ఆస్ట్రేలియాకు రావడం తనకు చాలా ఇష్టం అని, ఇక్కడ అత్యుత్తమ క్రికెట్ ఆడాను అని టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తెలిపాడు. ప్రేక్షకులు భారీ సంఖ్యలో వచ్చి తమకు మద్దతు ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు చెప్పాడు. అంతర్జాతీయ క్రికెట్లో సుదీర్ఘ అనుభవం ఉన్నా.. ఆట ఎపుడూ కొత్త పరీక్ష పెడుతుందన్నాడు. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో డకౌట్ అయిన తర్వాత హాఫ్ సెంచరీ చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించడం సంతోషంగా ఉందని కోహ్లీ భావోద్వేగం చెందాడు. విరాట్ ఇంటర్వ్యూకి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మ్యాచ్ అనంతరం బ్రాడ్‌కాస్టర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు మాట్లాడారు. ఆస్ట్రేలియన్ క్రికెట్‌తో తమకున్న సుదీర్ఘ అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. ఎన్నో ఏళ్లుగా అభిమానుల ఆప్యాయత, మద్దతుకు కృతజ్ఞతలు తెలిపారు. ఆడమ్ గిల్‌క్రిస్ట్, రవిశాస్త్రిలతో జరిగిన ఇంటర్వ్యూలో కోహ్లీ మాటాడుతూ.. ‘ఎన్నో ఏళ్లుగా క్రికెట్ ఆడుతున్నా. అంతర్జాతీయ క్రికెట్లో సుదీర్ఘ అనుభవం ఉన్నా ఆట ఎప్పటికప్పుడు సవాల్ విసురుతుంటుంది. మొదటి రెండు మ్యాచ్‌ల్లో డకౌట్ అయిన తర్వాత ఈ మ్యాచ్‌లో రాణించడం చాలా ఆనందంగా ఉంది. ఇంకొన్ని రోజుల్లో నాకు 37 ఏళ్లు పూర్తవుతాయి. ఛేజింగ్ ఎప్పుడూ నాలో ఉత్తమమైన ఆటను బయటకు తెస్తుంది’ అని తెలిపాడు.
‘రోహిత్ శర్మతో కలిసి భారీ భాగస్వామ్యం నెలకొల్పడం, జట్టు విజయంలో కీలక పాత్ర పోషించడం చాలా సంతోషంగా ఉంది. ఈ మ్యాచ్‌లో మొదటి నుంచి మేం కండిషన్స్‌ను బాగా అర్థం చేసుకున్నాం. అందుకే ప్రతిసారి రన్స్ చేస్తున్నాం. మేం ఇప్పుడు అత్యంత అనుభవమైన జోడీ. కానీ మేం కుర్రాళ్లుగా ఉన్నప్పుడే మంచి భాగస్వామ్యంతో జట్టును గెలిపించగలమని గ్రహించాం. మా ప్రయాణం 2013లో స్వదేశంలో ఆస్ట్రేలియాతో మొదలైంది. మేము 20 ఓవర్లు ఆడి పెద్ద భాగస్వామ్యం నెలకొల్పితే జట్టు గెలుస్తుంది. ఈ విషయం ప్రత్యర్థులకు కూడా తెలుసు. ఆస్ట్రేలియాకు రావడం మాకు ఇష్టం. ఇక్కడ మేం అత్యుత్తమ క్రికెట్ ఆడాం. ప్రేక్షకుల మద్దతుకు ధన్యవాదాలు’ అని విరాట్ కోహ్లీ చెప్పుకొచ్చాడు.