Off The Record: అది కంపెనీ అయినా… రాజకీయ పార్టీ అయినా… పై స్థాయిలో తీసుకున్న నిర్ణయాలను అమలు చేయడం, ఆచరించడమన్నది సహజ లక్షణం. ముందు చెప్పింది చేయడం మొదలుపెడితే… తర్వాత వేసే అడుగుల్లో… నాయకుల దిశా నిర్దేశం ఉంటుంది. కానీ తెలంగాణ కాంగ్రెస్ నేతలకు మాత్రం ఆ విషయం బోధపడటం లేదట. పదే పదే నాయకత్వం సలహాలు..సూచనలు ఇస్తున్నా… ఆ స్థితి దాటి ఆదేశాల వరకు వెళ్ళినా సరే… కింది నాయకుల తీరు మారడం లేదంటున్నారు. ఆ విషయంలో పార్టీ పెద్దలకు కూడా క్లారిటీ వచ్చిందట. పార్టీ ఎమ్మెల్యేలు చాలామంది… నాయకత్వం చెప్పిన మాటలు పెడచెవిన పెట్టినట్టు కనిపిస్తోంది. వరుసగా రెండు సిఎల్పీ సమావేశాల్లో సీఎం రేవంత్ రెడ్డి కాస్త కటువుగా చెప్పినా… ఎమ్మెల్యేలు మాత్రం ఎవరి దారి వారిదే అన్నట్టు వ్యవహరిస్తున్నారన్న అభిప్రాయం బలపడుతోంది. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు సక్రమంగా జనానికి చేరేలా చూడటం, చేసింది చెప్పుకోవడం లాంటి వాటికి ప్రాధాన్యత ఇవ్వాలని పదేపదే గుర్తు చేస్తున్నారు సీఎం. కానీ… ఆచరణలో మాత్రం అది కనిపించడం లేదు.
Read Also: Pakistan: బలూచిస్తాన్‌లో బీఎల్ఏ ధమాకా.. 22 మంది పాక్ సైనికుల హతం..
ఎప్పుడూ బిజీగా ఉండే మెజార్టీ కేబినెట్ మంత్రులు కనీసం వారంలో ఒక రోజైనా.. నియోజకవర్గంలో ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు. కానీ…. కొందరు ఎమ్మెల్యేలు మాత్రం… హైదరాబాద్ ఔటర్ రింగ్‌రోడ్డు దాటడం లేదని చెప్పుకుంటున్నారు. అందులోనూ…. మొదటిసారి ఎమ్మెల్యేలు అయినవారిలోనే ఈ నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోందని పార్టీ వర్గాలే చెప్పుకుంటున్నాయి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా ఉన్నా… ప్రతిష్టాత్మకంగా చాలా ుథకాలు అమలు చేస్తోంది ప్రభుత్వం. సన్నబియ్యం, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు… ఇలా చాలా స్కీమ్‌లే ఉన్నాయి. అయినా సరే…. వాటి గురించి చెప్పుకోవడంగానీ…ప్రతిపక్షం నుండి వస్తున్న విమర్శలకు ధీటుగా సమాధానం చెప్పడం కానీ చేయడం లేదన్న అభిప్రాయం పార్టీ పెద్దల్లో బలంగా ఉందట. పైస్థాయిలో ఉన్న వాళ్ళు నిర్ణయాలు తీసుకోవడం, అమలుకు సంబంధించిన సూచనలు, సలహాలు ఇవ్వడంతోనే సరిపోతుంది.
Read Also: Myopia: 2050 వరకు భారత్‌లో సంగం మంది స్కూలుకెళ్లే పిల్లలకు కళ్ల జోడు?
కానీ… నియోజకవర్గ స్థాయిలో గ్రౌండింగ్ చేయాల్సిన నేతలు మాత్రం అసలు పనులు వదిలేసి… కొసరు పనులు చేస్తున్నారన్న ఫీలింగ్‌లో ప్రభుత్వ పెద్దలు ఉన్నారట. అలెర్ట్ చేయడం… పనుల్లో వేగం పెంచడం, పైనుంచి వచ్చే ఆదేశాలు పాటించే విషయంలో చాలామంది ఎమ్మెల్యేలు నిర్లక్ష్యంగా ఉంటున్నారన్న నివేదికలు అధిష్టానానికి అందుతున్నాయట. వీళ్ళని ఏం చేస్తారన్నది ఇప్పుడు పార్టీలో మిలియన్ డాలర్ క్వశ్చన్. మార్పు రాకుండా ఇలాగే ఉంటే మాత్రం…. ఎదురు దెబ్బలు తగలడం ఖాయమన్న అభిప్రాయం కాంగ్రెస్ వర్గాల్లోనే ఉంది. పొలిటికల్ యాక్టివిటీ… పెంచకుండా, కనీసం చేసింది చెప్పుకోకుండా…. పార్టీ ఇస్తున్న ఆదేశాల్ని పట్టించుకోకుండా ఉన్న ఎమ్మెల్యేలను వీళ్ళింతే… ఇక మారరని పార్టీ పెద్దలు వదిలేస్తారా? లేక అంకుశం ప్రయోగిస్తారా అన్నది చూడాలంటున్నారు రాజకీయ పరిశీలకులు.