Off The Record: తెలంగాణ ఉద్యమ సమయంలోను, ఆ తర్వాత అధికారంలో ఉన్న పదేళ్ళు తిరుగులేని ఆధిపత్యం చెలాయించింది బీఆర్‌ఎస్. కానీ… 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత డీలా పడ్డాయి పార్టీ శ్రేణులు. అసెంబ్లీ ఎన్నికల ఓటమితో పాటు… తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోవడంతో ఇబ్బందులు ఎదురయ్యాయి. చాలామంది నాయకులు ఒక్కరొక్కరుగా పార్టీని వదిలేసి వెళ్లారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన కొత్తల్లో అలాంటి వలసలు ఉక్కిరిబిక్కిరి చేసినా… ఈ మధ్య కాలంలో ఆ ప్రవాహం దాదాపుగా ఆగిపోయిందనే చెప్పాలి. దీంతో కాస్త ఊపిరి పీల్చుకున్న గులాబీ అధిష్టానం… ఇక పార్టీ కార్యక్రమాలపై దృష్టి పెట్టి మళ్ళీ ఊపు తీసుకురావాలని అనుకుంది. అందుకు వరంగల్‌లో జరిగిన పార్టీ రజతోత్సవ సభను వేదికగా చేసుకోవాలనుకున్నారట పార్టీ పెద్దలు. సభతో ఊపు వస్తుందని, అదే ఊపును కొనసాగించి… కేడర్‌ను రీ ఛార్జ్ చేయాలని అనుకున్నా… వాస్తవంలో ఆ పరిస్థితి కనపడటం లేదన్న చర్చ తాజాగా మొదలైంది పార్టీ వర్గాల్లో. బహిరంగ సభ తర్వాత సభ్యత్వాల నమోదు, గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు కమిటీలు ఏర్పాటు, తర్వాత కేటీఆర్ జిల్లాల పర్యటన…. ఇలా పూర్తి స్థాయిలో యాక్టివిటీని పెంచాలనుకున్నట్టు తెలిసింది.
Read Also: Operation Sindoor: 15 బ్రహ్మోస్ మిస్సైల్స్‌తో పాకిస్తాన్‌లో విధ్వంసం.. ఇండియా ప్లాన్ అదుర్స్..
కానీ… ప్లీనరీ ముగిసి 15 రోజులు కావస్తున్నా… అలాంటి వాతావరణం ఏదీ కనిపించడం లేదంటున్నారు. కనీసం ప్రాధమిక కసరత్తు కూడా జరక్కపోవడం ఏంటన్న అనుమానాలు వస్తున్నాయట పార్టీ శ్రేణులకు. అందుకు కొత్తగా చుట్టు ముడుతున్న సమస్యలే కారణం అంటున్నారు. పార్టీ కార్యక్రమాలపై దృష్టి పెట్టాలనుకునేలోపే బీఆర్‌ఎస్‌కు సోషల్ మీడియా రూపంలో సమస్యలు చుట్టుముడుతున్నాయట. ఆ పోస్టింగ్స్‌కు సమాధానం చెప్పుకోవడంతోనే సరిపోతోందని అంటున్నారు. తనను కావాలనే టార్గెట్ చేస్తున్నారని, ఆరు నెలలు జైల్లో ఉండటానికి కారకులు ఎవరో తెలుసునని, వాళ్ళు సొంత పార్టీ వాళ్ళు కావచ్చు, బయటి వాళ్ళు కావచ్చు అంటూ సంచలన ప్రకటన చేశారు ఎమ్మెల్సీ కవిత. ఆ విషయంలో కొన్నాళ్ళు పార్టీ పరమైన చర్చ, హడావిడి నడిచాయి. ఆ తర్వాత మరో సీనియర్ లీడర్ హరీష్‌రావు ఎపిసోడ్ తెర మీదికి వచ్చింది. హరీష్ పార్టీ పెట్టబోతున్నారని కొందరు, లేదు కాంగ్రెస్‌లోనో, బీజేపీలోనో చేరతారని మరికొందరు సోషల్ మీడియాలో చర్చ పెట్టి ఎవరికి తోచిన రాతలు వాళ్ళు రాసేసుకున్నారు.
Read Also: Operation Sindoor: 15 బ్రహ్మోస్ మిస్సైల్స్‌తో పాకిస్తాన్‌లో విధ్వంసం.. ఇండియా ప్లాన్ అదుర్స్..
ఆ వ్యవహారం మరీ శృతి మించేసరికి చివరికి హరీష్‌రానే రంగంలోకి దిగి… తాను కేసీఆర్‌కి నమ్మిన బంటునని, ఆయన మాట జవదాటబోనని వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. ఇలా వరుసబెట్టి వస్తున్న వివాదాలు, వాటికి సంబంధించిన వివరణలు, చర్చలతోనే సమయం సరిపోతోంది తప్ప పార్టీ కార్యక్రమాల మీద దృష్టి పెట్టే అవకాశం గులాబీ పెద్దలకు రావడం లేదన్న చర్చ జరుగుతోంది రాజకీయ వర్గాల్లో. అటు సోషల్ మీడియా రాతలకు పార్టీ పరంగా కౌంటర్స్ వేస్తున్నా…. వాటి తాలూకు డిస్ట్రబెన్స్ అయితే ఖచ్చితంగా నాయకత్వంలో ఉంటోందన్న అభిప్రాయం గులాబీ వర్గాల్లో పెరుగుతోంది. పార్టీ కీలక నాయకులే తమ గురించి తాము చెప్పుకోవాల్సి రావడం ఒకవైపు… బీజేపీ, కాంగ్రెస్‌లో విలీనం అవుతుందన్న ప్రచారం మరోవైపు కలగలిసి ఎక్కడ లేని గందరగోళాన్ని సృష్టిస్తున్నాయని, ఆ దెబ్బకు కేడర్ కూడా అయోమయంలో పడుతోందని చెప్పుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో… రజతోత్సవ బహిరంగ సభ తర్వాత ఫుల్‌గా రీ ఛార్జ్ మోడ్ ఆన్ అవుతుందని అనుకున్నా… ఆ ఒక్కటీ జరగడం లేదంటున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి వస్తామని చెబుతున్న అధినాయకత్వం గేమ్ ప్లాన్ మార్చి స్పీడ్ అయితే తప్ప ఉపయోగం ఉండబోదని, ఆ దిశగా అడుగులేయాలన్న చర్చ జరుగుతోంది పార్టీ వర్గాల్లో.