Off The Record: అనకాపల్లి జిల్లా… యలమంచిలి సెగ్మెంట్‌లో కూటమి పాలిటిక్స్ హాట్ మెటల్‌లా సలసలమంటున్నాయి. టీడీపీ, జనసేన మధ్య అంతర్గత రచ్చ బజారుకెక్కింది. ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ దూకుడుని తట్టుకోవడం టీడీపీ నేతలకు మహా కష్టంగా మారిందట. ఇది కొత్తగా వచ్చిన ఇబ్బంది కాదని.. పొత్తులు పుట్టినప్పుడే ఇలాంటి బుల్డోజ్ రాజకీయాల్ని ఊహించామంటూ ఘొల్లుమంటున్నాయి టీడీపీ శ్రేణులు. కూటమి ధర్మానికి కట్టుబడి శాసనసభ్యుడు వ్యవహరిస్తారని ఆశించినప్పటికీ పరిస్ధితుల్లో మార్పు రాలేదని బహిరంగానే అంటున్నారట. ఇంత కాలం అంతర్గత సంఘర్షణ మాత్రమే జరిగిన చోట ఇప్పుడు వార్ ఓపెన్ అయిపోవడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అది కూడా… టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర మంత్రి లోకేష్ ఎదుటే కావడంతో ఈ పరిణామాలకు మరింత ప్రాధాన్యం వచ్చింది. ఇటీవల జిల్లా పర్యటనకు వచ్చిన లోకేష్… యలమంచిలి నియోజకవర్గ పరిధిలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అచ్యుతాపురం నుంచి అనకాపల్లి వరకు ఫోర్ లైన్ల రోడ్డు విస్తరణ పనులకు శంకుస్ధాపన చేశారాయన. అంత కంటే ముందు యలమంచిలి నియోజకవర్గ పార్టీ సమన్వయ సమావేశానికి హాజరయ్యారు. నాలుగు మండలాల నుంచి వందల మంది కార్యకర్తలు హాజరైన ఈ వేదిక నుంచి నియోజకవర్గంలో పరిణామాలపై గళం ఎత్తింది ముఖ్య నాయకత్వం.
టీడీపీ ఇన్చార్జ్ ప్రగడ నాగేశ్వరరావు చేసిన ఫిర్యాదు యలమంచిలిలో కూటమి పరిస్ధితికి, అంతర్గత విభేదాల తీవ్రతకు అద్దం పట్టిందని అంటున్నారు. 80శాతం టీడీపీ బలం వున్న చోట కేడర్ నలిగిపోతున్నారని, కనీసం తమకు పనులు కూడా జరగడం లేదని….స్వయంగా అధిష్టానం కల్పించుకుంటే తప్ప పరిస్ధితుల్లో మార్పు రాదని కుండబద్దలు కొట్టేశారాయన. అందుకు కేడర్ గొంతు కలపడంతో వాతావరణం వేడెక్కింది.అధినాయకత్వం తాత్కాలికంగా సర్ధిచెప్పినప్పటికీ భవిష్యత్తులో ఇక్కడ ఇబ్బందులు మరింత ఎక్కువ అవుతాయన్న సంకేతాలు వెలువడుతున్నాయి. వాస్తవానికి యలమంచిలి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోట. ఇక్కడ మొదటి నుంచి కాంగ్రెస్, టీడీపీల మధ్యే పోటీ. 2019లో తొలిసారి ఈ సీటును తన ఖాతాలో వేసుకుంది వైసీపీ. కాంగ్రెస్ నుంచి ఫ్యాన్ పార్టీలో చేరిన కన్నబాబురాజు, అప్పటి యలమంచిలి సిట్టింగ్ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు మధ్య పోటీ జరగ్గా విజయం వైసీపీని వరించింది. 2024నాటికి ఉమ్మడి విశాఖ జిల్లా రాజకీయ ముఖచిత్రంలో చాలా మార్పులు జరిగాయి. పొత్తులో భాగంగా నాలుగు స్ధానాల నుంచి జనసేన పోటీ చేసి విజయం సాధిస్తే వాటిలో యలమంచిలి ఒకటి. కాపు, మత్స్యకార,ఎస్సీ, గవర సామాజిక వర్గాల ఓట్ బ్యాంక్ ఎక్కువ. కాపు ఓట్ డిసైడింగ్ ఫ్యాక్టర్ కాగా జనసేన నుంచి రెండోసారి పోటీ చేసిన సుందరపు విజయ్ కుమార్ విజయం సాధించారు. ఐతే, ఈ సీటును టీడీపీకే కేటాయించాలని అప్పట్లో కేడర్ హంగామా చేసింది. పరిశీలకుల ఎదుటే కుర్చీలు గాల్లో లేవగా…. అప్పట్లో దీనిపై విస్తృత చర్చ జరగడంతోపాటు అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేసింది.
హైకమాండ్ ఆదేశాలతో కలిసి పని చేసినప్పటికీ యలమంచిలిలో టీడీపీ, జనసేన మధ్య వ్యవహారం ఉప్పూనిప్పుగానే వుంది. సిట్టింగ్ ఎమ్మెల్యే విజయ్ కుమార్, టీడీపీ ఇన్చార్జ్, రాష్ట్ర రహదారుల అభివృద్ధి సంస్ధ చైర్మన్ ప్రగడ నాగేశ్వరరావు మధ్య వర్గపోరు పెరిగింది. పేరుకే కూటమి అని, జనసేన ఎమ్మెల్యే కనీసం మిత్ర ధర్మం పాటించడం లేదని…నియోజకవర్గంలో అంతా తాను చెప్పినట్లే జరగాలని హుకుం జారీ చేస్తున్నారంటూ రగిలిపోతోందట టీడీపీ కేడర్. ఎమ్మెల్యే తీరుతో విసిగెత్తిపోయిన టిడిపి నేతలు ఇక ఎక్కువ కాలం ఉగ్గబట్టుకుని కూర్చుంటే మొదటికే మోసం వస్తుందని అనుకున్నారట. సరైన వేదిక కోసం ఎదురు చూస్తున్న సమయంలోనే… ఇటీవల లోకేష్ సమక్షంలోనే బరస్ట్ అయిపోవడం కొత్త చర్చకు కారణం అయింది. మరోవైపు యలమంచిలి పరిణామాలు ఇప్పటికే జనసేన అధిష్టానం దృష్టికి వెళ్ళాయట. ఈ క్రమంలోనే ఇప్పుడు నేరుగా టీడీపీ ఫిర్యాదులు చేయడం, అది కూడా లోకేష్ సమక్షంలో బహిరంగ వేదికపై కావడంతో తదుపరి పరిణామాలు ఎలా వుంటాయన్న ఉత్కంఠ పెరుగుతోంది.