ఏపీలో పొలిటికల్ హీట్ కొనసాగుతోంది. టీడీపీ కార్యాలయాలపై దాడి అంశాన్ని ఆ పార్టీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ దృష్టికి తీసుకువెళ్లగా… తాజాగా టీడీపీపై వైసీపీ ఎంపీలు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. గురువారం నాడు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసిన వైసీపీ ఎంపీలు టీడీపీపై ఫిర్యాదు చేశారు. ఏపీలో తెలుగుదేశం పార్టీ అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోందని, తక్షణమే ఆ పార్టీ గుర్తింపు రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
Read Also: ఏపీలో కేసీఆర్ పార్టీ పెట్టాలని కోరుకుంటాం: పేర్నినాని
టీడీపీ నేతలు అధికార పార్టీ నేతలను అసభ్య పదజాలంతో దూషిస్తున్నారని వైసీపీ ఎంపీలు సీఈసీకి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. సీఎం, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు.. ఇలా ప్రజాప్రతినిధులందరినీ టీడీపీ నేతలు దూషిస్తున్నారని వైసీపీ ఎంపీలు ఆరోపించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు దిగజారడానికి కారణం చంద్రబాబేనని వారు విమర్శించారు. కాగా సీఈసీని కలిసిన వైసీపీ ఎంపీలలో విజయసాయిరెడ్డి, మార్గాని భరత్, రెడ్డప్ప, డా.సత్యవతి, తలారి రంగయ్య, డా.సంజీవ్, మాధవి, గోరంట్ల మాధవ్ ఉన్నారు. అంతకుముందు వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసి టీడీపీపై ఫిర్యాదు చేశారు. టీడీపీ నేతలు కావాలనే సీఎం జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని, రాష్ట్రంలో అలజడులు సృష్టించేందుకు టీడీపీ కుట్ర పన్నిందని ఎంపీ గోరంట్ల మాధవ్ ఆరోపించారు. అసభ్యంగా మాట్లాడిన వారిని శిక్షించేలా చట్టాలను కఠిన తరం చేయాలని అమిత్ షాకు ఆయన విజ్ఞప్తి చేశారు.