తెలంగాణ రాష్ట్రానికి ఎల్లుండి (జూన్ 19న) కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ రాబోతున్నారు. ఇక, కేంద్రమంత్రులుగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి రాష్ట్రానికి వస్తుండటంతో వారికి స్వాగతం పలికేందుకు భారతీయ జనతా పార్టీ భారీగా ఏర్పాట్లు చేస్తుంది. భారీ ర్యాలీతో పాటు బీజేపీ పార్టీ ఆఫీస్ దగ్గర సభ ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. హైదరాబాద్ చుట్టూ పక్కల జిల్లాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులతో సన్నాహక సమావేశం ఏర్పాటు చేయనున్నారు. ఇక, ఎల్లుండి ( బుధవారం) మధ్యాహ్నం బేగంపేట ఎయిర్ పోర్టు లో కిషన్ రెడ్డీ, బండి సంజయ్ లకి బీజేపీ శ్రేణులు భారీగా స్వాగతం పలకనున్నారు. అక్కడి నుంచి బీజేపీ రాష్ట్ర కార్యాలయం వరకు ర్యాలీ తీయనున్నారు. ఆ తర్వాత సన్మాన సభలో పాల్గొంటారు. చార్మినార్ భాగ్యలక్ష్మీ అమ్మవారిని కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ లు దర్శించుకోనున్నారు.
Read Also: CM Chandrababu: పోలవరంలో సీఎం చంద్రబాబు.. పనుల పురోగతిపై ఆరా
అయితే, కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా కిషన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆ శాఖలో అధికారులతో ఇప్పటికే సమీక్ష నిర్వహించారు. ఈ నెల 30లోగా కనీసం ఆరు గనులను వేలం వేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర సర్కార్ సూచించింది. ఇక, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా బండి సంజయ్ పదవి బాధ్యతలను తీసుకున్నా.. తర్వాత దేశవ్యాప్తంగా నెలకొన్న తాజా పరిస్థితులపై ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు.