Off The Record: ఆ నియోజకవర్గంలో అధికార పార్టీ ముఖ్య నాయకుడు మద్యం వ్యాపారులను బెదిరిస్తున్నారా? మీ సంపాదనలో నాకు గట్టి వాటా కావాల్సిందేనని డిమాండ్ పెట్టారా? లేదంటే.. ఎక్సైజ్ జీపులు వైన్స్ షాపుల మందు ఆగుతున్నాయా? మేం వ్యాపారమన్నా బంద్ చేసుకుంటాం గానీ.. మీరు అడిగినంత ఇచ్చుకోలేమని వైన్స్ ఓనర్స్ చెప్పేశారా? ఎక్కడ జరుగుతోందా తంతు? నెలకు ఎంత అడుగుతున్నాడా టీడీపీ నేత?
Read Also: Off The Record: మిత్రపక్షం తీరుతో బొలిశెట్టి విసిగిపోతున్నారా..?
సాధారణంగా ఎక్కడైనా.. మద్యం షాపు దక్కిందంటే లక్ అన్నట్టే. ఆ వ్యాపారం, అందులో ఆదాయం ఆ రేంజ్‌లో ఉంటాయి మరి. అందుకే.. లిక్కర్ షాపుల లాటరీ టైంలో అంత ఉత్కంఠ ఉంటుంది. బెదిరింపులు, సిండికేట్ల లాంటి మాటలు వినిపిస్తుంటాయి. ఇక వైన్స్ షాపుల నిర్వహణకు ఎక్సైజ్ రూల్స్ ఉంటాయి. వాటిని ఏ మాత్రం అతిక్రమించినా.. చర్యలు తప్పవు. కానీ, వాస్తవంలో మాత్రం పరిస్థితులు వేరుగా ఉంటున్నాయి. ఉదయం పదిగంటలకు తెరవాల్సిన వైన్స్ షాపులు కొన్ని చోట్ల పొద్దు పొద్దున్నే మిల్క్ బూత్‌లతో పాటే ఓపెన్ అయిపోతుంటాయి. ఇక వైన్స్ షాపుల పక్కనే పర్మిట్ రూమ్స్ సంగతైతే చెప్పే పనేలేదు. అయినా అలాంటివేవీ ఎక్సైజ్ అధికారులకు కనిపించవు. నెలవారీ మామూళ్లే అందుకు కారణం అన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ మాముూళ్ళు అధికారులతో పాటు రాజకీయ నాయకులకు కూడా బాగానే అందుతుంటాయన్నది బహిరంగ రహస్యం. ప్రస్తుతం గుంటూరు జిల్లా పత్తిపాడులో ఇదే హాట్ టాపిక్ అయింది. ఈ నియోజకవర్గంలో 20 వైన్స్ షాపులున్నాయి. అన్ని చోట్లలాగే ఇక్కడ కూడా అందే మామూళ్ళు అందుతున్నా.. ఓ రాజకీయ నాయకుడు అంతకు మించి అనడంతో సమస్య మొదలైందట.
Read Also: CM Revath Reddy : వచ్చే 72 గంటలు అలెర్ట్‌గా ఉండాలని ఆదేశాలు
నియోజకవర్గంలోని ఓ టీడీపీ నేత వ్యవహారశైలి మీద చర్చ జరుగుతోంది. సెగ్మెంట్‌లో పార్టీకి అతి ముఖ్యమని భావించే నేతకు ముఖ్య అనుచరుడిగా ఉన్న సదరు లీడర్…. ఈ మధ్య లోకల్ లిక్కర్ వ్యాపారులు అందర్నీ పిలిపించారట. మద్యం దుకాణాల దగ్గర అనుమతి లేకుండా పర్మిట్ రూమ్స్ పెడుతున్నారు. దానివల్ల మీకు అదనంగా ఆదాయం వస్తుంది. కాబట్టి… అందులో మాక్కూడా వాటా కావాలని అడిగారట. ఒక్కో మద్యం దుకాణం నుంచి నెలకు ఐదు లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేయడంలో బిత్తరపోవడం వ్యాపారుల వంతైందని చెప్పుకుంటున్నారు. ఆ మాట విన్నాక… వాళ్ళందరికీ ఎత్తిన ఫుల్ బాటిల్ దించకుండా తాగేసినంత కిక్కెక్కి బుర్ర గిర్రున తిరిగిపోయిందట. కాసేపటికి తేరుకుని.. అన్నా.. అసలే వ్యాపారం డల్ గా ఉంది. ఇప్పుడు మీరు కొత్తగా డబ్బులు ఇవ్వాలంటే కష్టమేనని చెప్పినట్టు ప్రచారం జరుగుతోంది. ఆ తర్వాత వ్యాపారులు ఎవరూ ఆ మామూళ్ళ గురించి మాట్లాడని క్రమంలో.. ఈ మధ్య షాపుల్లో ఎక్సైజ్ తనిఖీలు జరిగాయట.దీంతో మరోసారి షాక్ తిన్న మద్యం వ్యాపారులు ఇలాగైతే బిజినెస్ చేయడం కష్టమని భావించినట్టు సమాచారం. ఇదే విషయాన్ని ఎక్సైజ్ శాఖకు చెందిన ఓ ఉన్నతాధికారి దగ్గర చెప్పినా…ఆయన కూడా మేం మాత్రం ఏం చేస్తామన్నట్లు చూశారట. పైగా, మీరంతా మీ పరిధిలోని గ్రామాల్లో బెల్టుషాపులకు సరఫరా చేస్తూ బాగానే సంపాదిస్తున్నారు.. మాకు ఇవ్వడానికి మాత్రం ఏడుస్తారంటూ రివర్స్ అయినట్టు చెప్పుకుంటున్నారు.
Read Also: Coolie : ‘కూలీ’ సినిమాకు ఏపీలో టికెట్ ధరల పెంపు.. ఎంతంటే ?
దాంతో.. ఇలా బెదిరింపులకు పాల్పడితే మేం వ్యాపారం చెయ్యలేమని చెప్పేసినట్టు సమాచారం. అదే సమయంలో మళ్ళీ ఎక్కడ అధికారులు దాడులు చేస్తారోనన్న భయం కూడా కొంతమంది వ్యాపారుల్లో మొదలైందని అంటున్నారు. అసలు సమస్య పర్మిట్ రూములే కదా అంటూ.. కొందరు వైన్స్ షాపుల పక్కనే అనధికారికంగా ఏర్పాటు చేసిన రూమ్స్‌ని క్లోజ్ చేసేశారు. మరి కొంత మంది మాత్రం అందరూ ఏం చేద్దామంటే మేము కూడా అలాగేనంటూ లౌక్యంగా తప్పించుకుని వాటిని కొనసాగిస్తున్నారట. ప్రస్తుతానికి వాతావరణం అలా అలా ఉన్నా.. ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న టెన్షన్ మాత్రం మద్యం వ్యాపారుల్లో ఉన్నట్టు చెప్పుకుంటున్నారు. వ్యాపారం కోసం అనధికార పర్మిట్ రూములు పెట్టామే తప్ప వాటివల్ల మాకేమీ అదనపు ఆదాయం రాదని అంటున్నారు వైన్ షాప్స్ ఓనర్స్. కానీ మీరు సంపాదించుకున్నప్పుడు మాకు మాత్రం ఎందుకివ్వరు అన్నట్టుగా ఉందట నియోజకవర్గ ముఖ్య నేత తీరు. అధికార పార్టీ నాయకుడి వ్యవహారం ఇలాగే ఉంటే… ఇక నియోజకవర్గంలో వ్యాపారం బంద్ చేయడమే బెటరన్న చర్చ జరుగుతోందట వ్యాపారుల్లో. ఈ మామూళ్ళ కథ ఏ మలుపు తిరుగుతుందో చూడాలి.