అబ్బబ్బ.. ఏం స్కెచ్చేశారు. చిన్న యాప్ పెట్టారు.. ఏకంగా 4 వేల కోట్ల రూపాయలు కొట్టేశారు. ప్రపంచంలో ఎవరూ పెట్టని విధంగా ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ యాప్ పేరుతో జనానికి కుచ్చుటోపీ పెట్టారు. తీరా బాధితులు.. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో తట్టా బుట్టా సర్దేసి విదేశాలకు చెక్కేశారు. కానీ దాదాపు 4 నెలల తర్వాత పోలీసులు ఫాల్కన్ నిందితుల్లో కీలక వ్యక్తిని అరెస్ట్ చేశారు.
పెద్ద ఎత్తున జనాలకు కుచ్చుటోపీ పెట్టిన ఫాల్కన్ కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా వేల మందిని లక్షల్లో ముంచేసింది. చిన్న మొత్తాలు పెట్టుబడి పెట్టండి.. పెద్ద మొత్తంలో లాభాలు పొందండి అంటూ జనాన్ని నిలువు దోపిడీ చేశారు. తాజాగా ఈ కేసులో చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ఆర్యన్ సింగ్‌ను సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. నాందేడ్ మీదుగా పంజాబ్‌లో భటిండాకు పారిపోయి అక్కడ ఓ గురుద్వారాలో తలదాచుకున్నాడు ఆర్యన్ సింగ్. విశ్వసనీయ సమాచారంతో CID బృందం అక్కడికి వెళ్లి జులై 4న అరెస్ట్ చేసింది. ఆయనను హైదరాబాద్‌కు తీసుకువచ్చి.. జులై 6న న్యాయమూర్తి ముందు హాజరు పరిచారు. ఫాల్కన్ స్కామ్ కేసులో ఆర్యన్ సింగ్ ఐదవ నిందితుడుగా ఉన్నారు. దాదాపు 3 నెలల నుంచి పోలీసులకు దొరకకుండా తప్పించుకు తిరుగుతున్నాడు..
ఫాల్కన్ కంపెనీ COOగా వ్యవహరించిన ఆర్యన్, స్ట్రాటజిక్ డిపాజిట్ల పేరిట రూ.14.35 కోట్లు, తన ఖాతాలోకి రూ.1.62 కోట్లు మళ్లించుకున్నాడని పోలీసులు తెలిపారు. అతనే బాధితులతో డీలింగ్ చేసేవాడంటున్నారు. అంతే కాదు బాధితులకు ఫేక్ ఒప్పందాలు, డాక్యుమెంట్లు ఇచ్చినట్లు గుర్తించారు. మరోవైపు ఆర్యన్ వద్ద నుంచి రెండు సెల్‌ఫోన్లు, ఇంక్రిమినేటింగ్ డాక్యుమెంట్లు CID అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
Also Read: Old Temples Lift: జాకీల సాయంతో వందేళ్ల నాటి ఆలయాలు లిఫ్ట్.. ఎక్కడో తెలుసా?
ఫాల్కన్ కేసులో ఇప్పటివరకు 10 మంది నిందితులను అరెస్ట్ చేశారు. ఇంకా ఛైర్మన్తో పాటు పలువురు కీలక నిందితులు పరారీలో ఉన్నారు. వారి కోసం లుకౌట్ నోటీసులు కూడా జారీ అయ్యాయి. వారిని పట్టుకోవడం కోసం ప్రత్యేక బృందాలు పనిచేస్తున్నాయి. ఫాల్కన్ కంపెనీ దేశవ్యాప్తంగా 7056 మంది నుంచి దాదాపు 4,215 కోట్లను సేకరించింది. అయితే వీటిలో 792 కోట్లు 4065 మందికి తిరిగి చెల్లించక పోవడంతో మోసం జరిగినట్లు తేలింది. ఫాల్కన్ ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ యాప్ అభివృద్ధి చేశారు. నకిలీ డీల్స్, నకిలీ రసీదులు, నకిలీ ఒప్పందాలు! మొత్తం నకిలీ స్కెచ్‌తోనే డబ్బులు వసూలు చేశారు. తొలుత హైదరాబాద్‌లో కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత వాటిని EOW విభాగానికి అప్పగించారు. తర్వాత కేసును సీఐడీకి అప్పగించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఫాల్కన్ కంపెనీపై 8 కేసులు నమోదై ఉన్నాయి.
అసాధ్యమైన లాభాలు వాగ్దానం చేసే ఆన్‌లైన్ స్కీమ్‌లను నమ్మవద్దని పోలీసులు చెబుతున్నారు. సాంకేతికతను వాడుకుంటూ మోసాలు చేసే వాటిని ముందుగానే గుర్తించాలంటున్నారు. డబ్బు పెట్టుబడి పెట్టే ముందు ధృవీకరణ చేయడం తప్పనిసరి అంటున్నారు హెచ్చరిస్తున్నారు.