ప్రధాని బహిరంగ సభపై ప్రభుత్వం ఫోకస్:
ఈనెల 8న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విశాఖ పర్యటన కోసం పటిష్ఠమైన ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆరోజు మధ్యాహ్నం 2 గంటలకు ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో నేవల్ వైమానిక స్థావరం ఐఎన్ఎస్ డేగాకు మోడీ చేరుకుంటారు. ఎయిర్ పోర్ట్ నుంచి రోడ్డు మార్గంలో బహిరంగ సభ జరిగే ఆంధ్రా యూనివర్శిటీ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండుకు చేరుకుంటారు. దత్త ఐలాండ్ నుంచి ఏయూ గ్రౌండ్ వరకు భారీ రోడ్ షో నిర్వహించే విధంగా షెడ్యుల్ ఫిక్స్ అయింది. 60 వేల మందికి పైగా ప్రధాని రోడ్ షో పాల్గొనే విధంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. దాదాపు కిలోమీటరున్నర దూరం ఓపెన్ టాప్ వాహనంపై ప్రధాని రోడ్ షో చేస్తారు. పీఎం వెంట సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉంటారు.
శ్రీశైలం మల్లన్న భక్తులకు అలర్ట్:
ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైలంలో మల్లన్న స్పర్శదర్శనంపై కీలక నిర్ణయం తీసుకుంది దేవస్థానం. ఇప్పుడు స్పర్శదర్శనంలో మార్పులు చేసింది. శ్రీశైలంలో రద్దీ రోజులలో మల్లన్న స్పర్శదర్శనంలో మార్పులు చేస్తూ నిర్ణయించింది. సామాన్య భక్తులకు ప్రాధాన్యమిస్తూ స్పర్శదర్శనంలో మార్పులు చేసింది దేవస్థానం. ఇక మీదట ప్రతి శనివారం, ఆదివారం, సోమవారం ప్రభుత్వ సెలవు రోజుల్లో రోజుకు 2 విడతలుగా మాత్రమే స్పర్శ దర్శనం కల్పించనున్నారు. రద్దీ రోజుల్లో ప్రతి విడతకు 500 టికెట్లు మాత్రమే అందుబాటులో ఉంచనుంది దేవస్థానం. ఈ సమయంలో ఉదయం 7:30 గంటలకు.. తిరిగి రాత్రి 9 గంటలకు మాత్రమే శ్రీస్వామివారి స్పర్శ దర్శనం కల్పించనున్నారు.
ఆర్టీఓకు కలెక్టర్ షోకాజ్ నోటీస్:
వరంగల్ జిల్లాలో రవాణాశాఖలోని ఆర్టీఓ గంధం లక్ష్మిపై విధుల్లో నిర్లక్ష్యం కారణంగా జిల్లా కలెక్టర్ సత్య శారద శనివారం షోకాజ్ నోటీస్ జారీ చేశారు. రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా రోడ్లు, భవనాల శాఖ స్పెషల్ ఛీఫ్ సెక్రటరీ వికాస్ రాజ్, మంత్రి పొన్నం ప్రభాకర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. అనంతరం కలెక్టర్ సత్యశారద, ఆర్టీఓ గంధం లక్ష్మితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో రోడ్డు భద్రత మాసోత్సవాల సమయంలో రవాణా శాఖ చేపడుతున్న కార్యక్రమాల గురించి కలెక్టర్ ఆర్టీఓ లక్ష్మిని ప్రశ్నించారు. అయితే, అడిగిన ప్రశ్నలకు ఆర్టీఓ నిర్లక్ష్యంగా సమాధానాలు ఇవ్వడం కలెక్టర్ ఆగ్రహానికి గురైంది. విధుల్లో నిర్లక్ష్యం వహించడం సరైన పని కాదని అన్నారు.
గిన్నిస్ వరల్డ్ రికార్డు సృష్టించిన తెలంగాణ వ్యక్తి:
తెలంగాణ రాష్ట్రం సూర్యాపేటకు చెందిన క్రాంతి కుమార్ పణికేరా తన అసాధారణ ప్రతిభతో గిన్నిస్ వరల్డ్ రికార్డులో స్థానం సంపాదించి ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం సంపాదించాడు. కేవలం ఒక నిమిషంలో తన నాలుకను ఉపయోగించి 57 ఎలక్ట్రిక్ ఫ్యాన్ బ్లేడ్స్ ఆపడం ద్వారా ఈ అరుదైన రికార్డును సాధించారు. అసాధారణమైన సాహసాలకు ప్రసిద్ధి చెందిన క్రాంతిని అభిమానులు ప్రేమగా “డ్రిల్ మాన్” అని పిలుస్తారు. ఈ సందర్బంగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ తమ ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ అద్భుతమైన విజయానికి సంబంధించిన వీడియోను పంచుకుంటూ.. “ఒక నిమిషంలో అత్యధికంగా 57 ఎలక్ట్రిక్ ఫ్యాన్ బ్లేడ్స్ నాలుకతో ఆపిన రికార్డు – క్రాంతి కుమార్ పణికేరా (డ్రిల్ మాన్) పేరుతో నమోదు” అని పేర్కొనింది.
ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్:
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బస్తర్ ప్రాంతం మరోసారి కాల్పులతో దద్దరిల్లిపోయింది. నారాయణ్‌పూర్- దంతెవాడ జిల్లాల సరిహద్దుల్లోని దండకారణ్యంలో ఈ ఎన్‌కౌంటర్ చోటు చేసుకుంది. ఈ ఘటనలో నలుగురు మావోయిస్టులు మృతి చెందాగా.. మావోయిస్టులు జరిపిన ఎదురు కాల్పుల్లో ఓ కానిస్టేబుల్ ప్రాణాలు కోల్పోయినట్లు పోలీస్ అధికారులు వెల్లడించారు. అబుజ్‌మాద్‌లోని అటవీ ప్రాంతంలో శనివారం నాడు అర్ధరాత్రి డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్, సీఆర్పీఎఫ్ బలగాలు సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించాయి. ఈ క్రమంలో భద్రతా బలగాలపై మావోయిస్టులు కాల్పులు జరిపగా.. దీంతో భద్రతా బలగాలు జరిపిన ఎదురుకాల్పుల్లో నలుగురు మావోయిస్టులు సంఘటన ప్రదేశంలోనే మృతి చెందారు.
శబరిమలకు వెళ్లే భక్తులకు అలెర్ట్:
శబరిమలలో అయ్యప్ప భక్తులు ఒక్కసారిగా పోటెత్తారు. దీంతో 24 గంటల్లో లక్ష మందికి పైగా భక్తులు దర్శనం చేసుకున్నారు. అయ్యప్ప స్వామి సర్వ దర్శనానికి 10 గంటల సమయం పడుతుంది. ఇక, స్పాట్ దర్శనానికి 20 వేల టికెట్లను ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు ఇచ్చింది. పంబ నుంచి సన్నిదానం వరకు భారీగా క్యూలైన్లలో భక్తులు వేచి ఉన్నారు. క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులు కనీస వసతులు ఏర్పాటు చేశారు. అయితే, ఈ ఏడాది శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలో ఈనెల 15వ తేదీన నిర్వహించనున్న మకరజ్యోతి దర్శనానికి భారీ ఎత్తున ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. శబరిమలకు వచ్చే ప్రతి భక్తులు ఈజీగా దర్శనం చేసుకుని తిరిగి క్షేమంగా వెళ్లాలన్న లక్షంతో ఏర్పాట్లు చేస్తున్నామని శబరిమల అడ్మినిస్ట్రేటివ్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ అరుణ్ ఎస్ నాయిర్ వెల్లడించారు.
అమెరికాలో నోరో.. చైనాలో హెచ్‌ఎమ్‌పీవీ:
అమెరికాలో నోరోవైరస్ కేసులు పెరుగుతున్నాయి. డిసెంబరు నుంచి ఇప్పటివరకు దాదాపు వందకు పైగా వైరస్ కేసులు నమోదయ్యాయి. నోరోవైరస్ అనేది వేగంగా వ్యాపించే వ్యాధి. ఇది ఒక వ్యక్తి నుంచి మరొకరికి సోకుతుంది. సెంటర్ ఆఫ్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) ప్రకారం.. అమెరికాలోని అనేక ప్రాంతాల్లో నోరోవైరస్ కేసులు నిరంతరం పెరుగుతున్నాయి. నవంబరు మొదటి వారంలో 69 కేసులు నమోదు కాగా, డిసెంబర్ తొలివారంలో ఈ సంఖ్య 91 కి పెరిగింది. ప్రస్తుతం వందకు పైగా కేసులు నమోదైనట్లు సమాచారం. వాంతులు, విరేచనాలకు కారణమయ్యే అంటువ్యాధి వైరస్ పెరుగుదలపై ఆరోగ్య అధికారులలో ఆందోళన మొదలైంది.
‘డాకు మహారాజ్’ ట్రైలర్ రిలీజ్:
గాడ్ ఆఫ్ మాసెస్, నటసింహం నందమూరి బాలకృష్ణనటిస్తున్న చిత్రం ‘డాకు మహారాజ్’. బాలయ్య కెరీర్ లో 109వ సినిమాగా వస్తున్న ఈ సినిమాకు బాబీ కొల్లి దర్శకత్వం వహిస్తున్నారు. నేడు USAలోని డల్లాస్ లో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను అత్యంత భారీ స్థాయిలో చాలా గ్రాండ్ గా నిర్వహించారు. వేలాది మంది అభిమానులు తరలిరావతో ఆడిటోరియం జై బాలయ్య నినాదాలతో హోరెత్తింది. ఈ నేపథ్యంలో ఈ డాకు మహారాజ్ థియేట్రీకల్ ట్రైలర్ లాంచ్ చేసారు మేకర్స్. దర్శకుడు బాబీ టేకింగ్ ఓ రేంజ్ లో ఉందనే చెప్పాలి. ఓన్లీ యాక్షన్ సీక్వెన్స్ తో ఔట్ అండ్ ఔట్ యాక్షన్, ఎమోషనల్ ఎంటర్టైనర్ గా ట్రైలర్ ను కట్ చేశారు మేకర్స్.
ఏపీలో సంక్రాంతి వస్తున్నాం టికెట్ ధర పెంపు:
టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ హీరోగా యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న సినిమా ‘సంక్రాంతికి వస్తున్నాం’. జనవరి 14న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానున్న ఈ సినిమాకు ఏపీ ప్రభుత్వం ప్రత్యేక అనుమతులు ఇచ్చింది. రిలీజ్ రోజు నుండి మొదటి పది రోజులు సింగిల్ స్క్రీన్స్ లో రూ. 100 అలాగే ముల్టీప్లెక్స్ లో రూ. 125 పెంచుతూ అనుమతులు ఇచ్చింది. ఈ పెంపుతో సంక్రాంతికి వస్తున్నాం టికెట్ ధర రూ. 245, రూ. 175 రూ. 302 గా ఉండనుంది. అనిల్ రావిపూడి విక్టరీ వెంకటేష్ కాంబోలో వస్తున్న హ్యాట్రిక్ మూవీపై ఫ్యాన్స్ భారీగా అంచనాలు పెట్టుకున్నారు. ఈ సినిమా ట్రైలర్ ను ఈ నెల 6న రిలీజ్ చేయనున్నారు. మరోవైపు ప్రమోషన్స్ లో పొంగల్ కు రాబోయే సినిమాలతో పోలిస్తే సంక్రాంతికి వస్తున్నాం యూనిట్ దూసుకెళుతోంది. ఇప్పటివరకు ప్రమోషన్ కంటెంట్ చూస్తే మరోసారి అనిల్ రావిపూడి, వెంకీ కాంబో ప్రేక్షకులకు నవ్వలు పువ్వులు పూయించేలా ఉన్నారని స్పష్టంగా తెలుస్తోంది.
భారత్ ఘోర ఓటమి:
సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన ఐదో టెస్టులో 6 వికెట్ల తేడాతో టీమిండియా ఘోరంగా ఓడిపోయింది. దీంతో ఐదు మ్యాచ్‌ల బోర్డర్- గవాస్కర్ ట్రోఫీని 3-1 తేడాతో భారత్ కోల్పోయింది. అలాగే, ఈ ఓటమితో వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ నుంచి టీమిండియా నిష్క్రమించినట్లైంది. ఇక, మ్యాచ్‌లో భారత్ ఇచ్చిన 162 పరుగుల స్వల్ప టార్గెట్ ను 27 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఆస్ట్రేలియా విజయం సాధించడంతో సిరీస్‌తోపాటు డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్తును ఖరారు చేసుకుంది.