డ్రైవర్ సుబ్రమణ్యం హత్యకేసులో ఎమ్మెల్సీ అనంతబాబును గత నెల 23న అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అప్పటి నుంచి ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్‌లో ఉన్నారు. బెయిల్ కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఎమ్మెల్సీ జైలులో ఉన్నప్పటికీ రంపచోడవరం నియోజకవర్గంలో ఏ పనైనా ఆయన కనుసన్నల్లోనే జరుగుతోందట. నియోజకవర్గంలో మొత్తం 11 మండలాలు ఉన్నాయి. రాష్ట్ర విభజనప్పుడు తెలంగాణలోని పోలవరం ముంపు మండలాలు కొన్ని రంపచోడవరం నియోజకవర్గంలో కలిశాయి. రంపచోడవరం వ్యాప్తంగా తనకు నమ్మకంగా ఉన్న అనుచరులతో పనులు చక్కబెడుతున్నారట అనంతబాబు. ఒక్కో మండలం బాధ్యత ఒక్కో అనుచరుడికి అప్పగించేశారట. తాను ఫీల్డ్‌లో లేకపోయినా ఎక్కడేం జరుగుతుందో అంతా తనకు తెలుసని చెబుతున్నారట ఎమ్మెల్సీ.
గతంలో బయట ఉన్నప్పుడు వ్యవహారాలు ఎలా జరిగాయో.. ఇప్పుడు కూడా అలాగే ఉండాలని జైలు నుంచి ఆదేశాలు ఇస్తున్నారట ఎమ్మెల్సీ అనంతబాబు. తరచూ తనను కలవడానికి వస్తున్న మందీమార్బలానికి దిశానిర్దేశం చేస్తున్నారట. తాను లేకపోయినా తన పేరు మాత్రం నియోజకవర్గంలో మార్మోగి పోవాలని.. జనాల్లో నిరంతరం తన గురించి చర్చ జరగాలని వచ్చిన వారికి నూరి పోస్తున్నారట ఈ ఎమ్మెల్సీ. పార్టీ నుంచి సస్పెండ్ అనేది చాలా చిన్న విషయమని.. అవన్నీ తాను చూసుకుంటానని గట్టిగానే చెబుతున్నారట. తాను ఎలా బయటకు రావాలో.. వచ్చాక ఏం చేయాలో క్లారిటీ ఉందని బదులిస్తున్నారట అనంతబాబు.
బాస్ ఇచ్చిన ఆదేశాలో ఏమో.. రంపచోడవరంలో అనుచరులు ఒక్కసారిగా గేర్ మార్చేశారు. గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే ధనలక్ష్మి పాల్గొంటున్నా.. అనంతబాబు అనుచరులు చాలా హడావిడి చేశారు. ఎమ్మెల్సీ అనంతబాబు ఫ్లెక్సీకి పాలాభిషేకాలు.. పూలదండలు జై జైలు పడుతూ పెద్ద సీన్ క్రియేట్ చేశారు. అనంతబాబు లేకపోతే నియోజకవర్గంలో వైసీపీ ఉందా అనే స్థాయిలో చర్చ తీసుకువస్తున్నారట అనుచరులు. ఇంత కంటే పెద్ద కేసులు ఉన్న వాళ్లు కొద్దిరోజులు గ్యాప్ ఇచ్చి పాలిటిక్స్‌లో యాక్టివ్ అవుతున్నారని.. అనంతబాబు కేసులో ఏముంది అని లైట్‌గా తీసుకుంటున్నారట.
రంపచోడవరం వైసీపీ ఎమ్మెల్యేగా ధనలక్ష్మి ఉన్నారు. అంతకుముందు అదేపార్టీ నుంచి రాజేశ్వరి గెలిచినప్పుడు కూడా పెత్తనం అనంత బాబుదే అని ఓపెన్ టాక్. ప్రస్తుతం జైల్లో ఉన్నా ఇక్కడ ఎమ్మెల్యేకి పెద్దగా పని లేదట. ఎప్పట్లాగే అధికారిక కార్యక్రమాలకు హాజరు కావడం తప్ప ఎమ్మెల్యే సొంత నిర్ణయాలు ఏమీ తీసుకోకూడదట. బాస్ మాకు బాధ్యతలు అప్పగించారు మీరు రిలాక్స్ అవ్వండి అని ధనలక్ష్మికి ముఖం మీదే చెబుతున్నారట అనుచరులు. నియోజకవర్గానికి చెందిన కొందరు అధికారులు .. ఉద్యోగ బదిలీల్లో ఎమ్మెల్సీ సిఫారసుల కోసం తెగ ప్రయత్నాలు చేస్తున్నారట. మొత్తానికి కిందపడ్డా తనదే పైచెయ్యి అన్నట్టుగా ఉందట అనంతబాబు వ్యవహార శైలి. వైసీపీ నుంచి సస్పెండ్ చేసినా రంపచోడవరంలో పెత్తనం చెలాయిస్తున్నారట.