Off The Record: బాపట్ల జిల్లా…. అద్దంకి నియోజకవర్గం అంటేనే వర్గ రాజకీయాలకు కేరాఫ్. ఒకప్పుడు ఇక్కడ కరణం బలరాం వర్సెస్ బాచిన చెంచు గరటయ్యగా రాజకీయాలు నడిచేవి. ఆ తర్వాత గొట్టిపాటి రవికుమార్ ఎంట్రీతో సీన్ మారిపోయింది. కొన్నాళ్ళు గొట్టిపాటి వర్సెస్ కరణం, మరి కొన్నాళ్ళు గొట్టిపాటి వర్సెస్ బాచిన కుటుంబాల పొలిటికల్ పోరు నడిచింది. రవికుమార్ నియోజకవర్గంలో పాతుకుపోవడంతో… ప్రత్యర్ధి ఎవరైనా గొట్టిపాటికి మరోవైపునే డీకొట్టాల్సిన పరిస్ధితి ఏర్పడిందన్నది లోకల్ టాక్. 2004లో రాజకీయ ఆరంగ్రేటం చేసిన గొట్టిపాటి రవికుమార్ ముందు మార్టూరు నుంచి పోటీ చేసినా… నియోజకవర్గాల పునర్విభజనతో 2009లో అద్దంకి నియోజకవర్గానికి షిఫ్ట్ అయ్యారు. దీంతో అప్పటి వరకూ కరణం.. బాచిన కుటుంబాల మధ్య ఉన్న వార్ కాస్తా గొట్టిపాటి వర్సెస్ అదర్స్ అన్నట్లుగా మారిపోయింది. 2009, 2014, 2019,2024ల్లో వరుసగా అద్దంకి నుంచి కాంగ్రెస్, వైసీపీ, టీడీపీల తరపున గెలు వస్తున్నారాయన. ప్రస్తుతం చంద్రబాబు కేబినెట్‌లో విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్నారు రవికుమార్. ఇక 2019 ముందు వరకు అద్దంకి నుంచే బరిలో దిగుతున్న కరణం బలరాం కుటుంబం.. గొట్టిపాటి టీడీపీలో చేరటం, చీరాల టీడీపీ ఖాళీ కావటంతో తప్పనిసరి పరిస్దితుల్లో అటువైపు వెళ్ళాల్సి వచ్చింది.
Read Also: Ram Charan: లండన్‌లో రామ్‌చరణ్‌ను కలిసిన కామన్‌వెల్త్ బాక్సింగ్ ఛాంపియన్..
2019లో చీరాల ఎమ్మెల్యేగా గెలిచిన కరణం బలరాం…. ఆ తర్వాత ఫ్యాన్ గూటికి చేరారు. ఇక 2024లో చీరాల నుంచే వైసీపీ తరపున ఆయన కుమారుడు కరణం వెంకటేష్ పోటీ చేసి ఓడిపోయారు. మరోవైపు గత ఎన్నికల్లో అనేక ప్రయోగాలు చేసి భారీ ఓటమిని మూటగట్టుకున్న వైసీపీ ఇప్పడిప్పుడే తప్పుల్ని సవరించుకుంటోంది. ఓడిన నియోజకవర్గాలపై కేస్ స్టడీ చేసి అక్కడ సమర్ద నాయకత్వాన్ని సిద్దం చేసే పనిలో ఉందట. ఆ క్రమంలోనే… అద్దంకికి మళ్ళీ కరణం బలరాం కుటుంబాన్ని పరిశీలిస్తున్నట్టు సమాచారం. నియోజకవర్గంలో ఇప్పటికీ బలరాంకంటూ ఓ వర్గం ఉంది. ఆయన ఎక్కడున్నా వాళ్ళతో రెగ్యులర్‌గా టచ్‌లో ఉంటారట. గతంలో ఇక్కడ ఆయన కుమారుడు వెంకటేష్‌కు కూడా అన్నీ తామై నడిపించిందట ఆ వర్గం. ఇక అద్దంకిలో సమర్థవంతమైన నాయకత్వాన్ని బరిలో దించాలని చూస్తున్న వైసీపీ తిరిగి బలరాంకు బాధ్యతలు ఇస్తే ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. గొట్టిపాటి రవికుమార్ దూకుడుకు బ్రేక్ వేయడం ఒక్క కరణం వల్లే తప్ప ఇతరులకు వీలుకాదని వైసీపీ పెద్దలు భావిస్తున్నట్టు సమాచారం. అటు 2024 ఎన్నికల్లో అద్దంకి నుంచి వైసీపీ అభ్యర్దిగా పోటీ చేసిన పాణెం హనిమిరెడ్డి కూడా ఓడిన నాటి నుంచి నియోజకవర్గంలో యాక్టివ్‌గా లేరు. దీంతో ఆయన వైపు నుంచి అభ్యంతరాలు ఉండక పోవచ్చని అనుకుంటున్నారు.
Read Also: KTR: కాంగ్రెస్ ప్రభుత్వంపై వరుస పోరాటాలకు సిద్ధం కావాలి..
దీంతో అద్దంకిని సెట్ చేయాలంటే కరణం కుటుంబానికి బాధ్యతలు అప్పగించటం ఒక్కటే మార్గమని జగన్ ఓ అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. అదే జరిగితే గొట్టిపాటి దూకుడుకు కొంత కళ్లెం వేయవచ్చన్నది జగన్ లెక్కగా చెప్పుకుంటున్నారు. కానీ.. ఇక్కడే ఇంకో ట్విస్ట్ ఉంది. కరణం బలరాం తిరిగి టీడీపీలోకి వెళ్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఆ ప్రచారాన్ని ఆయన ఖండించనూ లేదు, అలాగని వెళ్తానని చెప్పడం లేదు. దీంతో అసలు బలరాం మనసులో ఏముందోన్నది తెలియాల్సి ఉందంటున్నారు పరిశీలకులు. ఎలాగైనా తన కుమారుడు వెంకటేష్‌కు ఓ మంచి పొలిటికల్ ఫ్లాట్ ఫాంని సిద్దం చేయాలన్నది బలరాం ఆలోచన అట. ఆ పరంగా చూసుకుంటే… ఆయన అద్దంకి వైపు మొగ్గు చూపవచ్చన్న విశ్లేషణలు పెరుగుతున్నాయి. మరోవైపు కరణం వెంకటేష్‌కు రాజకీయాలు కొత్త కాకున్నా… పోటీ చేసిన రెండు సార్లు ఓడటంతో ఈసారి గెలవక పోతే రాజకీయంగా కనుమరుగవుతానన్న భయం ఉందట. అందుకే… ఆచితూచి అడుగులు వేయాలనుకుంటున్నట్టు సమాచారం. త్వరలో అద్దంకి వైసీపీ బాధ్యతల్ని కరణం వెంకటేష్‌కు అప్పగిస్తారన్న ప్రచారంలో నిజమెంత? బలరాం ఆలోచన ఏంటి? కరణం వారి పాలిటిక్స్ ఏ టర్న్ తీసుకుంటాయన్నది తేలాలంటే కొన్నాళ్ళు ఆగాల్సిందే.