మధ్యప్రదేశ్‌లో దారుణం చోటు చేసుకుంది. కొడుకుపై తండ్రి కత్తితో దాడి చేసిన సంఘటన శివపురిలోని జవహర్ కాలనీలో జరిగింది. తాను చెప్పిన మాట విననందుకు కన్న కొడుకుపై కర్కశం చూపించాడు. కూలర్ ను శుభ్రం చేయమని చెప్పిన తండ్రి.. కుమారుడు మాట వినకపోవడంతో కోపంతో కర్రలతో కొట్టాడు. అంతటితో ఆగకుండా.. తండ్రి కొడుకుపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనను చూసిన తన కొడుకును రక్షించబోయిన తల్లిని, మరో కుమారుడిని కూడా చితక బాదాడు.
కాగా.. గాయపడిన యువకుడిని చికిత్స నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఇదిలా ఉంటే.. కొడుకుపై దాడికి పాల్పడిన అనంతరం.. తండ్రి రూరల్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తన కొడుకులిద్దరిపై కేసు నమోదు చేసాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు జిల్లా ఆస్పత్రికి చేరుకుని ఘటనపై ఆరా తీశారు. అనంతరం యువకుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు తండ్రిపై కేసు నమోదు చేశారు.
కూలర్ శుభ్రం విషయంలో వివాదం
వివరాల్లోకి వెళ్తే.. గురువారం సాయంత్రం తన భర్త బలరామ్ ఇంట్లోనే ఉన్నాడని భార్య షీలా కుష్వాహా తెలిపింది. కూలర్‌ను సరిగ్గా శుభ్రం చేసి అందులో నీళ్లు నింపమని తన భర్త తన కొడుకు కపిల్ కుష్వాహకు చెప్పాడని తెలిపింది. అయితే కపిల్.. కాసేపటి తర్వాత కూలర్‌ను శుభ్రం చేసి నీళ్లు నింపుతానని చెప్పాడు. దీంతో కోపోద్రిక్తుడైన తన భర్త.. తన కొడుకును తిట్టాడని చెప్పింది. ఆ తర్వాత తన కొడుకు ఎదురుతిరగడంతో.. కర్రలతో అతి కిరాతకంగా కొట్టాడు. అనంతరం కత్తితో దాడి చేశాడని తెలిపింది. తాను, తన మరో కుమారుడు జీతేంద్ర కపిల్‌ను కాపాడేందుకు ప్రయత్నించగా, తమను కూడా తీవ్రంగా కొట్టారని చెప్పింది. అంతేకాకుండా.. తన భర్త బెట్టింగ్‌లకు పాల్గొంటాడని తెలిపింది.