ఇప్పటికే చాలా జండాలు మారాయి..చాలా కండువాలు కప్పారు.. తీసేశారు..కొంత కాలంగా ఇవన్నీ కాదని సైలెంట్ గా ఉన్నారు..
అయితే ఇప్పుడు మళ్లీ ఫ్యాన్ గాలి కింద సేదదీరుదామనుకుంటున్నారట..హస్తం, సైకిల్, కమలం.. ఇవన్నీ దాటుకుని వచ్చిన ఆయన వైసీపీకి మరోసారి దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తున్నారట..
మళ్లీ వైసీపీకి దగ్గరవుతున్నారా?అధికార పార్టీకి దగ్గరయ్యేందుకు పావులు కదుపుతున్నారా? కీలక నేత దారెటు?
సి కే జయచంద్రారెడ్డి అలియాస్ సికె బాబు.చిత్తూరు జిల్లా సీనియర్ రాజకీయనాయకుల్లో ఒకరైన సికె బాబు, నాలుగు సార్లు చిత్తూరు ఎమ్మెల్యేగా గెలిచారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో రాయలసీమ ప్రాంత అభివృద్ధి మండలి చైర్మన్ గా కూడా కొంతకాలం పనిచేశారు.
చిత్తూరు పట్టణంలో ఓ సాధారణ కార్మిక నేతగా సికె బాబు రాజకీయ జీవితం ప్రారంభమైంది. కౌన్సిలర్ గా, మునిసిపల్ వైస్ చైర్మన్ గా తక్కువ కాలంలోనే గుర్తింపు పొందారు. 1989 ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా చిత్తూరు నుంచి పోటీచేసి అనూహ్యంగా విజయం సాధించారు. ఆ తర్వాత కాంగ్రెస్ లో చేరి 1994, 1999 ఎన్నికల్లోనూ గెలిచారు. 1994 లోజిల్లాలోని 15 స్థానాల్లో 14 చోట్ల టిడిపి గెలిస్తే, ఒక్క చిత్తూరు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా సికే బాబు విజేతగా నిలిచారు.
అయితే, 2004 ఎన్నికల్లో ఆయనకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వలేదు. స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగిన సీకే బాబు చివరకు ఓటమిపాలయ్యారు. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ టిక్కెట్ సాధించి చిత్తూరు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అయితే, వైయస్ మరణం తర్వాత, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డిలతో సీకే బాబు ఇమడలేకపోయారు. 2014 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరినా, అక్కడి 2014 ఎన్నికల్లో పోటీకి దూరంగానే ఉండిపోయారు. నాటి చిత్తూరు వైసిపి అభ్యర్థి జంగాలపల్లి శ్రీనివాసులు విజయానికి తన వంతు పాటుపడ్డారు. కానీ, ఆ ఎన్నికల్లో చిత్తూరు స్థానాన్ని టిడిపి కైవసం చేసుకుంది. సికె బాబు క్రమంగా వైసిపి లో ఒంటరి అవుతూ వచ్చారు. చివరకు ఆయన్ని అటు పార్టీ కూడా దూరం పెట్టింది. దీంతో వైసిపి నుంచి ఆయన బయటకు వచ్చారు.
అయితే, కొంత కాలం సైలెంట్ గా ఉన్న సికె బాబు, 2017 నవంబరులో అనూహ్యంగా బీజేపీలో చేరారు. పొత్తులో భాగంగా 2019 ఎన్నికల్లో చిత్తూరు సీటు పొందొచ్చని భావించారు. కానీ, టిడిపి, బిజెపి పొత్తు చెదిరిపోవడంతో మళ్లీ సికే సందిగ్ధ స్థితిలో పడిపోయారు. బిజెపికి దూరం అయినా టిడిపితో టచ్ లోనే ఉంటూ చిత్తూరు, పూతలపట్టు నియోజకవర్గ టిడిపి అభ్యర్థుల కోసం ప్రచారంలో పాల్గొన్నారు. కానీ, జిల్లాలో వైసిపి దాదాపు క్లీన్ స్వీప్ చేసింది. దీంతో తన కెరీర్ లో అత్యంత గడ్డు కాలంలో పడ్డారు సీకె బాబు.
గత ఎన్నికల తర్వాత నుంచి రాజకీయాలకు దూరంగా ఉంటున్న సీకె బాబు ఇంటికే పరిమితం అయ్యారు. కానీ, ఈ మధ్యే ఆయన వ్యూహం మార్చారని అధికార వైసీపీకి మళ్లీ దగ్గరకానున్నట్లు జిల్లాలో గట్టిగా ప్రచారం జరుగుతోంది. అతి త్వరలో ఆయన వైసిపి కండువా కప్పుకోనున్నట్లు టాక్ నడుస్తోంది.
మరోపక్క సికె బాబు సతీమణి సికే లావణ్యకు కూడా రాజకీయాలపై ఆసక్తి ఉంది. అటు కుమారుడు సాయికృష్ణను కూడా రాజకీయంగా తెరపైకి తెస్తున్నారు. మొన్న చిత్తూరులో భారీ స్దాయిలో జరిగిన వైఎస్సార్ వర్ధంతి వేడుకల్లో తన కుమారుడితో కలిసి సికె లావణ్య పాల్గొనడం నగరంలో చర్చనీయాంశమైంది. దీంతో సికె కుటుంబం మళ్లీ వైసీపీలోకి రావడం ఖాయమని అంతా అనుకుంటున్నారు. వైసిపి జిల్లా ముఖ్యనేతలతో సికె కుటుంబానికి ఇది వరకు ఉన్న వైరం అంతా సమసిపోయిందనే ప్రచారం జరుగుతోంది.
అయితే ఇలాంటి ప్రచారాలు ఇప్పుడు కొత్తగా జరుగుతున్నవి కూడా కాదు. మొన్నటిదాకా సికె బాబు పుట్టిన రోజు నాడు కీలమైన నిర్ణయం ఉంటుందని జరిగిన ప్రచారం కాస్తా, ఇప్పుడు నడివీధి గంగమ్మ జాతర తరువాత నిర్ణయం తీసుకుంటారని చెబుతున్నారట. ఏది ఏమైనా, సికె బాబు మళ్లీ యాక్టివ్ కావటం ఖాయమనే టాక్ మాత్రం గట్టిగానే ఉంది.
Watch Here : https://youtu.be/_A6S4ax8eDQ