Off The Record: రికార్డ్ మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలిచిన ఆ మాజీ మంత్రికి ఇప్పుడు నియోజకవర్గంలో సీన్ సితారవుతోందా? తెచ్చి నెత్తిన పెట్టుకుని గెలిపిస్తే… భస్మాసుర హస్తంలా మారారని లోకల్ లీడర్స్ ఫీలవుతున్నారా? ఒకప్పుడు పట్టిందల్లా బంగారం అన్నట్టుగా ఉన్న ఆ నేత ఇప్పుడు పూలమ్మిన చోటే కట్టెలమ్ముతున్నారా? అసలు ఎవరా ఎమ్మెల్యే? అంత దుస్థితి ఎందుకు వచ్చింది ఆయనకు?
Read Also: Falcon App Scam: ఏం స్కెచ్చేశారు మామ.. చిన్న యాప్‌తో 4 వేల కోట్ల రూపాయలు కొట్టేశారుగా!
గంటా శ్రీనివాసరావు….తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా పరిచయం అవసరంలేని నాయకుడు. ఆయన పొలిటికల్ సక్సెస్‌ల సంగతి ఎలా ఉన్నా… ఏ ఎండకు ఆ గొడుగు పట్టేస్తారని మాత్రం గట్టిగా చెప్పుకుంటుంటాయి రాజకీయ వర్గాలు. ఆయన అధికారం లేకుండా ఎక్కువ కాలం ఉండలేకపోవడమే అందుకు కారణం అంటారు. 2024 ఎన్నికల్లో సీటు కోసం ఎక్కువ నలిగిపోయిన అతికొద్ది మంది నేతల్లో గంటా ఒకరు. ఆఖరి నిముషం వరకు టీడీపీ హైకమాండ్ అభ్యర్థిత్వం ఖరారు చేయకపోగా పోటీ చేసే స్థానాలపై అనేక కండిషన్స్ పెట్టింది. అసలు 2014లోనే టీడీపీ పెద్దలతో ఆయనకు గ్యాప్ వచ్చిందన్న ప్రచారం ఉంది. అప్పట్లో HRD మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన గంటా… ఒక రకంగా పార్టీ నాయకత్వాన్ని బైపాస్ చేసే స్థాయికి వెళ్ళాలనే ప్రచారం జరిగింది. ఆ తర్వాతి నుంచి ఆయనకు ప్రాధాన్యం తగ్గుతూ వచ్చిందట. ఇక మంత్రి హోదాలోనే 2019లో విశాఖ ఉత్తర నియోజకవర్గం బరిలోకి దిగి అత్తెసరు మెజారిటీతో బయటపడ్డారాయన. ఐతే అప్పటి జగన్ సునామీలో దక్కిన ఆ విజయం ఒక విధంగా గంటా ఎన్నికల నిర్వహణకు నిదర్శనమన్న టాక్ ఉంది. నాడు గెలుపు అయితే దక్కింది గానీ..హైకమాండ్ తో ఏర్పడ్డ గండి మాత్రం పూడ్చుకోలేకపోయారట.
Read Also: Off The Record: తెలంగాణ బీజేపీలో పదవుల పంచాయితీ..?
నాడు ప్రతి పక్ష ఎమ్మెల్యేగా అసెంబ్లీకి హాజరు కోసం వెళ్ళిన ఈ మాజీ మంత్రి నియోజకవర్గం, పార్టీ వ్యవహారాలను గాలికి వదిలేశారనే ఫిర్యాదులు వెళ్ళాయి. అప్పట్లో వైసీపీలో చేరేందుకు ఉత్సాహం ప్రదర్శించారని, ఒకటి రెండు సార్లు ముహూర్తం ఖరారైందని కూడా చెప్పుకున్నారు. ఆ ఎపిసోడ్ తర్వాత టీడీపీ అధినాయకత్వంతో గంటాకు దూరం మరింత పెరిగింది. మొన్నటి ఎన్నికల్లో చీపురుపల్లి నుంచి పోటీ చేయాలని అధిష్టానం ఆదేశిస్తే గంటా అంగీకరించలేదు. నానా తంటాలు పడి భీమిలి టిక్కెట్ తెచ్చుకుని గెలిచారాయన. ఈ సీనియర్ నేతకు మంత్రి వర్గంలో ఛాన్స్ మీద ఊహాగానాలు నడిచినా… అవన్నీ ఉత్తుత్తివేనని తేలిపోయింది. మంత్రి పదవి సంగతి తర్వాత. అసలిప్పుడు ఆయనకు అధిష్టానం దగ్గర కనీస మర్యాద కూడా దక్కడం లేదనే ప్రచారం బలంగా ఉంది. ఒక్కమాటలో చెప్పాలంటే శాసనసభ్యుడిగా ఇప్పుడు గంటా సొంత పార్టీలోనే ఒంటరి పోరాటం చేస్తున్నారట. కనీసం మీటింగ్ పెడదామని పిలిస్తే….సహచర ఎమ్మెల్యేలు కూడా ఆయనను కలిసేందుకు ఇష్టపడటం లేదని సమాచారం. ఇటీవల జరిగిన బదిలీల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేగా గంటా మాటను అధికారులు ఖాతరు చేయకపోవడం తీవ్ర చర్చనీయాంశం అయింది. ఆనందపురం తహసీల్దార్ నియామకంలో కనీసం తనకు సమాచారం కూడా ఇవ్వకపోవడం పై గుర్తుగా ఉన్నారట ఆయన. రెండు సార్లు మంత్రిగా చేసిన గంటాకు ఇలాంటి గడ్డు పరిస్థితులు ఎదురవడం ఆయన కెరీర్‌లోనే తొలిసారి అంటున్నారు.
Read Also: Off The Record: సొంత జిల్లా కాబట్టి సీఎం చూసుకుంటాడని అనుకుంటున్నారా?
అలక పాన్పు ఎక్కిన రోజుల్లో… చంద్రబాబు, లోకేష్ విశాఖ వస్తే.. కనీసం కర్టసీ విజిట్‌కు కూడా వెళ్లని ఈ మాజీ మంత్రి తత్వం బోధపడేసరికి ఇప్పుడు ఎదురెళ్ళి ఏకంగా స్వాగతాలే పలుకుతున్నారట. ఇవన్నీ ఒక ఎత్తైతే.. గంటా అనుకుంటే పని జరుగుతుందనే నమ్మకం ఒకప్పుడు ఆయన వర్గీయుల్లో ఉండేది. కానీ, ఇప్పుడా పరిస్థితి మారిపోయి సొంత పార్టీ నేతలే ఆయన మీద ఫిర్యాదులు చేసేదాకా వెళ్ళిపోయింది. పార్టీలో.. కష్టపడిన నాయకులకు గుర్తింపు లేకుండా చేస్తున్నారంటూ.. జిల్లా టిడిపి అధ్యక్షుడు గండి బాబ్జికి భీమిలి నియోజకవర్గ నేతలు ఫిర్యాదు చేశారు. వలస నేతలకు, ఎమ్మెల్యే అనుచరులకే పదవులు దక్కుతున్నాయని, జండా మోసిన నాయకులకు అన్యాయం జరుగుతోందన్నది ఆ ఫిర్యాదు సారాంశం. దీనిపై రేపో మాపో ఎంపీ భరత్‌కు కంప్లయింట్ ఇచ్చి.. తర్వాత డైరెక్ట్‌గా అమరావతి వెళ్ళాలనుకుంటోందట గంటా వ్యతిరేక వర్గం. ఈసారి ఆయన్ని గెలిపించి తప్పు చేశామని, అది తమకు భస్మాసుర హస్తం అయిందని ఆవేదనగా ఉన్నారట భీమిలి టీడీపీ ద్వితీయశ్రేణి నాయకులు. అన్యాయం జరిగితే తమ దారి తాము చూసుకుంటామని కూడా హెచ్చరిస్తున్నారు కొందరు. మరోవైపు., గంటా మీద కార్పొరేటర్లు, ద్వితీయ శ్రేణి ఫిర్యాదులుపై మరో వర్గం కౌంటర్ చేస్తోంది. ఎమ్మెల్యే మీద ఫిర్యాదు చేసిన వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తోంది ఆ వర్గం. మొత్తం మీద సొంత పార్టీ ఎమ్మెల్యే పైనే టిడిపి నేతలు ఫిర్యాదు చేయడం విశాఖ జిల్లాలో హాట్ టాపిక్ అయింది. ఓడలు బండ్లు, బండ్లు ఓడలు అనడమంటే ఇదే కాబోలు అంటున్నారు రాజకీయ పరిశీలకులు.