Off The Record: తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అత్యంత కీలకమైన బిల్లులను ఇంకా ఆమోదించకుండా పెండింగ్‌లో పెట్టడంపై కొత్త కొత్త అనుమానాలు పెరుగుతున్నాయట. ఇప్పటికే ప్రభుత్వం చట్ట సభల్లో ఐదు బిల్లుల్ని ఆమోదించి గవర్నర్‌కు పంపింది. బీసీలకు స్థానిక సంస్థల్లో ఉన్న 50 శాతం నిబంధనను ఎత్తేస్తూ…. రిజర్వేషన్స్ పెంచేందుకు ఉద్దేశించిన పంచాయతీరాజ్ సవరణ బిల్లు అసెంబ్లీలో ఏకగ్రీవంగా ఆమోదం పొందింది. పురపాలక చట్ట సవరణ బిల్లుకు కూడా ఓకే చెప్పేసింది సభ. ఇక అల్లొపతిక్ ప్రైవేట్ మెడికల్ కేర్ ఎస్టాబ్లిష్‌మెంట్స్ బిల్లుకు కూడా అసెంబ్లీ ఆమోద ముద్ర పడింది. సంగారెడ్డి జిల్లాలో కొత్త మున్సిపాలిటీల ఏర్పాటు, ఇస్నాపూర్ మున్సిపాలిటీ విస్తరణ బిల్లుల్ని ఉభయ సభలు ఆమోదించాయి. మొత్తం ఆ ఐదు బిల్లులు రాజ్ భవన్‌కు చేరాయి. అయితే… వాటికి వెంటనే స్టాంప్ వేసేయకుండా… ఆమోదించే ముందు న్యాయ సలహా తీసుకోవాలని నిర్ణయించారట గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. ప్రస్తుతం ఆ ప్రక్రియ కొనసాగుతోంది.
Read Also: Top Headlines @ 9 PM: టాప్ న్యూస్
కొత్త మున్సిపాలిటీలు ఏర్పాటు, విస్తరణ బిల్లుకు మాత్రమే రాజ్‌భవన్ ఆమోదముద్ర పడింది. దీంతో… మిగిలిన వాటికి ఆమోదం తెలుపుతారా.. లేక తిరిగి వెనక్కి పంపుతారా అన్న ఉత్కంఠ పెరుగుతోంది ప్రభుత్వ వర్గాల్లో. అత్యంత కీలకమైన ఎమ్మెల్సీల నియామకానికి సంబంధించిన బిల్లు కూడా పెండింగ్ లిస్ట్‌లోనే ఉండటం చర్చనీయాంశం అయింది. గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా ప్రొఫెసర్ కోదండరామ్, అజారుద్దీన్ పేర్లకు తెలంగాణ క్యాబినెట్ ఆమోదం తెలిపి, గవర్నర్ కు సిఫారసు చేసింది. గతంలో ఇదే కోటా కింద నామినేట్ అయిన కోదండరాం, జర్నలిస్ట్ అమీర్ అలీఖాన్ నియామకాన్ని ఇటీవల సుప్రీంకోర్టు రద్దు చేసింది. ఆ పరిస్థితుల్లో… ఆగస్ట్ 31న జరిగిన కేబినెట్ భేటీలో గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై చర్చ జరిగింది. ఆ సందర్భంగానే… గవర్నర్ కోటాలో తిరిగి ఎమ్మెల్సీలుగా కోదండరామ్ పేరును ఖరారు చేయడంతోపాటు అమీర్ అలీఖాన్ స్థానంలో అజారుద్దీన్‌ను ఖరారు చేసింది. ఆ ఫైల్‌నే గవర్నర్ తిరిగి పెండింగ్‌లో పెట్టడంతో ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ పెరుగుతోంది కాంగ్రెస్ వర్గాల్లో. తెలంగాణ ఉద్యమ సమయంలో అత్యంత కీలక పాత్ర పోషించిన ప్రొఫెసర్ కోదండరామ్ సేవలకు గుర్తుగా… ఆయన్ని ఎట్టి పరిస్థితుల్లో చట్ట సభకు పంపాలని పట్టుదలగా ఉంది కాంగ్రెస్ నాయకత్వం.
మరోవైపు అజారుద్దీన్‌కు కూడా ఎమ్మెల్సీ ఇచ్చి మైనార్టీ కోటాలో కేబినెట్‌లోకి తీసుకుంటారన్న ప్రచారం సైతం ఉంది. దీంతో ఆ ఫైల్ రాజ్‌భవన్‌నుంచి స్టాంప్‌తో బయటికి వస్తుందా? లేక రివర్స్ అవుతుందా అన్న టెన్షన్ పెరుగుతోందట గాంధీభవన్‌లో. బీఆర్‌ఎస్ హయాంలో కేబినెట్ సిఫారసు చేసిన రెండు పేర్లను అప్పటి గవర్నర్ తమిళిసై తిరస్కరించారు. ఈసారి అలాంటి పరిణామాలు ఎదురవకుండా…. ప్రొఫెసర్ కోదండరామ్ గురించి ప్రత్యేకంగా నోట్ తయారు చేసినట్లు తెలుస్తోంది. టీజేఎస్ పేరుతో ఆయన ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడు అయినప్పటికీ… రాష్ట్ర సాధనలో చేసిన పోరాటం, ప్రొఫెసర్‌గా అందించిన సేవలను ఆ నోట్‌లో పొందుపరిచిందట సర్కార్. ఒకవేళ గవర్నర్ లీగల్ ఒపీనియన్‌కు వెళ్ళినా…ఎట్టి పరిస్థితుల్లో తేడాపడకుండా…పక్కా ప్రణాళికతో కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో అలాంటి జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే… సుప్రీం కోర్ట్‌లో ఎదురుదెబ్బ తగిలిందన్న అభిప్రాయం కాంగ్రెస్ పెద్దల్లో ఉన్నట్టు తెలుస్తోంది. మిగతా వాటి సంగతి ఎలా ఉన్నా… ఎమ్మెల్సీల ఫైల్ విషయంలో చిన్న తిరకాసు ఉన్నందునే 15 రోజుల నుంచి ఏ నిర్ణయం తీసుకోకుండా పెండింగ్‌లో పెట్టినట్టు తెలుస్తోంది. ఈ కేసులో సుప్రీం కోర్ట్ తుది తీర్పు వెలువడేదాకా ఫైల్‌పై సంతకం చేయవద్దని గవర్నర్‌కు సూచించారట న్యాయ నిపుణులు. అందుకే అది పెండింగ్‌లో పడ్డట్టు చెబుతున్నారు.