హైదరాబాద్ మెట్రోపై కీలక నిర్ణయం.. అక్కడి వరకు మెట్రో సేవలు
తెలంగాణ కేబినెట్ హైదరాబాద్ మెట్రోపై మరో కీలక నిర్ణయం తీసుకుంది.. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో హైదరాబాద్ మెట్రో విస్తరణ సహా పలు కీలక అంశాలకు ఆమోదం వేశారు.. కేబినెట్ సమావేశం ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడిన మంత్రి కేటీఆర్.. కేబినెట్ నిర్ణయాలను వెల్లడించారు.. ప్రజా రవాణాను విస్తృతం చేయాలని భావిస్తున్నాం.. హైదరాబాద్ మెట్రో రైలును విస్తరిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుందన్నారు.. 70 కిలో మీటర్లకు అదనంగా ఎయిర్ పోర్టు ఎక్స్ ప్రెస్ వే వస్తుందన్న ఆయన.. జూబ్లీ బస్టాండ్ నుంచి తుంకుంటా… డబుల్ డెక్కర్ మెట్రో, ప్యాట్నీ నుంచి కండ్లకోయ వరకు, ఇస్సాన్పూర్ – మియాపూర్, ఉప్పల్ నుంచి బీబీ నగర్ వరకు… శంషాబాద్ నుంచి కొత్తూరు వరకు విస్తరణ చేయాలని కేబినెట్‌లో నిర్ణయం తీసుకున్నాం అన్నారు.. ఇక, ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) చుట్టూ మెట్రో వరకు విస్తరణ చేయాలని నిర్ణయించాం.. 60 వేల కోట్ల రూపాయలతో 101 కిలోమీటర్లకు అదనంగా మెట్రో కారిడార్ నిర్మాణం చేస్తాం అన్నారు.. రాబోయే మూడు, నాలుగేళ్ళలో మెట్రోరైలు నిర్మాణం పూర్తి చేస్తామని ప్రకటించారు. ఇక, దీనికి కేంద్ర ప్రభుత్వ సహాయం చేస్తుందని ఆశిస్తున్నాం.. వారు సహకరించకపోయినా రాష్ట్ర ప్రభుత్వం నిర్మాణం చేస్తుందని స్పష్టం చేశారు మంత్రి కేటీఆర్.
కేసీఆర్ కీలక నిర్ణయం.. ప్రభుత్వంలో టీఎస్ఆర్టీసీ విలీనం..!
తెలంగాణ ప్రభుత్వం టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థను ప్రభుత్వంలో విలీనం చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు క్యాబినెట్ మీటింగ్ లో చర్చించారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ మండలి కీలక నిర్ణయం తీసుకున్నది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన మంత్రివర్గ మండలి సమావేశమైంది. ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై మంత్రివర్గంలో చర్చించింది. త్వరలో జరిగే అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టనున్నది. అనంతరం ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులుగా మారనున్నారు. మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని నిర్ణయం తీసుకుందని చెప్పారు. టీఎస్ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించేందుకుగాను అధికారులతో కూడిన సబ్ కమిటీని ఏర్పాటు చేశామని మంత్రి కేటీఆర్ చెప్పుకొచ్చారు. 43, 373 మంది ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ కీలక నిర్ణం తీసుకుంది. ఈరోజు సుదీర్ఘంగా సాగిన కేబినెట్‌లో తీసుకున్న నిర్ణయాలను మంత్రి కేటీఆర్ వివరించారు. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వం ఉద్యోగులుగా గుర్తించే బిల్లును మూడో తారీఖున నిర్వహించబోయే అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నట్టు ఆయన తెలిపాడు. ఈ మేరకు సంబంధిత నేతలకు, అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశాలిచ్చినట్టు కేటీఆర్ తెలిపారు. ఈ అంశానికి సంబంధించిన విధివిధానాలపై సబ్ కమిటీ ఏర్పాటు చేయనున్నట్టు పేర్కొన్నారు.
అధిక మాసం ఎఫెక్ట్.. టీటీడీ కీలక నిర్ణయం
ఈ ఏడాది అధిక మాసం కారణంగా తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కీలక నిర్ణయం తీసుకుంది.. ఈ రోజు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవ ఏర్పాట్లపై ఉన్నతాధికారుల సమావేశం నిర్వహించారు టీటీడీ ఈవో ధర్మారెడ్డి.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ ఏడాది అధిక మాసం కారణంగా శ్రీవారి ఆలయంలో రెండు సార్లు బ్రహ్మోత్సవాలను నిర్వహించాలని నిర్ణయించినట్టు వెల్లడించారు.. సెప్టంబర్ 18వ తేదీ నుంచి 26వ తేవీ వరకు సాలకట్ల బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తామని.. ఇక, అక్టోబర్ 15వ తేదీ నుంచి 23వ తేదీ వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్టు వెల్లడించారు ఈవో ధర్మారెడ్డి. ఇక, సాలకట్ల బ్రహ్మోత్సవాలు సందర్భంగా సెప్టెంబర్ 18వ తేదీన రాష్ర్ట ప్రభుత్వం తరపున సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి పట్టువస్త్రాలు సమర్పిస్తారని తెలిపారు టీటీడీ ఈవో ధర్మారెడ్డి.. సెప్టెంబర్ 22న గరుడ సేవ, 23న స్వర్ణరథ ఉరేగింపు ఉంటాయని.. బ్రహ్మోత్సవాల సమయంలో సిఫార్సు లేఖల స్వీకరణపై వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేశామని వెల్లడించారు. వెనుకబడిన ప్రాంతాలకు చెందిన 10 వేల మంది భక్తులకు స్వామివారి దర్శనభాగ్యం కల్పిస్తాం.. గరుడ సేవ రోజున తిరుమల చేరుకున్న భక్తులందరికీ స్వామివారి దర్శనభాగ్యం కల్పించేలా ఏర్పాట్లు చేస్తామని ప్రకటించారు టీటీడీ ఈవో ధర్మారెడ్డి. కాగా, తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది.. కొన్ని రోజుల క్రితం వరకూ శ్రీవారి దర్శనం కోసం గంటల తరబడి ఎదురుచూసేవారు. కానీ, ఇప్పుడు ఎక్కడా భక్తులు వేచి ఉండకుండా నేరుగా స్వామివారిని దర్శించుకుంటున్నారు.
రోడ్డుపై బిస్కెట్ ప్యాకెట్లు.. కార్లు, బైక్‌లు ఆపి ఎగబడ్డ జనం..
రోడ్డుపై ఏదైనా పడితే చాలు.. అయ్యో మీది పడిపోయింది.. ఇదిగో తీసుకోండి అని ఇచ్చేవారి సంఖ్య క్రమంగా తగ్గిపోతోందేమో అనే డౌట్ కొన్ని ఘటనలు చూసినప్పుడు అర్థం అవుతుంది.. ఇప్పటికే చాలా సందర్భాల్లో ఇది రుజువైంది కూడా.. కోళ్ల లోడ్‌తో వెళ్తున్న వ్యాన్ బోల్తా పడినప్పుడు, లిక్కర్ లోడ్‌తో వెళ్తున్న లారీ బోల్తా కొట్టినప్పుడు, పెట్రోల్, డీజిల్ ట్యాంకర్‌లో బోల్తా కొట్టినప్పుడు, మంచినూనె లోడ్‌తో వెళ్తున్న ట్యాంకర్ ప్రమాదానికి గురైనప్పుడు.. సదరు బాధితుడికి సాయం చేయకపోవడం పక్కనపెడితే.. అందినకాడికి దండుకొనిపోయినవారే తప్పితే.. అయ్యోపాపం అనే నాదుడే లేడే అనిపించింది.. తాజాగా, బిస్కెట్ల ప్యాకెట్ల లోడ్‌తో వెళ్తున్న ఆటో నుంచి.. ప్యాకెట్లు రోడ్డుపై పడిపోయాయి.. అది గమనించని సదరు ఆటో డ్రైవర్ అలాగే ముందుకు సాగాడు.. కానీ, వెనుకాల కార్లలో, బైక్‌లు, ఇతర వాహనాలపై వస్తున్నవారు.. వారి వాహనాలను ఆపిమరి.. అందినకాడికి బిస్కెట్ ప్యాకెట్లు తీసుకెళ్లిపోయారు. గండేపల్లిలో జరిగిన ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. బిస్కెట్ ప్యాకెట్ల లోడుతో వెళ్తున్న ఆటోకి కట్టిన తాడు తెగిపోయింది.. దాంతో, ఆటోలో ఉన్న బస్కెట్ల ప్యాకెట్లకు సంబంధించిన కేసులు రోడ్డుపై పడిపోయాయి.. ఇక, ఆటో వెనకాలే వెళ్తున్న కార్లు, బైక్‌లు, ఇతర వాహనాలను ఆపి మరీ.. బిస్కెట్ల ప్యాకెట్ల కోసం ఎగబడ్డారు ప్రజలు.. రాజమండ్రి నుంచి తునికి బిస్కెట్ల లోడ్‌తో ఆటో వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.. అయితే, విషయం తెలిసి ఆటో ఆపి వెనక్కి వచ్చారు.. ఆటో డ్రైవర్, క్లీనర్.. కానీ, అప్పటికే అందిన కాడికి, దొరికొనకాడికి.. దొరికినట్టు పట్టుకుని పెళ్లిపోయారు ప్రజలు.. దీంతో, తన ఓనర్‌కి ఏమి చెప్పాలో తెలియక లబోదిబోమంటున్నాడు డ్రైవర్.
సీఎం యోగి సంచలన వ్యాఖ్యలు.. జ్ఞానవాపిని మసీదు అనడమే వివాదం
జ్ఞానవాపి మసీదు అంశంపై ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముస్లిం వర్గాలు చారిత్రక తప్పిదానికి పాల్పడ్డాయని.. సరిదిద్దుకునే అవకాశం ఇప్పటికీ వారికి ఉందంటూ వ్యాఖ్యానించారాయన. సోమవారం ఉదయం ఓ జాతీయ మీడియా పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న ఆయన జ్ఞానవాపిపై స్పందించారు. ”జ్యోతిర్లింగం ఉంది. దానిని మేమేవరం ఉంచలేదు. విగ్రహాలు అక్కడ ఉన్నాయి. ఇప్పటికైనా చారిత్రక తప్పిదం సరిదిద్దుకుంటామనే ప్రతిపాదన ముస్లింల నుంచి రావాలి. జ్ఞానవాపిని మసీదు అని పిలిస్తేనే అది వివాదం అయినట్లు లెక్క. అక్కడి ప్రజలు ఆలోచించాలి. అసలు అక్కడ త్రిశూలానికి ఏం పని? అని ఆ పాడ్‌కాస్ట్‌లో ప్రసంగించారు. ఈ సాయంత్రం ఆ పాడ్‌కాస్ట్‌కు సంబంధించిన పూర్తి ఎపిసోడ్ టెలికాస్ట్ కానుంది. ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ జ్శానవాపి మసీదుపై చేసిన వ్యాఖ్యలపై ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘‘అలహాబాద్ హైకోర్టులో ఏఎస్ఐ సర్వేను ముస్లిం వైపు వ్యతిరేకించారని, మరికొద్ది రోజుల్లో తీర్పు వెలువడుతుందని సీఎం యోగికి తెలుసు. అయినప్పటికీ అతను అలాంటి వివాదాస్పద ప్రకటన ఇచ్చాడు. ఇది న్యాయపరిధిని ఉల్లంఘించడమే అని తెలిపారు. జ్ఞానవాపిపై సీఎం యోగి వ్యాఖ్యలను ఏఐఎంఐఎం తీవ్రంగా పరిగణించింది. ‘‘90వ దశకంలోకి మేం వెళ్లాలనుకోవట్లేదు. చట్టం ప్రకారం.. మా హక్కుల ప్రకారమే మేం అక్కడ ప్రార్థనలు చేయాలనుకుంటున్నాం. కేసు కోర్టులో ఉండగా.. అలాంటి ప్రకటనలు ఎలా చేస్తారు? అని ఎంఐఎం నేత వారిస్ పథా తప్పుబట్టారు.
లాలూ ఫ్యామిలీకి ఈడీ షాక్.. కోట్లాది రూపాయల విలువైన ఆస్తులు సీజ్
ఆర్జేడీ నేత అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఫ్యామిలీకి షాక్ ఇచ్చింది ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ).. భూ కుంభకోణంలో లాలూ ప్రసాద్ యాదవ్ ఆస్తులను ఈడీ జప్తు చేసింది. ఆస్తులలో న్యూ ఫ్రెండ్స్ కాలనీలోని నివాస గృహంతో సహా ఢిల్లీ మరియు పాట్నాలోని లాలూ కుటుంబానికి చెందిన ఆస్తులు ఉండగా.. ఉద్యోగ భూముల కుంభకోణానికి సంబంధించి సీబీఐ.. సోమవారం తన తాజా ఛార్జిషీట్‌లో బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్‌తో పాటు లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన భార్య రబ్రీ దేవి పేర్లను తీసుకున్న ఈ కొత్త పరిణామం చోటు చేసుకుంది.. మరో 14 మంది పేర్లతో కూడిన ఛార్జ్ షీట్ ఈ కేసులో రెండో ఛార్జ్ షీట్ దాఖలు చేసింది సీబీఐ.. ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టులో దాఖలు చేసిన చార్జిషీట్‌లో తేజస్వి యాదవ్, రబ్రీ దేవి లబ్ధిపొందారని సీబీఐ ఆరోపించింది.. ఈ కేసులో లాలూ యాదవ్ కుటుంబ సభ్యులే కాకుండా ఎకె ఇన్ఫోసిస్టమ్స్, పలువురు మధ్యవర్తుల పేర్లను కూడా సీబీఐ పేర్కొంది. సీబీఐ ప్రత్యేక కోర్టులో చార్జిషీటు దాఖలు చేశారు. 2004 నుంచి 2009 వరకు యూపీఏ ప్రభుత్వంలో లాలూ ప్రసాద్ మంత్రిగా ఉన్న సమయంలో ముంబై, జబల్‌పూర్, కోల్‌కతా, జైపూర్, హాజీపూర్‌లలో ఉన్న వివిధ జోనల్ రైల్వేలలో పాట్నాకు చెందిన ప్రత్యామ్నాయాలను నియమించారనేది ఆరోపణ.
పెళ్లి చేసుకుంటానంది.. రూ. కోటి కాజేసింది
బెంగళూరులోని ఆర్‌కే పురానికి చెందిన ఓ వ్యక్తి యూకే (UK)లో సాఫ్ట్‌వేర్ కొలువు చేస్తున్నాడు. ట్రైనింగ్ కోసమని బెంగళూరుకు వచ్చాడు. ఈ సమయంలోనే మంచి అమ్మాయిని చూసి వివాహం చేసుకోవాలని అనుకున్నాడు. ఈ క్రమంలో మ్యాట్రీమోనీలో రిజిస్టర్ అయ్యాడు. సైట్‌లో ఒక యువతితో పరిచయం ఏర్పడింది. నిత్యం ఫోన్లో మాట్లాడుకునేవారు. పెళ్లి చేసుకోవాలని కూడా నిర్ణయించుకున్నారు. తన తండ్రి చనిపోయాడంటూ.. ప్రస్తుతం తల్లితోనే ఉంటున్నానని చెప్పడంతో అతను నిజమేనని విశ్వసించాడు. తన తల్లికి ఆరోగ్యం బాగోలేదని ఆసుపత్రికి వెళ్లేందుకు రూ. 1500లను అప్పుగా ఇవ్వమంటూ ఒక రోజు అతడికి ఫోన్ చేసింది. ఆమె మాటలు నమ్మి డబ్బు పంపించాడు. రెండు రోజుల తర్వాత నగ్నంగా అతడికి వీడియో కాల్ చేసి మాట్లాడింది. ఈ క్రమంలోనే అతడికి తెలియకుండా అదంతా రికార్డు చేసింది. అనంతరం ఆ క్లిపింగ్‌ను అతడికి షేర్ చేసింది. అడిగినంత డబ్బు ఇవ్వకపోతే మీ తల్లిదండ్రులకు పంపిస్తానంటూ.. బెదిరించడం ప్రారంభించింది. అలా రూ. కోటికి పైగా కాజేసింది. యువతి వేధింపులు తాళలేక బాధితుడు సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు ఆమె బ్యాంక్ ఖాతాలను గుర్తించి స్తంభింపజేశారు. ఆ విధంగా రూ. 84 లక్షలను ఆమె వినియోగించడానికి వీలు లేకుండా చేశారు. ‘‘ఇప్పటి వరకు ఆమె రూ. 30 లక్షలు వినియోగించింది. అతడి ఫిర్యాదుతో ఆమె ఖాతాను స్తంభింపజేశాం. గుర్తు తెలియని వ్యక్తులతో ఆన్‌లైన్ లావాదేవీలు జరపకూడదు. మీకు వచ్చే ఫేక్ కాల్స్‌ను నమ్మకండి’’ అంటూ డీసీపీ హెచ్చరించారు.
జియో మరో సంచలనం.. చీప్‌గా ల్యాప్‌టాప్
రిలయన్స్ జియో మరో సంచలనం సృష్టించేందుకు సిద్ధమైంది.. అన్నీ ఫ్రీ అంటూ టెలికం మార్కెట్‌లో సంచలనం సృష్టించింది జియో.. ఆ తర్వాత జియో ఫైబర్‌తోనూ సత్తా చాటింది.. ఇక, ఇప్పుడు జియో బుక్ పేరుతో ల్యాప్‌టాప్‌ను తీసుకొచ్చింది.. జియో బుక్‌లో 4G LTE, Wi-Fi, బ్లూటూత్ 5.0, HDMI పోర్ట్, 3.5mm ఆడియో జాక్ మరియు సిమ్ సపోర్ట్ కూడా పొందుపర్చారు..తాజా జియోబుక్‌లో Mediatek MT 8788 ఆక్టా కోర్ ప్రాసెసర్ ఇవ్వబడింది. ఈ ల్యాప్‌టాప్‌లో, కంపెనీ 4 GB LPDDR4 ర్యామ్‌ను ఇచ్చింది. దీనితో పాటు, ఫోన్ 64GB నిల్వను కలిగి ఉంది, దీనిని 256GB వరకు పెంచుకునే వీలు ఉంటుంది. ఇక, రిలయన్స్ జియో బుక్ ల్యాప్‌టాప్ బ్యాటరీకి సంబంధించిన విషయాల్లోకి వెళ్తే.. ఇది 8 గంటల బ్యాకప్‌ను ఇస్తుంది. దీనితో పాటు, ల్యాప్‌టాప్‌లో యాంటీ-గ్లేర్ HD డిస్‌ప్లే మరియు స్టీరియో స్పీకర్లు అందిస్తోంది.. ల్యాప్‌టాప్‌లో ఇన్ఫినిటీ కీబోర్డ్ మరియు లర్చ్ టచ్‌ప్యాడ్ సపోర్ట్ చేస్తుంది. ఈ ల్యాప్‌టాప్‌లో, 4G కనెక్టివిటీ కోసం సిమ్ కార్డ్ సపోర్ట్ చేయబడింది. ఈ ల్యాప్‌టాప్ కేవలం జియో సిమ్‌కు మాత్రమే సపోర్ట్ చేస్తుంది. జియోబుక్ సిమ్‌ని జియో స్టోర్‌లో కూడా యాక్టివేట్ చేయవచ్చు. దీని కోసం, మీరు మీ జియోబుక్‌ను సమీపంలోని జియో స్టోర్‌కు తీసుకెళ్లాల్సి ఉంటుంది. జియోబుక్ ధర విషయానికి వస్తే.. రిలయన్స్ యొక్క తాజా జియోబుక్‌ను కంపెనీ ప్రారంభ ధర రూ. 16,499గా ప్రకటించింది.. ఈ ల్యాప్‌టాప్‌ను రిలయన్స్ డిజిటల్ స్టోర్ మరియు అమెజాన్ ఇండియా నుండి ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయవచ్చు. అమెజాన్‌లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కార్డులపై కొనుగోలు చేసేవారికి అదనంగా రూ.1,250 తగ్గింపు పొందే అవకాశం ఉంది.
దానిమ్మ గింజలను రాత్రి తీసుకుంటే ఏం జరుగుతుందో తెలుసా?
దానిమ్మ పండ్ల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి..దాదాపు సంవత్సరం పొడవునా ఈ పండ్లు మనకు లభిస్తూ ఉంటాయి. దానిమ్మగింజలు చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. కొందరు దానిమ్మ గింజలను తింటే కొందరు వాటితో జ్యూస్ చేసుకుని తాగుతూ ఉంటారు. దానిమ్మపండ్లను తినడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. వీటిలో ఎన్నో పోషకాలు ఉంటాయి.. అయితే దానిమ్మను రాత్రి పూట కూడా తీసుకోవచ్చా అనేది చాలా మందికి వచ్చే డౌట్.. ఈరోజు మనం దానిమ్మను ఎప్పుడు తీసుకుంటే మంచి ప్రయోజనాలు ఉన్నాయో తెలుసుకుందాం.. దానిమ్మగింజల్లో ఫైబర్, ఐరన్, క్యాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, జింక్, విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ ఇ, విటమిన్ కె, ప్రోటీన్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఇలా అనేక రకాల పోషకాలు ఉంటాయి. దానిమ్మ గింజలను తినడం వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది. వీటిలో ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. మలబద్దకం వంటి సమస్యలు తగ్గుతాయి. అయితే ఈ గింజలను జ్యూస్ గా చేసి తీసుకుంటే మాత్రం వీటిలో ఉండే ఫైబర్ మన శరీరానికి అందదు.. అందుకే గింజలుగా తీసుకోవడం మంచిది..
ఒక్క క్షణంలో చేజారిన క్యాచ్.. అందరు షాక్..!
ఇంగ్లండ్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న యాషెస్ సిరీస్ 5వ టెస్ట్ లో బెన్ స్టోక్ ఓ క్యాచ్ ను పట్టినట్టే పట్టి చేజార్చాడు. మొయిన్ అలీ బౌలింగ్ లో స్టీవ్ స్మిత్ క్యాచ్ ఇవ్వగా.. స్టోక్స్ దానిని డ్రాప్ చేశాడు. దీంతో స్టీవ్ స్మిత్ నాటౌట్ గా నిలిచాడు. స్టీవ్ స్మిత్ బ్యాటింగ్ చేస్తుండగా.. బంతి అతని బ్యాట్‌కు తగిలి లెగ్ స్లిప్ లో ఉన్న బెన్ స్టోక్స్ వద్దకు వెళ్లింది. ఆ బంతిని ఒక చేత్తో క్యాచ్ పట్టినప్పటికీ.. ఆ తర్వాతి క్షణం బంతి చేజారింది. దీంతో అంపైర్ నాటౌట్ ఇచ్చాడు. అయితే బ్యాట్ కు బంతి తాకలేదని.. అంపైర్ నాటౌట్ ఇచ్చాడని ఇంగ్లండ్ ఆటగాళ్లు భావించారు. వెంటనే ఇంగ్లాండ్ కెప్టెన్ స్టోక్స్ డీఆర్ఎస్ తీసుకున్నాడు. అయితే రీప్లేలో బంతి స్మిత్ బ్యాట్‌కు తగిలి స్టోక్స్ క్యాచ్ తీసుకున్నట్లు రీప్లేలో కనిపించింది. అయితే స్టోక్స్ పట్టిన క్యాచ్‌ను థర్డ్ అంపైర్ నిశితంగా పరిశీలించాడు. స్టోక్స్ క్యాచ్ పట్టినప్పటికీ.. దానిని పూర్తి చేయలేకపోయాడు. ఎందుకంటే అతను బంతిని క్యాచ్ పట్టిన తర్వాత మోషన్‌లో ఉన్నప్పుడు.. అతని కుడి చేయి అతని పాదాలను తాకింది. దాంతో బంతి స్టోక్స్ చేతిలో నుండి జారిపోయింది. అంపైర్ దానిని సరైన క్యాచ్‌గా పరిగణించకపోవడంతో నాటౌట్ ఇచ్చాడు.
ఆటిట్యూడ్ తో హిట్ సినిమా వదులుకున్న ఆ హీరో ఎవరు.. ?
బాహుబలి నిర్మాత శోభు యార్లగడ్డ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన సినిమాలు విషయంలో ఎంత నిక్కచ్చిగా మాట్లాడతాడో.. సోషల్ మీడియాలో కూడా తన అభిప్రాయాలను తెలపడానికి ఏ మాత్రం సంకోచించడు. ఇక ప్రస్తుతం ఆయన చేసిన ఒక ట్వీట్ నెట్టింట కలకలం సృష్టిస్తోంది. ఒక యువహీరో ఆటిట్యూడ్ చూపించి.. మంచి హిట్ సినిమాను వదులుకున్నాడని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇక ఆ ట్వీట్ ను వెంటనే డిలీట్ చేయడంతో అసలు ఆ హీరో ఎవరు అని అభిమానులు ఆరా తీయడం మొదలుపెట్టారు. అసలు ఆ ట్వీట్ లో ఏమున్నది అంటే.. ” విజయాలు చాలా జాగ్రత్తగా నడుచుకుంటూనే వస్తాయి. ఇటీవలే మంచి హిట్ అందుకున్న ఒక కొత్త నటుడు.. ఒక డెబ్యూ డైరెక్టర్ స్క్రిప్ట్ చెప్పడానికి వెళ్ళినప్పుడు కనీస గౌరవం చూపలేదు. ఈ వైఖరి అతని కెరీర్‌ను నిర్మించడంలో సహాయపడదని అతను ముందుగానే గ్రహించాడని నేను ఆశిస్తున్నాను” అంటూ ట్వీట్ చేశాడు. అయితే ఆ హీరో ఎవరు అనేది ఆయన మెన్షన్ చేయలేదు. ఇక ఆ హీరో విశ్వక్ సేన్ అంటూ కొందరు కామెంట్స్ పెట్టుకొస్తున్నారు. బేబీ సినిమాను విశ్వక్.. స్క్రిప్ట్ కూడా వినకుండా రిజెక్ట్ చేసాడని డైరెక్టర్ సాయి రాజేష్ చెప్పుకొచ్చాడు. దానికి సమాధానంగా.. స్క్రిప్ట్ విని.. తరువాత నో చెప్పడం కన్నా.. ముందే నో చెప్పాను అని విశ్వక్ తెలిపాడు. దీంతో వీరి గొడవపైనే శోభు స్పందించాడంటూ చెప్పుకొచ్చారు. అయితే ఇది విశ్వక్ సేన్ గురించి కాదని శోభు క్లారిటీ ఇవ్వడంతో ఆ గొడవకు చెక్ పడింది. మరి శోభు చెప్పిన హీరో ఎవరు.. ? ఆ హిట్ సినిమా ఏంటి.. ? అని అభిమానులు ఆరా తీస్తున్నారు. నిజం చెప్పాలంటే ఒకకథను ఒక హీరో రిజెక్ట్ చేయడానికి చాలా కారణాలు ఉంటాయి. ఇలా ఆటిట్యూడ్ తో రిజెక్ట్ చేయడం చాలా రేర్ అని పలువురు అంటున్నారు. మరి ఆ ఆటిట్యూడ్ స్టార్ ఎవరు అనేది తెలియాల్సి ఉంది.
మా ప్రెసిడెంట్ కీలక నిర్ణయం.. అది చేయలేకనేనా.. ?
మంచు విష్ణు ప్రస్తుతం మా ప్రెసిడెంట్ గా విధులు నిర్వర్తిస్తున్న విషయం తెల్సిందే. గతేడాది జరిగిన మా ఎలక్షన్స్ లో మంచు విష్ణు ప్యానెల్ ఎంతటి రచ్చ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రకాష్ రాజ్ ప్యానెల్ ను ఓడించడానికి మంచు విష్ణు ఎంత కష్టపడ్డాడో అందరికి తెల్సిందే. ఇక ఎన్నికల ముందు ఎన్ని హామీలు అయితే చేశాడో.. ఆ హామీలలో ఒక్కటి కూడా నెరవేర్చలేకపోయాడని విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ముఖ్యంగా తాను ప్రెసిడెంట్ అయ్యాక మా బిల్డింగ్ ను నిర్మిస్తామని చెప్పుకొచ్చాడు. కానీ, విష్ణు ప్రెసిడెంట్ గా సంతకం చేసి ఏడాది దాటిపోయింది. ఇప్పటివరకు ఆ బిల్డింగ్ మాట కూడా ఎత్తలేదు. ఇక విష్ణుకు సపోర్ట్ గా నిలబడిన నరేష్ సైతం.. మా బిల్డింగ్ గురించి నన్ను అడగకండి.. విష్ణును అడగండి అని చెప్పేశాడు. దీంతో అందరూ విష్ణునే ప్రశ్నిస్తున్నారు. ఇక ఇప్పటివరకు ఆ హామీలను నిలబెట్టుకోలేకపోయిన విష్ణు ఒక కీలక నిర్ణయం తీసుకున్నాడు అని తెలుస్తోంది. అదేంటంటే.. వచ్చే మా ఎలక్షన్స్ నుంచి మంచు విష్ణు పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నాడట. ఇంకా మా ఎలక్షన్స్ కు సమయం ఉండడంతో ఆలోపు తాను నెరవేరుస్తాను అని చెప్పిన హామీలను అన్ని నెరవేర్చడానికి కృషి చేస్తాడట. అంతేకాకుండా మా బిల్డింగ్ విషయంలో కూడా విష్ణు ఒక కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం అందుతుంది. ఇక ఇందులో ఎలాంటి నిజం ఉంది అనేది తెలియాల్సి ఉంది. ఒకవేళ ఇదే కనుక నిజమైతే.. వచ్చే ఎలక్షన్స్ లో ఎవరు మా ప్రెసిడెంట్ గా నిలబడతారు అనేది ఆసక్తిగా మారింది.
ఫిల్మ్ ఛాంబర్ ప్రెసిడెంట్ గా ప్రమాణస్వీకారం చేసిన దిల్ రాజు..
తెలుగు ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ (టీఎఫ్ సీసీ) నూతన అధ్యక్షుడిగా ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఎన్నిక అయిన విషయం తెల్సిందే. సి. కళ్యాణ్ ప్యానెల్ తో పోటీపడిన దిల్ రాజు ప్యానెల్.. భారీ విజయాన్ని అందుకుంది. ఇక మొట్టమొదటిసారి పోటీచేసి.. ఫిల్మ్ ఛాంబర్ ప్రెసిడెంట్ గా గెలిచి ఔరా అనిపించాడు. ఇక కొద్దిసేపటి క్రితమే దిల్ రాజు.. తెలుగు ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ (టీఎఫ్ సీసీ) నూతన అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశాడు. చిత్ర పరిశ్రమను ముందుకు తీసుకెళ్లడానికి తనవంతు తాను కృషి చేస్తానని హామీ ఇచ్చాడు. ఇక ప్రెసిడెంట్ గా సంతకం చేసిన అనంతరం ఆయనకు ప్యానెల్ సభ్యులు శుభాకాంక్షలు తెలిపారు. కాగా, ఫిల్మ్ చాంబర్ ఉపాధ్యక్షుడిగా ముత్యాల రామరాజు ఎన్నికయ్యారు. కార్యదర్శిగా దామోదర ప్రసాద్ విజయం సాధించారు. టీఎఫ్ సీసీ కోశాధికారిగా ప్రసన్నకుమార్ ఎన్నికయ్యారు. ఇక దిల్ రాజు రెండేళ్లు ఈ పదవిలో కొనసాగనున్నాడు. మొదటి నుంచి కూడా దిల్ రాజు గెలుపును అందరు ఊహించారు. అందుకు కారణం చాలానే ఉన్నాయి. ఎప్పటినుంచో సి. కళ్యాణ్ ప్రెసిడెంట్ గా కొనసాగుతున్నాడు. ఈసారి కొత్త ప్రెసిడెంట్ ను ఎన్నుకొంటే.. ఆయన ఎలా పనిచేస్తాడో చూడాలి అని కొందరు అనుకోగా.. ఇంకొందరు.. టీఎఫ్‌సీసీని బలోపేతం చేసేందుకు ముందుకు వచ్చి పోటీ చేశాను అని దిల్ రాజు చెప్పడం చాలామందిని ఆకర్షించింది. అంతేకాకుండా చిన్న సినిమాలకు అండగా ఉంటాను అని ఆయన ఇచ్చిన హామీ..మిగతా నిర్మాతలకు వరంగా మారింది. ఇవన్నీ కలగలిపి దిల్ రాజును ప్రెసిడెంట్ గా చేసాయి. మరి..హార్ట్ కింగ్ ఇచ్చిన హామీలను ఎంతవరకు నిలబెట్టుకుంటాడో చూడాలి.