Site icon NTV Telugu

Bandi Sanjay: 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ‘పింక్ వైరస్’.. ప్రస్తుతం కాంగ్రెస్ నేతలకు ‘కరప్షన్ వైరస్’!

Bandi Sanjay

Bandi Sanjay

కేంద్ర మంత్రి బండిసంజయ్ ఉగాది సందర్భంగా తెలుగు ప్రజలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. కరీంనగర్ లోని తన నివాసంలో కేంద్ర మంత్రి మీడియాతో మాట్లాడారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాలనలో భారతదేశం ఆర్థిక ప్రగతిలో దూసుకుపోతోందని, ప్రధాని చేస్తున్న కృషిలో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. జ్యోతిష్య పండితుల ప్రకారం.. ఈ ఏడాది దొంగతనాలు పెరిగే అవకాశముందని, ప్రజా ప్రతినిధులు, అధికారులు విచ్చలవిడిగా అవినీతికి పాల్పడతారని, కొత్త వ్యాధులు ప్రబలే సూచనలు ఉన్నాయని తెలిపారు. కాంగ్రెస్ పాలనను గమనిస్తే ఈ జ్యోతిష్య ఫలితాలు నిజమని అర్థమవుతోందని అన్నారు. కాంగ్రెస్ నేతలకు ‘కరప్షన్ వైరస్’ సోకిందని విమర్శించారు. ప్రభుత్వ కాంట్రాక్టుల నుంచి పెండింగ్ బిల్లుల వరకు ప్రతి దాంట్లోనూ కమీషన్లు తీసుకోవడం సహజమైపోయిందని ఆరోపించారు. కాంగ్రెస్ అవినీతి వల్ల అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.

READ MORE: Vishwavasu Nama: “విశ్వావసు” నామ సంవత్సరం అర్థం ఏమిటి..?

బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో ‘పింక్ వైరస్’ సోకి ప్రజలు నష్టపోయారని సంజయ్ విమర్శించారు. బీజేపీ చేసిన పోరాటాల వల్ల తెలంగాణ ఈ పింక్ వైరస్ నుంచి విముక్తి పొందిందని పేర్కొన్నారు. సన్నబియ్యం పంపిణీని స్వాగతించిన బండి సంజయ్, బియ్యం ఖర్చంతా కేంద్రమే భరిస్తోందని తెలిపారు. ఒక్క కిలో బియ్యం కోసం రూ. 40 మోడీ సర్కారే చెల్లిస్తోందని, రాష్ట్ర ప్రభుత్వం కేవలం రూ. 10 ఖర్చు చేస్తున్నదని వివరించారు. ఈ నేపథ్యంలో అన్ని రేషన్ షాపుల్లో ప్రధాని మోడీ ఫోటోలు పెట్టాలని డిమాండ్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసును కాంగ్రెస్ ప్రభుత్వం నీరుగారుస్తోందని ఆరోపించారు. శ్రవణ్ రావు సహా అందరికీ బెయిల్ వచ్చేలా కాంగ్రెస్ సహకరిస్తోందని అన్నారు. గత ఎన్నికల ముందు కేసీఆర్ కుటుంబాన్ని జైల్లో వేస్తామని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు యూటర్న్ తీసుకున్నారని విమర్శించారు.

READ MORE: BJP Office : ప్రతి మహిళలో తల్లిని చూడాలనే జ్ఞానం పెరుగుతుంది: పంచాంగ శ్రవణం

జీహెచ్ఎంసీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ మజ్లిస్‌ను గెలిపించేందుకు పోటీకి దూరంగా ఉంటున్నాయని అన్నారు. బీజేపీకి సరిపడా బలం లేకపోయినా పోటీ చేస్తామని చెప్పారు. ఆర్ఎస్ఎస్ దేశభక్తి కలిగిన సంస్థ అని, హిందూ సమాజాన్ని సంఘటితం చేయడమే ఆ సంస్థ లక్ష్యమని బండి సంజయ్ స్పష్టం చేశారు. ఆర్ఎస్ఎస్ ఉగ్రవాదులకు అండగా నిలబడదని, కానీ మజ్లిస్ టెర్రరిస్టులకు అడ్డాగా మారిందని ఆరోపించారు. మజ్లిస్ పార్టీకి తెలంగాణ అంతటా పోటీ చేసే దమ్మే లేదని విమర్శించారు. అధికారంలో ఉన్న ఏ పార్టీకి అయినా మజ్లిస్ మద్దతు ఇచ్చేందుకు సిద్ధంగా ఉంటుందని, అది వారి వ్యాపార ధోరణిని కాపాడుకునేందుకు మాత్రమేనని పేర్కొన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు సవాల్ విసిరిన బండి సంజయ్, జీహెచ్ఎంసీ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ అభ్యర్థులను నిలబెట్టి వేర్వేరుగా పోటీ చేయాలని కోరారు. లేనిపక్షంలో ప్రజలు వీరికి తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.

Exit mobile version