కేంద్రం సహకారంతో ఏపీలో అభివృద్ధి పరుగులు పెడుతోంది..
ఏపీలో కూటమి ప్రభుత్వం ఏమి కోరితే అది మంజూరు చేసేందుకు కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం సిద్ధంగా ఉందని బీజేపీ కేంద్ర కార్యవర్గ సభ్యులు, రాష్ట్ర మాజీ అధ్యక్షులు సోము వీర్రాజు వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఏపీలో అభివృద్ది పరుగులు పెడుతోందని అన్నారు. రాజమండ్రిలో సోము వీర్రాజు మీడియాతో మాట్లాడుతూ.. విశాఖ ఉక్కుకు రూ.11,440 కోట్ల ప్యాకేజీ కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం రాష్ట్ర అభివృద్ధికి దోహదం చేస్తుందని పేర్కొన్నారు. విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేయమని ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నామని తెలిపారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్‌లు రాష్ట్ర అభివృద్ధిలో కీలకంగా పనిచేస్తున్నారని కితాబ్ ఇచ్చారు.
వైసీపీ విష ప్రచారాన్ని నమ్మొద్దు.. వారికి ఉచిత విద్యుత్ పథకం..!
ఎస్సీ, ఎస్టీలకు ఉచిత విద్యుత్ పథకానికి తూట్లు అంటూ వైసీపీ చేసే విషప్రచారాన్ని ప్రజలెవ్వరూ నమ్మొద్దని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. విద్యుత్ వ్యవస్థపై జగన్మోహన్ రెడ్డి కక్ష పెట్టుకున్నందుకే రోజూ అసత్యాల బురద చల్లుతున్నాడని ఆరోపించారు. ఐదేళ్లు విధ్వంసం చేసిన విద్యుత్ వ్యవస్థను చంద్రబాబు అనతికాలంలోనే తన అనుభవంతో సరిదిద్దారని అన్నారు. ప్రజలకు నాణ్యమైన విద్యుత్ అందిస్తుండటాన్ని చూసి జగన్ తట్టుకోలేకపోతున్నాడని మండిపడ్డారు. సూర్యఘర్, పీఎం కుసుమ్ పథకాల ప్రయోజనంపై అవగాహన లేక జగన్ అసత్యాలు ప్రచారం ప్రారంభించాడని విమర్శించారు. దీర్ఘకాలంలో పథకాల ప్రయోజనాలను ప్రజలు తెలుసుకుంటారని మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు.
భారత పర్యటనపై ట్రంప్ ఆసక్తి.. సలహాదారులతో చర్చ..
సోమవారం అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. ఈ కార్యక్రమానికి చాలా మంది విదేశీ ప్రముఖులు, రాజకీయవేత్తలు, టెక్ దిగ్గజాలు హాజరుకాబోతున్నారు. మరోవైపు ట్రంప్ తన తొలిరోజు ఎలాంటి సంచలన ఆర్డర్స్‌పై సంతకాలు చేస్తారనే దానిపై ప్రపంచం మొత్తం ఆసక్తిగా చూస్తోంది. ఇదిలా ఉంటే, ట్రంప్ భారతదేశ పర్యటనపై ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది.
పదేళ్ల పాలనలో పల్లెలన్నీ అన్ని రంగాల్లో అభివృద్ధి చేశాం
కరీంనగర్ జిల్లాలోని తిమ్మాపూర్ మండలం కొత్తపల్లి సాయిరాం గార్డెన్‌లో మండల బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల విస్తృత సమావేశంలో మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రసమయి బాలకిషన్ మాట్లాడుతూ.. తెలంగాణ పార్టీ ఏది అంటే ప్రజలంతా బీఆర్ఎస్ పార్టీ జెండానే చూపిస్తారన్నారు. దేవుడులాంటి కేసీఆర్‌ను దూరం చేసుకొని దయ్యం లాంటి రేవంత్ రెడ్డి తెచ్చుకున్నమని ప్రజలంతా బాధపడుతున్నారని, అర గ్యారెంటీ అమలు చేసి ఆరు గ్యారెంటీలు అమలు అయ్యాయని ప్రజలందరినీ మభ్యపెడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. 119 నియోజకవర్గంలో అత్యంత అవినీతిపరుడు ఎమ్మెల్యే మన కవ్వంపల్లి సత్యనారయణ రెండవ స్థానంలో ఉన్నాడని సీఎం రేవంత్ రెడ్డి చేసిన సర్వే రిపోర్ట్ లో తేలిందని, పదేండ్ల పాలనలో పల్లెలన్ని అన్ని రంగాలుగా అభివృద్ధి చేశామన్నారు రసమయి బాలకిషన్.
ఎన్డీఆర్ఎఫ్ కార్యక్రమంలో ఆసక్తికర సన్నివేశం..
విజయవాడ కొండపావులూరులో ఎన్డీఆర్ఎఫ్ 20వ వ్యవస్థాపక దినోత్సవంలో ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ప్రోటోకాల్ ప్రకారం శిలాఫలకం టెంట్ దగ్గర కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ముఖ్యమంత్రి చంద్రబాబుకు మాత్రమే కుర్చీలు వేశారు అధికారులు. అది గమనించిన అమిత్ షా.. మరొక కూర్చీ తీసుకురావాలని ఆదేశించారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు పక్కన కూర్చీలో కూర్చోమ్మని చెప్పారు. ఈ వీడియోను జనసేన కార్యకర్తలు వైరల్ చేస్తున్నారు. ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలు పవన్ కల్యాణ్‌కు ఇచ్చేటటువంటి ప్రాముఖ్యత ఇదేనంటూ ప్రచారం చేస్తున్నారు.
రేపు నల్గొండలో పర్యటించనున్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
రేపు (20.01.2025) నల్గొండ జిల్లాలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పర్యటించారు. ఈ పర్యనటలో భాగంగా ఆయన కనగల్, తిప్పర్తి, నల్గొండ మండలాల్లో వివిధ అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఉదయం 07.30 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరి ఉదయం 9.45 గంటలకు నల్గొండ జిల్లా కనగల్ మండలం దర్వేశిపురం గ్రామానికి చేరుకోనున్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. ఉదయం 10.15 గంటలకు.. దర్వేశిపురం గ్రామంలో కొత్తగా ఎన్నికైన శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయ కమిటీ చేత ప్రమాణస్వీకారం చేయించనున్నారు. ఉదయం 11.45 గంటలకు కనగల్ మండల కేంద్రంలో జంక్షన్ అభివృద్ధి పనులను పరిశీలిస్తారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.
విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు కేంద్రం ఇచ్చిన ప్యాకేజీపై అనుమానాలున్నాయి..
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్యాకేజ్‌పై వైసీపీకి చాలా అనుమానాలు ఉన్నాయని సీనియర్ నేత, మాజీ మంత్రి, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ అన్నారు. స్టీల్ ప్లాంట్ ముసుగులో కూటమి పార్టీలు గుద్దులాడుతున్నాయని ఆరోపించారు. ప్రయివేటీకరణ వ్యూహం అమలులో భాగంగానే ప్యాకేజ్ అనేది ఖచ్చితంగా చెబుతున్నాం.. అప్పులు తీర్చుకోవడానికి డబ్బులు ఇస్తే పరిశ్రమ ఏ విధంగా నడుస్తుంది..? అని ప్రశ్నించారు. కార్యచరణ ప్రకటించకుండా ప్యాకేజ్ ప్రకటించడం వెనుక మతలబు ఉందని అన్నారు. ప్యాకేజ్ అనేది ప్రలోభ పెట్టడమే తప్ప ప్రయోజనం చేకూర్చేది కాదని తెలిపారు.
కుంభమేళలో అగ్ని ప్రమాదం.. యోగికి ప్రధాని మోడీ ఫోన్..
ఉత్తర్ ప్రదేశ్ ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభ మేళలో ఆదివారం రోజు భారీ అగ్ని ప్రమాదం రిగింది. సెక్టార్-19 క్యాంప్‌సైట్ ప్రాంతంలో రెండు నుండి మూడు గ్యాస్ సిలిండర్లు పేలిన తరువాత భారీ అగ్నిప్రమాదం సంభవించిందని అధికారులు తెలిపారు. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో భక్తుల భయాందోళనకు గురయ్యారు. అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఎవరికీ ఏ హాని జరగలేదు. పరిస్థితిని అంచనా వేయడానికి సీఎం యోగి ఆదిత్యనాథ్ అగ్నిప్రమాదం జరిగిన చోటుకు చేరుకున్నారు.
బారాముల్లాలో ఎన్‌కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదులు ట్రాప్..
జమ్మూ కాశ్మీర్ మరోసారి కాల్పులతో దద్దరిల్లుతోంది. బారాముల్లా జిల్లాలో ఆదివారం సాయంత్రం ఎన్‌కౌంటర్ ప్రారంభమైంది. బారాముల్లాలోని సోపోర్ సెక్టార్‌లో భద్రతా దళాలు కార్డర్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించిన తర్వాత భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య కాల్పులు జరిగాయి. సైన్యం, జమ్మూ కాశ్మీర్ పోలీసులు సంయుక్తంగా ఈ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి. కాల్పుల్లో కనీసం ఇద్దరు ఉగ్రవాదులు చిక్కుకున్నారని అధికారులు తెలిపారు. 22 రాష్ట్రీయ రైఫిల్స్, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) యొక్క 179వ బెటాలియన్, జమ్మూ కాశ్మీర్ పోలీసుల బృందం కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తుండగా ఈ ఎన్‌కౌంటర్ జరిగింది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
ప్రభుత్వ పథకాల అమలు పారదర్శకంగా జరుగుతోంది
రాష్ట్రంలో జరుగుతున్న సంక్షేమ పథకాల అమలు నిష్పాక్షికంగా, పారదర్శకంగా జరుగుతుందని, ప్రజలు ఏ విధంగానూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఆదివారం మండలంలోని పలు గ్రామాల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసి, ప్రారంభోత్సవాలు నిర్వహించారు.
సభలో ఆయన మాట్లాడుతూ, ఈ నెల 26వ తేదీ నుండి రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డుల జారీ ప్రారంభమవుతాయని తెలిపారు. వ్యవసాయ భూములు ఉన్న ప్రతి రైతు కుటుంబానికి ఎకరానికి రూ.12,000 చెల్లిస్తామని, భూమిలేని నిరుపేద రైతు కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం ద్వారా వార్షికంగా రూ.12,000 అందజేస్తామని తెలిపారు. రాష్ట్రంలో అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి రేషన్ కార్డులు ఇవ్వడం జరుగుతుందని వివరించారు.