US President Joe Biden tests positive for COVID-19: రెండున్నర సంవత్సరాలుగా ప్రపంచాన్ని కరోనా బాధిస్తోంది. అనేక రూపాలను మారుస్తూ ప్రపంచాన్ని వణికిస్తోంది. ఆల్ఫా, బీటా, డెల్టా, ఓమిక్రాన్, ఓమిక్రాన్ సబ్ వేరియంట్ల రూపంలో ప్రజలను పట్టిపీడిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా కేసుల సంఖ్య 65 కోట్లను దాటింది. ముఖ్యంగా అమెరికాతో పాటు బ్రెజిల్, జర్మనీ, ఇండియా, చైనా వంటి దేశాలు ఇప్పటికే కరోనాతో బాధపడుతూనే ఉన్నాయి. వ్యాక్సిన్లు వచ్చినా కూడా కరోనా మహమ్మారికి పూర్తిగా అడ్డుకట్ట పడటం లేదు.
తాజాగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్(79) గురువారం కరోనా బారిన పడ్డారు. పరీక్షల్లో ఆయనకు కోవిడ్ 19 పాజిటివ్ వచ్చింది. వైట్ హౌజ్ ప్రెస్ సెక్రటీరీ కరీన్ జిన్ పియర్ మాట్లాడుతూ.. బైడెన్ కరోనా సోకిందని.. తేలికపాటి లక్షణాలతో బాధపడుతున్నారని ఆయన వెల్లడించారు. వ్యాధి తీవ్రతను తగ్గించడానికి యాంటీ వైరల్ డ్రగ్ పాక్స్‌లోవిడ్ తీసుకోవడం ప్రారంభించారని వెల్లడించారు. ప్రస్తుతం కరోనా సోకడంతో వైట్ హౌజ్ లో బైడెన్ ఐసోలేషన్ లో ఉన్నారు. అక్కడి నుంచే తన విధులు కొనసాగిస్తారని వైట్ హౌజ్ సెక్రటరీ వెల్లడించారు. కరోనాకు సంబంధించి ఇప్పటికే జోబైడెన్ వ్యాక్సిన్ తీసుకున్నారు.
Read Also: Dammai Guda Case: 15 ఏళ్ల నాటి పగ.. తండ్రిని చంపిన వాడిని ఖతం చేసిన కొడుకు
ప్రెసిడెంట్ గా బాధ్యతలు తీసుకోవడానికి ముందే ఆయన ఫైజర్ వ్యాక్సినేషన్ రెండు డోసులు పొందారు. సెప్టెంబర్ లో మొదటి బూస్టర్ డోస్ తీసుకున్నారు. అయినా కూడా బైడెన్ కు కరోనా సోకింది. జో బైడెన్ తోె సన్నిహితంగా ఉన్న వారు కూడా పరీక్షలు చేయించుకుంటున్నారు. ఇప్పటికే వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్, క్యాబినెట్ సభ్యులు, వైట్ సిబ్బందికి కరోనా సోకింది. ఇటీవల కాలంలో అమెరికా వ్యాప్తంగా కేసుల సంఖ్య పెరుగుతోంది. అక్కడి ప్రజలు మహమ్మారి బారిన పడుతున్నారు.