భారత ఆర్థిక వ్యవస్థ ప్రమాదంలో ఉంది..
హైదరాబాద్ వేదికగా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ.. కాంగ్రెస్ గత తొమ్మిదిన్నర సంవత్సరాలుగా కేంద్రంలో ప్రతిపక్ష పార్టీగా కీలక పాత్ర పోషిస్తోందని తెలిపారు. దేశం ఈ రోజు అనేక అంతర్గత సవాళ్లను ఎదుర్కొంటుంది.. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, మణిపూర్లో హింసను రేకెత్తించడం, అసమానత విస్తరించడం, రైతులు, కార్మికుల స్థితి తగ్గడంలో మోడీ ప్రభుత్వం అన్ని ముఖ్యమైన రంగాల్లో పూర్తిగా విఫలమైంది అని విమర్శించారు. మణిపూర్లో ఇప్పటికీ జరిగిన విషాద సంఘటనలను మొత్తం దేశం చూస్తోంది.. ఈ సంఘటనలు ఆధునిక, ప్రగతిశీల- లౌకిక భారతదేశం యొక్క ఇమేజ్‌ను దెబ్బ తీస్తాయని ఖర్గే అన్నారు. మన ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం ప్రమాదంలో ఉందని మల్లికార్జున ఖర్గే అన్నారు. అన్ని ముఖ్యమైన వస్తువుల ధరల ద్రవ్యోల్బణం, పెరుగుదల పేద- సామాన్య ప్రజల జీవితాలను ప్రతికూలంగా ప్రభావితం చేసిందన్నాడు. దేశం యొక్క విలువైన సంపదను మోడీ ప్రభుత్వం తన స్నేహితులకు అప్పగించింది.. వరదలు, కరువు వంటి సహజ విపత్తుల వల్ల ప్రభావితమైన ప్రజలకు ఉపశమనం కలిగించాల్సిన అవసరం ఉందన్నారు. నేషనల్ సెక్యూరిటీ ఫ్రంట్‌లో, చైనా యొక్క ఆక్రమణలకు సంబంధించి ప్రభుత్వం నిర్లక్ష్యం చేసినట్లు దేశ భద్రతకు క్లిష్టమైన ప్రమాదం పొంచి ఉందని ఆయన తెలిపారు.
కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న తుమ్మల నాగేశ్వరరావు
బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇవాళ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఏఐసీసీ చీప్ మల్లికార్జున ఖర్గే సమక్షంలో ఆయన హస్తం గూటికి చేరారు. తుమ్మలకు పార్టీ కండువా కప్పి ఖర్గే కాంగ్రెస్ పార్టీలోకి సాదర స్వాగతం పలికారు. తుమ్మల చేరిక కార్యక్రమంలో కర్ణాటక సీఎం సిద్దరామయ్య, కేసీ వేణుగోపాల్, టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు.
ఇక, తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ పార్టీలో చేరడంతో ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి. తుమ్మలతో పాటే ఆయన అనుచరులు, ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని కీలక నేతలు కూడా మరి కొద్ది రోజుల్లోనే హస్తం గూటికి వచ్చే ఛాన్స్ ఉంది. తుమ్మలకు ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గం టికెట్ ఇచ్చే ఛాన్స్ ఉందని పార్టీ వర్గాలు టాక్. నాగేశ్వరరావు గతంలో ప్రాతినిధ్యం వహించిన పాలేరు టికెట్ కోసం పొంగులేటి ఇప్పటికే అప్లికేషన్ పెట్టుకున్నారు. ఈ రెండు స్థానాల విషయంలో వీరిద్దరి మధ్య సర్దుబాటు చేసేందుకు కాంగ్రెస్ అధిష్టానం ట్రై చేస్తుంది. ఆయన చేరికతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ బలం మరింత పెరిగే ఛాన్స్ ఉంది.
కులం అడ్డుగోడలు ఛేదించారు.. తొలిసారి ఆలయ పూజారులుగా ముగ్గురు మహిళలు..
తమిళనాడులో తొలిసారిగా ముగ్గురు మహిళలు ఆలయ పూజారులుగా మారారు. కులాల అడ్డుగోడలను ఛేదించి దేవుడి గర్భగుడిలోకి ప్రవేశించి లింగసమానత్వాన్ని తీసుకురానున్నారు. దేవుడి సేవ చేసుకునే భాగ్యం కొన్ని కులాలకే కాదు అందరికి ఉందనే నిజాన్ని చాటి చెప్పేందుకు ఈ ముగ్గురు మహిళలు సిద్దమయ్యారు. రమ్య, కృష్ణవేణి, రంజిత అనే యువతులు తమిళం, సంస్కృతం చదువుతూ శ్రీరంగం ఆలయంలో ఒక ఏడాది కోర్సును పూర్తి చేశారు. కడలూర్ కి చెందిన టైలర్ కుమార్తె, మ్యాథ్స్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన రమ్య మాట్లాడుతూ..ఆలయంలో దేవుడికి సేవ చేయడం ఆనందంగా ఉందని, దేవుడికి సేవ చేయాలనే కోరిక తనకు ఎప్పటి నుంచో ఉందని ఓ నేషనల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. అన్ని కులాల వారు పూజారులు కావచ్చని తమిళనాడు ప్రభుత్వం చెప్పినప్పుడు తాను ఎంతో సంతోషించానని తెలిపారు. తామే మొదటి ఆయల పూజారులమైనందుకు గర్వంగా ఉందని, అన్ని వ్యతిరేకతలను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం తమకు మద్దతు ఇచ్చిందని, ప్రజలు కూడా తమకు మద్దతు ఇవ్వాలని కోరుకుంటున్నట్లు రమ్య తెలిపారు. ముగ్గురు మహిళలు సహాయ అర్చకులుగా నియమితులయ్యే ముందు తమిళనాడు దేవాలయాల్లో ఏడాది పాటు శిక్షణ పొందారు.
45 రోజుల పాటు జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం
జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపైన్ శుక్రవారం(సెప్టెంబర్ 15) నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైందని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఆరోగ్య సేవలన్నీ అందించటమే దీని లక్ష్యమన్నారు. 5 దశల్లో ఈ కార్యక్రమం అమలు జరుగుతుందన్నారు. ప్రజల సమస్యల పరిష్కారానికి చేపట్టిన ‘జగనన్న సురక్ష’ కార్యక్రమం తరహాలోనే ‘జగనన్న ఆరోగ్య సురక్ష’ కార్యక్రమంలో కూడా సిబ్బంది ఇంటింటికీ వెళ్లి, ప్రజల ఆరోగ్య సమస్యలు, అవసరాలు తెలుసుకొని వాటిని పరిష్కరిస్తారని చెప్పారు. తొలుత వాలంటీర్లు, గృహ సారథులు, ప్రజాప్రతినిధులు వారి పరిధిలోని ఇళ్లను సందర్శించి, ప్రజలందరీకి ఈ కార్యక్రమం గురించి అవగాహన కల్పిస్తారన్నారు. తొలి దశ వైద్య శిబిరాలు నిర్వహించే పట్టణాలు/గ్రామాల్లో ముందుగా ఈ క్యాంపెయిన్ మొదలవుతుందన్నారు. వైద్య , ఆరోగ్యశ్రీ సేవలు ఎలా వినిగించుకోవాలనేది అవగాహనా, సేవలు అనే దశల వారీగా జరుగుతుందన్నారు. 45 రోజుల పాటు జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం జరుగుతుందని మంత్రి వెల్లడించారు. 105 రకాలు మందులు ప్రజలకు అందుబాటులో ఉంటాయన్నారు. 3751 కొత్త ప్రొసిజర్స్ తీసుకుని వచ్చామని మంత్రి చెప్పారు. ఇప్పటికే ఫ్యామిలీ డాక్టర్ ఓపీలను 2లక్షల 40 మంది ఉపయోగించుకున్నారని స్పష్టం చేశారు.
గేమ్ ఛేంజర్ లీక్స్.. కేసు పెట్టిన దిల్ రాజు సంస్థ
ఈ మధ్య కాలంలో దాదాపు బడా నిర్మాణ సంస్థలు అన్నీ పాన్ ఇండియా సినిమాల నిర్మాణంలో తలమునకలు అయి ఉన్నాయి. అలా దిల్ రాజు నిర్మాణ సంస్థ నుంచి రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ అనే సినిమా తెరకెక్కుతోంది. ఇక ఈ సినిమాలో కియారా అద్వానీ, అంజలి హీరోయిన్లుగా నటిస్తుండగా తెలుగు సహా అనేక భాషలకు చెందిన నటీనటులు కీలక పాత్రలలో నటిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా నుంచి తాజాగా ఒక సాంగ్ లీక్ అయింది. వాస్తవానికి అది ఈ గేమ్ ఛేంజర్ సాంగ్ అని కూడా జనానికి తెలియదు. థమన్ కొట్టిన మ్యూజిక్ అని అర్ధం అయింది దీంతో గుంటూరికారం లేదా గేమ్ ఛేంజర్ సినిమాది అనుకున్నారు. ఇక ఇప్పుడు ఈ సాంగ్ లీక్ కావడం పెద్ద ఎత్తున చర్చనీయాంశం అయింది.
పాలమూరు జిల్లాలో పుట్టిన నేతలే ప్రాజెక్టును అడ్డుకున్నారు..
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రారంభించి తెలంగాణ ప్రజలకు అంకితం చేశారు. ఇక, కొల్లాపూర్ సింగోటం చౌరస్తాలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును గత పాలకులు, నాయకులు చాలా మంది అడ్డుకున్నారు అని అన్నారు. పాలమూరు జిల్లాలో పుట్టిన నేతలే ప్రాజెక్టును అడ్డుకున్నారు.. ఆనాడు చేయని దద్దమ్మ నాయకులే ఇన్నాళ్లు అడ్డుకున్నారు.. బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి లాంటి నేతలు పాలమూరుపై విమర్శలు చేశారు.. మూడు ప్రాజెక్టులు పూర్తైతే దేశానికే తెలంగాణ అన్నం పెడుతుంది.. తెలంగాణలో మనకు రావాల్సిన నీటి వాటాలను లెక్కగట్టి మూడు ప్రాజెక్టుల పనులను ప్రారంభించామని సీఎం కేసీఆర్ తెలిపారు.
నాలుగో విడత వారాహి యాత్రకు సిద్దమవుతున్న పవన్ కళ్యాణ్
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వారాహి యాత్ర విడత వారీగా కొనసాగుతోంది. ఇప్పటికే మూడు విడతలు చేపట్టిన వారాహి యాత్రను విజయవంతంగా పూర్తి చేసుకున్న పవన్ కళ్యాణ్ నాలుగో విడత యాత్రకు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు ఈనెల 21వ తేదీన కృష్ణా జిల్లాలో పవన్ కల్యాణ్ వారాహి యాత్రను ప్రారంభించనున్నారు. ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జనసేనాని వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఇటీవల టీడీపీ కలిసి ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తుందన్న ఆయన వైసీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తన వారాహి యాత్రలో ప్రధానంగా వైసీపీ ప్రభుత్వం, సీఎం జగన్‌పై తీవ్ర విమర్శలతో విరుచుకుపడ్డ పవన్.. నాలుగో విడత వారాహి యాత్రకు సిద్ధమవుతున్నారు.. ఈ యాత్రకు సంబంధించిన ప్రాంతాల్లో ఉండే సమస్యల గురించి తెలుసుకుంటున్నారు. ఎప్పుడెప్పుడు ప్రారంభమవుతుందని ఎదురు చూస్తు్న్న జనసైనికులు సెప్టెంబర్ 21 నుంచి నాలుగో విడత వారాహి యాత్ర ప్రారంభమవుతుండడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఏపీలో అరాచక పాలన సాగుతుందని, దాన్ని అంతం చేసేందుకు టీడీపీతో కలిసి పోటీ చేస్తామని పవన్ కల్యాణ్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
నలుగురు ఆర్మీ జవాన్లు వీరమరణం పొందితే.. బీజేపీ సంబరాలు చేసుకుంది
ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ సహా దేశంలోని ఐదు రాష్ట్రాల్లో త్వరలో ఎన్నికలు జరుగనున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా.. ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ సమన్వయకర్త అరవింద్ కేజ్రీవాల్ ఛత్తీస్‌గఢ్‌లోని జగదల్‌పూర్‌లో ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. బీజేపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. జమ్మూకశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌లో జవాన్ల బలిదానాలకు యావత్ దేశం దుఃఖించిందని.. మన సైనికులు అమరులైన సమయంలో ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో సంబరాలు జరుపుకోవడం మరింత బాధాకరమన్నారు. జవాన్లపై ఉగ్రవాదులు కాల్పులు జరిపినప్పుడు బీజేపీ ప్రధాన కార్యాలయంలో ప్రధాని మోడీ, హోంమంత్రి, రక్షణ మంత్రి సంబరాలు చేసుకుంటున్నారని కేజ్రీవాల్ అన్నారు. దేశం మొత్తం విషాదంలో మునిగిపోతే.. వారు మాత్రం సంబరాలు చేసుకున్నారని మండిపడ్డారు. ఇదిలా ఉంటే.. నలుగురు ఆర్మీ జవాన్లు వీరమరణం పొందితే ఇప్పటికీ ప్రధాని స్పందించలేదన్నారు. వారి కోసం ఒక్క మాట.. ఒక్క ట్వీట్ కూడా చేయలేదని తెలిపారు. ప్రతిదానిపైనా ట్వీట్లు చేసే ప్రధాని, హోంమంత్రి జవాన్ల మరణంపై ఎందుకు ఉలుకు పలుకు లేదన్నారు.
హైదరాబాద్‌లో పలు చోట్ల వర్షం
హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో శనివారం సాయంత్రం అకస్మాత్తుగా వర్షం కురిసింది. బషీర్‌బాగ్, అబిడ్స్, కోఠి, సుల్తాన్‌బజార్, బేగంబజార్, మెహదీపట్నం, అఫ్జల్‌గంజ్‌లో వర్షం కురియడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్డుపై వర్షపు నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇదిలా ఉంటే.. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఏర్పాడింది. వాయువ్య బంగాళాఖాతం సహా ఉత్తర ఒడిశా-పశ్చిమ బంగాళాఖాతం తీరాల మీదుగా బలపడిందని వాతావరణ శాఖ వెల్లడించింది. అల్పపీడన ప్రభావంతో రానున్న మరో 3 రోజుల పాటు తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో నేడు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్,రాజన్న సిరిసిల్ల, జగిత్యాల జిల్లాల్లో నేడు భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. సముద్ర మట్టానికి 7.6 కి.మీ ఎత్తు వరకు విస్తరించి ఉందని అధికారులు తెలిపారు.
తెలంగాణ ఇచ్చిన దేవత సోనియా.. ఇంటికి పోతరా.. జైలుకు పోతరా..!
తెలంగాణ ఇచ్చిన దేవత సోనియా హైదరాబాద్ కొచ్చారు అని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. అందరం స్వాగతం పలికాం.. తెలంగాణ ప్రజలు కూడా రేపు సభకు తరలి రావాలి అని ఆయన పిలుపునిచ్చారు. తెలంగాణలో కేసీఆర్ పతనం మొదలైంది.. ఎన్ని హామీలు ఇచ్చిన ఓటమి తప్పదు.. అప్పుల రాష్ట్రాన్ని బాగు చేసుకునే బాధ్యత అందరిపై ఉందన్నారు. ప్రజలు విజయభేరి సభకు తరలి రావాలి అని ఎంపీ వెంకట్ రెడ్డి కోరారు. బీజేపీ లేదు, బీఆర్ఎస్ ఓడిపోతుంది.. కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది అని ధీమా వ్యక్తం చేశారు. మంత్రి కేటీఆర్ కు ఏం తెల్సు.. తెలంగాణ ఉద్యమం గురించి.. అస్సలు కేటీఆర్ అప్పుడు ఎక్కడున్నాడు అంటూ ఆయన ప్రశ్నించారు. నల్గొండ జిల్లా ప్రజలు ఫ్లోరైడ్ సమస్యతో ఇబ్బంది పడ్తున్నారు అని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. మూసీ ప్రక్షాళన ఏమైంది.. చింతమడకలో ఇంటికి 10 లక్షలు రూపాయలు ఇస్తావ్.. మరి ఇతర గ్రామాల ప్రజలకు ఎందుకు ఇయ్యవ్ అని ఆయన ప్రశ్నించారు. రేపు ( ఆదివారం ) సభలో చెబుతాం.. మేము ఏం చేసేదో.. చేసేదే చెబుతామన్నారు.
చంద్రబాబు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడమే నేరమా..?
టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుకు నిరసనగా రాజమండ్రిలో తెలుగు మహిళలతో కలిసి నారా భువనేశ్వరి, బ్రాహ్మణి కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. రాజమండ్రి తిలక్ రోడ్డు నుంచి కటారినగర్ రామాలయం వరకు ర్యాలీ కొనసాగింది. ముందుగా సాయిబాబా ఆలయం, రామాలయాల్లో నారా భువనేశ్వరి, బ్రాహ్మణి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా నారా బ్రాహ్మణి మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబుపై పెట్టిన కేసులు అక్రమం, ఇవి కక్ష సాధింపు కేసులు అన్నారు. చంద్రబాబు లాంటి సీనియర్ నేతను, విజనరీ లీడర్ ను. అన్యాయంగా అరెస్ట్ చేశారు అంటూ ఆమె పేర్కొన్నారు. ఎలాంటి ఎవేడేన్స్ లేకుండా అన్యాయంగా అరెస్ట్ చేశారు.. లక్షలాది మందికి స్కిల్స్ ద్వారా ఉద్యోగాలు వచ్చేలా చేశారు.. సంక్షేమం చేయడం నేరమా అని బ్రహ్మణి అడిగారు.
అత్యాధునిక హంగులతో టీఎస్‌ఆర్టీసీ నర్సింగ్ కళాశాల
అత్యాధునిక హంగులతో నిర్మించిన తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) నర్సింగ్ కళాశాల నూతన భవనం విద్యార్థులకు అందుబాటులోకి వచ్చింది. రెండున్నర ఎకరాల విస్తీర్ణంలో రూ.10 కోట్ల వ్యయంతో నాలుగు అంతస్థుల భవన సముదాయాన్ని సంస్థ నిర్మించింది. హైదరాబాద్ తార్నాక ఆస్పత్రి ప్రాంగణంలో శనివారం నర్సింగ్ కళాశాల నూతన భవనాన్ని సంస్థ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్, ఎండీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ ప్రారంభించారు.
అనంతరం తరగతి గదులు, ల్యాబొరేటరీలను వారు పరిశీలించారు. నూతన భవనంలో విద్యార్థులకు కల్పిస్తోన్న సౌకర్యాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సంస్థ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్ మాట్లాడుతూ.. సిబ్బంది సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని తార్నాక టీఎస్ఆర్టీసీ ఆస్పత్రికి అనుసంధానంగా 2021-22 విద్యా సంవత్సరం నుంచి నర్సింగ్ కళాశాలను ఏర్పాటు చేశామని తెలిపారు. నర్సింగ్ కోర్సులు పూర్తి చేసిన వారికి వైద్య రంగంలో మంచి భవిష్యత్ ఉందని, విద్యార్థులందరూ టీఎస్ఆర్టీసీ అందిస్తోన్న నర్సింగ్ కోర్సులను సద్వినియోగం చేసుకోవాలన్నారు.