ఇచ్చిన మాట కోసం నిలబడే వ్యక్తి వైఎస్ జగన్ అని, సీఎం చంద్రబాబులా మోసం చేయడం చేతకాదని వైసీపీ నేత కురసాల కన్నబాబు అన్నారు. ప్రజలను మోసం చేయాలంటే జగన్ సూపర్ సిక్స్ కాదని.. సూపర్ సిక్స్ టీ ఇచ్చేవారని విమర్శించారు. 8 నెలల్లో కూటమి ప్రభుత్వం పరపతి కోల్పోయిందన్నారు. నారా లోకేష్ చేసింది యువగళం కాదని.. నిన్న విశాఖ రోడ్లపై వినిపించింది అసలైన యువగళం అని పేర్కొన్నారు. రాజకీయ పార్టీలో చేరికలు, వలసలు సర్వ సాధారణం అని కన్నబాబు చెప్పుకొచ్చారు. ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్‌గా కురసాల కన్నబాబు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు.
‘ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్‌గా బాధ్యత అప్పగించిన వైఎస్ జగన్ గారికి ధన్యవాదాలు. ఈ ప్రాంతంతో నాకు ఎంతో అనుబంధం ఉంది. ఉత్తరాంధ్ర ఒక ప్రత్యేకమైన ప్రాంతం. రాష్ట్రంలో వైసీపీ ఎంతో బలంగా ఉంది. ఇచ్చిన మాట కోసం నిలబడే వ్యక్తి వైఎస్ జగన్. చంద్రబాబు నాయుడులా మోసం చేయడం జగన్‌కు చేతకాదు. ప్రజలను మోసం చేయాలంటే జగన్ సూపర్ సిక్స్ కాదు.. సూపర్ సిక్స్ టీ ఇచ్చేవారు. సినిమా హీరోలను మించి జగన్‌కు జనాలు వస్తున్నారు. గ్రూప్ 2 అభ్యర్ధులను చంద్రబాబు మోసం చేశారు. ఎన్నికల్లో ఓడాక టీడీపీ కార్యకర్తలు రోడ్డు మీదకు రావడానికి మూడేళ్ల సమయం పట్టింది, కానీ మా పార్టీ నాయకులకు మూడు నెలల సమయం కూడా పట్టలేదు’ అని కురసాల కన్నబాబు అన్నారు.
‘8 నెలల్లో కూటమి ప్రభుత్వం పరపతి కోల్పోయింది. చెప్తే చేస్తాడని వైఎస్ జగన్ నిరూపిస్తే.. చంద్రబాబు నాయుడు చెబితే చేయడు అనేది కన్ఫర్మ్ అయ్యింది. చంద్రబాబు, టీడీపీ మోసాల పుట్ట. నారా లోకేష్ చేసింది యువగళం కాదు.. నిన్న విశాఖ రోడ్లపై వినిపించింది అసలైన యువగళం. రాష్ట్రంలో రెండే పథకాలు అమలు అవుతున్నాయి. ఒకటి చంద్రన్న పగ, రెండోది చంద్రన్న దగా. విశాఖ నుంచి వైసీపీ గళాన్ని గట్టిగా వినిపిస్తాం. రాజకీయ పార్టీలో చేరికలు, వలసలు సర్వ సాధారణం. జనసేన, టీడీపీలో గెలిచిన చాలా మంది వైసీపీ నుంచి వెళ్లిన వారే. జగనన్న సైన్యం మాత్రం ఎక్కడ చెక్కుచెదరలేదు’ అని కురసాల కన్నబాబు పేర్కొన్నారు.