Off The Record: కాళేశ్వరం కుంగుబాటుపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన పీసీ ఘోష్ కమిషన్ నివేదిక సమర్పించింది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రులు హరీష్ రావు, ఈటెల రాజేందర్‌తో పాటు సీనియర్ ఐఏఎస్‌లు ఎస్కే జోషి, స్మితా సబర్వాల్, ఈఎన్సీలు మురళీధరరావు, నాగేందర్, వెంకటేశ్వర్లు పలువురు అధికారులపై ఆరోపణలు చేశారు. వారిపై చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డిలు స్పష్టం చేశారు. అయితే మాజీ మంత్రి హరీశ్‌రావు…సీఎస్ రామకృష్ణారావును కలవడం చర్చనీయాంశంగా మారింది. కాళేశ్వరం కమిషన్ రిపోర్టు కోసమే సీఎస్‌ను కలిసినట్లు బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. అయితే 60 పేజీల పిసి ఘోష్ కమిషన్ ఇచ్చిన రిపోర్టుపై…ఇంతకు ముందే మాజీ మంత్రి హరీశ్‌రావు తెలంగాణ భవన్ వేదికగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. మొదట కాళేశ్వరం ప్రాజెక్టు అనుమతుల నుంచి నిర్మాణం వరకు అనే అంశాలపై క్లారిటీ ఇచ్చారు.
Read Also: Ganja : ఏపీ నుంచి ఢిల్లీకి భారీగా గంజాయి తరలింపు..
ఇటీవల మాజీ మంత్రి హరీశ్‌రావు ఢిల్లీ వెళ్లి వచ్చారు. రాష్ట్రానికి సంబంధించిన పలు విషయాలపై న్యాయ నిపుణులతో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన బనకచర్ల ప్రాజెక్టుపై న్యాయ పోరాటంతో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల పార్టీ ఫిరాయింపులు, కాళేశ్వరం కమిషన్‌పై కూడా సుప్రీంకోర్టు లాయర్లతో మంతనాలు జరిపినట్లు సమాచారం. ఢిల్లీ నుంచి రాష్ట్రానికి వచ్చిన వెంటనే సీఎస్‌ను కలిసిన హరీశ్‌రావు…పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన 665 పేజీల నివేదిక ఇవ్వాలని కోరారు. అందుకోసం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, హరీశ్‌రావు…ఇద్దరు వేరువేరుగా సీఎస్‌కు లేఖలు. ప్రస్తుతం ముగ్గురు ఐఏఎస్‌లు తయారు చేసిన 60 పేజీల నివేదికను స్టడీ చేసి… తర్వాత 665 పేజీల రిపోర్టును స్టడీ చేస్తారని బీఆర్ఎస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభం నుంచి హరీశ్‌రావు నీటి పారుదల శాఖ మంత్రిగా ఉన్నారు. ఆ తర్వాత ఆర్థిక శాఖ మంత్రిగా కొనసాగారు.
Read Also: Surprising Reasons : అది మాల్ అయినా, థియేటర్ అయినా, టాయిలెట్ తలుపుల కింద ఖాళీ ఎందుకు ఉంటుంది..?
కాళేశ్వరం ప్రాజెక్టు అనుమతుల కోసం కేంద్ర ప్రభుత్వ సంస్థల చుట్టూ తిరిగి వాటి నుంచి ధ్రువీకరణ పత్రాలు సంపాదించారు. పీసీ ఘోష్ కమిషన్ తప్పు పట్టిన అంశాలను…మళ్ళీ కేంద్ర ప్రభుత్వ సంస్థల వద్దకే వెళ్లి సమాధానం చెప్పించాలని హరీశ్‌రావు భావిస్తున్నట్లు తెలుస్తోంది. కాళేశ్వరం, బనకచర్ల ప్రాజెక్టుల అంశాలు రెండు రాష్ట్రాల మధ్య చర్చనీయాంశంగా మారాయి. బీఆర్ఎస్ మాత్రం ఈ అంశాలపై న్యాయ పోరాటానికి సిద్ధమైనట్లు సమాచారం. త్వరలో జరిగే అసెంబ్లీలో 665 పేజీల నివేదిక ప్రభుత్వం సభ్యులందరికి ఇస్తుందా? 60 పేజీల నివేదికను మరికొంత పెంచి ఇస్తుందా? చూడాలి.