తెలంగాణ బీజేపీలో అప్పుడే పదవుల పంచాయితీ మొదలైపోయిందా? కొత్త కమిటీని వేయడం అంత తేలిగ్గా లేదా? రాష్ట్ర కమిటీ కోసం హైదరాబాద్ నుంచి ఢిల్లీ దాకా… పెద్ద ఎత్తున లాబీయింగ్ జరుగుతోందా? ఆ దిశగా ప్రస్తుతం పార్టీలో జరుగుతున్న కసరత్తు ఏంటి?
Read Also: Off The Record: సొంత జిల్లా కాబట్టి సీఎం చూసుకుంటాడని అనుకుంటున్నారా?
తెలంగాణ బీజేపీకి కొత్త సారథి వచ్చారు. రామచంద్రరావు పార్టీ పగ్గాలు చేపట్టారు. ఇక త్వరలోనే పూర్తి స్థాయి జిల్లా కమిటీల నియామకం జరగబోతోంది. ఆ కొత్త కమిటీలతో తన సొంత టీమ్‌ను సిద్ధం చేసుకోవాలనుకుంటున్నారట రామచంద్రరావు. అటు రాష్ట్ర కమిటీని కూడా వీలైనంత త్వరగానే ప్రకటిస్తారన్న టాక్ నడుస్తోంది పార్టీ వర్గాల్లో. సాధారణంగా… బీజేపీ రాష్ట్ర కమిటీ లిమిటెడ్‌గా ఉంటుంది. మొహమాటాలు, వర్గాలను సంతృప్తి పరచాలన్న కారణాలతో జంబోకు ఛాన్స్ ఉండదు. అలాగని తక్కువ పోస్టులతో అందరినీ సంతృప్తి పరచడం అంత తేలిక కాదు. ఇదే ఇప్పుడు కొత్త అధ్యక్షుడికి కత్తిమీద సాము కాబోతోందని చెప్పుకుంటున్నాయి పార్టీ వర్గాలు. ఇటు రాష్ట్రంలో పార్టీ విస్తరిస్తోంది. 40 లక్షల సభ్యత్వంతో 34 వేల మంది క్రియా శీలక సభ్యులతో, 20 మంది ప్రజా ప్రతినిధులతో గతం కన్నా బలంగా ఉంది. దీంతో…. పార్టీ పదవులు ఆశిస్తున్న వారి సంఖ్య కూడా భారీగానే ఉంది. పాత కమిటీలో 8 మంది ఉపాధ్యక్షులు, 8 మంది కార్యదర్శులు, ఐదుగురు ప్రధాన కార్యదర్శులు, కోశాధికారి ఉన్నారు.
Read Also: Off The Record: మంచిర్యాలలో మంత్రికి నో ఎంట్రీ బోర్డు ఎన్నాళ్ళు?
వీరికి అదనంగా ఒకరిద్దరికి అవకాశం ఇవ్వాలని అడిగినా… అప్పట్లో నో చెప్పింది కేంద్ర పార్టీ. దీంతో ఈసారి కూడా అదే సంఖ్యతో సర్దుకు పొమ్మంటారా? లేక కాస్త సడలింపులు ఇస్తారా అని ఆసక్తిగా చూస్తున్నాయి… రాష్ట్ర బీజేపీ వర్గాలు. మరోవైపు పార్టీ పదవుల కోసం ఆశావహులు ప్రయత్నాలు మొదలు పెట్టారు. మరీ ముఖ్యంగా… రాష్ర్ట కమిటీలో చోటు కోసం పైరవీలు జోరందుకున్నాయట. అధ్యక్షుడి తర్వాత పార్టీలో ప్రధాన కార్యదర్శి పోస్ట్ పవర్ ఫుల్. అందుకే దాని మీదే ఎక్కువ మంది కన్నేసినట్టు సమాచారం. దీంతో ప్రధాన కార్యదర్శి పోస్ట్ పాటు మిగతా పదవులు ఎవరిని కలిస్తే వస్తాయంటూ ఆరా తీసేవారి సంఖ్య పెరిగిపోతోందట తెలంగాణ బీజేపీలో. పార్టీ పెద్దలతో పాటు.. ఆర్‌ఎస్‌ఎస్ ముఖ్యులను కూడా కలిసి కొందరు మనసులో మాట చెప్పుకుంటున్నారట. సునీల్ బన్సల్, అభయ్ పాటిల్ ముందు తమ దరఖాస్తులను పెడుతున్నట్టు సమాచారం. దీంతో కమిటీ వేసుకోవడం రామచంద్రరావుకు కత్తిమీద సామేనన్న అభిప్రాయం బలపడుతోంది. పదవుల పంచాయతీలో అందరినీ మెప్పించి ఒప్పించి తన టీమ్‌ను ఆయన ఎలా తయారు చేసుకుంటారోనని చూస్తున్నారు రాజకీయ పరిశీలకులు.