Off The Record: ముతుకుమిల్లి శ్రీభరత్….. తెలుగుదేశం పార్టీ యువ ఎంపీ. ఉద్దండులు గెలిచిన విశాఖ గడ్డ మీద రికార్డులు బ్రేక్ చేసిన నాయకుడు. రాజకీయ వారసత్వ పునాదుల ఆధారంగా 2019లో తొలిసారి పోటీ చేసిన శ్రీభరత్‌కు షాకింగ్ ఎక్స్‌పీరియన్స్ మిగిల్చారు విశాఖ ఓటర్లు. నాడు వైసీపీ ప్రభంజనం ఒకవైపు, జనసేన ఓట్లు చీలిక మరోకవైపు తీవ్ర ప్రభావం చూపి ఫస్ట్ అటెంప్ట్‌లో ఓడిపోయారాయన. అప్పట్లో… ఇక్కడ వైసీపీ అభ్యర్థి ఎంవీవీ సత్యనారాయణ గెలుపుకంటే… భరత్ ఓటమిపైనే ఎక్కువ విశ్లేషణలు నడిచాయి. అదంతా గతం. ఇక 2024 నాటికి కూటమి ఏర్పడటం, లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో క్లీన్ స్వీప్ చేయడం లాంటి పరిణామాలు శ్రీభరత్ రికార్డ్ విక్టరీ సొంతం చేసుకోవడానికి సహకరించాయి. 5లక్షలకు పైగా మెజార్టీతో గెలిచి ఢిల్లీ సభలో అడుగు పెట్టారాయన. అంత వరకు అంతా బాగానే ఉన్నట్టు అనిపించినా… ప్రస్తుతం ఎంపీ మాట తీరు కాస్త తేడాగా ఉందన్న చర్చలు జోరుగా జరుగుతున్నాయి వైజాగ్ పొలిటికల్ సర్కిల్స్‌లో. శ్రీభరత్ కుటుంబానికి రాజకీయాలు కొత్త కాకున్నా…. ఆయన ప్రత్యక్షంగా ప్రజా జీవితంలోకి రావడం మాత్రం ఇదే మొదటిసారి. ఆ అనుభవరాహిత్యమే ఇప్పుడు సమస్యగా మారిందనేది లోకల్ డిస్కషన్. అంతర్గత సమావేశాల్లో కూటమి ఎమ్మెల్యేలు ఈ అంశాన్ని చర్చకు పెడుతున్నారట.
Read Also: Wife Kills Husband: మరో భర్త బలి.. కూల్ డ్రింక్‌లో గడ్డి మందు కలిపి..?
ఐతే…. టీడీపీ అధినాయకత్వానికి దగ్గరి బంధువు కావడంతో…. చాలా మంది తమ మనసులో మాటను బయటపెట్టలేకపోతున్నట్టు సమాచారం. అలాగే… అరాకొరా ఒకరిద్దరు ఆయన దృష్టికి తెచ్చే ప్రయత్నం చేసినా… ఆయన ఖాతరు చేయడం లేదని తెలుస్తోంది. దీంతో… ఎప్పుడు తెలుసుకుంటాడ్రా… బాబూ… నోటి మాట ఆయనకు ఎంత చేటు చేస్తోందో… కనీసం అర్ధమవుతోందా అంటూ… తలలు పట్టుకుంటున్నారట ఆయన పరిధిలోని కూటమి శాసనసభ్యులు. రాష్ట్రంలో అభివృద్ధి చెందేందుకు విస్తృతమైన అవకాశాలు ఉన్న లోక్‌సభ నియోజకవర్గం విశాఖ. ఎంపీకి కూడా ఆ విషయం తెలుసు కాబట్టి… అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పర్యటిస్తూ… పట్టు బిగించే ప్రయత్నం చేస్తున్నారట. ఈ క్రమంలోనే… స్థానిక ఎమ్మెల్యేలతో విభేదించే పార్టీ నాయకుల్ని చేరదీస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. సహజంగానే ఆ వ్యవహారాలు సిట్టింగులకు ఇబ్బందిగా మారుతున్నాయట. అదే సమయంలో సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్న విశాఖ ఉక్కుకు పునరుజ్జీవం, రైల్వేజోన్, ఐటీ సహా వివిధ రంగాలు నెమ్మదిగా పుంజుకోవడం లాంటివి ఎంత కాదనుకున్నా…అంతో ఇంతో.. ఎంపీ అకౌంట్లో పడుతున్నాయి. అసెంబ్లీ సెగ్మెంట్స్‌లో ఎమ్మెల్యేల వ్యతిరేకుల్ని చేరదీయడం లాంటి కార్యక్రమాలు ఈ అభివృద్ధి పనులు, యాక్టివ్‌గా ఉండటం లాంటి వాటి మాటున కొట్టుకు పోతున్నాయి.
Read Also: Akash Prime: వైమానిక రక్షణలో మరో అస్త్రం.. 15,000 అడుగుల ఎత్తులో ‘ఆకాశ్ ప్రైమ్’ విజయవంతం..!
కానీ… ఇటీవల ఆయన బహిరంగ వేదికలపై చేస్తున్న వ్యాఖ్యలు మాత్రం తీవ్ర చర్చనీయాంశం అవుతున్నాయి. వీలైనంత నిక్కచ్చిగా మాట్లాడాలన్న తత్వంతో… అసలు పొలిటికల్ లాజిక్‌ని మిస్ అవుతున్నారన్నది పరిశీలకుల మాట. రాజకీయాల్లో అన్నిటికన్నా లౌక్యం చాలా ముఖ్యమని, శ్రీభరత్ దాన్నే మిస్ అవుతున్నారన్న అభిప్రాయం బలపడుతోంది. కొద్దిరోజుల క్రితం ఆంధ్రా యూనివర్శిటీ ప్రమాణాలను కంపేర్ చేస్తూ ఎంపీ చేసిన పాసింగ్ కామెంట్స్ తీవ్రస్ధాయిలో విమర్శలకు కారణం అయ్యాయి. తన కుటుంబ సంస్థ అయిన గీతం యూనివర్సిటీ,ఏయూలను పోల్చుతూ… ఆయన చేసిన వ్యాఖ్యల వెనుక ఉద్దేశం ఏదైనాగానీ… విపరీతంగా ట్రోల్ అయింది. అలాగే… ప్రభుత్వం నిర్వ హించిన షైనింగ్ స్టార్స్ ప్రోగ్రాంలో బ్యూరోక్రసీలో వుండే వైఫల్యాలపై కుండ బద్ధలు కొట్టినట్టు మాట్లాడారు ఎంపీ. ఐఎఎస్ ల విషయంలో ఆయన అభిప్రాయం ఎంత వరకు కరెక్ట్ అనేది పక్కన బెడితే మాట్లాడిన వేదిక సరైనది కాదన్న మాటలు వినిపించాయి. ఎంపీ వ్యాఖ్యలతో సీనియర్ ఐఎఎస్‌లు సైతం చిన్నబుచ్చుకున్నట్టు చెప్పుకున్నారు. తాజాగా కేంద్ర మంత్రి శర్బానంద్ సోనోవాల్ తో కలిసి ప్రెస్ మీట్ నిర్వహించారు ఎంపీ. పోర్ట్ ఆధారిత అభివ్రుద్ధి మీద జరిగిన ఈ సమావేశంలో విశాఖకు క్రూయిజ్ షిప్‌లు రాకపోవడం వెనుక కారణాలను విశ్లేషించే పని చేశారు శ్రీభరత్. బంగాళాఖాతం ఎక్కువ రోజులు అలజడిగా వుంటుందని… కార్గో రవాణాకు ఫర్వాలేదు కానీ క్రూయిజ్‌ల నిర్వహణకు సమస్య ఎదురౌతుందని చెప్పారు.
Read Also: Off The Record: మైనంపల్లి, మర్రి రాజశేఖర్రెడ్డి మధ్య సవాళ్ల పర్వం..
90కోట్ల రూపాయలతో టూరిజం టెర్మినల్ నిర్మించి తూర్పుతీరంలో క్రూయిజ్ అభివ్రుద్ధికి కేంద్రం ప్రణాళికలు రూపొందించింది. సాంకేతికంగా సమస్యలను అధ్యయనం చేసిన తర్వాత మాత్రమే షిప్పింగ్ మంత్రిత్వశాఖ పెట్టుబడులు పెడుతుంది. అటు వంటిది కేంద్ర ప్రభుత్వమే ముందుకు వచ్చినప్పుడు సముద్ర వాతావరణం ప్రతికూలత కారణంగా క్రూయిజ్ ల నిర్వహణ సమస్య ఎదురౌతుందని లోకల్ ఎంపీ వ్యాఖ్యానించడం చర్చకు కారణం అయింది. కొంత వరకు శ్రీభరత్ చెప్పింది వాస్తమే అయినప్పటికీ అరేబియా సముద్రంతో పోలిస్తే వాతావరణ ప్రతికూలతకు కారణం అయ్యే తుఫాన్లు, అల్పపీడనాల రేషియో ఇక్కడ తక్కువ అనేది విమర్శకుల పాయింట్. అటు, ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులు శ్రీభరత్ మాటతీరుతో కొంత మేర ఇబ్బందిపడుతున్నట్టు ప్రచారం. కొద్దిమంది నాయకులను చేరదీసి వాళ్ళు చెప్పిన మాటలకే ప్రాధాన్యం ఇస్తున్నారనే అసంత్రుప్తి పెరుగుతోంది.