అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ టీకాంగ్రెస్‌లో పాదయాత్రల చుట్టూ రాజకీయం నడుస్తోంది. హాత్ సే హాత్ జోడో పేరుతో నేతలు జనాల్లోకి వెళ్తున్నా.. సీనియర్ల హ్యాండ్స్ మాత్రం కలవడం లేదు. ఇప్పుడు ఒకరి తర్వాత ఒకరు అడుగులు వేస్తారా? లేక ఎవరిదారి వారిదేనా అనే అనుమానాలు ఉన్నాయి.
శివరాత్రి నుంచి భట్టి యాత్ర..?
పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాదయాత్ర రాష్ట్రంలో కొనసాగుతోంది. ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి .. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోకి యాత్ర ఎంటర్ అయ్యింది. తాము కూడా పాదయాత్ర చేస్తామని కాంగ్రెస్ సీనియర్లు ప్రకటించారు. అందరూ యాత్రలు చేయండి.. షెడ్యూల్ ఇవ్వండి అని AICC ఇంఛార్జ్ థాక్రే స్పష్టం చేశారు. ఇప్పటి వరకు సీనియర్లు ఎవరూ యాత్రల షెడ్యూల్ ఇవ్వలేదు. సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క.. అసెంబ్లీ సమావేశాల బిజీలో ఉండిపోయారు. అసెంబ్లీ సమావేశాలు ముగియడంతో భట్టి కూడా పాదయాత్రపై దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. శివరాత్రి నుంచి సీఎల్పీ నేత అడుగులు పడతాయని అనుకుంటున్నారు. షెడ్యూల్ ఖరారు చేసే పనిలో ఉన్నారట భట్టి. అయితే భట్టి ఖమ్మం జిల్లాలోనే పాదయాత్ర చేస్తారా లేక తెలంగాణలో ఎవరు ఆహ్వానిస్తారో వారి నియోజకవర్గాల్లో నడుస్తారా అనేది క్లారిటీ లేదు.
ఖరారు కాని ఉత్తమ్ షెడ్యూల్
పీసీసీ మాజీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి కూడా పాదయాత్ర చేసి అవకాశం ఉంది. పార్లమెంట్ సమావేశాలు ముగిసిన వెంటనే ఆయన ఫీల్డ్‌లోకి ఎంట్రీ ఇస్తారని అనుకుంటున్నారు. యాత్రలో తన పార్లమెంటు నియోజకవర్గంతో పాటుగా.. కోదాడ, హుజుర్‌నగర్ నియోజకవర్గాల్లో ఫోకస్ పెడతారని సమాచారం. అయితే ఇప్పటి వరకు యాత్రపై పార్టీకి షెడ్యూల్ ఇంకా ఇవ్వలేదట. ఉత్తమ్ ఏఐసీసీ ప్లీనరీలో రాజకీయ వ్యవహారాల కమిటీలో సభ్యుడు కావడంతో షెడ్యూల్ ఇంకా ఫైనల్ చేయలేదట. ఇక మరో ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఆయన బైక్ యాత్ర చేస్తా అని ప్రకటించారు. ఖమ్మం, మహబూబ్‌నగర్, నల్గొండ జిల్లాలో తిరుగుతానని కూడా చెప్పారు. దీనిపైనా ఇంకా క్లారిటీ కోసం చూస్తున్నాయి పార్టీ వర్గాలు. కాంగ్రెస్‌లో జిల్లాలు.. సరిహద్దుల పంచాయితీ నడుస్తున్న తరుణంలో.. మిగిలిన మూడుజిల్లాల్లో ఆయన బైక్ యాత్ర ఉంటుందా అనేది ప్రశ్న. పీసీసీ చీఫ్ రేవంత్‌నే.. నర్సంపేట రావాల్సిన అవసరం లేదని స్థానిక నేత దొంతి మాధవరెడ్డి కుండ బద్దలు కొట్టేశారు. అందుకే సీనియర్ల యాత్రపై ఉత్కంఠ నెలకొంది.
రేవంత్‌తో కలిసి సీనియర్లు నడుస్తారా?
రేవంత్‌రెడ్డి పాదయాత్రలో కాంగ్రెస్‌లో సీనియర్లుగా చెప్పుకొంటున్నవాళ్లు ఎవరూ పాల్గొనలేదు. VH మాత్రం ఒకటి రెండు రోజుల్లో వెళ్తారని చెబుతున్నారు. భట్టి.. ఉత్తమ్, కోమటిరెడ్డి లాంటి సీనియర్లు రేవంత్‌తో కలిసి అడుగులు వేస్తారా లేక ఎవరి దారి వాళ్లదే అన్నట్టుగా వెళ్తారా అనేది చూడాలి.