ఆటకు ఇవ్వగలిగినంత ఇచ్చానన్న స్పష్టతతో విరాట్ కోహ్లీ ఉన్నాడని, అతడిలో ఎలాంటి విచారం లేదు అని టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి అన్నాడు. విరాట్ రిటైర్ కావడం తనను ఆశ్చర్యపరిచిందని తెలిపాడు. మరో 2-3 ఏళ్లు టెస్ట్ ఫార్మాట్లో ఆడే సత్తా అతడిలో ఉందని అభిప్రాయపడ్డాడు. విశ్రాంతి తీసుకోకపోతే మానసికంగా అలసిపోక తప్పదు అని రవిశాస్త్రి చెప్పుకొచ్చాడు. విరాట్ టెస్ట్ కెరీర్‌కు రిటైర్‌మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇంగ్లండ్ టూర్‌కు ముందు తనకు ఇష్టమైన సాంప్రదాయ ఫార్మాట్‌కు వీడ్కోలు పలికి అందరికీ షాక్ ఇచ్చాడు.
విరాట్ కోహ్లీ రిటైర్‌మెంట్‌పై తాజాగా రవిశాస్త్రి స్పందించాడు. ‘టెస్ట్ రిటైర్మెంట్ గురించి విరాట్ కోహ్లీతో మాట్లాడా. విరాట్ తన నిర్ణయాన్ని ప్రకటించడానికి వారం రోజుల ముందు ఇద్దరం కలిశాం. ఆటకు ఇవ్వగలిగినంత ఇచ్చానన్న స్పష్టతతో ఉన్నాడు. ఆతడిలో ఎలాంటి విచారం లేదు. రిటైర్మెంట్ ఇచ్చి విరాట్ నన్ను ఆశ్చర్యపరిచాడు. మరో 2-3 ఏళ్లు టెస్టు క్రికెట్ ఆడగలిగే సత్తా అతడిలో ఉంది. కోహ్లీ శారీరకంగా ఫిట్‌గా ఉన్నా మానసికంగా బాగా అలసిపోయాడు. ఓ ఆటగాడు తన పని పూర్తి చేసి ప్రశాంతంగా ఉంటాడు. విరాట్ మాత్రం అలా కాదు. జట్టు బరిలోకి దిగినప్పుడు అన్ని వికెట్లు తానే తీసుకోవాలని, అన్ని క్యాచ్‌లు తానే పట్టాలని, అన్ని నిర్ణయాలు తానే తీసుకోవాలన్నట్లు ఉంటాడు. ఆట తీవ్రత ఆ స్థాయిలో ఉన్నపుడు విశ్రాంతి తీసుకోకపోతే మానసికంగా అలసిపోక తప్పదు. కింగ్ ఇంకా సాధించాల్సిందేమీ లేదు’ అని రవిశాస్త్రి చెప్పాడు.
Also Read: AP Liquor Scam: మద్యం కేసులో రెండో రోజు సిట్ కస్టడీకి శ్రీధర్ రెడ్డి!
2011లో టెస్టు క్రికెట్‌లోకి అడుగుపెట్టిన విరాట్ కోహ్లీ.. 123 టెస్టులు ఆడి 46.85 సగటుతో 9,230 పరుగులు చేశాడు. ఇందులో 30 సెంచరీలు, 31 అర్ధ హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 2015లో టెస్ట్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన కింగ్.. జనవరి 2022 వరకు కొనసాగాడు. టీమిండియాకు 68 మ్యాచ్‌లలో సారథిగా వ్యవహరించి 40 మ్యాచ్‌ల్లో విజయాలు అందించాడు. 17 మ్యాచ్‌ల్లో ఓటమిచవిచూడగా.. 11 మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి. కోహ్లీ కెప్టెన్సీలో భారత్ విజయ శాతం 58.82 శాతంగా ఉంది.