Off The Record: మేడ్చల్ జిల్లా మల్కాజిగిరి రాజకీయం మండుతోంది. ఈ అసెంబ్లీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు మధ్య సవాళ్ళు, ప్రతి సవాళ్ళ పర్వం తారా స్థాయికి చేరిపోయింది. ప్రభుత్వ కార్యక్రమంలో ఎమ్మెల్యే అనుచరుల దగ్గర మొదలైన గొడవ… చినికి చినికి గాలి వానాగా మారి ప్రకంపనలు రేపుతోంది. ఆ దెబ్బకు మల్కాజిగిరి నియోజకవర్గ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కి సెగలు పుడుతున్నాయి. తాజాగా… అల్వాల్‌లో బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య చెలరేగిన ఘర్షణల ప్రభావం మల్కాజిగిరి వరకు పాకడంతో ఇరు పార్టీల నాయకులు సవాళ్లు, ప్రతిసవాళ్లతో హీట్ పెంచారు. దాని తాలూకు ఉద్రిక్తతలు నియోజకవర్గంలో కొనసాగుతూనే ఉన్నాయి. పైనుంచి కింది స్థాయిదాకా.. ఈ సవాళ్ళ పర్వం నడుస్తూనే ఉంది. దమ్ముంటే మల్కాజిగిరికి రా… అంటూ బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ శ్రేణులకు సవాల్ విసిరారు. స్వీకరించిన కాంగ్రెస్ లీడర్స్ మైనంపల్లి హనుమంతరావు, ఆయన కుమారుడు మైనంపల్లి రోహిత్, పార్టీ కార్యకర్తలతో కలిసి పెద్ద ఎత్తున మల్కాజిగిరి చౌరస్తాకు చేరుకున్నారు. దీంతో పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారింది. అంతకు ముందు అల్వాల్‌లో జరిగిన ఘటనే దీనికి మూల కారణం అంటున్నారు పరిశీలకులు.
Read Also: Tanya : కెమెరామెన్ తో హీరోయిన్ ఎంగేజ్ మెంట్..
మల్కాజిగిరి నియోజకవర్గంలోని ఆలయాలకు బోనాల పండుగ సందర్భంగా చెక్కుల పంపిణీ కోసం దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేశారు. స్థానిక వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి, బీఆర్‌ఎస్, కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు హాజరయ్యారు. అక్కడ కుర్చీలు ఏర్పాటు చేసే క్రమంలో బీఆర్ఎస్ కార్పొరేటర్లకు సరైన స్థానం ఇవ్వలేదని, ఆ సీట్లలో కూడా కాంగ్రెస్ కార్యకర్తలు కూర్చున్నారంటూ వాగ్వివాదం మొదలై తోపులాటకు దారి తీసింది. ఈ క్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలు బీఆర్ఎస్ మహిళా కార్పొరేటర్ భర్తపై దాడి చేసినట్టు ఆరోపిస్తున్నారు. అదే సమయంలో ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి మీదికి కూడా వాటర్ బాటిల్ విసిరినట్టు చెబుతున్నారు. అప్రమత్తమైన గన్ మెన్ వెంటనే దానిని అడ్డుకున్నాన్నారని, ఒక దశలో గాల్లోకి కాల్పులకు కూడా సిద్ధమయ్యారని సమాచారం. అయితే… వేగంగా స్పందించిన పోలీసులు రెండు పార్టీల కార్యకర్తల్ని చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. అప్పటికి సద్దుమణిగినా… తిరిగి రాత్రి సమయంలో మరోసారి ఉద్రిక్తత తలెత్తింది. ఉదయం బీఆర్ఎస్ నేతలు చేసిన ఛాలెంజ్ కు రాత్రి కాంగ్రెస్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ స్పందించి తన అనుచరులతో మల్కాజిగిరి చౌరస్తాకు వచ్చి సవాల్ విసిరారు. దీంతో పొలిటికల్ హీట్ ఒక్కసారిగా పెరిగిపోయి ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది. అతి కష్టం మీద పోలీసులు పరిస్థితిని అదుపు చేయగలిగినా… ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే మధ్య మొదలైన సవాళ్ళ పర్వం ఇంకెంత దూరం వెళ్తుందోనన్న ఆందోళన మాత్రం అలాగే ఉందట నియోజకవర్గంలో.