ఉత్తర కొరియాకు రష్యా మద్దతుగా నిలిచింది. ఉత్తర కొరియాకు వ్యతిరేకంగా ఐక్యరాజ్యసమితి తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపట్టింది. ఉత్తర కొరియాపై ఐక్యరాజ్యసమితి విధించిన ఆంక్షలు కొరియా ద్వీపకల్పంలో శాంతిని పెంపొందించడానికి అడ్డంకిగా ఉన్నాయని రష్యా ఆరోపించింది. అంతేకాకుండా ప్రాంతీయ భద్రతను మెరుగుపరిచేందుకు ఇవి ఏమాత్రం ఉపయుక్తంగా లేవని తెలిపింది.
ఉత్తర కొరియా అణు కార్యక్రమంపై విధించిన ఆంక్షలను పర్యవేక్షించేందుకు ఐక్యరాజ్యసమితి నిపుణులతో వేసిన కమిటీ పదవీ కాలాన్ని పొడిగించేందుకు భద్రతా మండలిలో ప్రవేశపెట్టిన తీర్మానాన్ని గురువారం రష్యా తన వీటో అధికారంతో అడ్డుకుంది. అంతేకాకుండా మాస్కో, ప్యాంగాంగ్ మధ్య ఆయుధాల బదిలీలపై భద్రతా మండలి విచారణ చేపట్టడం మాస్కోకు ఏ మాత్రం మింగుడు పడలేదు.
ఇది కూడా చదవండి: Laila: ‘లైలా’గా మారిన విశ్వక్ సేన్.. ఇదెక్కడి ట్విస్ట్ బాసూ?
గత కొన్నేళ్లుగా కొరియా ద్వీపకల్ప ప్రాంతంలో భద్రత పరిస్థితులను మెరుగుపరిచేందుకు తీసుకున్న అంతర్జాతీయ నియంత్రణ చర్యలు ఏమాత్రం ఉపయోగపడలేదని రష్యా విదేశాంగశాఖ అధికార ప్రతినిధి మారియా జఖరోవా ఓ అంతర్జాతీయ మీడియాకు తెలిపారు. ఆంక్షల చర్యలను క్రమంగా తగ్గించేందుకు, వాటిని సమీక్షించేందుకు సరైన యంత్రాంగాలు లేనప్పుడు ఇలాంటి చర్యల వల్ల ఏ ఫలితం ఉండబోదని మారియా పేర్కొన్నారు. ఐక్యరాజ్యసమితి నిపుణుల కమిటీ పదవీ కాలాన్ని పొడిగించేందుకు 15 సభ్య దేశాల్లో 13 అనుకూలంగా ఓటు వేయగా రష్యా వ్యతిరేకించింది. చైనా హాజరుకాలేదు. దీంతో కమిటీ పర్యవేక్షణ నిలిచిపోనుంది.
ఇది కూడా చదవండి: Atrocious: కూలర్ను శుభ్రం చేయనందుకు కొడుకుపై తండ్రి కత్తితో దాడి..
ఉత్తర కొరియా నుంచి ఆయుధాలను తెచ్చుకుంటున్న రష్యా.. దానిని కొనసాగించడానికే తీర్మానాన్ని అడ్డుకుందని మిగిలిన దేశాలన్నీ ఆరోపించాయి. రష్యా, ఉత్తర కొరియాల మధ్య చాలా ఏళ్లుగా సత్సంబంధాలు కొనసాగుతున్నాయి. ఉక్రెయిన్‌పై రష్యా సైనిక దాడి ప్రారంభించినప్పటి నుంచి ఆ రెండు దేశాల మధ్య సంబంధాలు మరింత బలోపేతమయ్యాయి.
ఇది కూడా చదవండి: Navdeep: ఎమ్మెల్యేగా పోటీ.. పెళ్లిపై నవదీప్ ప్రకటన?