Off The Record: బెజవాడ నగరపాలక సంస్థలో మేయర్‌కు…పదవీగండం తప్పేలా లేదు. ఎన్నికలకు ముందు వైసీపీకి 49 మంది కార్పొరేటర్లు ఉన్నారు. ప్రస్తుతం దాని 38కి పడిపోయింది. వీరిలో మరో 10 మందికి పైగా కూటమి పార్టీల ప్రజాప్రతినిధులతో మంతనాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. 64 మంది కార్పొరేటర్లున్న బెజవాడ కార్పొరేషన్‌లో…మేయర్ పీఠానికి 33 మంది సభ్యులు అవసరం. ప్రస్తుతం వైసీపీలో ఉన్న వారిలో ఏడుగురు వెళ్లిపోతే…మేయర్ కుర్చీ ఆ పార్టీకి దూరమైనట్టే. ఇప్పటికే ఐదుగురు టీడీపీలోకి, నలుగురు జనసేన, బీజేపీలో ఇద్దరు చేరిపోయారు. మొత్తం 11 మంది కార్పొరేటర్లు…వైసీపీకి రాంరాం చెప్పేశారు. మరో పది మంది కూటమి పార్టీలతో మంతనాలు జరుపుతున్నారట. భాగ్యలక్ష్మి మేయర్ పదవి స్వీకరించి మూడున్నరేళ్లు దాటుతోంది. నాలుగేళ్ల వరకూ అవిశ్వాసం పెట్టడానికి వీల్లేదనే నిబంధన ఇప్పటి వరకూ ఉంది. అందుకే అవిశ్వాసం పెట్టకుండా…గత కొంతకాలంగా ఎదురుచూస్తోంది టీడీపీ. ప్రస్తుతం నాలుగేళ్ల నిబంధనను సడలిస్తూ…రెండున్నరేళ్లకు కుదించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదన సిద్ధం చేసింది. త్వరలో దీన్ని ఆమోదించనుంది. ఆ తర్వాత మేయర్‌పై అవిశ్వాసం పెట్టడానికి కూటమి ప్రజాప్రతినిధులు సన్నాహాలు చేస్తున్నారట. ఈ నెలాఖరులో నగరపాలక సంస్థలో జరగబోయే కౌన్సిల్ సమావేశం నాటికి…మేయర్ పీఠానికి అవసరమైన కార్పొరేటర్ల బలాన్ని సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.
విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీ తరఫున 14 మంది గెలిచారు. వీరిలో కేశినేని శ్వేత రాజీనామా చేశారు. మరో కార్పొరేటర్ వైసీపీలో చేరడంతో…ఎన్నికల ముందు టీడీపీ బలం 12కి పడిపోయింది. ప్రస్తుతం వైసీపీ కార్పొరేటర్లు ఒక్కొక్కరిగా టీడీపీలోకి క్యూకడుతున్నారు. ఇప్పటికే ఐదుగురు టీడీపీలో చేరారు. వీరిలో ఇద్దరు పశ్చిమ నియోజకవర్గానికి చెందినవారు. టీడీపీ నుంచి వైసీపీలో చేరిన కార్పొరేటర్ కూడా తిరిగి సొంతగూటికి చేరుకున్నారు. దీంతో టీడీపీ బలం ప్రస్తుతం 18కి చేరింది. విజయవాడలో జనసేనకు గతంలో ఒక్క కార్పొరేటర్ లేరు. తాజాగా నలుగురు…పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరిపోయారు. మరో ఇద్దరు కాషాయ కండువా కప్పుకున్నారు. ప్రస్తుతం నగరపాలక పరిధిలో టీడీపీ, జనసేన, బీజేపీల కార్పొరేటర్ల బలం 24కు చేరింది. వైసీపీకి 38 మంది, సీపీఎంకు ఒకరున్నారు.
గత ఐదేళ్లు ఉన్న ఎమ్మెల్యేలుగా ఉన్న వెలంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణుతో…ఆ పార్టీ కార్పొరేటర్లకు గిట్టలేదు. సొంత పార్టీ ఎమ్మెల్యేల తీరుకు వ్యతిరేకంగా పలుమార్లు బహిరంగంగానే కార్పొ రేటర్లు నిరసన గళం వినిపించారు. ఆ పార్టీ అధిష్టానానికి కూడా ఫిర్యాదులు చేశారు. నగరంలో భవన ఆక్రమ నిర్మాణాలు, అదనపు అంతస్తుల అనుమతులకు సంబంధించిన వసూళ్ల విషయంలో… వెలంపల్లి, మల్లాది విష్ణు, కార్పొరేటర్ల మధ్య విభేదాలు బయటపడ్డాయి. వీరిద్దరికీ వ్యతిరేకంగా కార్పొరేటర్లు కథ నడిపారు. తాము ఎన్నికల కోసం పెట్టిన ఖర్చులో…కనీసం సగం కూడా సంపాదించుకోలేదని… రహస్య సమావేశాల్లో పలువురు కార్పొరేటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారట. ప్రస్తుతం రాష్ట్రంలో అధికారం కోల్పోవడంతో వైసీపీ కార్పొరేటర్లు రాం రాం చెప్పేస్తున్నారు. ఆ పార్టీలో ఉంటే తమకు రాజకీయ భవిష్యత్తు ఉండదనే నిర్ణయానికి చాలా మంది వచ్చేశారట. ఎలాగూ వచ్చే నగరపాలిక ఎన్నికల్లో కూటమి పార్టీలే గెలవబోతున్నట్లు అంచనాలో కార్పొరేటర్లు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అందుకే ఇప్పుడే పార్టీ మారితే వచ్చే ఎన్నికల్లో మరో సారి అవకాశం అందుకోవచ్చనే యోచనలో…కూటమి ప్రజాప్రతినిధులతో మంతనాలు జరుపుతున్నారట. కూటమిలోని మూడు పార్టీలో…తమకు ఎక్కడో ఒక చోట రాజకీయంగా అవకాశాలొస్తాయనేది కార్పొరేటర్లు లెక్కలు వేసుకుంటున్నారట.