ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పాలేరు సీటు చుట్టూ రాజకీయ చర్చ నడుస్తోంది. 2018 ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్ నుంచి MLAగా గెలిచిన కందాల ఉపేందర్‌రెడ్డి.. టీఆర్ఎస్‌లో చేరారు. వచ్చే ఎన్నికల్లో కారు గుర్తుపై తానే పోటీ చేస్తానని గట్టి ధీమాతో ఉన్నారు. కానీ.. మునుగోడు ఉపఎన్నిక తరుణంలో టీఆర్ఎస్, లెఫ్ట్ పార్టీల మధ్య కుదిరిన దోస్తీ.. పొత్తుల దిశగా అడుగులు వేస్తుండటంతో సీన్ మారిపోతోందన్నది తాజా టాక్. పొత్తు పొడుపుల్లో కుదిరే సర్దుబాటుల్లో పాలేరు చేరుతుందని.. ఆ సీటును సీపీఎంకు ఇవ్వొచ్చని ప్రచారం జరుగుతోంది. ఆ ప్రచారమే పాలేరు రాజకీయాలను వేడెక్కిస్తోంది.
Read Also: IT and ED Raids in Telangana: తెలంగాణపై కేంద్ర దర్యాప్తు సంస్థలు ఫోకస్.. ఈడీ తదుపరి టార్గెట్ ఎవరు?
మునుగోడు ఉపఎన్నికలో లెఫ్ట్‌పార్టీల మద్దతు TRSకు చాలా కలిసి వచ్చింది. టీఆర్ఎస్‌కు వచ్చిన మెజార్టీలో ఎక్కువ భాగం లెఫ్ట్ ఓటు బ్యాంకే అనేది రెండు పార్టీల మనసులో మాట. ఇదే మైత్రిని వచ్చే ఎన్నికల్లోనూ కొనసాగిస్తే.. టీఆర్ఎస్‌కు వర్గపోరు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాలపై ఆ ప్రభావం పడుతుందనే అభిప్రాయం ఉంది. అలాగే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కమ్యూనిస్టుల ప్రాధాన్యాన్ని పెంచాలని గులాబీ బాస్ లెక్కలేస్తున్నారనే చర్చ రాజకీయ వర్గాల్లో నడుస్తోంది. బీజేపీని కట్టడి చేసే వ్యూహంలో భాగంగా లెఫ్ట్ పార్టీలతో టీఆర్ఎస్ కలిసి వెళ్తుందనే టాక్ ఉంది. ఆ క్రమంలోనే ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో కలిసి పనిచేయడంపై అవగాహనకు వచ్చినట్టు సమాచారం. ఇటీవల సీఎం కేసీఆర్‌తో లెఫ్ట్ పార్టీ నేతలు జరిపిన ప్రాథమిక చర్చల్లో పాలేరు ప్రస్తావనకు వచ్చినట్టు తెలుస్తోంది.
ఉమ్మడి నల్గొండ జిల్లాలో సిపిఐకి ఏ నియోజకవర్గం ఇస్తారనేది క్లారిటీ లేదు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మాత్రం CPMకి ఇచ్చే సెగ్మెంట్లపై కొంత క్లారిటీకి వచ్చినట్టు తెలుస్తోంది. ఖమ్మం జిల్లాలో భద్రాచలంతోపాటుగా మరో నియోజకవర్గాన్ని ఇవ్వాలని అనుకుంటున్నారట. ఆ మేరకు కామ్రేడ్లకు స్పష్టత ఇచ్చినట్టు చెబుతున్నారు. ఆ క్రమంలోనే పాలేరుపై చర్చ మొదలైందట. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పాలేరు నుంచి పోటీ చేస్తారని.. ఆయనకు టీఆర్‌ఎస్ మద్దతిస్తుందని లెఫ్ట్ పార్టీల్లో టాక్ నడుస్తోంది. అదే నిజమైతే సిట్టింగ్ ఎమ్మెల్యే ఉపేందర్‌రెడ్డి పరిస్థితి ఏంటి? అనేది ప్రశ్న. పాలేరులో సీపీఎంకు పట్టు ఉంది. అందుకే వీరభద్రం కూడా ఆచితూచి అడుగులు వేస్తున్నట్టు సమాచారం. పాలేరులో పోటీ చేసేందుకు ఆసక్తిగా ఉన్నప్పటికీ స్థానిక టీఆర్ఎస్‌లో అంతర్గత పంచాయితీలు తేలకుండా జోక్యం చేసుకుంటే మొదటికే మోసం వస్తుందని అనుకుంటున్నారట. మరి.. ఎన్నికలు సమీపించే కొద్దీ పాలేరు రాజకీయం ఎలాంటి మలుపులు తీసుకుంటుందో చూడాలి.