TPCC Mahesh Goud : తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వకుండా అన్యాయం చేస్తోందని టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ ఆరోపించారు. డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణను పూర్తిగా విస్మరించారని విమర్శించారు. రాష్ట్ర సంక్షేమం, అభివృద్ధి కోసం రాజకీయ భేదాలను పక్కన పెట్టి అందరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు. తెలంగాణకు న్యాయం జరిగే వరకు శాంతియుతంగా పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు తగిన నిధులు కేటాయించకుండా అవహేళన చేస్తోందని నిరసిస్తూ, టీపీసీసీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ తదితరులు పాల్గొన్నారు. వారు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం మహేశ్ గౌడ్ మాట్లాడుతూ, తెలంగాణకు చెందిన ఇద్దరు కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధి కోసం ఏమి చేస్తున్నారు? అని ప్రశ్నించారు. తెలంగాణపై నిజమైన ప్రేమ ఉంటే వారు తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
Union Minister Suresh Gopi: గిరిజన వ్యవహారాల శాఖను బ్రాహ్మణ లేదా నాయుడు కులాల వారికి ఇవ్వాలి..
తెలంగాణ కోసం సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు ఒంటరి పోరాటం చేస్తున్నారని మహేశ్ గౌడ్ తెలిపారు. రాష్ట్రానికి ఎనిమిది మంది ఎమ్మెల్యేలు, ఎనిమిది మంది ఎంపీలు ఉన్నప్పటికీ, కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు కనీస నిధులు కేటాయించలేదని విమర్శించారు. ‘‘దేశమంటే మట్టి కాదు, దేశమంటే మనుషులు’’ అనే తెలుగు గేయాన్ని ప్రస్తావిస్తూ, తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు కేంద్ర ప్రభుత్వం మొండిచేయి చూపుతోందని ఆరోపించారు.
బీజేపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తూ, కేంద్ర బడ్జెట్ కేటాయింపులు ఢిల్లీ, బీహార్ ఎన్నికల కోసం మాత్రమేనని మహేశ్ గౌడ్ ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వం, కొన్ని రాష్ట్రాలకు మాత్రమే నిధులు కేటాయిస్తూ, ఇతర రాష్ట్రాలను విస్మరిస్తోందని విమర్శించారు. తెలంగాణ నుంచి జీఎస్టీ, ఇతర పన్నుల రూపంలో సుమారు లక్ష కోట్ల రూపాయలు వసూలు చేస్తూ, కనీసం 40 వేల కోట్లు కూడా తిరిగి ఇవ్వడం లేదని అన్నారు.
కేంద్ర ప్రభుత్వ కక్షపూరిత వైఖరిని నిరసిస్తూ, బీఆర్ఎస్, తెలంగాణవాదులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. సీఎం రేవంత్ ఢిల్లీకి వెళ్లి ప్రధానమంత్రిని కలుసుకొని నిధుల కోసం యాచించినా తెలంగాణకు ఒరిగిందేమీ లేదని విమర్శించారు. రాష్ట్ర అభివృద్ధి నిధుల కేటాయింపుపై బీజేపీ, బీఆర్ఎస్ నేతలు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
కేంద్రం వైఖరిని నిరసిస్తూ, సోమవారం రాష్ట్రవ్యాప్తంగా గల్లీ నుంచి పట్టణం వరకు నిరసన కార్యక్రమాలు చేపట్టాలని టీపీసీసీ పిలుపునిచ్చింది. ప్రధానమంత్రి, ఆర్థిక మంత్రి, తెలంగాణకు చెందిన కేంద్ర మంత్రుల దిష్టి బొమ్మలను దహనం చేయాలని పీసీసీ చీఫ్ పార్టీ శ్రేణులను కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్, ఎమ్మెల్యేలు శ్రీ గణేష్, ఈర్లపల్లి శంకర్, నాగరాజు, డీసీసీ అధ్యక్షుడు రోహిన్ రెడ్డి, కార్పొరేషన్ చైర్మన్లు మెట్టు సాయి కుమార్, మల్రెడ్డి రాంరెడ్డి, చల్ల నర్సింహారెడ్డి, రియాజ్, మహిళ కాంగ్రెస్ చీఫ్ సునీత రావ్, సామ రాంమోహన్ రెడ్డి, నియోజకవర్గ ఇంచార్జ్‌లు పాల్గొన్నారు.
తెలంగాణ అభివృద్ధి కోసం ప్రతిఒక్కరూ రాజకీయ భేదాలను పక్కన పెట్టి ఒకే వేదికపైకి రావాలని మహేశ్ గౌడ్ పిలుపునిచ్చారు. రాష్ట్రానికి తగిన నిధులు వచ్చే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
Sai Pallavi: డైరెక్టర్ సీక్రెట్స్ లీక్ చేసిన సాయి పల్లవి.. పాపం ఆడేసుకుందిగా!