్లలోనూ దుబ్బాక నియోజకవర్గానికి నిధులు రాలేదంటూ బాంబు పేల్చారు. ఇప్పుడు అడగ్గానే నిధులు మంజూరు చేసిన సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు అంటూ ప్రశంసల వర్షం కురిపించారు. దీంతో ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారట బీఆర్‌ఎస్ పెద్దలు. కొంపతీసి కొత్త ప్రభాకర్ రెడ్డి కాంగ్రెస్ వైపు చూస్తున్నారా అన్న అనుమానాలు సైతం వచ్చాయి. తర్వాత BRS రజతోత్సవ సభ సన్నాహక సమావేశంలో పార్టీ అధినేత కేసీఆర్ తన వ్యాఖ్యలపై వివరణ ఇచుకున్నారట కొత్త. ఇక కేసీఆర్‌ని కలిసిన కొద్ది రోజులకే మరో బాంబు పేల్చారు కొత్త. ఈ నెల 14న నిర్వహించిన బీఆర్ఎస్ నాయకుల సమావేశంలో ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపాయి. బిల్డర్లు, పారిశ్రామికవేత్తలు ఈ ప్రభుత్వాన్ని పడగొట్టండి అంటున్నారని… అవసరమైతే ఎమ్మెల్యేలను కొనమంటున్నారని దానికి వాళ్లే డబ్బులిస్తామని అంటున్నారంటూ సంచలన ప్రకటన చేశారాయన.
Read Also: Ashu Reddy : బ్రెయిన్ సర్జరీ వీడియో బయటపెట్టిన అషురెడ్డి..
ఇక, ఈ ప్రభుత్వంపై పిల్లల నుంచి పెద్దల దాకా అన్ని వర్గాల్లో వ్యతిరేకత ఉందని కామెంట్స్ చేశారు. ఆ వ్యాఖ్యలపై మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక మరుసటి రోజే ఎమ్మెల్యే మాట మార్చారు. ప్రభుత్వాన్ని పడగొడతామని తాము అనలేదని, ప్రజల అభిప్రాయం మాత్రమే చెప్పానని సమర్దించుకున్నారు. ఇలా ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ చేస్తున్న కామెంట్స్ ఇప్పుడు వరుసగా చర్చనీయాంశమవుతున్నాయి. ఎమ్మెల్యే అయ్యాక తన స్వరం మార్చడం వెనక కారణాలేంటన్న చర్చ జరుగుతోంది. అలాగే ఆయన వైఖరిలో క్రమంగా మార్పు వస్తోందని బీఆర్ఎస్ శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి. ఆయన అనుచరులు మాత్రం దూకుడు పెంచాలన్న ఉద్దేశ్యంతోనే అలా మాట్లాడినట్టు చెబుతున్నా… బయట మాత్రం రకరకాల ప్రచారం జరుగుతోంది. ఆనాడు పొగిడిన నోటీతోనే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తిట్టడం వెనుక ఏదో బలమైన కారణం ఉందనేది రాజకీయ విశ్లేషకుల మాట. ప్రతిపక్ష ఎమ్మెల్యే అయ్యి ఉంది సీఎంని పొగడటం, సొంతపార్టీపై విమర్శలు చేయడంతో ఆయనకు పార్టీలో ప్రతికూల పరిస్థితులు ఏర్పడి ఉండవచ్చని, అందుకే నష్ట నివారణ చర్యల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై ఇలా కామెంట్స్ చేశారనేది మరో వాదన. ఎలా ఏది ఏమైనా వివాదాలకు దూరంగా ఉండే కొత్త ప్రభాకర్ రెడ్డి మాత్రం ఈ మధ్య కేరాఫ్ కాంట్రవర్శీ అవుతున్నారట. మరి ఇప్పటికైనా పాత ప్రభాకర్ రెడీని చూస్తామా..? లేదా ఇంటి పేరు కొత్తని ఓన్ చేసుకుని దూకుడుగా ఉంటారా అన్నది చూడాలి..