శ్రీవారి భక్తులకు అలర్ట్..
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారి భక్తులు అప్రమత్తం కావాల్సిన సమయం వచ్చేసింది.. ఆగస్టు నెలకు సంబంధించిన దర్శనం టికెట్లతో పాటు.. వివిధ రకాల సేవా టికెట్లను విడుదల చేసేందుకు సిద్ధం అయ్యింది తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ).. ఇవాళ్టి నుంచి ఈ నెల 27వ తేదీ వరకు ఆన్ లైన్ లో ఆగస్టు నెలకు సంబంధించిన దర్శన టికెట్లు విడుదల చేయనున్నారు టీటీడీ.. ఇక, ఇవాళ నుంచి ఎల్లుండి ఉదయం 10 గంటలకు వరకు ఆర్జిత సేవలకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది.. ఎల్లుండి మధ్యహ్నం 12 గంటలకు లక్కిడిఫ్ విధానంలో ఆర్జిత సేవా టికెట్లు కేటాయించనున్నారు.. ఇక, తిరుమల పద్మావతి పరిణయోత్సవాలు రెండోరోజుకు చేరుకున్నాయి.. ఇవాళ గరుడ వాహనంపై ఉరేగింపుగా నారాయణగిరి ఉద్యానవనానికి చేరుకోనున్నారు శ్రీవారు.. ఈ నేపథ్యంలో.. ఇవాళ ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకరణ సేవలు రద్దు చేస్తున్నట్టు టీటీడీ ప్రకటించింది.. మరోవైపు తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది.. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్టుమెంట్లు నిండి.. వెలుపల క్యూ లైనులో పెద్ద సంఖ్యల్లో వేచిఉన్నారు భక్తులు.. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతుంది.. మరోవైపు.. నిన్న శ్రీవారిని 71,510 మంది భక్తులు దర్శించుకున్నారు.. 43,199 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు.. హుండీ ఆదాయం రూ.3.63 కోట్లుగా పేర్కొంది టీటీడీ.
సీమలో మూడు చోట్ల ప్రమాదాలు.. ఆరుగురు మృతి
అనంతపురంలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది.. గుత్తి మండలం బాచుపల్లి సమీపంలోని 44 నెంబర్ జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదంలో నలుగురు మృతి చెందారు.. కారు – లారీ ఢీకొనడగా… ఘటనా స్థలంలోనే నలుగురు మృతి చెందారు.. ఈ ప్రమాదంలో మరో ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా.. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు చెబుతున్నారు.. మృతులంతా అనంతపురంలోని రాణి నగర్ వాసులుగా గుర్తించారు పోలీసులు.. క్షతగాత్రులను గుత్తి ఆసుపత్రికి తరలించారు.. హైదరాబాద్ – బెంగుళూరు జాతీయ రహదారిపై ఈ ఘటన జరిగింది.. అయితే, ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. ఇక, కడప జిల్లా ముద్దనూరులో లోడుతో వెళ్తున్న లారీ బీభత్సం సృష్టించింది.. ముద్దనూరు లోని రైల్వ్ గేటు సైతం తుంచుకొని వెళ్లి చలపతి అనే అతని ఇంటిలోకి దూసుకెళ్లింది లారీ.. ఇంటిలోకి లారీ దూసుకెళ్లడంతో లారి ముందుభాగం తీవ్రంగా దెబ్బంది.. దీంతో.. లారీ డ్రైవర్ అక్కడికి అక్కడే మృతి చెందాడు.. గతంలో కూడా ఇదే ప్రాంతంలో.. ఇతే తరహాలో ప్రమాదం జరిగినట్టు స్థానికులు చెబుతున్నారు.. వేరే లారి ఇంటిని ఢీకొట్టగా అప్పుడు జరిగిన ప్రమాదంలో కూడా డ్రైవర్ మృతి చెందారు.. కేసునమోదు చేసి ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. మరోవైపు.. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం ఐతేపల్లి జాతీయ రహదారిపై మరో రోడ్డు ప్రమాదం జరిగింది.. ముందు వెళ్తున్న వాహనాన్ని అతివేగంగా వెళ్లి ఢీకొట్టింది కారు.. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న మల్లవరానికి చెందిన ప్రదీప్ మృతి చెందాడు.
ఇంటర్ హాల్ టికెట్లు విడుదల.. మే 24 నుంచి పరీక్షలు..
తెలంగాణలో ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల హాల్ టిక్కెట్లను ఇంటర్మీడియట్ బోర్డ్ విడుదల చేసింది. హాల్ టిక్కెట్లను అధికారిక వెబ్‌సైట్‌లో మే 17న అందుబాటులో ఉంచారు. విద్యార్థులు తమ రోల్ నంబర్, పుట్టిన తేదీ వివరాలను నమోదు చేయడం ద్వారా హాల్ టిక్కెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇంటర్మీడియట్ బోర్డ్ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం మే 24 నుంచి జూన్ 3 వరకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగగా.. ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు జరుగుతాయి. ఇక జూన్ 4 నుండి 8 వరకు విద్యార్థులకు ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించబడతాయి. కాగా.. మొదటి సెషన్‌లో ఉదయం 9 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు మరియు రెండవ సెషన్‌లో మధ్యాహ్నం 2 నుండి సాయంత్రం 5 గంటల వరకు ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించబడతాయి. ఇక ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులకు జూన్ 10న ఇంగ్లీష్ ప్రాక్టికల్ పరీక్ష నిర్వహిస్తారు. ఉదయం 9 గంటల నుంచి పరీక్ష నిర్వహించనున్నారు. పర్యావరణ విద్య పరీక్ష జూన్ 11న నిర్వహించబడుతుంది మరియు ఎథిక్స్, హ్యూమన్ వాల్యూస్ పరీక్ష జూన్ 12న నిర్వహించబడుతుంది. ఆ తేదీల్లో ఉదయం 10 నుండి మధ్యాహ్నం 1 గంటల వరకు పరీక్షలు నిర్వహించబడతాయి.
నేడు రైతు సమస్యలపై బీజేపీ రణభేరీ..
కరీంనగర్ పార్లమెంటరీ నియోజకవర్గంలో రైతుల సమస్యలపై బీజేపీ రణభేరీ మోగించింది. 6 హామీల అమలుపై కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని బీజేపీ నిర్ణయించింది. మరోవైపు రైతుల సమస్యల పరిష్కారమే ప్రధాన ఎజెండాలో భాగంగా బీజేపీ శ్రేణులు తమ ప్రాంతాల్లోని వడ్ల కల్లాలను సందర్శించి రైతులకు అండగా నిలవాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు నిర్ణయించారు. అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని బీజేపీ ఆరోపిస్తోంది. ప్రకృతి వైపరీత్యాలను అధిగమించి పండించిన వరి పంటను కల్లాలకు తీసుకువచ్చి రోజులు గడుస్తున్నా.. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని కల్లాల పర్యటనకు బీజేపీ నిర్ణయం తీసుకున్నారు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని మండల కమిటీలు, ముఖ్యనేతలతో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్‌కుమార్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. అకాల వర్షాల వల్ల పంటలు నష్టపోయిన రైతుల వివరాలను సేకరించేందుకు నాయకులు వడ్ల కల్లాలో పర్యటించాలని సూచించారు. అందువల్ల ప్రభుత్వం పంట నష్టం వివరాలను సేకరించి వరి పరిస్థితి, అరుగు, తేమతో సంబంధం లేకుండా వరిని కొనుగోలు చేయాలని ఒత్తిడి చేయాలన్నారు. కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు అన్ని రకాల ధాన్యానికి క్వింటాల్‌కు రూ.500 బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేయాలన్నారు. వచ్చే వానాకాలం నుంచి రైతులకు, కౌలు రైతులకు ఎకరాకు 15 వేలు, రైతు కూలీలకు ఎకరాకు 12 వేలు ఇచ్చే వరకు ప్రభుత్వంపై వివిధ రూపాల్లో నిరసన తెలపాలని సూచించారు. రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేయాలంటే దాదాపు 35 వేల కోట్ల నిధులు అవసరమని, ఆ నిధులు రాష్ట్ర ప్రభుత్వం వద్ద లేవని అన్నారు. వీటితో పాటు ఆరు హామీల అమలుకు మరో లక్ష కోట్ల రూపాయలు అవసరమవుతాయని చెప్పారు.
నేడు క్యాబినెట్ భేటీ.. వ్యవసాయ రంగంపై ప్రధాన చర్చ?
కొద్దిరోజుల విరామం తర్వాత తెలంగాణ మంత్రివర్గం నేడు సమావేశం కానుంది. సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. రాష్ట్ర పునర్విభజన జరిగి పదేళ్లు కావస్తున్నందున పునర్విభజన చట్టానికి సంబంధించి పెండింగ్‌లో ఉన్న అంశాలు, తెలంగాణ, ఏపీ మధ్య అపరిష్కృతంగా ఉన్న సమస్యలపై మంత్రివర్గంలో చర్చించనున్నారు. ధరణి సమస్యలపై ప్రధానంగా చర్చించనున్నారు. ఉద్యోగుల విభజన, ఆస్తులు, అప్పులపై నివేదిక ఇవ్వాలని సీఎం రేవంత్ ఇప్పటికే అధికారులను ఆదేశించారు. ఉద్యోగుల బదిలీల సమస్యను ఇరు రాష్ట్రాల సమన్యాయంతో పరిష్కరించాలన్నారు సీఎం రేవంత్. క్లిష్టమైన సమస్యలపై రాష్ట్ర ప్రయోజనాలను పరిరక్షించేలా కార్యాచరణ ఉండాలన్నారు. ఇందుకు సంబంధించి మంత్రివర్గంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. అలాగే ఆగస్టు 15లోగా రైతుల రుణాలను మాఫీ చేయాలని ఇప్పటికే ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించగా.. సంబంధిత నిధుల సమీకరణపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. తెలంగాణలో దాదాపు 40 లక్షల మంది రుణమాఫీ కోసం ఎదురుచూస్తున్నారు. రూ. 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఇందుకోసం రూ. 34 వేల కోట్ల వరకు నిధులు అవసరమవుతాయని అంచనా. రైతుల సంక్షేమం, అభివృద్ధికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని, రుణమాఫీ చేస్తామని రేవంత్ రెడ్డి చెబుతున్నారు. ఇంత పెద్ద మొత్తంలో నిధులు ఎక్కడి నుంచి వస్తాయనే దానిపై రేవంత్‌కి క్లారిటీ ఉందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలన్నారు. ఆ దిశగానే నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ధాన్యం సేకరణ పురోగతిని సమీక్షించి తదుపరి ఖరీఫ్ పంటల ప్రణాళికపై చర్చించనున్నారు. రాష్ట్ర ఆదాయాన్ని పెంచే దిశగా వనరుల సమీకరణ, ఆదాయాన్ని పెంచే ప్రత్యామ్నాయాలపై మంత్రివర్గం చర్చించనుంది. కూలిపోయిన మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల మరమ్మతులకు సంబంధించి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇటీవల మధ్యంతర నివేదికను సమర్పించింది.
ప్రభుత్వం పై నమ్మకం లేదు.. 24గంటలూ ఈవీఎంలకు కాపలాగా నాయకులు
ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్‌లో సమాజ్‌వాదీ పార్టీ భారత కూటమి అభ్యర్థి జ్యోత్స్నా గోండ్, దాద్రౌల్ అసెంబ్లీ నియోజకవర్గం ఉపఎన్నికలో ఎస్పీ అభ్యర్థి అవధేష్ వర్మతో పాటు జిల్లా అధ్యక్షుడు, సమాజ్‌వాదీ పార్టీ నేతలంతా ప్రస్తుతం బలంగా ఉన్నారు. రౌజ మండి పరిషత్‌లో ఏర్పాటు చేసిన ఓట్ల లెక్కింపు వేదికపై 24 గంటలూ డ్యూటీ చేస్తూ పగలు, రాత్రి పగలు కాపలా కాస్తున్నారు. స్ట్రాంగ్‌రూమ్‌లో ఉంచిన ఈవీఎం యంత్రాలను పర్యవేక్షించేందుకు ఎస్పీ తన మంచాన్ని ఉంచారు. ఎస్పీ జిల్లా అధ్యక్షుడు తన్వీర్ ఖాన్ మాట్లాడుతూ.. ప్రస్తుతం రాష్ట్ర, దేశ ప్రభుత్వాలపై ప్రజలకు నమ్మకం పోయిందని, దేశం, రాష్ట్ర ప్రభుత్వంపై నమ్మకం పోవడంతో పరిపాలనతోపాటు పర్యవేక్షణలో కూడా నిమగ్నమై ఉన్నామన్నారు. జిల్లా ఎన్నికల అధికారి ఉమేష్ ప్రతాప్ సింగ్ స్ట్రాంగ్ రూమ్‌ను పర్యవేక్షించేందుకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేయగా, దీనితో పాటు భారీ సంఖ్యలో పోలీసులు, పారామిలటరీ సిబ్బందిని మోహరించారు. పక్షి కూడా దూరకుండా ప్రతి సందు భద్రతా సిబ్బంది నిరంతర నిఘాలో ఉంటుంది. జూన్ 4న ఓట్ల లెక్కింపు జరిగే వరకు స్ట్రాంగ్‌రూమ్‌లోకి వెళ్లేందుకు ఎవరినీ అనుమతించరు. అయితే షాజహాన్‌పూర్‌లోని ఈ చిత్రం స్ట్రాంగ్‌రూమ్‌ను కాపలాగా ఉంచింది ఏర్పాటు. ఉత్తరప్రదేశ్‌లోని ఐదో దశలో లక్నో, మోహన్‌లాల్ గంజ్, రాయ్ బరేలీ, అమేథీ, జలౌన్, ఝాన్సీ, హమీర్‌పూర్, బందా, ఫతేపూర్, కౌశంబి, బారాబంకి, ఫైజాబాద్, కైసర్‌గంజ్, గోండాలలో ఓటింగ్ జరగనుంది. ఈ సీట్లన్నిటితో పాటు అందరి చూపు అమేథీ, రాయ్‌బరేలీపైనే ఉంది. ఈ రెండు స్థానాలూ కాంగ్రెస్‌కు కంచుకోటలుగా నిలిచాయి. అయితే, ఈసారి అమేథీ నుంచి కిషోరి లాల్ శర్మను కాంగ్రెస్ పోటీకి దించగా, రాహుల్ గాంధీ స్వయంగా రాయ్‌బరేలీ నుంచి పోటీలో ఉన్నారు. ఈ క్రమంలో శుక్రవారం (మే 17) రాహుల్ గాంధీ, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్‌తో కలిసి కిషోరీ లాల్ శర్మకు ప్రచారం చేసేందుకు అమేథీ చేరుకున్నారు.
ఆఫ్ఘనిస్తాన్‌లో కాల్పులు కలకలం.. నలుగురి కాల్చివేత
ఆఫ్ఘనిస్తాన్‌లోని బమియాన్ ప్రావిన్స్‌లో ముష్కరులు ముగ్గురు విదేశీయులతో సహా నలుగురిని కాల్చిచంపారు. విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. పరిస్థితి విషమించడంతో స్థానిక ఆస్పత్రిలో చేర్పించారు. శుక్రవారం అర్థరాత్రి సెంట్రల్ ఆఫ్ఘనిస్తాన్‌లో పలువురు ముష్కరులు కాల్పులు జరిపారని, ముగ్గురు విదేశీ పౌరులతో సహా కనీసం నలుగురు వ్యక్తులు మరణించారని తాలిబాన్ ప్రతినిధి తెలిపారు. ప్రధాన పర్యాటక ప్రాంతమైన బమియాన్ ప్రావిన్స్‌లో ఘటనా స్థలంలో నలుగురు అనుమానితులను అరెస్టు చేశామని, విచారణ కొనసాగుతోందని అధికారి తెలిపారు. సాయంత్రం జరిగిన ఈ దాడికి ఎవరూ వెంటనే బాధ్యత వహించలేదు. తాలిబాన్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి అబ్దుల్ మతీన్ కని ప్రకారం… దాడిలో నలుగురు విదేశీయులతో సహా మరో ఏడుగురు గాయపడ్డారని తెలిపారు. 20 సంవత్సరాల యుద్ధం తర్వాత అమెరికా, నాటో దళాలు దేశం నుంచి ఉపసంహరించుకునే చివరి వారాల్లో ఉన్నందున, ఆగష్టు 2021లో ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబాన్ అధికారాన్ని స్వాధీనం చేసుకుంది. నాలుగు, ఆరవ శతాబ్దాల మధ్య రాతిలో చెక్కబడిన, 2001 ప్రారంభంలో అల్-ఖైదా ఆదేశాల మేరకు తాలిబాన్‌లచే ధ్వంసం చేయబడిన రెండు పెద్ద బుద్ధ విగ్రహాల ప్రదేశంగా బమియాన్ బాగా ప్రసిద్ధి చెందింది.
చిన్నస్వామి స్టేడియంలో బెస్ట్ సబ్‌ఎయిర్ సిస్టమ్.. అరగంటలో మైదానం సిద్ధం! కానీ..
ప్రస్తుతం అందరి చూపు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్‌పైనే. ఐపీఎల్ 2024 ప్లేఆఫ్స్‌లో మిగిలిన ఏకైక బెర్తును ఏ జట్టు సొంతం చేసుకుంటుందో అని క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచుస్తున్నారు. ప్లేఆఫ్స్‌కు చేరాలంటే.. బెంగళూరు, చెన్నై జట్లకు గెలుపు తప్పనిసరి. అయితే చెన్నై గెలిస్తే చాలు కానీ.. రన్‌రేట్‌లో వెనకబడ్డ బెంగళూరు భారీ తేడాతో గెలవాల్సి ఉంది. ఈ కీలక మ్యాచ్ పూర్తిగా సాగుతుందా? అన్నది ఇప్పుడు అనుమానంగా మారింది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగే బెంగళూరు, చెన్నై మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉంది. శనివారం రాత్రి 8 నుంచి 11 మధ్య బెంగళూరులో వర్షం పడేందుకు 75 శాతం అవకాశముందని అక్కడి వాతావరణ శాఖ తెలిపింది. దాంతో మ్యాచ్‌పై నీలినీడలు కమ్ముకున్నాయి. అయితే చిన్నస్వామి స్టేడియంలో ప్రపంచంలోనే బెస్ట్ సబ్‌ఎయిర్ సిస్టమ్ ఉండడం కాస్త ఊరట కలిగించే అంశం. నీరు వేగంగా ఇంకిపోయే అత్యుత్తమ వ్యవస్థ కలిగిన చిన్నస్వామి స్టేడియంలో వర్షం నిలిచాక అరగంటలో మైదానాన్ని ఆటకు సిద్ధం చేయొచ్చు. వర్షం పడి ఆగిన తర్వాత మైదానాన్ని సిద్ధం చేసేందుకు చిన్నస్వామి స్టేడియంలో అత్యాధునిక పద్ధతులు ఉన్నాయి. కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ పదేళ్ల నుంచి సబ్ ఎయిర్‌సిస్టమ్‌ను వినియోగిస్తోంది. పిచ్‌తో పాటు మైదానంలోని పచ్చిక కింద పలు లేయర్లలో ఇసుకను నింపారు. మిగతా మైదానాల్లో లేయర్లలో ఎక్కువగా మట్టిని నింపుతారు. చిన్నస్వామిలో ఇసుక ఉండటం వల్ల నీరు మైదానంలో ఉండకుండా.. మెషిన్ స్టార్ట్ చేయగానే బయటకు వచ్చేస్తుంది. 200 హార్స్‌పవర్ యంత్రాలతో సబ్‌ఎయిర్ సిస్టమ్ ఇక్కడ రన్ అవుతుంది. అక్కడి నుంచి నీటిని డ్రైనేజ్‌ల ద్వారా బయటకు పంపిస్తారు. అనంతరం డ్రయర్లు, రోప్స్‌తో గ్రౌండ్‌ను సిద్ధం చేస్తారు.
జ్యోతిక కూడా మొదలెట్టేసిందా.. పిక్స్ మాములుగా లేవుగా..
తమిళ స్టార్ హీరోయిన్ జ్యోతిక గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. తమిళ్లో వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది… తెలుగులో కూడా ఈమె సినిమాలు డబ్ అవుతున్నాయి. దాంతో ఇక్కడ జనాలకు కూడా సుపరిచితమే.. ఇక ఈ మధ్య బాలీవుడ్ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. అక్కడ కూడా తన సత్తాను కొనసాగిస్తుంది.. ఇక సోషల్ మీడియాలో ఈ మధ్య యాక్టివ్ గా ఉంటుంది.. లేటెస్ట్ ఫొటోలతో నింపేస్తుంది.. తాజాగా స్టైలిష్ లుక్ లో ఆకట్టుకుంది.. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ముంబైకు మాకాం మార్చిన జ్యోతిక అక్కడ కూడా వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది.. సైతాన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన జ్యోతిక మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఆ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. అదే జోష్ లో వరుస సినిమాలను లైన్లో పెడుతుంది. ముంబై కి షిఫ్ట్ అయ్యాక జ్యోతిక స్టైల్ మార్చేసింది… ఎప్పుడు పద్దతిగా కనిపించే ఈ అమ్మడు తాజాగా ట్రెండీ వేర్ లో అదరగొట్టింది.. స్టైలిష్ లుక్ తో పాటుగా మెడలో ధరించిన నగ కూడా అందరిని ఆకట్టుకుంది.. లైట్ మేకప్ తో హైహిల్స్ తో స్టిల్స్ దిగింది… ఆ ఫోటోలు సోషల్ తెగ వైరల్ అవుతున్నాయి.. ఓ వైపు లేడీ ఓరియంటెడ్ లు చేస్తూనే స్టార్ హీరోలతోనూ జోడి కడుతున్నారు జ్యోతిక.. మొత్తానికి అక్కడ కూడా అమ్మడు పాగా వేసింది… ఇక నెక్స్ట్ ఎలాంటి సినిమాలు చేస్తుందో చూడాలి..
ప్రభాస్ “కల్కి”నుంచి వచ్చేది ఆ ఒక్క పాటేనా..?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ “కల్కి 2898 ఏడి “..మహంతి ఫేమ్ నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా బిగ్గెస్ట్ పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కుతుంది.ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ ,లోకనాయకుడు కమల్ హాసన్ వంటి లెజెండరీ స్టార్స్ నటిస్తున్నారు.ఈ సినిమాలో దీపికా పదుకోన్ ,దిశా పటాని హీరోయిన్స్ గా నటిస్తున్నారు.ఈ సినిమా వైజయంతి మూవీస్ బ్యానర్ పై దాదాపు 500 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది. ఈ సినిమాను మేకర్స్ మే 9 నే విడుదల చేయాలనీ భావించిన కూడా కొన్ని కారణాల వాయిదా పడింది.ఈ సినిమాను మేకర్స్ జూన్ 27 న విడుదల చేస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.ఇదిలా ఉంటే ఈ సినిమాలో కేవలం ఒకే ఒక్క పాట ఉండనున్నట్లు సమాచారం.టాటక్కరా అంటూ సాగే ఈ పాట ప్రేక్షకులను ఎంతగానో మెప్పిస్తుందట..ఈ పాటలో ప్రభాస్ ,దిశా పటాని మధ్య వచ్చే స్టెప్స్ ఫ్యాన్స్ చేత విజిల్స్ వేయిస్తుందని సమాచారం.ఈ సినిమాకు సంతోష్ నారాయణ్అద్భుతమైన మ్యూజిక్ బాక్గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు.ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ మేకర్స్ భారీగా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.