Off the Record: రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు రాజకీయాల్లో వివాదాస్పద వ్యక్తిగా మారుతున్న టాక్ పెరుగుతోంది లోకల్‌గా. ప్రత్యేకించి సెల్ఫ్ గోల్స్ వేసుకుంటున్నారన్నది స్థానికంగా ఉన్న విస్తృతాభిప్రాయం. ఇప్పటికే మద్యం సిండికేట్, ఇసుక మాఫియా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేపై తాజాగా భూ దందాలపై అలిగేషన్స్ రావడమే అందుకు నిదర్శనం అంటున్నారు. రాజమండ్రి దేవీ చౌక్ సమీపంలో ఉన్న గౌతమి సూపర్ బజార్‌కు సంబంధించిన 300 గజాలు స్థలం లీజు వ్యవహారంలో గత ప్రభుత్వ హయాంలో వైసిపి నేతలు ఐదు కోట్ల రూపాయల అక్రమార్జనకు పాల్పడ్డారని నాడు ఆరోపణలు చేశారు ఆదిరెడ్డి వాసు. అక్రమ లీజును రద్దుచేసి అవినీతి పాల్పడిన వాళ్ళని జైలుకు పంపుతానని అప్పట్లో శపథం చేశారాయన. కట్ చేస్తే.. ఇప్పుడు అదే స్థలంలో మళ్లీ అదే లీజుదారుడు నిర్మాణాలు చేపట్టారు. దీంతో అప్పటి మాటలు ఇప్పుడు ఎమ్మెల్యే మెడకే చుట్టుకుంటున్నాయన్న అభిప్రాయం పెరుగుతోంది. అలాగే రాజమండ్రి పందిరి మహాదేవుడు సత్రానికి సంబంధించి దేవాదయ శాఖ ఆధీనంలో ఉన్న కోట్లాది రూపాయలు విలువైన భూములను లీజు పేరుతో కొట్టేయాలని వైసీపీ హయాంలో కొందరు ప్రయత్నించారు. ఈ విషయం అప్పటి ప్రభుత్వ పెద్దల దృష్టికి వెళ్లడంతో దేవాదాయ శాఖ భూములను లీజుకు ఇవ్వడానికి తిరస్కరించారు. తీరా… ఇప్పుడు పెండింగ్ లో ఉన్న పాత లీజు పత్రాల దుమ్ము దులిపి అప్పనంగా కొట్టేసే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఈ స్థలాన్ని ఎమ్మెల్యే బంధువు ఒకరు వివాహ వేడుకకు వేదిక కోసమంటూ శుభ్రం చేయటంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయట. రాజమండ్రి చరిత్రలో ఇప్పటివరకు ఏ ఎమ్మెల్యే మీద భూ వివాదాలకు సంబంధించి ఆరోపణలు రాలేదు. కానీ… తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన ఆదిరెడ్డి వాసు మీదే వస్తున్నాయి. 2024 ఎన్నికల్లో తొలిసారి వాసు టీడీపీ ఎమ్మెల్యే అవగా…. అంతకు ముందు ఆయన భార్య ఆదిరెడ్డి భవాని కూడా టీడీపీ ఎమ్మెల్యేగా పనిచేశారు. వాసు తండ్రి అప్పారావుకు గతంలో వైసీపీ ఎమ్మెల్సీ ఇచ్చింది. ఈక్రమంలో రెండు పార్టీల్లోనూ ఆయన మనుషులు ఉన్నట్టు చెప్పుకుంటారు. టిడిపి నేతలతో పాటు వైసీపీలోని ఒక వర్గాన్ని ఇప్పటికీ వాసు కలుపుకుని పోతుంటారని చెప్పుకుంటారు. రాజమండ్రి సిటీలోని 12 మద్యం షాపుల్లో…ఎమ్మెల్యే పెట్టుబడులు పెట్టి వాటిని అనుచరులకు అప్పగించారని, వాటితో పాటు మరి కొన్ని వైసిపి నేతల మద్యం షాపుల్ని కలుపుకుని సిండికేట్ నడుపుతున్నట్టు ప్రచారం ఉంది.
ఎమ్మెల్యే అండదండలతోనే రాజమండ్రిలోని మద్యం షాపులను బార్లుగా మార్చేయడంతోపాటు బెల్ట్ షాపులు కూడా విచ్చలవిడిగా నిర్వహిస్తున్నారట. ఎటువంటి అనుమతులు లేకుండా తన అనుచరులతో ఇసుక ర్యాంపులు నిర్వహించి జేబులు నింపుకుంటున్నారన్న ఆరోపణలు సైతం ఉన్నాయి. ఇక ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు వైసీపీలోని ఒక వర్గంతో కలిసి వ్యవహారాలు నడిపించడాన్ని టీడీపీ నాయకులు కొందరు జీర్ణించుకోలేకపోతున్నట్టు తెలుస్తోంది. ఓవైపు భవాని చారిటబుల్ ట్రస్ట్ పేరుతో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూనే… మరోవైపు ఇవేం పనులన్న చర్చ నడుస్తోంది నియోజకవర్గంలో. అటు జగదీశ్వరి చిట్ ఫండ్స్ వ్యవహారాలకు సంబంధించి సిఐడి నమోదు చేసిన కేసుల్లో గత ప్రభుత్వ హయాంలో ఆదిరెడ్డి అప్పారావు, వాసు జైలుకు వెళ్ళి వచ్చారు. ప్రస్తుతం ఈ కేసులో ఇద్దరూ బెయిల్ పై ఉన్నారు. రాజమండ్రి వ్యవహారాన్ని టీడీపీ అధిష్టానం పూర్తిగా గమనిస్తోందని, యాక్షన్ ఎలా ఉంటుందో చూడాలని అంటున్నారు స్థానికంగా ఉన్న పార్టీ నేతలు కొందరు. యాక్షన్స్, రియాక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి మరి.