ఉత్తరప్రదేశ్‌లో అమేథీ స్థానం కాంగ్రెస్‌కు కంచుకోట. గాంధీ కుటుంబం ఇక్కడ నుంచి తిరిగి లేని విజయాలు సొంతం చేసుకుంది. గత ఎన్నికల్లో అనూహ్యంగా ఈ స్థానాన్ని బీజేపీ కైవసం చేసుకుంది. ఇప్పుడు తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. అమేథీతో గాంధీ కుటుంబానికి ఉన్న 25 ఏళ్ల బంధాన్ని తెంచుకుంది. ఇక్కడ ఊహించని విధంగా మరో వ్యక్తిని అభ్యర్థిగా ప్రకటించి సంచలన నిర్ణయం తీసుకుంది. గాంధీ కుటుంబానికి విధేయుడైన కేఎల్.శర్మను బరిలోకి దింపింది. దీంతో ఎవరీ కేఎల్.శర్మఅంటూ నెటిజన్లు సర్చ్ చేస్తున్నారు
కిషోరి లాల్ శర్మ 1939 సెప్టెంబర్ 25న జన్మించారు. ప్రస్తుతం ఆయన వయసు 84 సంవత్సరాలు. పంజాబ్‌లోని లుధియానాకు చెందిన ఆయనకు గత 40 ఏళ్లుగా కాంగ్రెస్‌తో అనుబంధం ఉంది. 1983లో తొలిసారి అమేథీకి వచ్చి అప్పటి నుంచి నియోజకవర్గంలో పార్టీ తరపున పని చేస్తూ వస్తున్నారు. కిషోరి లాల్ శర్మ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీకి అత్యంత సన్నిహితుడని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 1991లో రాజీవ్ గాంధీ హత్య తర్వాత గాంధీ కుటుంబంతో అతని బంధం మరింత బలపడింది. సోనియా గాంధీ 1999లో అమేథీ నుంచి తొలిసారి గెలుపొందడంలో కేఎల్ శర్మ కీలక పాత్ర పోషించారు. రాహుల్ కోసం సోనియా గాంధీ సీటు వదులుకున్న తర్వాత అమేథీ, రాయ్‌బరేలీలో శర్మ పార్టీ వ్యవహారాలను చూసుకుంటున్నారు.
గత 31 ఏళ్లుగా అమేథీ లోక్‌సభ నియోజకవర్గానికి గాంధీ కుటుంబసభ్యులు ప్రాతినిధ్యం వహించారు. 1980లో తొలిసారి సంజయ్ గాంధీ ఇక్కడి నుంచి గెలుపొందారు. ఆయన ఆకస్మిక మరణంతో మరుసటి ఏడాది జరిగిన ఉప ఎన్నికల్లో రాజీవ్ గాంధీ బరిలోకి దిగారు. అప్పటి నుంచి 1991 వరకు ఆయనే ఎంపీగా కొనసాగారు. 1999లో సోనియా గాంధీ పోటీ చేయగా.. ఆ తర్వాత జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అమేథీని కుమారుడికి అప్పగించారు. అలా 2004 నుంచి రాహుల్ గాంధీ వరుసగా మూడు సార్లు ఇక్కడ విజయం సాధించారు. కానీ గత ఎన్నికల్లో బీజేపీ నాయకురాలు స్మృతి ఇరానీ చేతిలో ఓడిపోయి కంచుకోటకు బీటలుపడ్డాయి.
గాంధీ కుటుంబేతరులు ఈ స్థానం నుంచి పోటీ చేయడం గత మూడు దశాబ్దాల్లో ఇది రెండోసారి. 1991లో రాజీవ్ గాంధీ మరణం తర్వాత ఈ స్థానాన్ని సతీశ్ శర్మకు అప్పగించింది. ఆ ఉప ఎన్నికల్లో గెలిచిన శర్మ.. 1996లో రెండోసారి విజయం సాధించారు. అనంతరం 1998లో మాత్రం బీజేపీ చేతిలో ఓటమిపాలయ్యారు. ఆ మరుసటి ఏడాదే మళ్లీ ఎన్నికలు జరగ్గా.. అమేథీ మరోసారి కాంగ్రెస్ వశమైంది. అప్పటి నుంచి గాంధీ కుటుంబసభ్యులే పోటీ చేయగా.. మళ్లీ ఇన్నేళ్లకు ఇతరులకు అవకాశమిచ్చారు. తాజా ఎన్నికల్లో అమేథీ నుంచి కిశోరీ లాల్ శర్మను నిలబెట్టారు. కేంద్రమంత్రి స్మృతి ఇరానీతో ఆయన తలపడనున్నారు. మరోసారి విజయం కోసం ఆమె ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతుంది. ఐదు విడతలో భాగంగా మే 20న పోలింగ్ జరగనుంది.
అమేథీలో కేఎల్.శర్మను నిలబెట్టడంపై ప్రియాంకాగాంధీ స్వాగతించారు. కిశోరీ లాల్‌తో మా కుటుంబానికి చాలా ఏళ్లుగా అనుబంధం ఉందని గుర్తుచేశారు. అమేథీ, రాయ్‌బరేలీ ప్రజల కోసం ఆయన తన జీవితాన్ని అంకితం చేశారని పేర్కొన్నారు. ఆయన పోటీలో ఉండటం చాలా ఆనందంగా ఉందని తెలిపారు.