Off The Record: సొంత జిల్లా.. అంతా ఆయనే చూసుకుంటాడు.. ఇక మనకెందుకని ఆ ముగ్గురు మంత్రులు మౌన వ్రతం పాటిస్తున్నారా? రైతులు రగిలిపోతున్నా… పార్టీ కేడర్ ఫీలవుతున్నా… మనకెందుకొచ్చిన గొడవ అనుకుంటూ… పక్కకు తప్పుకుంటున్నారా? ఏ మంత్రులు అంత నిర్లిప్తంగా ఉన్నారు? వాళ్ల మీద టీడీపీ నాయకులే ఎందుకు అంతలా మండిపడుతున్నారు?
Read Also: Off The Record: మంచిర్యాలలో మంత్రికి నో ఎంట్రీ బోర్డు ఎన్నాళ్ళు?
2024 అసెంబ్లీ ఎన్నికల్లో… ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని మొత్తం 14 స్థానాలకు గాను 12 చోట్ల గెలిచింది కూటమి. సీఎం చంద్రబాబు సొంత జిల్లాలో గతంలో ఎప్పుడూ ఈ స్థాయి విజయం దక్కలేదు. అయినాసరే… ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు జిల్లా టీడీపీ ద్వితీయ శ్రేణికి మింగుడు పడటం లేదట. తోతాపురి మామిడికి గిట్టుబాటు ధర విషయంలో అంత రచ్చ జరుగుతున్నా… నిన్నటిదాకా జిల్లా ఎమ్మెల్యేలు ఎవ్వరూ నోరు మెదపలేదు. రెండు మూడు రోజుల నుంచి ఒకరిద్దరు కాస్త సౌండ్ చేస్తున్నారు. ఎమ్మెల్యేలు సరే….. వాళ్ళని సమన్వయం చేయాల్సిన ఇన్ఛార్జ్ మంత్రులు ఏం చేస్తున్నారన్నది కార్యకర్తల క్వశ్చన్. ప్రస్తుతం చిత్తూరు జిల్లాకు రాంప్రసాద్‌రెడ్డి, తిరుపతి జిల్లాకు అనగాని సత్యప్రసాద్ ఇన్ఛార్జ్‌లుగా ఉన్నారు. మరి ఉమ్మడి జిల్లాలో జరుగుతున్న మామిడి రచ్చ వాళ్ళిద్దరికీ ఎందుకు పట్టడం లేదు? దాని గురించి ఇద్దరూ ఎందుకు మాట్లాడ్డం లేదు? సొంత జిల్లా కాబట్టి… అంతా ఆయనే చూసుకుంటాడు.. మనకెందుకొచ్చిన గొడవ అనుకుంటున్నారా అంటూ ఆగ్రహం వ్యక్తం అవుతోందట కేడర్‌లో. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పండే మామిడి పంటలో 80 శాతం తోతాపురి రకం. దీన్ని ఎక్కువగా స్థానికంగా ఉండే జ్యూస్ ఫ్యాక్టరీలు కొంటాయి.
Read Also: Nidhhi Agerwal: అగర్వాల్స్ ఏం తింటే ఇంత అందంగా ఉంటారో తెలుసా ?
అయితే, ఈసారి పంట కూడా ఎక్కువ రావడంతో.. ముందే గ్రహించిన ఎమ్మెల్యేలు ఏప్రిల్‌లోనే కలెక్టర్‌తో సమావేశమై… ధర నిర్ణయించారు. కిలోకు ఫ్యాక్టరీలు 8 రూపాయలు చెల్లిస్తే… ప్రభుత్వం తరపున మరో నాలుగు రూపాయలు కలిపి రైతుకు మొత్తం 12 రూపాయలు గిట్టుబాటు అయ్యేట్టు ఫిక్స్ చేశారు. కానీ…సకాలంలో ఫ్యాక్టరీలను తెరవకపోవడంతో అత్యధికంగా వచ్చిన పంటను ఏం చేయాలో తెలియక రోడ్డున పడ్డారు జిల్లా మామిడి రైతులు. మామిడి లోళ్ళతో ట్రాక్టర్లు కిలోమీటర్ల కొద్దీ బారులు తీరిన పరిస్థితి. సరిగ్గా ఇక్కడే పొలిటికల్ వ్యూహానికి పదువు పెట్టిన వైసీపీ… మామిడి రైతులు అల్లాడిపోతుంటే ప్రభుత్వం చోద్యం చూస్తోందంటూ దాడి మొదలుపెట్టింది. జిల్లా మామిడి రైతుల పరామర్శకు స్వయంగా వైసీపీ అధ్యక్షుడు జగన్ కూడా రాబోతున్నారు. ఇంత రచ్చ జరుగుతున్నా… చిత్తూరు జిల్లా ఇన్చార్జి మంత్రిగా ఉన్న రాంప్రసాద్ రెడ్డిగాని, తిరుపతి జిల్లా ఇన్చార్జిగా ఉన్న అనగాని సత్య ప్రసాద్‌గాని కనీస స్పందనలు లేకుండా ఏం చేస్తున్నారు? ప్రభుత్వం తరపున సాయం చేస్తూ కూడా ఎందుకు చెప్పలేకపోతున్నారు? అంటూ ఫైరైపోతున్నారట ఉమ్మడి జిల్లా తమ్ముళ్ళు.
Read Also: HYDRA: దారికి అడ్డంగా కట్టిన గోడ వేలాది మంది ప్రజలకు గోసగా..
కాగా, గిట్టుబాటు ధర గురించి చెప్పలేదుసరే….కనీసం మామిడి రైతులు సమస్యల మీద ఏ ఒక్క రోజైనా… అధికారులతోగాని, ఎమ్మెల్యేలతోగానీ ఎందుకు మీటింగ్ పెట్టి సమీక్ష చేయలేకపోయారని నిలదీస్తున్నారట. ఇతర అభివృద్ధి పనులు ,వ్యక్తిగత వ్యవహారం కోసం జిల్లాకు వస్తున్నారే తప్ప… ఏ ఒక్క రోజైనా మామిడి రైతుల సమస్య గురించి చర్చించారా అంటూ సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు. రెండు జిల్లాలలకు అసలు ఇన్ఛార్జ్ మంత్రులు ఉన్నారా అన్న అనుమానం కలుగుతోందని సొంత ఎమ్మెల్యేలే మాట్లాడుకుంటున్న పరిస్థితి. జిల్లా అధికారులతో మాట్లాడి మేమే గిట్టుబాటు ధర కల్పించాం తప్ప…. ఇన్చార్జి మంత్రులుగా ఉంటున్న వీళ్లు ఏమైపోయారో అర్థం కావడం లేదని అంటున్నారట టీడీపీ శాసనసభ్యులు. అదే సమయంలో ఇన్ఛార్జ్ మంత్రులు ఇద్దరితో పాటు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడి మీద కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు చిత్తూరు తమ్ముళ్ళు. మామిడి రైతులు ఇంతలా ఇబ్బందులు పడుతుంటే… సంబంధిత శాఖ మంత్రి నిద్రపోతున్నారా అంటూ కాస్త ఘాటుగానే రియాక్ట్ అవుతున్నట్టు తెలుస్తోంది. కనీసం మేం చేసిన మంచిని కూడా మినిస్టర్ హోదాలో ఆయన గట్టిగా చెప్పలేకపోతున్నారని ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలే అసహనం వ్యక్తం చేసినట్టు తెలిసింది.
Read Also: Nampally Court: అత్యాచారం కేసులో నాంపల్లి కోర్టు సంచలన తీర్పు.. యువకుడికి 20 ఏళ్ల జైలు శిక్ష
ఇక, మామిడి పంట విషయమై జిల్లాలో నానా రచ్చ జరుగుతుంటే.. చంద్రగిరికి ఒక్క రోజు పర్యటన కోసం అచ్చెన్నాయుడు వచ్చి వెళ్ళారే తప్ప… లోకల్‌గా ఉన్న ఇంత పెద్ద సమస్య మీద కనీసం ఒక్కటంటే ఒక్క సమీక్షా సమావేశం పెట్టకపోవడాన్ని ఎలా చూడాలని అంటున్నారట టీడీపీ ద్వితీయ శ్రేణి నాయకులు. ఈ వ్యవహారశైలే వైసీపీ నాయకులకు ఆయుధంగా మారుతోందన్నది వాళ్ళ ఆవేదన అట. అచ్చెన్నాయుడు జిల్లాకు వస్తే… మామిడి రైతులు పాతేస్తారని వైసీపీ లీడర్స్ ఘాటుగా విమర్శించినా నోరెత్తలేని పరిస్థితి వచ్చిందంటే ఆయన చర్యలే కారణం అని టీడీపీ లీడర్స్ ఆగ్రహంగా ఉన్నట్టు చెప్పుకుంటున్నారు. మొత్తం మీద ముగ్గురు మంత్రుల వైఖరిపై ఉమ్మడి చిత్తూరు జిల్లాలో విస్తృత చర్చే జరుగుతోంది. నడుస్తున్న ఎపిసోడ్‌తో ముగ్గురికీ సంబంధం ఉన్నా… ఎవ్వరూ నోరు మెదపడంలేదంటే… అంతా ఆయనే చూసుకుంటారంటూ… సీఎం మీదికి వదిలి ఊరుకున్నారా? అదే నిజమైతే… ఆ మాత్రందానికి వీళ్ళకు బాధ్యతలు, పదవులు ఎందుకని సీరియస్‌గా ఉన్నారు చిత్తూరు టీడీపీ లీడర్స్.