Off The Record: ఆ జిల్లా కాషాయ పార్టీలో కల్లోలం మొదలైందా..? పదవుల కోసం కత్తులు దూసుకుంటున్నారా..? పనిచేసే వాళ్ళకి ప్రాధాన్యం దక్కలేదని ఫైరైపోతున్నారా? జిల్లా పార్టీ నాయకత్వం తీరుపై పెద్దలకు ఫిర్యాదులు వెళ్తున్నాయా? ఎక్కడుంగా పరిస్థితి? ఏంటా పదవుల పందేరం కథ?
Read Also: Sophia Qureshi: కల్నల్ సోఫియా ఖురేషిపై మంత్రి అనుచిత వ్యాఖ్యలు
సంగారెడ్డి జిల్లా బీజేపీ ఇటీవల కొత్త మండల అధ్యక్షుల్ని ప్రకటించింది. ఇక అంతే… ఆ ఒక్క ప్రకటనతో…. జిల్లా పార్టీలో వర్గపోరు భగ్గుమంది. తమను సంప్రదించకుండా నిర్ణయాలు తీసుకోవడం ఏంటంటూ.. పార్టీ ముఖ్య నాయకులు జిల్లా అధ్యక్షురాలిపై సీరియస్ అయినట్టు సమాచారం. ఏళ్ళ తరబడి పార్టీ కోసం కష్టపడ్డ తమకి గుర్తింపు ఇవ్వకుంటే ఎలాగని నిలదీస్తున్నారట. అంతటితో ఆగకుండా… ముఖ్య నాయకులు, కార్యకర్తలు జిల్లా పార్టీ ఆఫీస్ ముందు ఆందోళనలు చేయడంతో అంతర్గత వ్యవహారం వీధికెక్కింది. సంగారెడ్డి జిల్లాలో ఐదు అసెంబ్లీ, రెండు లోక్‌సభ నియోజకవర్గాలు ఉన్నాయి. అందులో కొన్ని మండలాలకు కొత్త అధ్యక్షుల్ని ప్రకటించారు జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి. పార్టీలో అంతర్గత గొడవలున్నా ఇప్పటిదాకా… ఎక్కడా బయటపడలేదు. కానీ..ఈ ప్రకటనతో కాషాయ పార్టీలో కుమ్ములాటలు పతాక స్థాయికి చేరాయని సొంత కార్యకర్తలే చెవులు కొరుక్కుంటున్న పరిస్థితి. జిల్లా బీజేపీలో జరుగుతున్న పరిణామాలపై తీవ్ర అసంతృప్తితో ఉన్న నేతలంతా ఈ వ్యవహారాన్ని అధిష్టానం దృష్టికి తీసుకేళ్లే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
Read Also: WTC Final- IPL 2025: డబ్ల్యూటీసీ ఫైనల్ ఎఫెక్ట్.. ఐపీఎల్‌లో ఆ జట్లకు బిగ్ షాక్!
అయితే, దశాబ్దాలుగా పార్టీ కోసం కష్టపడిన వారిని కనీసం సంప్రదించకుండా గోదావరి అంజిరెడ్డి ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకొవడమంటే.. మమ్మల్ని అవమానించ డమేనంటూ జిల్లా అధ్యక్షురాలిపై మండిపడుతున్నారట. గత శాసన సభ ఎన్నికల తర్వాత మాజీ ఎంపీ బీబీ పాటిల్ బీజేపీలో చేరడంతో బీఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకులు చాలా మంది ఆయన వెంట నడిచారు. కొత్తగా చేరిన తమకు పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని చెప్పి అప్పట్లో చేర్చుకున్నారని, ప్రస్తుతం అలాంటి పరిస్థితులేవీ ఇక్కడ చూపించడం లేదని, కనీస గౌరవం కూడా దక్కడం లేదని కొత్త నేతలు ఆవేదనను వ్యక్తం చేస్తున్నారట. ఎమ్మెల్సీ ఎన్నికల వరకు తమతో బాగానే ఉన్నప్పటికీ ఆ తర్వాత నుంచి అసలు పట్టించుకోవడం లేదని కార్యకర్తలు వాపోతున్నారు. జిల్లా అధ్యక్షురాలిపై గుర్రుగా ఉన్న నాయకులు ఓ ఫామ్ హౌస్ లో రహస్యంగా సమావేశమైనట్టు తెలిసింది.
Read Also: Top Headlines @ 9 PM: టాప్ న్యూస్
ఇక, మొదట విషయాన్ని హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లి..ఆ తర్వాత ఎటువంటి మార్పు లేకపోతే పార్టీలో ఉండాలా వద్దా అన్న సంగతి తేలుద్దామంటూ ఆ సీక్రెట్ మీటింగ్‌లో మాట్లాడుకున్నట్టు సమాచారం. జిల్లా బీజేపీలో కుటుంబ పాలన ఎక్కువైపోయిందని, ఒకే కుటుంబంలో ఇద్దరు ముగ్గురు పార్టీ పదవులు అనుభవిస్తున్నారని బహిరంగంగా విమర్శలు చేస్తున్నారు నాయకులు. అలాగే ఓ సామాజిక వర్గానికి చెందిన వారికే పదవులు ఇస్తున్నారన్న ఆరోపణలు సైతం ఉన్నాయి. పరిస్థితి ఇలాగే ఉంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీకి నష్టం తప్పదని కార్యకర్తలు, పార్టీ అభిమానులు హెచ్చరిస్తున్నారు. అయితే… జిల్లా పార్టీ వెర్షన్ మాత్రం మరోలా ఉందట. కష్టపడ్డ వారిని గుర్తించి సముచిత స్థానం ఇస్తున్నామని, ఎవర్నీ నిర్లక్ష్యం చేయడం లేదని చెప్పుకొస్తోందట నాయకత్వం. మొత్తంగా సంగారెడ్డి కమలంలో పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయికి వెళ్ళింది వ్యవహారం. మరోవైపు మెదక్ ఎంపీ రఘునందన్ రావు అసమ్మతి నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారట. ఎవరూ తొందరపడొద్దని, అందరికీ న్యాయం జరుగుతుందని నచ్చజెపుతున్నట్టు సమాచారం. అయినా సరే… తాడో పేడో తేల్చోకోవాలని కసిగా ఉన్నారట కొందరు. ఈ గొడవకు ఎలా ఫుల్‌స్టాప్ పడుతుందో చూడాలి.