Ganja : గంజాయి స్మగ్లర్లు.. పోలీసులకు దొరకకుండా తెలివిగా ప్రవర్తిస్తున్నారు. కార్లలో గంజాయి తరలిస్తూ..ముందు ఎస్కార్ట్ కూడా ఏర్పాటు చేసుకుంటున్నారు. సరిగ్గా ఇదే తరహాలో ఏపీ నుంచి ఢిల్లీకి గంజాయి తరలిస్తున్న ముఠాను పోలీసులు ఛేజ్ చేసి మరీ పట్టుకున్నారు. మొత్తంగా 250 కిలోల గంజాయి సీజ్ చేశారు. పోలీసులు ఎంత నిఘా పెట్టినా.. గంజాయి బ్యాచ్ రెచ్చిపోతున్నారు. తమ అక్రమ దందాకు బ్రేకులు లేవనే విధంగా తమ పని తాము చేసుకుంటూ వెళ్తున్నారు. తాజాగా ఏపీలోని అనకాపల్లి నుంచి ఢిల్లీకి పెద్ద ఎత్తున గంజాయి తరలించే ప్రయత్నం చేసిన గ్యాంగ్ ఆట కట్టించారు తెలంగాణ పోలీసులు…
మోనిస్ అనే వ్యక్తి.. యూపీ, ఢిల్లీకి చెందిన మంగల్, నూర్ మహమ్మద్, జమీల్, భాను, కన్హాయిలను ముఠాగా ఏర్పాటు చేశాడు. వీరికి ఏపీ నుంచి ఢిల్లీకి గంజాయిని అక్రమంగా తరలించే బాధ్యతను అప్పగించాడు. ఇందుకోసం కార్లను సమకూర్చి ఒక్కొక్కరికి 20 వేల రూపాయలు ఇచ్చాడు. ఈ ముఠా ఢిల్లీ నుంచి ఆగస్ట్ 1న రోడ్డు మార్గంలో బయలుదేరి తెలంగాణ మీదుగా ఏపీలోకి ప్రవేశించి అనకాపల్లికి చేరుకున్నారు. అప్పటికే అనకాపల్లి అటవీ ప్రాంతంలోని గంజాయి సరఫరాదారులతో మోనిస్ అలియాస్ రాహుల్ మిశ్రా మాట్లాడి 500 కిలోల గంజాయిని సిద్ధంగా ఉంచాడు…
ఈ ముఠా.. తమ రెండు కార్లలో 250 కిలోల చొప్పున నింపి ఆగస్టు 5న తిరుగు ప్రయాణమయ్యారు. వాహనాలతో కాన్వాయ్‌గా బయలుదేరారు. ఈ కాన్వాయ్‌కి ఒక కారు ఎస్కార్ట్‌గా ఉంటూ పోలీసుల తనిఖీలను గమనిస్తూ ముందుకు సాగింది. ముఠా సభ్యులు రాష్ట్రాన్ని బట్టి కార్ల నెంబర్ ప్లేట్లను మారుస్తూ ప్రయాణించారు. ఇలా ఏపీలోని అనకాపల్లి నుంచి ఢిల్లీకి గుట్టు చప్పుడు కాకుండా అక్రమంగా గంజాయిని తరలిస్తున్నారు… సరిగ్గా అదే సమయంలో నల్లగొండ జిల్లాలో హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిపై చిట్యాల వద్ద పోలీసులు వాహనాల పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. ఢిల్లీ నెంబర్ ప్లేట్ ఉన్న కారు హైదరాబాద్ వైపు వెళ్తుండగా.. ఆ కారులోని ముగ్గురు వ్యక్తులను పోలీసులు ప్రశ్నించారు. ఇద్దరు అక్కడి నుంచి పారిపోగా.. ఒకరిని అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ కారు వెనక వస్తున్న మరో కారును పోలీసులు ఆపేందుకు ప్రయత్నించగా.. విజయవాడ వైపు వేగంగా మళ్లించారు. దీంతో ఆ కారును పట్టుకునేందుకు పోలీసులు ఛేజ్ చేశారు.
అక్రమార్కులు తమ కారును కట్టంగూరు మండలం కురుమర్తి వద్ద చెట్ల పొదల్లో వదిలి పరారయ్యారు. నూర్ మహమ్మద్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకొని పోలీసులు విచారించగా విషయం బయటపడింది. పారిపోయిన ఇద్దరు ఉత్తరప్రదేశ్‌కు చెందిన బబ్లూ, మంగల్, ఢిల్లీకి చెందిన జమీల్, భాను, కన్నాయిగా గుర్తించారు. ఏపీలోని అనకాపల్లి నుంచి ఢిల్లీకి గంజాయిని కార్లలో తరలిస్తున్న ముఠా సభ్యుడిని అరెస్టు చేసి కోటి రూపాయల విలువైన 250 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. రెండు కార్లు, ఆరు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. మిగిలిన నిందితులను గంజాయిని త్వరలోని పట్టుకుంటామన్నారు. పెద్ద ఎత్తున ఢిల్లీకి గంజాయి తరలుతున్న నేపథ్యంలో ఢిల్లీ పోలీసులను సైతం తెలంగాణ పోలీసులు అలర్ట్ చేశారు…