Off The Record: ఏపీ కాషాయ దళం… కొత్తగా జయంతి, వర్ధంతుల రాజకీయం మొదలుపెట్టిందా? పెద్దల ఫోటోలకు వేసే దండల్లోనే ఓట్లు వెదుక్కుంటోందా? కుల రాజకీయాన్ని కొత్త కోణంలో ఆవిష్కరించబోతోందా? లుక్ అండ్ ఫీల్ మార్చేసి… ఫక్తు బడుగు, బలహీన వర్గాల పార్టీ ముద్ర కోసం ప్రయత్నిస్తోందా? ఇంతకీ బీజేపీ నయా రాజకీయం ఏంటి? మునుపటికి భిన్నంగా ఏం చేస్తున్నారు ఆ పార్టీ లీడర్స్?
Read Also: Jodha-Akbar: జోధా-అక్బర్ పెళ్లి నిజం కాదు, బ్రిటీష్ ప్రభావిత భారత చరిత్ర: రాజస్థాన్ గవర్నర్
ఆంధ్రప్రదేశ్ బీజేపీలో కొత్త పోకడలు కనిపిస్తున్నాయంటున్నారు పరిశీలకులు. ప్రత్యేకించి రాష్ట్రంలో ఇన్నాళ్లు పార్టీ పరిస్థితులకు భిన్నంగా… కనిపిస్తున్నాయని అంటున్నారు. ఎంత కూటమిలో ఉన్నా… అధికారం చెలాయిస్తున్నా… సొంత బలం ఉంటేనే గౌరవం అన్న నిర్ణయానికి వచ్చిన ఏపీ కాషాయదళం… ఆ దిశగా అడుగులేస్తోందట. రొటీన్‌కు భిన్నంగా… కుల సమీకరణాలను ఫాలో అయితే తప్ప… రాష్ట్రంలో నిలదొక్కుకోలేమని భావిస్తున్నట్టు సమాచారం. అందుకే ఇటీవల కార్యక్రమాల నిర్వహణలో ఆ తరహా శ్రద్ధ తీసుకుంటున్నట్టు చెప్పుకుంటున్నారు. మరీ ముఖ్యంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ ఓట్ బ్యాంక్ మీద దృష్టిపెట్టిన కమలం పార్టీ…. ఆయా సామాజికవర్గాలను ఆకట్టుకునే ప్రయత్నంలో ఉందట. ఇటీవల రాష్ట్రంలో పార్టీ పరంగా నిర్వహించిన అంబేద్కర్ జయంతి వేడుకలు అందులో భాగమేనని అంటున్నారు. ఓటింగ్ పరంగా బలమైన శక్తులుగా ఉన్న కులాలను ఆకర్షించడం, అందరి పార్టీగా పేరు తెచ్చుకోవడం మీద దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది.
Read Also: Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీకి మధ్యంతర బెయిల్ మంజూరు
ఇక, ఇన్నాళ్ళు బీజేపీ అంటే అర్బన్ పార్టీ అని, కొన్ని ఆధిపత్య కులాల పార్టీ అంటూ జరుగుతున్న ప్రచారాన్ని, ఉన్న ముద్రను చెరిపేసుకోవడమే లక్ష్యంగా అడుగులు పడుతున్నాయట. ఆ ఓట్ బ్యాంక్‌ని ఆకట్టుకోవాలంటే… ముందు మనం ఆ దారిలోకి వెళ్ళాలని, వాళ్ళు గౌరవించే వాళ్ళను ముందుగా మనమే గౌరవించుకోవాలనుకుంటూ…. బీసీ, ఎస్సీ, ఎస్టీ ప్రముఖుల జయంతులు, వర్ధంతి కార్యక్రమాల నిర్వహణకు ప్రాధాన్యం ఇస్తున్నట్టు తెలుస్తోంది. బీఆర్ అంబేద్కర్ లాంటి ఆదర్శప్రాయుల జయంతి కార్యక్రమం అంటే… ఏదో.. ఒక ఫోటోకు దండేసి, పూలు చల్లి మమ అనిపించడం కాకుండా… వారాలు, నెలల పాటు ఉత్సవాల మాదిరిగా నిర్వహించాలన్న నిర్ణయంతో… అలాంటి కార్యక్రమాలకే ప్రాధాన్యం ఇస్తున్నారట ఏపీ బీజేపీ లీడర్స్. తాజాగా… మహిళలు, బలహీన వర్గాలకు సేవ చేసిన అహిల్యాబాయి జయంతి వేడుకల్ని నెల రోజులపాటు నిర్వహించడం వెనుక ఆంతర్యం అదేనని అంటున్నారు పరిశీలకులు. దీని వెనక బీసీ ఓట్‌బ్యాంక్‌ని ఆకట్టుకునే రాజకీయ తంత్రం ఉందని అంటున్నారు. బీజేపీ కేవలం కొన్నివర్గాల పార్టీ కాదని, బడుగు బలహీన వర్గాలందరి పార్టీగా కనిపిస్తేనే…, క్షేత్రస్ధాయి బలపడతామన్నది అధిష్టానం విశ్వాసం అట. అందుకే వరుస కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు చెప్పుకుంటున్నారు.
Read Also: PBKS vs RCB : ఆర్సీబీ బౌలర్ల విజృంభణ.. పంజాబ్ బ్యాటర్లు కుదేలు…
అయితే… ఇదే సమయంలో మరో రకమైన చర్చ కూడా జరుగుతోంది. కూటమిలో భాగస్వామిగా ఉన్నప్పుడు, ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రంలో ఇలాంటి ఎత్తుగడలు ఫలిస్తాయా? అదంతా కుదిరే పనేనా అని మాట్లాడుకుంటున్నాయి రాజకీయ వర్గాలు. రాష్ట్రంలో ఇప్పటికే ఎవరి ఓట్ బ్యాంక్ వాళ్ళకు స్థిరంగా ఉంది. బీజేపీ కొత్తగా టార్గెట్ చేయాలనుకుంటున్న బీసీ, ఎస్సీ, ఎస్టీ ఓట్ బ్యాంక్‌ల విషయంలో కూడా చాలా క్లారిటీ ఉంది. ఆయా సామాజికవర్గాల్లో టీడీపీ, వైసీపీ, జనసేన ఇప్పటికే తమ ముద్ర వేసి స్థిరంగా ఉన్నాయి. మూడు ప్రాంతీయ పార్టీలు అంత బలంగా ఉన్నచోట, ఎవరి పర్సంటేజ్‌ని వాళ్ళు ఫిక్స్‌డ్‌గా ఉంచుకుంటున్న పరిస్థితుల్లో… కొత్తగా బీజేపీ ఎక్కడి నుంచి సంపాదిస్తుంది, ఎవరి ఓట్ బ్యాంక్‌ని చీలుస్తుందన్నది క్వశ్చన్ మార్క్ అంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఇప్పుడు మొదలుపెట్టిన క్యాస్ట్ బేస్డ్ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ ఏపీ కాషాయ దళానికి ఎంతవరకు కలిసొస్తాయన్నది ఇప్పుడే చెప్పలేమంటున్నారు పొలిటికల్ పండిట్స్. ఏదో రకంగా ఏపీలో పాగా వేద్దామని చూస్తున్న బీజేపీ ప్లాన్స్ ఏ మేరకు వర్కౌట్ అవుతాయో చూడాలి మరి.