మరో రెండు రోజులు భారీ వర్షాలు.. ఈ జిల్లాలపై తీవ్ర ప్రభావం
ఈశాన్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ఆదివారం కూడా కొనసాగింది. ఇది సముద్రమట్టం నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తువరకు విస్తరించి ఉందని.. దీని ప్రభావంతో వాయవ్య బంగాళాఖాతం, పశ్చిమ, మధ్య బంగాళాఖాతంలో సోమవారం అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. అయితే, ఈ అల్పపీడన ప్రభావంతో రానున్న రెండు రోజుల పాటు తెలంగాణ రాష్ట్రంలోని పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది వాతావరణశాఖ.. రాష్ట్రంలోని ఉత్తర ప్రాంత జిల్లాల్లోని కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు, ఒకట్రెండు చోట్ల అత్యంత భారీ వర్షాలు నమోదు అయ్యే అవకాశం ఉందని అంచనా వేసింది.. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షసూచన నేపథ్యంలో ఐఎండీ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ రోజు ఆదిలాబాద్, కొమరం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, జనగాం, సిద్దిపేట ప్రాంతాల్లో ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. ఇక, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది వాతావారణశాఖ.. కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. మరోవైపు.. ఏపీలోనూ పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్న విషయం విదితమే. ఇక, వర్షం కారణంగా నేడు రాయలసీమ జోన్ ఎస్సై అభ్యర్థుల దేహదారుఢ్య పరీక్షలు వాయిదా వేశారు.. ఇవాళ జరగాల్సిన దేహదారుఢ్య పరీక్షలు.. ఈనెల 21 తేదీకి వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు ఉన్నతాధికారులు.
పోలీసుల ముందే బైక్‌కు నిప్పు పెట్టిన వ్యక్తి.. కారణం ఏంటంటే?
డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుపడితే.. కొందరు పోలీసుల నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నిస్తారు లేదా వాగ్వాదానికి దిగుతారు. అయితే ఓ వ్యక్తి మాత్రం తన ద్విచక్ర వాహనానికి ట్రాఫిక్ పోలీసుల ఎదుటే నిప్పు అంటించాడు. మంటలను ఆర్పిన పోలీసులు వాహనాన్ని సీజ్ చేసి స్టేషన్‌కు తరలించారు. ఈ ఘటన తెలంగాణలోని వరంగల్‌లో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. వరంగల్ ట్రాఫిక్ ఎస్సై రవి ఆధ్వర్యంలో శనివారం రాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. శివనగర్ ప్రాంతానికి చెందిన పులిశేరు శివ పూటుగా మద్యం తాగి తన ద్విచక్ర వాహనంపై వస్తున్నాడు. పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేస్తున్నారని గ్రహించిన శివ.. ప్రధాన తపాలా కేంద్రం కూడలి రహదారి పక్కన ద్విచక్ర వాహనం నిలిపి రోడ్డు దాటుతుండగా పోలీసులు పట్టుకున్నారు. మద్యం తాగి వాహనం నడుపుతూ వచ్చావని, కేసు నమోదు చేస్తామని పోలీసులు అందడంతో శివ ఆవేశానికి గురయ్యాడు.
అసహజ శృంగారానికి ఒత్తిడి.. కర్రలతో కొట్టి చంపిన మైనర్లు..
విజయవాడలో దారుణమైన ఘటన చోటు చేసుకుంది.. అసహజ శృంగారం కోసం ఒత్తిడి చేస్తున్నాడని ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేశారు మైనర్లు.. అయితే, ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.. ఘోర పార్కులో తాగిన మైకంలో.. అక్కడే ఉన్న మైనర్లపై అసహజ లైంగిక దాడికి ప్రయత్నించాడో వ్యక్తి.. లైంగికంగా అనేకరకాలుగా తమను ఇబ్బంది పెడుతున్నాడని.. తాగిన మైకంలో ఉన్న ఆ వ్యక్తిపై కర్రలతో దాడి చేశారు ఇద్దరు మైనర్లు. అక్కడి నుంచి పరారయ్యారు.. అయితే, గత నెల 30వ తేదీన ఘోర పార్క్ లో గుర్తుతెలియని మృతదేహాన్ని గుర్తించి విచారణ చేపట్టారు పోలీసులు.. మృతుడి శరీరంపై రక్తపు గాయాలతో ఉండడంతో దర్యాప్తును సవాల్‌గా తీసుకున్నారు.. అయితే, పోలీసుల విచారణలో అసలు వ్యవహారం బయటపడింది.. సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా ఇద్దరు మైనర్లను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అయితే, తమపై అనేక రకాలుగా లైంగిక దాడికి ప్రయత్నిస్తూ ఇబ్బంది పెట్టడంతో.. తట్టుకోలేక కర్రలతో కొట్టి వెళ్లిపోయినట్లు పోలీసుల విచారణలో ఆ ఇద్దరు మైనర్లు ఒప్పుకున్నట్టుగా తెలుస్తోంది.. అయితే, హత్యకు గురైన వ్యక్తి ఎవురు? ఎక్కడి నుంచి వచ్చాడు? అనే విషయాలపై ఆరా తీస్తున్నారు ఈ కేసు దర్యాప్తు చేస్తున్న గవర్నర్ పేట పోలీసులు. కాగా, ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది.
ఇస్రోలో విషాదం.. మూగబోయిన కౌంట్ డౌన్ స్వరం
ఆమె గొంతు ఎంతో ప్రత్యేకం. భారత అంతరిక్ష సంస్థ(ఇస్రో) సాధించిన ఎన్నో విజయాలు ఆమె గొంతులోనే మొదలయ్యారు. అలాంటి గొంతు మూగబోయింది. దీంతో ఇస్రోలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇస్రోలో రాకెట్ ప్రయోగానికి కొన్ని గంటల ముందు కౌంట్ డౌన్ ప్రారంభం అవుతుంది. అప్పుడు మనకు ఒక గొంతు వినిపిస్తుంది. ఆ గొంతు ఎప్పటికీ మనకు గుర్తుండి పోతుంది. అయితే ఆ వాయిస్ ఇచ్చేది ఎవరో కాదు ఇస్రో సైంటిస్ట్ వలార్మతి. ఇస్రో ప్రయోగించిన ఎన్నో రాకెట్ల కౌంట్ డౌన్ కోసం ఆమె వాయిస్ అందించారు. తాజాగా చంద్రయాన్ 3 కూడా ఆమె వాయిస్ తో కౌంట్ డౌన్ చెప్పిన తరువాతే నింగిలోకి దూసుకు వెళ్లింది. అలాంటి వలార్మతి గుండెపోటుతో మరణించారు. ఇస్రో నుంచి రిటైరైన వలర్మాతి చైన్నెలో తన నివాసంలో ఉంటున్నారు. శనివారం గుండెపోటు రావడంతో ఆమెను ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడే ఆమె తుది శ్వాస విడిచారు. వలర్మాతి చనిపోయిన వార్తతో ఇస్రోలో విషాద ఛాయలు అలముకున్నాయి.
మైక్రోసాఫ్ట్ సంచలన నిర్ణయం.. 30 ఏళ్ల చరిత్ర కలిగిన ‘వర్డ్‌ప్యాడ్’ మాయం..!
ఎన్నో కొత్త కొత్త సాఫ్ట్‌వేర్‌లు వచ్చినా.. కొన్ని పాతవాటికి ఎప్పటికీ ప్రాధాన్యత తగ్గదు.. అందులో వర్డ్‌ప్యాడ్ ఒకటి.. ఏది టైప్ చేయాలనుకున్నా.. మొదట వర్డ్‌ప్యాడ్ ఓపెన్ చేస్తుంటారు.. అయితే, త్వరలోనే ఆ వర్డ్‌ప్యాడ్ మాయం కాబోతోంది.. ‘వర్డ్‌ప్యాడ్’కు ముగింపు పలకబోతున్నట్టు మైక్రోసాఫ్ట్ సంచలన ప్రకటన చేసింది.. విండోస్ 95తో పరిచయమైన ‘వర్డ్‌ప్యాడ్’ గత 30 ఏళ్లుగా ఎంతో ఆదరణ పొందింది.. డాక్యుమెంట్ రైటింగ్‌లో విరివిగా వినియోగించే వర్డ్‌ప్యాడ్.. ఇక తెరమరుగుకాబోతోంది. అంటే.. ఇప్పటికే వినియోగంలో ఉన్న విండోస్ వెర్షన్లలో ‘వర్డ్‌ప్యాడ్’ అందుబాటులో ఉన్నా.. భవిష్యత్‌లో రాబోయే వర్షన్లలో వర్డ్‌ప్యాడ్ కనిపించదు.. అన్ని అప్‌డేట్ అయినట్టే.. వర్డ్‌ప్యాడ్ కూడా అప్‌డేట్ వెర్షన్ వస్తుందని అనుకుంటున్నారేమో.. అది కూడా రాబోదు. అయితే, దీని స్థానంలో ‘మైక్రోసాఫ్ట్ వర్డ్’ను ఉపయోగించుకోవాలని ఆ సంస్థ ఓ ప్రకటనలో పేర్కొంది. కాగా, ఇటీవలే సరికొత్త ఆప్షన్లతో అప్‌గ్రేడ్ వెర్షన్ ‘నోట్‌ప్యాడ్’ను విడుదల చేసిన మైక్రోసాఫ్ట్.. ఇప్పుడు అసలు వర్డ్‌ప్యాడ్ ఉండదంటూ ప్రకటించింది యూజర్లకు షాక్ ఇచ్చింది. మైక్రోసాఫ్ట్ ఆటోసేవ్ మరియు ట్యాబ్ ఉపసంహరణ వంటి ఫీచర్లతో నోట్‌ప్యాడ్‌ను అప్‌గ్రేడ్ చేస్తున్నట్లు ప్రకటించిన ఒక రోజు తర్వాత WordPad తొలగిస్తున్నట్టు పేర్కొంది. విండోస్ 11లోని విండోస్ నోట్‌ప్యాడ్ యాప్ 2018లో సంవత్సరాలలో మొదటిసారిగా నవీకరించబడింది మరియు ట్యాబ్‌లు జోడించారు. ఇక, గత నెల, iOS మరియు Android తర్వాత, మైక్రోసాఫ్ట్ ఇప్పుడు విండోస్ 11లో దాని డిజిటల్ అసిస్టెంట్ కోర్టానా యాప్‌ను మూసివేస్తున్నట్లు ప్రకటించింది. విండోస్‌లో Cortana స్వతంత్ర యాప్‌గా నిలిపివేయబడినప్పటికీ, Teams Mobile, Microsoft Teams Display మరియు Microsoft Teamsలో Cortanaకి మద్దతు నిలిపివేయబడింది. మరోవైపు.. ఎక్స్‌ప్లోరర్ సెట్టింగ్‌ల సంఖ్యను తగ్గించే ప్రయత్నంలో మైక్రోసాఫ్ట్ ఫైల్ ఎక్స్‌ప్లోరర్‌లోని ఫోల్డర్ ఎంపికల క్రింద కొన్ని పాత సెట్టింగ్‌లను కూడా తీసివేసింది.
నేడు నేపాల్‌తో భారత్ కీలక మ్యాచ్.. సూపర్-4 లక్ష్యంగా బరిలోకి రోహిత్ సేన! బుమ్రా దూరం
ఆసియా కప్ 2023లో భారత్ మరో కీలక మ్యాచ్‌కు సిద్ధమైంది. పసికూన నేపాల్‌తో రోహిత్ సేన తలపడనుంది. విజయంతో టోర్నీలో శుభారంభం చేయడమే కాకుండా.. గ్రూప్-ఏలో సూపర్-4 బెర్తు దక్కించుకోవాలన్న పట్టుదలతో టీమిండియా ఉంది. అయితే ఈ మ్యాచ్‌కు వర్షం ముప్పు ఉంది. ఒకవేళ వర్షం కారణంగా భారత్, నేపాల్ మ్యాచ్ రద్దయినా.. 2 పాయింట్లతో టీమిండియా ముందంజ వేస్తుంది. ఎందుకంటే ఇప్పటికే పాకిస్తాన్ చేతిలో నేపాల్ ఓటమి పాలైంది. ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. పాకిస్థాన్ మ్యాచ్‌లో భారత్ టాప్ ఆర్డర్ బ్యాటింగ్ సజావుగా సాగలేదు. పాక్‌పై విఫలమైన కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ భారీ ఇన్నింగ్స్ ఆడాలని మేనేజ్మెంట్ ఆశిస్తోంది. తరచుగా విఫలమవుతున్న ఓపెనర్ శుభ్‌మన్ గిల్ కూడా ఫామ్ అందుకోవడానికి ఇదే మంచి అవకాశం. గాయం నుంచి కోలుకుని పునరాగమంలో విఫలమైన శ్రేయస్ అయ్యర్ కూడా పరుగులు చేసేందుకు నేపాల్ మ్యాచ్ ఉపదయోగపడనుంది. పాక్‌పై అద్భుతంగా ఆడిన ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యాలపై అంచనాలు పెరిగాయి. ప్రపంచకప్ 2023 ఉన్న నేపథ్యంలో అందరూ రన్స్ చేస్తే జట్టులో ఆత్మవిశ్వాసం పెరగనుంది. పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో వర్షం కారణంగా బౌలింగ్ చేసే ఛాన్స్ భారత బౌలర్లు దక్కలేదు. దాంతో నేపాల్‌పై ఎలా రాణిస్తారో చూడాలి. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా వ్యక్తిగత కారణాలతో ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడు. బుమ్రా స్థానంలో సీనియర్ పేసర్ మహ్మద్ షమీ తుది జట్టులోకి రానున్నాడు. షమీ, మొహ్మద్ సిరాజ్ బౌలింగ్‌ను అడ్డుకోవడం నేపాల్ బ్యాటర్లకు కష్టమే. మరోవైపు ఫామ్‌లో ఉన్న మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ చెలరేగితే నేపాల్‌కు ఇబ్బందులు తప్పవు. ఇక ఐపీఎల్‌లో ఆడిన స్పిన్నర్ సందీప్ లమిచానె నేపాల్ జట్టులో మంచి ఆటగాడు. కెప్టెన్ రోహిత్ పౌడెల్, కుశాల్ బర్తెల్ కూడా మంచి బ్యాటర్లు. వీరు భారత్‌ను ఏమాత్రం ప్రతిఘటిస్తారో చూడాలి.
బిగ్‌బాస్ సీజన్ 7 కంటెస్టెంట్స్ జాబితా ఇదే.. ఈసారి ఎవరెవరున్నారంటే?
ప్రముఖ రియాల్టీ షో ‘బిగ్‌బాస్’ ఇప్పటివరకు తెలుగులో ఆరు సీజన్లు పూర్తి చేసుకోగా.. ఆదివారం (సెప్టెంబర్ 3) ఏడో సీజన్ అట్టహాసంగా ఆరంభమైంది. టాలీవుడ్ కింగ్ నాగార్జున మరోసారి హోస్ట్‌గా వచ్చారు. ‘ఈ సీజన్‌లో అన్నీ ఉల్టా పల్టా’ అంటూ ఇన్ని రోజులు ఆసక్తి రేకెత్తించిన నాగ్.. తొలుత హౌస్‌లోకి వచ్చి విశేషాలు పంచుకున్నారు. ఆపై కంటెస్టెంట్‌లను పరిచయం చేశారు. ఇక నాగార్జున తన సరికొత్త గెటప్, తనదైన చమత్కారాలతో ఏడో సీజన్ గ్రాండ్ లాంచ్ ఎపిసోడ్‌ని చాలా ఎంటర్‌టైనింగ్‌గా నడిపించారు. సీజన్-7లో భాగంగా తొలి కంటెస్టెంట్ ‘జానకి కలగనలేదు’ సీరియల్ నటి ప్రియాంక జైన్ హౌసులోకి అడుగుపెట్టారు. రెండో కంటెస్టెంట్‌గా మాజీ హీరో శివాజీ ప్రవేశించారు. మూడో కంటెస్టెంట్‌గా సింగర్ దామిని రాగా.. నాలుగో కంటెస్టెంట్‌గా ప్రిన్స్ యావర్ వచ్చాడు. ఆపై శుభశ్రీ, షకీలా, ఆట సందీప్, శోభా శెట్టి, టేస్టీ తేజ, రతిక రోజ్, గౌతమ్ కృష్ణ, కిరణ్ రాథోడ్, పల్లవి ప్రశాంత్, అమర్‌దీప్ బిగ్‌బాస్ హౌసులోకి అడుగుపెట్టారు.
వాయిదా లేదు… చెప్పిన డేట్ కే డైనోసర్ వస్తుంది…
గత కొన్ని రోజుల్లో ఇండియాలో వినిపిస్తున్న ఒకేఒక్క పేరు ‘సలార్’. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ మూవీ సెప్టెంబర్ 28న రిలీజ్ కావాల్సి ఉంది. ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేసి, ట్రైలర్ రిలీజ్ చేసి ప్రమోషన్స్ ని కిక్ స్టార్ట్ చేస్తారు అనుకుంటున్న టైములో సలార్ సినిమా వాయిదా పడిందనే మాట వినిపిస్తోంది. దీంతో పాన్ ఇండియా మొత్తం ఒక్కసారిగా కంపించింది. సలార్ సినిమా వస్తుందనే సెప్టెంబర్ 28న ఏ సినిమా రిలీజ్ చేయకుండా అన్ని ఇండస్ట్రీల ఫిల్మ్ మేకర్స్ వేరే డేట్ ని చూసుకున్నారు. ఇలాంటి సమయంలో రిలీజ్ కి మరో మూడు వారాలు మాత్రమే ఉంది అనగా ఇలా సలార్ వాయిదా పడింది అంటే ఏ సినిమా సెప్టెంబర్ 28న రిలీజ్ చేయాలి? అనే డైలామాలో ఇండస్ట్రీ వర్గాలు ఉన్నారు. ఇది చాలదన్నట్లు ఇకపై రాబోయేది ఫెస్టివల్ సీజన్… దసరా, దీపావళి, సంక్రాంతి… ఈ సీజన్స్ లో రిలీజ్ అవ్వాల్సిన సినిమాలు ఇప్పటికే లాక్ అయిపోయాయి. ఇప్పుడు సలార్ ఆ ఫెస్టివల్ సీజన్స్ లో ఏ సీజన్ ని టచ్ చేసినా కూడా మిగిలిన సినిమాలకి నష్టం తప్పదు. అందుకే సలార్ సినిమా వాయిదా పడడం అనేది తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీపైనే కాదు మొత్తం ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీపైన ఇంపాక్ట్ చూపించింది. అయితే కొంతమంది మాత్రం హోంబలే ఫిల్మ్స్ నుంచి సలార్ వాయిదా పడింది అనే విషయంలో ఇంకా అఫీషియల్ కన్ఫర్మేషన్ రాలేదు. ప్రొడ్యూసర్స్ చెప్పలేదు అంటే సినిమా వాయిదా పడకుండా చెప్పిన డేట్ కే రిలీజ్ అవుతుంది అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ఆ కామెంట్స్ నిజమై సలార్ సెప్టెంబర్ 28నే రిలీజ్ అయితే చూడాలని ప్రభాస్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.