మున్సిపల్ చైర్మన్ పదవికి రాజీనామా.. జేసీ సంచలన ప్రకటన
అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ పదవికి జేసీ ప్రభాకర్ రెడ్డి నెల రోజుల లోపు రాజీనామా చేస్తానని సంచలన ప్రకటన చేశారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రవ్యాప్తంగా జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో 74 మున్సిపాలిటీలలో వైసీపీ అధికారంలోకి రాగా.. తాడిపత్రి మున్సిపాలిటీని మాత్రం టీడీపీ కైవసం చేసుకుంది. జేసీ ప్రభాకర్ రెడ్డి తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ గా పదవి బాధ్యతలు స్వీకరించారు. అయితే, మున్సిపల్ చైర్మన్ గా ఎన్నికైనప్పుడు నాలుగు సంవత్సరాలలో మున్సిపల్ కౌన్సిలర్లను సంవత్సరానికి ఒకరు చొప్పున మున్సిపల్ చైర్మన్ గా.. మరికొంతమంది కౌన్సిలర్లను, మున్సిపల్ వైస్ చైర్మన్ గా ఎంపిక చేస్తామని ప్రకటించారు. ఇక, 2024 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ-బీజేపీ-జనసేన కూటమి అధికారం కైవసం చేసుకోవడంతో తన మున్సిపల్ చైర్మన్ పదవికి నెల రోజుల్లోపు రాజీనామా చేస్తున్నానని ప్రకటించారు జేసీ ప్రభాకర్‌రెడ్డి.. గత ఐదు సంవత్సరాల్లో తాడిపత్రిలో కుంటపడిన అభివృద్ధిని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తానని పేర్కొన్నారు.
తిరుపతి ఎంపీ సీటుపై బీజేపీలో ఆసక్తికర చర్చ..! ఓటమికి కారణం అదేనా..?
సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో సత్తా చాటింది కూటమి.. అయితే, నమ్మకంలేని స్థానాల్లో విజయం సాధించినా.. గెలుస్తాం అనుకున్న కొన్ని స్థానాలు కోల్పోవడంతో అసలు ఏం జరిగింది? అనేదానిపై ఫోకస్ పెడుతున్నారు నేతలు.. ఇక, తిరుపతి ఎంపీ సీటుపై బీజేపీలో ఆసక్తికరమైన చర్చ సాగుతోంది.. తిరుపతి పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ సీట్లు గెలిచినా.. ఎంపీ సీటు ఓడిపోవడానికి గల కారణాలపై అన్వేషణ మొదలుపెట్టారు పార్టీ నేతలు.. దీనికి ప్రధాన కారణం.. కూటమి నుండి క్రాస్ ఓటింగ్ జరగడమే అనే నిర్ధారణకు వచ్చారట.. అభ్యర్ధిగా వరప్రసాద్ ఎంపికే ఓటమి కారణంగా నిర్ణయానికి వచ్చారు స్థానిక నేతలు.. ఇక అత్యధికంగా గూడురులో 24 వేలకుపైగా క్రాస్ ఓటింగ్ జరిగినట్టు లెక్కలు వేస్తున్నారు.
నేటితో ముగియనున్న పిన్నెల్లి మధ్యంతర బెయిల్ గడువు..
నేటితో మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ముందస్తు మధ్యంతర బెయిల్ గడువు ముగియనుంది.. ఈవీఎం ధ్వంసం సహా మరో మూడు కేసుల్లో పిన్నెల్లిని అరెస్ట్ చేయవద్దు అంటూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయం విదితమే.. అయితే, కౌంటింగ్ నేపథ్యంలో ఇవాళ్టి వరకు అరెస్ట్ చేయవద్దని గతంలో ఆదేశాలు ఇచ్చింది ఏపీ హైకోర్టు.. ఈ రోజు విచారణ చేయనున్న వెకేషన్ బెంచ్.. అయితే, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్టుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది.. ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల సమయంలో.. ఈవీఎం ధ్వంసంతోపాటు, మరికొన్ని కేసుల్లో పిన్నెల్లిని అరెస్టు చేసే అవకాశం కనిపిస్తుంది.. నరసరావుపేటలో అనిల్ కుమార్ యాదవ్ నివాసంలో పిన్నెల్లి ఉన్నట్టు గుర్తించిన పోలీసులు.. అతడి కదలికలపై నిఘా పెట్టారు.. కోర్టు ఇచ్చిన గడువు ముగిసిన వెంటనే పిన్నెల్లిని అదుపులోకి తీసుకొని, అరెస్టు చూసే అవకాశం ఉందని తెలుస్తోంది.
చల్లటి కబురు.. తెలుగు రాష్ట్రాల్లో 5 రోజుల పాటు భారీ వర్షాలు..
తెలుగు రాష్ట్రాల్లో ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. రుతుపవనాల రాకతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని పేర్కొంది. రానున్న 3, 4 రోజుల్లో నైరుతి రుతుపవనాలు కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలు, కోస్తా ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలలోకి ప్రవేశించే అవకాశం ఉందని తెలిపారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఈదురు గాలులతో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురుస్తాయి. రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్ గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉంది. హైదరాబాద్‌లో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. సాయంత్రం, రాత్రి సమయాల్లో ఉరుములతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు, ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. ఇక హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. సెరిలింగంపల్లి, చందానగర్, మియాపూర్, మాదాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గంలో భారీ వర్షం కురిసింది. వర్షపు నీరు రోడ్లపై ప్రవహించింది. భారీ సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోవడంతో నగరం అంతా కిక్కిరిపోయింది.
కనుమరుగైపోతున్న కమ్యూనిస్టు పార్టీలు..
ఒకప్పుడు భారతదేశంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కమ్యూనిస్టు పార్టీ ప్రస్తుతం మనుగడ కష్టతరంగా మారింది. సీట్లు తగ్గడం వల్ల జాతీయ రాజకీయాల్లో వామపక్షాలు కూడా అప్రస్తుతం అవుతున్నాయి. ఇండియా కూటమిలో ఉన్నప్పటికీ, ఈ ఎన్నికల్లో నాలుగు వామపక్షాలు కేవలం ఎనిమిది సీట్లు మాత్రమే గెలుచుకోగలిగాయి. వారి సాంప్రదాయక కంచుకోటలైన కేరళ, పశ్చిమ బెంగాల్, త్రిపురలలో కూడా కమ్యూనిస్తు పార్టీల ప్రదర్శన చాలా పేలవంగా ఉంది. ఇక, స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కమ్యూనిస్ట్ పార్టీ మూడు ఎన్నికలకు ప్రధాన ప్రతిపక్ష పార్టీగా కొనసాగింది. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో కూడా కొన్నిసార్లు మూడో స్థానంలోనూ, కొన్నిసార్లు నాలుగో అతిపెద్ద రాజకీయ పార్టీగానూ నిలిచింది. అయితే, ఇంతలోనే కమ్యూనిస్టు పార్టీలో చీలిక రావడంతో కొత్త పార్టీలు కూడా ఏర్పడ్డాయి. ఈ ధోరణి 2004 వరకు కొనసాగింది. ఆ తర్వాత పశ్చిమ బెంగాల్‌లో వామపక్ష ప్రభుత్వం పడిపోవడంతో పార్లమెంట్‌లో వారి ప్రాతినిధ్యం కూడా తగ్గిపోయింది. అయితే, కేరళలో ఇప్పటికీ సీపీఐ(ఎం) నేతృత్వంలో వామపక్ష ప్రభుత్వం కొనసాగుతుంది. కానీ, అక్కడ ఒక్క సీటు మాత్రమే గెలుచుకోగలిగింది. గత ఎన్నికల్లో కూడా ఒకే ఒక్క సీటును సీపీఐం గెలుచుకుంది. అక్కడి సీపీఐ(ఎం) ఓట్ల శాతం 25.82 ఉండగా.. ఆ పార్టీకి 6.14 శాతం ఓట్లు వచ్చాయి. మొత్తం ఓట్లలో 32 శాతం ఓట్లు సాధించినా వామపక్షాలు ఒక్క సీటు మాత్రమే గెలుచుకోగలిగాయి. పశ్చిమ బెంగాల్, త్రిపురలో కనీసం ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. ఇక, పశ్చిమ బెంగాల్‌లో వామపక్షాలకు ఆరు శాతం ఓట్లు రాగా, త్రిపురలో దాదాపు 12 శాతం ఓట్లు పోల్ అయ్యాయి.
2004 నుంచి 2024 వరకు వామపక్షాల ఓట్ల శాతం ఇదే..
2004- 7.85
2009- 7.46
2014- 4.55
2019- 2.46
2024- 2.54
అణ్వాయుధాలు ప్రయోగించేందుకు సిద్ధంగా ఉన్నాం..
సార్వభౌమత్వాన్ని, ప్రాదేశిక సమగ్రతను కాపాడుకునేందుకు అణ్వాయుధాలను ప్రయోగించడానికి తాము వెనకాడబోమని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తెలిపారు. ఉక్రెయిన్ తో కొనసాగుతున్న వార్ అణుయుద్ధాలకు దారి తీస్తుందా? అన్న ప్రశ్నకు ఆయన ఈ మేరకు ఆన్సర్ ఇచ్చారు. బుధవారం ఆయన సెయింట్ పీటర్స్ బర్గ్‌లో అంతర్జాతీయ మీడియా ప్రతినిధులతో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. కాగా, అణు యుద్ధం పేరిట రష్యా భయోత్పాతం సృష్టిస్తోందంటూ అమెరికా చేస్తున్న తప్పుడు ఆరోపణలను అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తీవ్రంగా మండిపడ్డారు. వాస్తవానికి రెండో ప్రపంచ యుద్ధంలో అణ్వాయుధాన్ని వాడింది అమెరికాయేనని గుర్తు చేశారు. అయితే, ముప్పు పొంచి ఉన్నప్పుడు అణ్వాయుధ ప్రయోగానికి రష్యా చట్టాలు పర్మిషన్ ఇస్తాయని ఆయన చెప్పుకొచ్చారు. అణ్వాయుధ ప్రయోగానికి సంబంధించి రష్యాకు ఓ విధానం అనేది ఉంది.. మా ప్రాదేశిక సమగ్రత, సార్వభౌమత్వం ప్రమాదంలో ఉన్నప్పుడు మేము అణ్వాయుధాలు సహా అన్ని ప్రత్యామ్నాయాలను అనుసరిస్తామన్నారు. ఈ హెచ్చరికలను తేలిగ్గా తీసుకోవద్దు అంటు రష్యా అధ్యక్షుడు పుతిన్ వెల్లడించారు.
టీ20 క్రికెట్‌లో జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు.. అగ్రస్థానంలో పసికూన టీమ్స్ బౌలర్లు!
టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు నెలకొల్పాడు. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక మెయిడిన్ ఓవర్లు వేసిన భారత బౌలర్‌గా బుమ్రా నిలిచాడు. టీ20 ప్రపంచకప్ 2024లో భాగంగా బుధవారం రాత్రి న్యూయార్క్‌లోని నాసౌవ్ కౌంటీ స్టేడియంలో ఐర్లాండ్‌తో జరిగిన గ్రూప్-ఏ లీగ్ మ్యాచ్‌లో బుమ్రా ఈ ఫీట్ సాధించాడు. ఈ మ్యాచ్‌లో ఆరో ఓవర్‌ను బుమ్రా మెయిడిన్‌గా వేశాడు. టీ20ల్లో బుమ్రాకు ఇది 11వ మెయిడిన్ ఓవర్. ఈ క్రమంలో భువనేశ్వర్ కుమార్ (10) రికార్డును అధిగమించాడు. జస్ప్రీత్ బుమ్రా 63 మ్యాచ్‌ల్లో 11 ఓవర్లు మెయిడిన్‌గా వేశాడు. సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ 87 మ్యాచ్‌ల్లో 10 మెయిడిన్ ఓవర్లు వేశాడు. అయితే అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక మెయిడిన్ ఓవర్లు వేసిన జాబితాలో పసికూన టీమ్స్ ఉగాండ, కెన్యా బౌలర్లు అగ్రస్థానంలో ఉండడం విశేషం. ఉగాండా బౌలర్ ఎఫ్ నుసుబుగా 15 మెయిడిన్ ఓవర్లు వేసి అగ్రస్థానంలో ఉన్నాడు. కెన్యా బౌలర్ సోంగోచ్ 12 మెయిడిన్ ఓవర్లతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ఐసీసీ టాప్ 8 ర్యాంక్స్ జట్లలో అత్యధిక ఓవర్లు మెయిడిన్ చేసిన బౌలర్ మాత్రం బుమ్రానే.
చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ!
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు. అంతర్జాతీయ టీ20ల్లో భారత్‌కు అత్యధిక విజయాలు (43) అందించిన కెప్టెన్‌గా హిట్‌మ్యాన్ నిలిచాడు. టీ20 ప్రపంచకప్ 2024లో భాగంగా బుధవారం న్యూయార్క్‌లోని నాసౌవ్ కౌంటీ స్టేడియంలో ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో భారత్ విజయం సాధించడంతో రోహిత్ ఖాతాలో ఈ రికార్డు చేరింది. ఈ క్రమంలో టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ రికార్డును బ్రేక్ చేశాడు. ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌కు ముందు ఎంఎస్ ధోనీతో కలిసి రోహిత్ శర్మ అగ్రస్థానంలో ఉన్నాడు. ఐర్లాండ్‌పై విజయం అనంతరం టీ20ల్లో భారత్‌కు అత్యధిక విజయాలు అందించిన సారథిగా రోహిత్ చరిత్ర సృష్టించాడు. ఈ జాబితాలో ఎంఎస్ ధోనీ (42), విరాట్ కోహ్లీ (32) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. ఇక అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక విజయాలు సాధించిన జాబితాలో రోహిత్ నాలుగో స్థానంలో ఉన్నాడు. బాబర్ అజామ్ (46) అగ్రస్థానంలో ఉండగా.. బ్రియాన్ మసాబా, ఇయాన్ మోర్గాన్ (44) రెండో స్థానంలో ఉన్నారు.