Off The Record: వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఓ వెలుగు వెలిగిన ఆ మాజీ ఎంపీ…. ఇప్పుడు రెంటికీ చెడ్డారా? ఎప్పుడూ వివాదాలతోనే అంటకాగే నాయకుడికి ఇప్పుడు అవే శాపం అయ్యాయా? ప్రస్తుతం ఆయన కావాలనే మౌన వ్రతం పాటిస్తున్నారా? లేక పార్టీనే కాస్త పక్కకు జరగమని చెప్పిందా? ఎవరా కేరాఫ్ కాంట్రవర్శీ లీడర్? మౌనానికి ముందు తగిలిన దెబ్బేంటి?
Read Also: Off The Record: ఫైర్ బ్రాండ్ రాజాసింగ్ ఒక్కసారిగా కూల్ అవడానికి కారణాలేంటి?
రాజకీయాల్లో ఉన్న వాళ్ళకు వివాదాలు రెండు వైపులా పదునున్న కత్తి లాంటివి. ఒక్కోసారి… అవే పాపులర్ చేస్తాయి. ఇంకోసారి ఎత్తి అగాధంలోకి పడేస్తాయి. హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ విషయంలో ఈ రెండూ జరిగిపోయాయి. ఒకప్పుడు పోలీస్ ఆఫీసర్‌గా కెరీర్ ప్రారంభించిన మాధవ్…. 2019 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు. పార్టీలోకి ఎంటర్ అవుతూనే… ఎంపీ టికెట్ దక్కడం, హిందూపురం నుంచి భారీ మెజారిటీతో గెలవడం చకచకగా జరిగిపోయాయి. సీఐగా ఉన్నప్పుడు గబ్బర్ సింగ్ తరహాలో తనదైన శైలిలో డ్యూటీ చేశారు గోరంట్ల. అప్పట్లో ఏదోరకంగా నిత్యం వార్తల్లో ఉండేవారాయన. అంతవరకు ఆ వైఖరి గొప్పగానే ఉన్నా… హీరోయిజం చూపినా నడిచిపోయిందిగానీ…. పోలీస్ నుంచి ప్రజాప్రతినిధిగా మారాక కూడా ఆయన వైఖరి మారకపోవడం రకరకాల వివాదాలకు దారి తీసింది. తమ ప్రాంత వాసులకు ఉద్యోగాలు ఇవ్వడం లేదంటూ కియా కార్ల ఫ్యాక్టరీలోనే కారు మీద ఓపెన్ గా రాయడం, మాజీ ఎంపీ జేసీ కుటుంబంపై కయ్యానికి కాలు దువ్వడం, ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పదునైన విమర్శలతో మాటల దాడి చేయడం లాంటి రకరకాల వివాదాలు ఆయన చుట్టూ వైఫైలై తిరిగాయి.
Read Also: Off The Record: సీఎం రేవంత్ ని నాడు వద్దన్న నేతలే.. నేడు పోటీ పడి పిలుస్తున్నారా?
సరే, అవంటే రాజకీయ విమర్శలు, ఉనికి కోసం పడే పాట్లు అనుకున్నా… వాటన్నిటికీ మించిన మరో వివాదం ఒక రకంగా.. గోరంట్ల మాధవ్ రాజకీయ జీవితానికి మరణశాసనం రాసిందన్న అభిప్రాయం బలంగా ఉంది. ఎంపీగా ఉన్నప్పుడే బయటికి వచ్చిన మాధవ్ న్యూడ్ వీడియో…. గల్లీ నుంచి ఢిల్లీదాకా వైరల్ అయింది. దాని గురించి ఢిల్లీలో ఎంపీల మధ్య కూడా చర్చ జరిగిందంటే…. ఎంపీ సాబ్ ఏ స్థాయిలో బద్నాం అయ్యారో అర్ధం చేసుకోవచ్చు. ఆ వీడియో ఎఫెక్ట్‌తోనే… చివరకు 2024 సార్వత్రిక ఎన్నికల్లో టిక్కెట్ రాలేదని చెప్పుకుంటారు. టికెట్ రాకున్నా… గోరంట్ల మాధవ్ మాత్రం.. వైసీపీలోనే కొనసాగుతూ వచ్చారు. ఎన్నికల ముందు కాస్త స్తబ్దుగా కనిపించినా తర్వాత యాక్టివ్ అయ్యారాయన. రాప్తాడు నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి యాక్టివ్‌గా లేని సమయం చూసి మొత్తం కలియదిరిగేశారు మాధవ్. ఇక అక్కడ పాగా వేసే ప్లాన్‌లో ఉండగానే….విషయాన్ని పసిగట్టిన ప్రకాష్‌రెడ్డి తిరిగి యాక్టివ్ అయ్యారు. దీంతో రాప్తాడు రహదారి బంద్ అయింది.
Read Also: Off The Record: వరంగల్ లో డ్యూటీ చేయడానికి పోలీసులు హడలిపోతున్నారా?
ఇదే సమయంలో వైసీపీ అధినేత జగన్, ఆయన భారతి మీద అనుచిత వ్యాఖ్యలు చేశారు చేబ్రోలు కిరణ్. అందుకు సీరియస్ అయిన కూటమి ప్రభుత్వం… కిరణ్‌ను అరెస్టు చేయించింది. ఆయన్ని కోర్ట్‌కు తరలించే సమయంలో దాడికి ప్రయత్నించారు గోరంట్ల మాధవ్. ఆ టైంలోనే… మాజీ ఎంపీతో పాటు ఆయన అనుచరుల మీద కూడా కేసులు నమోదయ్యాయి. పోలీసులు ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకొని మాధవ్‌ని అరెస్టు చేశారు. కొన్నాళ్ళు జైల్లో ఉండి బెయిల్‌పై బయటికి వచ్చారు ఈ మాజీ పోలీస్ ఆఫీసర్. తర్వాత జిల్లా బాధ్యతలు చూస్తున్న మిథున్ రెడ్డి అనంతపురం వచ్చినప్పుడు కలిశారాయన. పార్టీ సపోర్ట్‌గా ఉంటుందని మిధున్‌రెడ్డి అయితే చెప్పారుగానీ…. అప్పటి నుంచి మాధవ్ మాత్రం మునుపటిలా యాక్టివ్‌గా లేరు. జిల్లాలో పార్టీ పరంగా జరుగుతున్న ఏ కార్యక్రమంలోనూ చురుగ్గా పాల్గొనడం లేదన్నది వైసీపీ వర్గాల మాట. మాజీ ఎంపీ తలారి రంగయ్య ఆర్డీటీ కోసం పాదయాత్ర చేస్తుండగా… ఆయన ఆహ్వానం మేరకు ఆ ఒక్క కార్యక్రమంలో పాల్గొన్నారు తప్ప…మిగతా ఎక్కడా కనిపించలేదు. ఇటీవల పార్టీ కార్యక్రమాలు చురుగ్గా సాగుతున్నా…. మాజీ ఎంపీ మాత్రం పట్టనట్టుగా ఉండటం ఏంటో అర్ధం కావడం లేదన్నది లోకల్ కేడర్ మాట. దీంతో పరిస్థితుల దృష్ట్యా ఆయన తనకు తానుగా సైలెంట్ అయ్యారా? లేక పార్టీ పెద్దలే సైలెంట్‌గా ఉండమన్నారా అన్న చర్చ జరుగుతోంది పార్టీ సర్కిల్స్‌లో.