ఆ మాజీ డిప్యూటీ సీఎమ్‌కు షాకుల మీద షాకులు తగులుతున్నాయా? ప్రత్యర్థుల కంటే ఆయనకి ఇంటిపోరే ఎక్కువైందా? అప్పట్లో ఆయనకు భార్య షాకిస్తే…ఇప్పడు తమ్ముడి వంతు వచ్చిందా? ఇంతకీ ఎవరా నేతా? ఏమా సంగతి?
తమ్ముడు ఝలక్ ఇచ్చారా?
దామోదర రాజనర్సింహ. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేత. మాజీ డిప్యూటీ సీఎం. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని ఆయన లెక్కలు వేస్తూ.. వ్యూహాలు రచిస్తుంటే.. ఇంట్లో వాళ్లే రాజనర్సింహకు షాక్‌లపై షాక్‌లు ఇస్తున్నారు. 2018 ఎన్నికల నాటి పరిణామాలు ఆయన విషయంలో రిపీట్ అవుతున్నాయని చెవులు కొరుక్కుంటున్నారు పార్టీ కార్యకర్తలు. గత ఎన్నికల సమయంలో రాజనర్సింహ భార్య షాక్ ఇచ్చారు. ఇప్పుడు రాజనర్సింహకు ఆయన తమ్ముడు ఝలక్ ఇస్తున్నారు. ఎన్నికల వ్యూహం ఎలా ఉన్నా.. వీటి నుంచి బయట పడటమే ఆయనకు సవాల్‌గా మారింది.
బీజేపీలోకి దామోదర్ తమ్ముడు
గత ఎన్నికల సమయంలో దామోదర రాజనర్సింహ భార్య పద్మిని బీజేపీలో చేరారు. భర్త కాంగ్రెస్‌లో.. భార్య బీజేపీ ఏంటని అప్పట్లో ప్రశ్నలు వినిపించాయి. కాంగ్రెస్ పార్టీలో కలకలం రేగింది. మాజీ డిప్యూటీ సీఎం ఇరకాటంలో పడ్డారు. తర్వాత ఏమైందో ఏమో.. ఉదయం కాషాయ కండువా కప్పుకొన్న పద్మిని.. సాయంత్రానికి బీజేపీకి గుడ్‌బై చెప్పి కాంగ్రెస్‌లోకి వచ్చేశారు. ఆ ఎన్నికల్లో రాజనర్సింహ ఓటమికి పద్మిని తీరు కూడా కారణమని పార్టీ వర్గాలు చెప్పుకొన్నాయి. ఇప్పుడంతా బాగుందని.. ఈ ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికలకు పక్కాగా ప్లాన్ చేద్దామని రాజనర్సింహ అనుకుంటున్నారట. ఇంతలోనే ఆయన తమ్ముడు రాంచందర్ కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పి బీజేపీలోకి వెళ్తున్నారు. ఊరంతా భారీగా ఫ్లెక్సీలు కూడా వెలిశాయి.
పద్మిని సోదరుడితో పడకే రాంచందర్ జంప్?
దామోదర రాజనర్సింహకు రాంచందర్‌కు మధ్య మంచి సంబంధాలే ఉన్నాయి. ఆందోల్ నియోజకవర్గంలో దామోదర కార్యకర్తలకు అందుబాటులో లేకపోయినా.. తమ్ముడు పార్టీ వ్యవహారాలు చక్కబెట్టేవారు. అలాంటి తమ్ముడు కీలక సమయంలో పార్టీ మారాలని అనుకోవడం వెనుక బలమైన కారణాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. పద్మిని సోదరునికి దామోదర సోదరుడు రాంచందర్‌కి పార్టీ వ్యవహారాల్లో కొన్నాళ్లుగా ఇంటిపోరు కొనసాగుతోందట. అందుకే రాంచందర్ పార్టీ మారుతున్నారని టాక్. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడానికి జహీరాబాద్ నియోజకవర్గాన్ని కూడా రాంచందర్ ఎంపిక చేసుకున్నట్టు టాక్. హైదరాబాద్‌లోని బీజేపీ కార్యాలయం ముందు తనపేరుతో ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేసుకున్నారు.
బీజేపీలో రాంచందర్ చేరిక వాయిదా కూడా చర్చే
బీజేపీలో రాంచందర్ చేరిక నాటకీయ పరిణామాల మధ్య ఆగిపోయింది. ఆయన చేరిక వాయిదా పడిందని చెబుతున్నా.. రాంచందర్ బీజేపీ పెద్దలను కలిశారు. అయితే రాంచందర్ చేరిక ఆగడంపైనా జిల్లాలో చర్చగా మారింది. ఈ ఏడాదే అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో… ఈ జంపింగ్‌లు.. ఇంటిపోర్లు మళ్లీ దామోదర రాజనర్సింహను గందరగోళంలో పడేస్తున్నాయట.