ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడికి ఇన్‌ఫ్రంట్ దేరీజ్ క్రోకడైల్ ఫెస్టివలా? ఇన్నేళ్ళలో ఎన్నడూ లేని కొత్త టాస్క్ ఆయన ముందుకు వచ్చిందా? ఆ లక్ష్యాన్ని చేరుకోలేకపోతే… చివరికి సొంత కార్యకర్తలే నిలదీసే పరిస్థితి వస్తుందా? ఇంతకీ ఏంటా కొత్త టార్గెట్? మాథవ్ మీద అంత ప్రెజర్ ఎందుకు బిల్డ్ అవుతోంది? ఏపీ బీజేపీలో ఇన్నాళ్ళు ఒక ఎత్తు, ఇక నుంచి మరో ఎత్తు అన్నట్టుగా మారిపోయిందట వ్యవహారం. కూటమిలో వాటాల ప్రస్తావన సీరియస్ అవడంతో… మేమేంటో కూడా నిరూపించుకోవాలని కాషాయ లీడర్స్, కేడర్ తహతహలాడుతున్నట్టు సమాచారం. ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు చేసిన కామెంట్స్ చుట్టూ ఇప్పుడు హాట్ హాట్ చర్చ జరుగుతోంది. కూటమి ప్రభుత్వంలో తమ పదవుల వాటాను ఐదు శాతమంటూ ఏ లెక్కన తేల్చారని ప్రశ్నించారాయన. అక్కడితో ఆగలేదు సరికదా… ఇంకొంచెం ఘాటు వ్యాఖ్యలతో సెగ పుట్టించడంతో పాటు పార్టీ రాష్ట్ర శాఖ కొత్త అధ్యక్షుడు మాథవ్‌కి కొత్త టాస్క్ ఫిక్స్ చేశారని మాట్లాడుకుంటున్నాయి పార్టీ వర్గాలు. పదవుల్లో పార్టీకి అన్యాయం జరిగితే… టీడీపీ గల్లా పట్టుకోవాలని అన్నారు విష్ణు. ఇప్పుడీ కామెంట్ చుట్టూనే తిరుగుతోంది చర్చ మొత్తం.
ఇప్పటికే తమను మైనర్ భాగస్వామిగా చూస్తున్నారని, పదవుల విషయంలో అస్సలు పట్టించుకోవడం లేదని గుర్రుగా ఉన్నాయి ఏపీ బీజేపీ శ్రేణులు. ఇప్పుడు ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు అలాంటి వాళ్ళకు మంచి బూస్ట్ ఇచ్చాయట. విష్ణు అన్నట్టు తేడావస్తే… నిజంగానే మాథవ్ టీడీపీ గల్లా పట్టుకోగలరా? అసలు ఆయనకా సత్తా ఉందా అంటూ… ఏపీ కాషాయ కేడర్ మాట్లాడుకుంటున్నట్టు సమాచారం. గతంలో కూడా టీడీపీతో సఖ్యతగా ఉండి, కలిసి పని చేసిన నాయకుడిగా… ఇప్పుడు దూకుడు చూపించగలరా? అన్యాయం జరిగిందని టీడీపీ అధిష్టానాన్ని నిలదీయగలరా అంటూ ఎవరికి వారు రకరకాల విశ్లేషణలు చేసేస్తున్నారు ద్వితీయ శ్రేణి బీజేపీ నాయకులు.
ఆయన మెతక వైఖరి వీడి గట్టిగా నిలదీస్తేనే… తమకు పదవులు వస్తాయన్నది వాళ్ళ ఆశ అట. విష్ణుకుమార్ రాజు అడిగిన ప్రశ్నకు వేదిక ముందున్న కార్యకర్తలు విజిల్స్ వేసి మరీ మద్దతు తెలపడాన్నే ఇందుకు ఉదాహరణగా చెబుతున్నారు. సాధారణంగా ఏపీ బీజేపీలో నినాదాలు తప్ప…. కేడర్ విజిల్స్‌వేసి ఆనందం వ్యక్తం చేసిన సందర్భాలు లేవని, తొలిసారి ఎమ్మెల్యే విష్ణు మాటలకు విజిల్స్ పడ్డాయంటే… కార్యకర్తలు ఎంత ఆతృతగా ఎదురు చూస్తున్నారో అర్ధం చేసుకోవచ్చని అంటున్నారు. తమ మనసులో మాట విష్ణుకూమార్‌రాజు నోటి నుంచి రావడంతోనే… వాళ్ళలో ఆనందం కట్టలు తెంచుకున్నట్టు చెప్పుకుంటున్నారు. నామినేటెడ్ పదవులు సహా… ప్రతి అంశంలోనూ తమ ప్రాధాన్యత తగ్గుతోందని, ఇలా ఉంటే ముందు ముందు అస్సలు విలువ ఉండదంటూ ఇటీవల ఏపీ బీజేపీలో చర్చ పెరిగిపోయింది. కేంద్రంలో తమ అవసరాన్ని కూడా గుర్తుంచుకుని రాష్ట్రంలో పదవులు కేటాయించాలంటూ ఇటీవల వాయిస్ పెరిగింది. మేం నిలబెట్టగలం, కావాలంటే పడగొట్టనూగలం అంటూ… ఇటీవల ఆ పార్టీ ఎంపీ ఒకరు కామెంట్ చేశారు. బీజేపీ బెదిరిస్తోందా అంటూ అప్పుడే రకరకాల వ్యాఖ్యలు వచ్చాయి. ఈ పరిస్థితుల్లో విష్ణు మాట్లాడ్డం, అందుకు కేడర్ విజిల్స్ వేయడం చూస్తుంటే… పార్టీ రాష్ట్ర శాఖ కొత్త అధ్యక్షుడికి టాస్క్ ఏమంత ఈజీగా లేదన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది పొలిటికల్ సర్కిల్స్‌లో. కూటమి ప్రభుత్వంలో తమ పదవుల వాటా పెరగాలన్నదే కాషాదళంలో టాప్ టు బాటమ్ ఉన్న అభిప్రాయంగా తెలిసింది.
మాథవ్‌కు టీడీపీ పెద్దలతో సత్సంబంధాలే ఉన్నాయంటారు. ఆయన రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నిక అవడానికి అది కూడా ఒక కారణమని చెప్పుకుంటున్నారు. అలాంటి నాయకుడు ఇప్పుడు అన్యాయం జరిగిందంటూ… నిజంగా గల్లా పట్టుకుని అడగ గలరా అన్నది మిలియన్ డాలర్ క్వశ్చన్. కూటమి ధర్మం పాటించడమంటే…. ఎంతిస్తే అంత తీసుకుని, కిమ్మనకుండా ఉండటం కాదనేది బీజేపీ నేతల తాజా అభిప్రాయం. ఈ క్రమంలో ఇప్పుడు మాథవ్ గట్టిగా మాట్లాడగలరా? కూటమిలో పార్టీకి షేర్ పెంచగలరా లాంటి ప్రశ్నలకు సమాధానాలు వెదుకుతున్నారు కార్యకర్తలు. ఆయన నిజంగా ఆ పని చేయగలరా లేదా అన్న సంగతి పక్కనబెడితే… విష్ణు స్టేట్‌మెంట్‌కు కేడర్ రియాక్షన్‌ను చూస్తుంటే… మాత్రం టాస్క్ చాలా పెద్దదేనని అనిపిస్తోందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.