ఎస్వీ గోశాల వద్ద నాటకీయ పరిణామాలు:
తిరుపతి ఎస్వీ గోశాల వద్ద నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డికి ఎమ్మెల్యేలు బొజ్జల సుధీర్ రెడ్డి, పులివర్తి నాని, కలికిరి మురళీ మోహన్, నవాజ్ బాషాలు ఫోన్ చేశారు. ఎస్వీ గోశాలను సందర్శించాలని భూమనను కూటమి శాసనసభ్యులు కోరారు. అసత్య ఆరోపణలు చేయడం కాదు.. క్షేత్రస్థాయికి రావాలన్నారు. పోలీసుల సూచనల మేరకు ఐదుగురితో గోశాలకు రావాలని సూచించారు. ఎమ్మెల్యేల పిలుపుతో గోశాలకు వస్తానని భూమన చెప్పారు. దాంతో తిరుపతి గోశాల వద్ద పోలీసులు భారీగా మోహరించారు. తిరుపతి ఎస్వీ గోశాలకు రావాలని, అవసరమైన భద్రత కల్పిస్తామని భూమన కరుణాకర్ రెడ్డికి టీడీపీ ఎమ్మెల్యే బోజ్జల సుధీర్ రెడ్డి ఫోన్లో చెప్పారు. ఎస్పీతో మాట్లాడి ఎస్కార్ట్ భద్రత ఎర్పాటు చేస్తామని సుధీర్ చెప్పగా.. పోలీసులు అనుమతి ఇస్తే వస్తానంటూ భూమన సమాధానం ఇచ్చారు. ‘టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డిని గృహనిర్బంధం చేయలేదు. ఎస్వీ గోశాలకు వెళ్లడానికి భూమనకు ఎలాంటి అభ్యంతరం పెట్టలేదు. రెండు పార్టీల నేతలు ఒకే సారి వెళ్లకూడదని సూచించాం. భూమన వ్యక్తిగత భద్రతా సిబ్బందితో వెళ్లవచ్చని సూచించాం’ అని తిరుపతి ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు.
ప్రధాని మోడీ పర్యటన ఖరారు:
రాజధాని అమరావతి నిర్మాణాల పునఃప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన ఖరారైంది. మే 2న సాయంత్రం 4 గంటలకు రాజధాని పనులను ప్రధాని ప్రారంభించనున్నారు. పునఃప్రారంభోత్సవ కార్యక్రమం కోసం సచివాలయం వెనక బహిరంగ సభ వేదికను ఏపీ సర్కారు ఎంపిక చేసింది. ఇందుకోసం ఇప్పటికే ప్రభుత్వం ఏర్పాట్లు ప్రారంభించింది. ప్రధాని పర్యటన ఏర్పాట్ల కోసం మంత్రుల కమిటీని ప్రభుత్వం నియమించింది. మరోవైపు భద్రతా ఏర్పాట్లను ఎస్పీజీ బృందం పర్యవేక్షిస్తోంది. రాజధాని నిర్మాణాల పునఃప్రారంభోత్సవ కార్యక్రమంకు 5 లక్షల మంది హాజరవుతారనే అంచనాతో ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి ప్రజలు హాజరయ్యేలా కార్యాచరణ రూపొందించారు. ప్రముఖులు, ప్రజలు సభా ప్రాంగణానికి చేరుకునేలా 9 రహదారులను గుర్తించామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ తెలిపారు. రహదారులపై వాహనాల రాకపోకలకు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించామని వెల్లడించారు.
మెట్రో ప్రయాణికులకు షాకింగ్ న్యూస్:
2017లో ప్రారంభమమైన హైదరాబాద్ మెట్రో రైలు సేవలు దేశంలోనే అతి పెద్ద పబ్లిక్ ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ (PPP) ప్రాజెక్టుగా నిలిచింది. ఈ మెట్రో సేవలు నగరంలోని ముఖ్య ప్రాంతాలను కలుపుతూ ప్రతిరోజూ లక్షలాది మందికి సేవలందిస్తున్నాయి. అధిక రహదారి ట్రాఫిక్, కాలుష్య సమస్యల నేపథ్యంలో మెట్రో సేవలు నగర ప్రజల దైనందిన జీవితంలో ఒక భాగంగా మారాయి. ఇకపోతే తాజాగా హైదరాబాద్ మెట్రోను నిర్వహిస్తున్న ఎల్ అండ్ టీ (L&T) సంస్థ రూ.6,500 కోట్లకు పైగా నష్టాలను ప్రకటించింది. ఈ నేపథ్యంలో భాగంగా మెట్రో రైల్ ఛార్జీల పెంపు తప్పదన్న ఊహాగానాలు గట్టిగా వినిపిస్తున్నాయి. దీనికి కారణం ఇప్పటికే ప్రయాణికులకు అందిస్తున్న కొన్ని డిస్కౌంట్ ల విధానాలను తొలగించడం కూడా దీనికి సంకేతంగా భావిస్తున్నారు.
అధికారులను జైలుకు పంపినా తప్పు లేదు:
తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ మళ్లీ ప్రభుత్వంపై విమర్శల దాడికి దిగారు. కంచన్‌బాగ్ – గచ్చిబౌలి మధ్య 400 ఎకరాల భూముల వివాదం, సుప్రీంకోర్టు వ్యాఖ్యలపై స్పందిస్తూ కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నేడు తెలంగాణ భవన్ లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘అధికార మదంతో విర్రవీగితే ప్రజాస్వామ్యంలో వారికి తావు లేదని అన్నారు. నిన్న సుప్రీంకోర్టులో వాదోపవాదాలు విన్న సగటు పౌరుడికి న్యాయస్థానాల పట్ల మరింత గౌరవం పెరిగింది’ అంటూ వ్యాఖ్యానించారు. సుప్రీంకోర్టు ఆధికారులను జైలుకు పంపినా తప్పు కాదు’’ అన్న వ్యాఖ్యలపై కేటీఆర్ స్పందిస్తూ, ఇది ప్రభుత్వానికి పెద్ద నింద అని పేర్కొన్నారు. అలాగే ఆత్మాభిమానమున్న ఏ సీఎం అయినా ఇలాంటి పరిణామాల అనంతరం రాజీనామా చేస్తారు. కానీ, రేవంత్ రెడ్డికి ఆత్మాభిమానమే లేదు అంటూ విమర్శించారు. ఈ వివాదంలో పర్యావరణ ప్రేమికుల విజయం సాధించారని కేటీఆర్ అన్నారు. ఈ భూముల యాజమాన్యంపై స్పష్టత వచ్చే వరకూ కట్టడాలు నిర్మించకూడదు, లీజుకు ఇవ్వకూడదు అని సెంట్రల్ కమిటీ చెప్పింది. ఇది మేము గత వారం చెప్పిన మాటలే అని పేర్కొన్నారు.
ఈడీ ప్రశ్నలపై రాబర్ట్ వాద్రా కీలక వ్యాఖ్యలు:
మనీలాండరింగ్ కేసులో రాబర్ట్ వాద్రా వరుసగా మూడో రోజు ఈడీ కార్యాలయానికి వచ్చారు. ప్రియాంకతో కలిసి విచారణ కార్యాలయానికి వచ్చారు. ఈ సందర్భంగా రాబర్ట్ వాద్రా కీలక వ్యాఖ్యలు చేశారు. విచారణలో అధికారులు అడుగుతున్న ప్రశ్నలపై అసహనం వ్యక్తం చేశారు. అధికారులు కొత్త ప్రశ్నలేవీ అడగడం లేదని చెప్పారు. అడిగినవే మళ్లీ మళ్లీ అడుగుతున్నారని వ్యాఖ్యానించారు. 2019లో కూడా ఇవే ప్రశ్నలు అప్పుడు అడిగారని తెలిపారు. కొత్త సంగతి ఏమీ లేదన్నారు. ప్రభుత్వం ఉద్దేశ పూర్వకంగా తప్పుగా చూపించే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. అయినా కూడా తట్టుకునే శక్తి తమకు ఉందన్నారు. ఈడీ చర్య తమ కుటుంబంపై జరుగుతున్న రాజకీయ ప్రతీకార చర్యగా పేర్కొన్నారు.
ఓ ప్రేమజంటకు హైకోర్టు షాక్:
ఓ ప్రేమజంటకు అలహాబాద్ హైకోర్టు షాకిచ్చింది. తల్లిదండ్రుల్ని ఎదురించి వివాహం చేసుకున్న జంటకు రక్షణ కల్పించలేమని న్యాయస్థానం తేల్చి చెప్పింది. పోలీస్ రక్షణను హక్కుగా డిమాండ్ చేయరాదని.. ఒకవేళ నిజమైన బెదిరింపు అయితే పోలీసులు రక్షణ కల్పిస్తారని అలహాబాద్ హైకోర్టు తీర్పు వెలువరించింది. ప్రేమ వివాహం చేసుకున్న శ్రేయా కేసర్వాణి, ఆమె భర్త… రక్షణ కల్పించాలంటూ అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీన్ని విచారించిన ధర్మాసనం.. నిజంగా బెదిరింపు వస్తే పోలీసులు రక్షణ కల్పిస్తారని.. కానీ అలాంటి బెదిరింపులు లేకుండానే రక్షణ కల్పించాలని కోరడం భావ్యంకాదని పిటిషన్ కొట్టేసింది.
పాక్ మళ్లీ వక్రబుద్ధి:
కాశ్మీర్‌పై పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ కీలక వ్యాఖ్యలు చేశారు. విదేశాల్లో నివసిస్తున్న పాకిస్తానీయులను ఉద్దేశించి ప్రసంగిస్తూ అసిమ్ మునీర్ కాశ్మీర్ అంశాన్ని లేవనెత్తారు. కాశ్మీర్ తమ జీవనాడి అని.. దానిని మరిచిపోలేమని వ్యాఖ్యానించారు. విదేశాల్లో ఉన్నవారంతా దేశ రాయబారులు అని.. ఉన్నతమైన భావజాలం.. సంస్కృతికి చెందినవారన్న విషయాన్ని మరిచిపోకూడదని హితవు పలికారు. మీ పిల్లలకు మన దేశ చరిత్రను తెలియజేయాలని.. హిందువులతో పోలిస్తే.. మనం భిన్నమైన వారమని బోధించాలని తెలిపారు. మన సంస్కృతి, సంప్రదాయాలు, ఆశయాలు భిన్నం అని చెప్పారు. దేశం ఏర్పాటు కోసం మన పూర్వీకులు ఎంతగానో పోరాటం చేశారని తెలిపారు. ఈ స్టోరీని మీ పిల్లలకు తెలియజేయాలని అసిమ్ మునీర్ కోరారు.
హార్వర్డ్ యూనివర్సిటీకి ట్రంప్ సర్కార్ భారీ షాక్:
హార్వర్డ్ యూనివర్సిటీపై చర్యలకు ట్రంప్ సర్కార్ రంగం సిద్ధం చేసింది. ఇప్పటికే యూనివర్సిటీకి అందించే 2.2 బిలియన్ డాలర్ల ఫెడరల్ నిధులను నిలిపివేసింది. తాజాగా విశ్వవిద్యాలయానికి ఇస్తున్న పన్ను మినహాయింపును కూడా రద్దు చేయాలని రెవెన్యూ ఏజెన్సీకి ట్రంప్ ఆదేశించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు ట్రంప్ ప్రభుత్వం ఇంటర్నల్ రెవెన్యూ సర్వీస్(ఐఆర్ఎస్)ను కోరినట్లుగా నివేదిక అందుతోంది. దీనిపై మరింత సమాచారం అందాల్సి ఉంది.
‘జాట్ 2’ ప్రకటించిన మైత్రీ మూవీస్:
ఏప్రిల్ 10న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయిన జాట్ ఓ మాదిరి హిట్ టాక్ తెచ్చుకుంది. సన్నీ డియోల్ నటన మాస్ ఆడియెన్స్ ను మెప్పించింది. ఇక దర్శకుడు గోపీచంద్ మలినేని టేకింగ్ కు మంచి మార్కులే పడ్డాయి. సీనియర్ హీరో సన్నీ డియోల్ ను బాగా హ్యాండిల్ చేసాడని క్రిటిక్స్ పేర్కొన్నారు. కానీ రెగ్యులర్ రొటీన్ తెలుగు సినిమా టెంప్లేట్ కథలో కేవలం హీరో, విలన్ ను మాత్రమే బాలీవుడ్ నుండి తీసుకున్నాడు అనే విమర్శలు వచ్చాయి. ఇవన్నీ పక్కన పెడితే కమర్షియల్ గా జాట్ మంచి కలెక్షన్స్ రాబడుతోంది. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ ను ప్రకటించారు మేకర్స్. జాట్ కు సీక్వెల్ గా జాట్ 2 ను తీసుకురాబోతున్నామని అధికారకంగా పోస్టర్ రిలీజ్ చేసారు. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించబోయే ఈ సినిమా ఈ ఏడాది చివర్లో స్టార్ట్ కానుందని సమాచారం.
ముడు ముళ్ళ బంధంతో ఒక్కటైన అభినయ:
ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలి అనే సామెతను ఈ మధ్య సెలబ్రెటిలు చాలా సీరియస్‌గా తీసుకుంటున్నట్లు ఉన్నారు . ఒక్కొక్కరుగా కెరీర్ పీక్స్ లో ఉండగా పెళ్లి చేసుకుంటున్నారు. ఇందులో భాగంగా తాజాగా నటి అభినయ కూడా వివాహ బందం లోకి అడుగుపెట్టింది. పుట్టుకతో మూగ, చెవుడు వంటి అంగ వైకల్యం ఉన్నప్పటికీ పట్టుదలతో నటిగా మారి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది అభినయ. అయితే గత కొద్ది రోజులుగా ఈ అమ్మడి ప్రేమ,పెళ్లి వార్తలు నెట్టింట తెగ హల్‌చల్ చేస్తున్నాయి. దీంతో ఒక్క ఫోటోతో.. కుండ బద్దలు కొట్టి అన్ని పుకార్లకు తెరదించింది. ఎంగేజ్‌మెంట్ రింగ్స్ తొడిగి ఉన్న చేతుల ఫోటోలను షేర్ చేసి తాను త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్నట్లుగా అందరికి క్లారిటీ ఇచ్చింది.
తగ్గేదేలే అంటున్న పసిడి:
Today Gold Rates: నేడు మరోమారు బంగారం ధరలు భారీగా పెరిగాయి. గడిచిన రెండు రోజులలో తులానికి రూ.2,000ల పెరుగుదల నమోదైంది. ఇక నేడు మన తెలుగు రాష్ట్రలలో నిన్నటి ధర కంటే రూ.1,140 పెరిగి 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.97,310కి చేరింది. మరోవైపు 22 క్యారెట్ల బంగారం ధర రూ.1050 పెరిగి రూ.89,200గా ట్రేడ్ అవుతుంది. ఇంకా 18 క్యారెట్ల బంగారం ధర విషయానికి వస్తే.. నిన్నటి ధరపై రూ.860 పెరిగి రూ.72,990గా నమోదైంది. ఈ ధరల పెరుగుదలకి ప్రపంచ ఆర్థిక పరిస్థితులు, అమెరికా-చైనా మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు కారణమని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో అంతర్జాతీయంగా బంగారం మళ్లీ విలువైన పెట్టుబడి రూపంగా మారుతోంది.