సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు విచారణ కొనసాగుతోంది, విచారణ సాగే కొద్ది సరికొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. దాంత ఈ కేసు క్రైమ్ థ్రిల్లర్‌ని తలపిస్తోంది.ప్రస్తుతం సీబీఐ కోర్టులో విచారణ జరుగుతోంది. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డితో పాటు పలువురు ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. గత నెలలో హైదరాబాద్ సీబీఐ కోర్టులో ఈ కేసు విచారణ ప్రారంభమైంది. ప్రస్తుతం దర్యాప్తు వేగంగా ముందుకు సాగుతోంది. ఇక ఈ కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డిని సీబీఐ గా మరోసారి ప్రశ్నించింది. ఇంతకు ముందు కోర్టు ఆయనను రెండు సార్లు ప్రశ్నించింది. ఐతే ఈ సారి విచారణ సందర్భంగా సీబీఐ ఆయనను అరెస్టు చేస్తుందని అంతా అనుమానించారు. అయితే ఎంపీ అవినాష్ రెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో కేసుకు సంబంధించి కీలక అంశాలు బయటకొచ్చాయి. వైఎస్ అవినాష్ రెడ్డి రిట్ పిటిషన్‍లో పలు కీలక అంశాలు వెలుగు చూశాయి. వివేకా రెండో భార్య కొడుకును వారసుడిగా ప్రకటించే ప్రక్రియలో.. ఆయన హత్య జరిగి ఉండొచ్చని వైసీపీ ఎంపీ అనుమానం వ్యక్తం చేశారు. 2010లో షేక్ షమీమ్ అనే మహిళను వివేకా వివాహం చేసుకున్నారని.. రెండో వివాహంతో ఆయన కూతురు సునీతతో సంబంధాలు దెబ్బతిన్నాయని పేర్కొన్నారు.
2015లో షమీమ్, వివేకాకు కొడుకు పుట్టాడు. దాంతో వారు తమ కుటుంబం నుంచి దూరంగా ఉండాలంటూ సునీత బెదిరించింది. సీబీఐకి ఇచ్చిన వాగ్మూలంలో షమీమ్ ఇదే విషయాన్ని స్పష్టంగా చెప్పింది. రెండో వివాహం తర్వాత వివేకా చెక్ పవర్‍ను తొలగించారు. సునీత, వివేకా సతీమణి హైదరాబాద్‍లో ఉంటే.. వివేకానంద రెడ్డి మాత్రం ఒంటరిగా పులివెందులలో ఉండేవారు. షమీమ్‍కు పుట్టిన కుమారుడిని వారసుడిగా ప్రకటిస్తారని చర్చ జరిగిన నేపథ్యంలో హత్య జరిగి ఉండొచ్చు. హత్య తర్వాత నిందితులు వివేకా ఇంట్లో డాక్యుమెంట్ల కోసం వెతికినట్లు షమీమ్ చెప్పడం దీనికి బలం చేకూరుస్తుందని అవినాష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇన్ని రోజులు తాను మౌనంగా ఉండటంతో పార్టీ క్యాడర్ తనను ప్రశ్నిస్తోందని… ఇక నుంచి మాట్లాడటం మొదలుపెడతానన్నారు అవినాష్ రెడ్డి . వివేకా ది మర్డర్ ఫర్ గెయిన్ అన్నారాయన. ముస్లిం మహిళకు పుట్టిన కొడుకును రాజకీయ వారసుడిగా ప్రకటించాలని వివేకా నిర్ణయం తీసుకున్నారని.. ఆయన పేరును కూడా ముస్లిం పేరుగా మార్చుకున్నారని పేర్కొన్నారు.
Read Also: Delhi Liquor Scam: ఢిల్లీలో హైటెన్షన్.. కేసీఆర్ నివాసం వద్ద భారీగా పోలీసులు
ఆస్తులన్నీ వాళ్లకి వెళ్లిపోతాయని.. రాజకీయ వారసులుగా వస్తారని.. సునిత భర్త రాజశేఖర్ కుట్ర చేశారన్నది తన అనుమానని అన్నారు. హత్య జరిగిన ప్రాంతంలో లెటర్‌ను మాయం చేశారు.నేను ఎక్కడా గుండెపోటు అని చెప్పలేదని అవినాష్ రెడ్డి స్పష్టం చేశారు. సీబీఐ విచారణ వ్యక్తి టార్గెట్‌గా జరుగుతోందని… అప్రూవర్‌గా మారిన వ్యక్తి ఇచ్చిన వాగ్మూలంలో ఇదంతా ఉన్నప్పటికీ ఈ కోణంలో సీబీఐ ఎందుకు విచారణ జరపడం లేదని ప్రశ్నించారు. తాను గుండె పోటు అని చెప్పినట్టు టీడీపీ వారు చిత్రీకరించారు. కుటుంబ సభ్యులు చెబితేనే తాను హత్య జరిగిన ఇంటికి వెళ్లానని పేర్కొన్నారు. ఆ తర్వాత పోలీసులకు, ఇతర బంధువులకు, ముఖ్య నాయకులకు ఫోన్ చేశానన్నారు. తన సోదరి సునీత హైకోర్టు, సుప్రీంకోర్టులో అనేక ఆరోపణలు చేసినా .. ఏ ఒక్క రోజు తాను ఎవరి గురించి మాట్లాడలేదన్నారు. తాను హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయగానే.. సీబీఐ అధికారులు సునీతకు సమాచారం ఇచ్చి ఇంప్లీడ్ చేస్తున్నారని అవినాష్ రెడ్డి అన్నారు.
ఇదిలావుంటే, వివేకా హత్య కేసులో తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎంపీ అవినాష్‌రెడ్డిపై సోమవారం వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. ఇప్పటివరకు విచారించిన ఆడియో, వీడియో రికార్డులను హార్డ్ డిస్క్ రూపంలో మంగళవారం కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది. కాగా, ఎంపీ అవినాష్‌రెడ్డి రిట్ పిటిషన్‌పై హైకోర్టు శుక్రవారం విచారణ చేపట్టింది. గతంలో రెండు సార్లు విచారణలో ఆడియో, వీడియో రికార్డులు చేశారా అని హైకోర్టు.. సీబీఐని ప్రశ్నించింది. ఏ 4గా ఉన్న దస్తగిరి బెయిల్‌పై సీబీఐ అభ్యంతరం తెలపలేదని హైకోర్టుకు అవినాష్ తరఫు న్యాయవాది తెలిపారు. విచారణాధికారి పారదర్శకంగా వ్యవహరించడం లేదని అభియోగాలు ఉన్నాయన్న తెలంగాణ హైకోర్టు.. ఆడియో, వీడియో రికార్డులకు సంబంధించి ఏ విషయమైనా తెలపాలని సీబీఐకి కోర్టు సూచించింది. కాగా, మంగళవారం అవినాష్‌రెడ్డిని మళ్లీ విచారణకు పిలుస్తామని హైకోర్టుకు సీబీఐ తెలిపింది. విచారణ సందర్భంగా న్యాయవాదిని కూడా అనుమతించాలని అవినాష్ తరఫు న్యాయవాది కోరగా.. హైకోర్టు అంగీకరించింది. ఈనెల 14న ఉదయం 11గంటలకు విచారణకు హాజరు కావాలని అవినాష్‌రెడ్డిని న్యాయస్థానం ఆదేశించింది.
Read Also: SL vs NZ: తొలి టెస్టులో పట్టు బిగిస్తున్న లంక.. భారత్ కు ఊహించని షాక్..?
హత్యాస్థలంలో దొరికిన లేఖ తమ వద్దే ఉందని హైకోర్టుకు సీబీఐ తెలిపింది. లేఖపై సీఎఫ్‌ఎస్‌ఎల్ అభిప్రాయం తీసుకున్నామని చెప్పింది. వివేకా తీవ్ర ఒత్తిడిలో లేఖ రాసినట్లు సీఎఫ్‌ఎస్ఎల్ తెలిపిందని కోర్టుకు దృష్టికి తీసుకొచ్చింది. లేఖ, సీఎఫ్‌ఎస్‌ఎల్ నివేదిక సమర్పించాలని సీబీఐని హైకోర్టు ఆదేశించింది. మరోవైపు ఈ పిటిషన్‌లో వివేకా కుమార్తె సునీత ఇంప్లీడ్ అయ్యారు. పిటిషన్‌లో తన పేరు ప్రస్తావించినందున తన వాదనలు కూడా వినాలని కోరారు. దీనిపై అభ్యంతరం ఉందా? అని హైకోర్టు సీబీఐని అడిగింది. ఇక ఈ కేసు విచారణను సీబీఐ ప్రత్యేక కోర్టు ఈనెల 31కి వాయిదా వేసింది. కేసు విచారణలో భాగంగా చంచల్‌గూడ జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్నా సునీల్ కుమార్ యాదవ్, ఉమాశంకర్‌రెడ్డి, దేవిరెడ్డి శంకర్‌రెడ్డిని పోలీసులు కోర్టులో హాజరుపర్చారు. గంగిరెడ్డి సైతం సీబీఐ కోర్టుకు వచ్చారు. కేసు విచారణ వాయిదా పడిన తర్వాత ముగ్గురు నిందితులను పోలీసులు మళ్లీ చంచల్‌గూడ జైలుకు తరలించారు.