సంక్రాంతి సంబరాలు.. నేడు కొత్తపేటలో ప్రభల తీర్థం
తెలుగులొగిళ్లలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి.. ముఖ్యంగా పల్లెల్లో పండగ సంబరాలు అంబరాన్ని తాకుతున్నాయి.. ఇక, కోనసీమ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుంది ప్రభల తీర్థం. సంక్రాంతి పండుగ వేళ ప్రభల తీర్థం జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది.. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో జరిగే ప్రభల తీర్థాలకు ఐదు శతాబ్దాల చరిత్ర ఉంది. నేడు కొత్తపేట ప్రభుత్వ హైస్కూల్లో ప్రభల తీర్థం జరగనుంది.. కొత్తపేటలోని పాత , కొత్త రామాలయ వీధుల నుండి ప్రభలను ఊరేగింపుగా తీసుకుని రానున్నారు నిర్వాహకులు.. భక్తుల దర్శనార్థం హై స్కూల్ గ్రౌండ్ లో ప్రభలు ఏర్పాటు చేస్తారు.. వేలాదిగా తరలివచ్చి ప్రభలను దర్శించుకోనున్నారు భక్తులు.. మరోవైపు.. సాయంత్రం 6 గంటల నుండి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు భారీ ఎత్తున బాణాసంచా కాల్చేందుకు ఏర్పాట్లు చేశారు నిర్వాహకులు.. ఆకాశం దద్దరిల్లేలా.. పోటాపోటీగా బాణాసంచా పేల్చనున్నారు.. అయితే, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు అధికారులు. ఇక, అంబాజీపేట మండలం మొసలపల్లి శివారు జగ్గన్నతోట తీర్థానికి జాతీయ స్థాయి గుర్తింపు ఉంది. తీర్థం జరిగే ప్రాంతంలో గుడి, గోపురాలు ఉండవు. కౌశిక నదిని ఆనుకుని ఉన్న కొబ్బరి తోటలో ఈ తీర్థం జరగడం ఇక్కడి ప్రత్యేకత. కాగా, పెద్దాపురం సంస్థానాదీశుడు రాజా వత్సవాయి జగన్నాథరాజు హయాంలో తొలిసారిగా 17వ శతాబ్ధంలో ఈ తీర్థాన్ని ప్రారంభించారని చెబుతుంటారు. జగ్గన్నతోటతో పాటు కొత్తపేట సెంటర్, అవిడి డ్యామ్ సెంటర్, కాట్రేనికోన, మామిడికుదురు మండలం కొర్లగుంట వంటి చోట్ల పెద్ద తీర్థాలు జరుగుతాయి. ఇవికాకుండా జిల్లా వ్యాప్తంగా 84 వరకూ తీర్థాలు నిర్వహిస్తారు.
అంగన్వాడీలను సంక్రాంతికి దూరం చేశారు.. వారి ఉసురు తగులుతుంది..!
ఆంధ్రప్రదేశ్‌లో అంగన్వాడీల సమ్మె కొనసాగుతూనే ఉంది.. నెల రోజుల దాటినా.. పలు మార్లు ప్రభుత్వం-అంగన్వాడీల మధ్య చర్చలు జరిగినా విఫలం అయ్యాయి.. దీంతో.. అంగన్వాడీలు సమ్మె కొనసాగిస్తూనే ఉన్నారు.. వారి ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు విపక్షాలు మద్దతు ప్రకటించాయి.. మీ ముఖ్యంగా కమ్యూనిస్టు పార్టీలు, కార్మిక సంఘాలు వారికి మద్దతుగా పోరాటాలు చేస్తున్నాయి.. అయితే, అంగన్వాడీలకు తానిచ్చిన హామీని అమలు చేస్తానని సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి స్వయంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ.. రాష్ట్రవ్యాప్తంగా ఒక లక్ష ఆరు వేల మంది అంగన్వాడీలను సంక్రాంతి పండుగకు దూరం చేశారని వైసీపీ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. ఇచ్చిన మాట అమలు చేసుంటే అంగన్వాడీలు రోడ్డేక్కేవారా..? అని ప్రశ్నించారు. అంగన్వాడీల సమస్యల పరిష్కారం కోసం చర్చలెందుకు జరపటం లేదు అని నిలదీశారు.. న్యాయమైన అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వంపైనే ఉందన్నారు. అయితే, సర్కార్‌కు అంగన్వాడీ కుటుంబాల ఉసురు తగిలి తీరుతుంది అంటూ వ్యాఖ్యానించారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. కాగా, నెలరోజుల దాటిని పట్టు వీడకుండా.. రోజుకో రూపంలో ఆందోళన కొనసాగిస్తూనే ఉన్నారు అంగన్వాడీలు.. ప్రభుత్వం ఎస్మా ప్రయోగించినా ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా ఆందోళనలు, నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటున్న విషయం విదితమే.
సంక్రాంతికి టీఎస్ఆర్టీసీ రికార్డు కలెక్షన్లు.. ఒక్క రోజే 52.78 లక్షల మంది జర్నీ..
ఈ సంక్రాంతి పండుగకు తెలంగాణ ఆర్టీసీ సరికొత్త రికార్డు సృష్టించింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా ప్రజలు ఇళ్లకు వెళ్లేందుకు ఆర్టీసీ బస్సులను వినియోగించుకున్నారు. మహా లక్ష్మి పథకంలో భాగంగా తెలంగాణ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయడం ద్వారా ఈసారి ఆర్టీసీకి భారీ స్పందన లభించింది. ఈ విషయాన్ని వైద్య ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్విట్టర్‌లో తెలిపారు. సంక్రాంతికి #TSRTC బస్సులకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డుస్థాయిలో నిన్న ఒక్క రోజే 1861 ప్రత్యేక బస్సులను వివిధ ప్రాంతాలకు సంస్థ నడిపింది. అందులో 1127 హైదరాబాద్ సిటీ బస్సులను ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉన్న కరీంనగర్, వరంగల్, విజయవాడ, ఖమ్మం, తదితర రూట్లలో తిప్పడం జరిగింది. సంక్రాంతి సందర్బంగా 4484 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయాలని సంస్థ ప్లాన్ చేయగా.. ప్రయాణికుల రద్దీ విపరీతంగా ఉండటంతో ఈ నెల 11, 12, 13 తేదిల్లోనే 4400 ప్రత్యేక బస్సులను నడపగా.. శనివారం వరకు మొత్తంగా 6261 ప్రత్యేక బస్సులను నడపడం జరిగింది. ఆదివారం కూడా 652 ప్రత్యేక బస్సులను ప్లాన్ చేయగా.. మధ్యాహ్నం వరకు 450 బస్సులను సంస్థ తిప్పింది. శనివారం ఒక్క రోజులోనే 52.78 లక్షల మందిని సురక్షితంగా గమ్యస్థానాలకు సిబ్బంది చేర్చారు. అందులో సగానికిపైగా మహిళా ప్రయాణికులే ఉన్నారు. మహాలక్ష్మి పథకాన్ని వినియోగించుకుని ఉచితంగా వారంతా సొంతూళ్లకు వెళ్లారు. ముందస్తు ప్రణాళికతో పాటు సిబ్బంది సమన్వయంతో పనిచేయడం వల్ల సంక్రాంతికి ఎలాంటి ఘటనలు జరగకుండా ప్రశాంతంగా ప్రయాణికులను సొంతూళ్లకు సంస్థ చేర్చింది. తొలిసారిగా బస్ భవన్ లో కమాండ్ కంట్రోల్ సెంటర్ ను ఏర్పాటు చేసి.. రద్దీకి అనుగుణంగా ప్రత్యేక బస్సులను ప్రయాణికులు అందుబాటులో ఉంచాం. సంక్రాంతికి ప్రశాంతంగా ప్రజలను సొంతూళ్లకు చేర్చడంలో పాలుపంచుకున్న టీఎస్‌ఆర్టీసీ సిబ్బంది, అధికారులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అని తెలిపారు.
నేడు శబరిమలలో మకర జ్యోతి దర్శనం..
శబరిమలకు అధిక సంఖ్యలో భక్తులు చేరుకున్నారు. ఇవాళ మకర జ్యోతి దర్శనం కోసం లక్షల సంఖ్యలో అయ్యప్ప స్వాములు వేచి చూస్తున్నారు. అత్యధిక మంది భక్తులు చేరుకోవడంతో శబరి కొండలు స్వామి శరణం అయ్యప్ప నినాదాలతో మారుమోగిపోతున్నాయి. ప్రతి ఏటా మకర సంక్రాంతి రోజున శబరిమలలో మకర జ్యోతి దర్శనం ఇస్తుంది. ఈ జ్యోతి దర్శనం చేసుకునేందుకు అయ్యప్ప భక్తులు లక్షల సంఖ్యలో అనేక రాష్ట్రాల నుంచి చేరుకోవడం సంప్రదాయంగా వస్తుంది. మకర జ్యోతి దర్శనం చేసుకుంటే తమకు మోక్షం లభిస్తుందని అయ్యప్ప భక్తులు భావిస్తారు. ఇక, అయ్యప్ప స్వామి మాల వేసుకునే ప్రతి ఒక్క భక్తుడు మకర జ్యోతి దర్శనం చూడాలని కోరుకుంటారు. జ్యోతి దర్శనం కోసం నలభై ఒక్క రోజుల పాటు అయ్యప్ప స్వామి మాల వేసుకుని కఠినమైన దీక్ష చేస్తారు. ఇక, శబరిమల కొండల్లో కనిపించే మకర జ్యోతి దర్శనం చేసుకుంటే.. తమ జీవితం ధన్యమయినట్లేనని భక్తులు నమ్ముతారు. అందుకే ఈరోజు శబరిమలకు లక్షల సంఖ్యలో భక్తులు వస్తారని ముందుగా అంచనా వేసుకుని ట్రావెన్ కోర్ దేవస్థానం అందుకు తగిన ఏర్పాట్లను పూర్తి చేసింది. నేటి సాయంత్రం మకర జ్యోతి దర్శనం కోసం అయ్యప్ప భక్తులు ఇప్పటి నుంచే శబరిమలకు క్యూ కడుతున్నారు.
నేడు గిరిజనుల కోసం ప్రధాని మోడీ కొత్త పథకం..
భారతదేశంలోని గిరిజనుల కోసం ప్రధాని నరేంద్ర మోడీ ఇవాళ పీఎం జన్‌మన్ పథకం(ఆదివాసుల అభివృద్ధి పథకం) పేరుతో కొత్త పథకాన్ని ప్రారంభిస్తున్నారు. తొలి విడతలో 100 జిల్లాల్లో ఈ పథకాన్ని ఆరంభించనున్నారు. ఈ పథకం ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని మోడీ వర్చువల్ గా నాగర్ కర్నూలు జిల్లా పరిధిలోని చెంచెలతో సమావేశమై మాట్లాడనున్నారు. ఈ పథకం ద్వారా తెలంగాణలో అదిలాబాద్, ఆసిఫాబాద్, నాగర్ కర్నూల్, వికారాబాద్ జిల్లాల్లో గిరిజనులు లబ్ధిపొందనున్నారు. ఈ పథకం అమలుతో 18 రాష్ట్రాల్లో 75 ఆదివాసి తెగలను గుర్తించి 24,104 కోట్లు కేటాయించగా, లక్ష ఇండ్లను నిర్మించనున్నారు. ఆదివాసీ గురుకుల విద్యాలయం(పీటీజీ)లో జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారులు అందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక, గిరిజనులతో ప్రధాని మాట్లాడేందుకు డిజిటల్ తెర ఏర్పాటు చేశారు. సమావేశానికి జిల్లా పరిధిలోని అన్ని పెంటల నుంచి చెంచులు, చెంచు ప్రజాప్రతినిధులు మొత్తం 800 మందికి ఆహ్వానం పంపించారు. ఇక, చెంచుల అభ్యున్నతికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పీఎం జన్‌మన్ పథకం అమలుపై సమావేశంలో వారికి మోడీ వివరించనున్నారు. ఈ పథకంలో భాగంగా పాఠశాలల నిర్మాణం, గృహాల నిర్మాణం, స్వయం ఉపాధి కల్పన, సౌర విద్యుత్ ఏర్పాటుతో పాటు అంశాలపై గిరిజనులతో ప్రధానమంత్రి మోడీ మాట్లాడుతారని జిల్లా గిరిజనాభివృద్ధి శాఖ అధికారి తెలిపారు.
అటల్ సేతుపై ఎక్కడ పడితే అక్కడ కార్లు, చెత్త కుప్పలు.. ఇలాంటి వారిని జైల్లో వేసేయండి మోడీ జీ
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జనవరి 12న అటల్ బిహారీ వాజ్‌పేయి సెవ్రీ-నవ శేవ అటల్ వంతెనను ప్రారంభించారు. నవీ ముంబైలో ఉన్న ఇది భారతదేశంలోని పొడవైన సముద్ర వంతెన. ప్రారంభమైనప్పటి నుండి వంతెనపై ప్రజలు ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చాలా మంది ఈ విజువల్స్‌పై కామెంట్స్ చేస్తూ భయానకంగా ఉన్నారు. వీడియోను షేర్ చేస్తూ ఓ నెటిజన్ “ఇది అటల్ సేతులో పిక్నిక్” అని రాసి వీడియోను షేర్ చేశాడు. కారు లోపల నుండి తీసిన వీడియోలో సముద్ర వంతెన వెంబడి అనేక కార్లు కనిపిస్తున్నాయి. ప్రజలు వంతెన ఒడ్డున నిలబడి లేదా దానిపై నడుస్తున్నట్లు కూడా కనిపిస్తారు. మరొక వీడియోలో ప్రజలు సముద్ర చిత్రాలను తీయడానికి రైలింగ్‌పైకి ఎక్కడం కనిపించారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో చూసి ప్రజలు కలత చెందారు. చాలా మంది ఈ సమస్యపై తమ స్పందనలు ఇచ్చారు. ఒక వినియోగదారు వ్యాఖ్యానిస్తూ.. “OMG! ఇవి భయానక దృశ్యాలు’ అని, మరొ నెటిజన్ వ్యాఖ్యానిస్తూ, ‘ప్రారంభించి ఒక రోజు మాత్రమే గడిచింది, ఈ వంతెనపై ఎటువంటి ఆంక్షలు లేవని తెలిసినప్పటికీ, ప్రజలు దీనిని పర్యాటక ప్రదేశంగా లేదా పిక్నిక్ స్పాట్‌గా పరిగణించడం ప్రారంభించారు.’ అంటూ రాసుకొచ్చాడు.
రియల్‌మీ నుంచి మరో రెండు స్మార్ట్ ఫోన్స్.. ఫీచర్స్ అదుర్స్..
ప్రముఖ మొబైల్ కంపెనీ రియల్ మీ ఇప్పుడు అదిరిపోయే ఫీచర్స్ తో మరో రెండు స్మార్ట్ ఫోన్లను మార్కెట్ లోకి విడుదల చేయనుంది . రియల్‌మీ 12 ప్రో సిరీస్‌లో భాగంగా రెండు ఫోన్లను లాంచ్ చేయనుంది. రియల్‌మీ 12 ప్రో, రియల్‌మీ 12 ప్రో ప్లస్ మార్కెట్ లోకి లాంచ్ చెయ్యనున్నారు.. ఈ రెండు ఫోన్‌లను రియల్‌మీ ఈ నెలలలో భారత మార్కెట్లోకి లాంచ్ చేయనున్నట్లు సమాచారం.. ఈ ఫోన్ల ఫీచర్స్, ధర ఎంతో ఇప్పుడు తెలుసుకుందాం.. ఈ కొత్త ఫోన్ల ఫీచర్స్ విషయానికొస్తే.. కర్వ్‌డ్ అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించనున్నట్లు తెలుస్తోంది. ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే ఈ స్మార్ట్ ఫోన్‌లో యూఐ5 వర్షన్‌పై ఔటాఫ్ బాక్స్‌ను అందించనున్నారు.. ఇక సెల్ఫీ ప్రియులకు పండగే అని చెప్పాలి.. ఈ స్మార్ట్ ఫోన్‌లో ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్‌ను అందించనున్నారు. రియల్ మీ 12 ప్రో+లో 64 ఎంపీతో కూడిన రెయిర్ కెమెరా, 32 ఎంపీతో కూడిన ఫ్రంట్ కెమెరాను అందించనున్నారు. ఇకపోతే ఈ స్మార్ట్ ఫోన్ బ్లాక్, ఆరెంజ్, క్రీమ్ కలర్ ఆప్షన్స్‌లో లభించనుంది. 6.7 ఇంచెస్‌తో కూడిన కర్వ్‌డ్ అమోలెడ్ డిస్ ప్లేను అందించనున్నారు. క్వాల్‌కామ్ స్నాప్ డ్రాగన్ 7ఎస్ జెన్2 చిప్ సెట్‌తో పనిచేసే ఈ ఫోన్‌లో 12 జీబీ ర్యామ్ విత్ 512 జీబీ స్టోరేజీని అందించనున్నారు.. ఫోన్ ఫీచర్స్ లీక్ అయ్యాయి.. కానీ ధర ఎంత అనేది మాత్రం అనౌన్స్ చెయ్యలేదు.. త్వరలోనే ఈ ఫోన్ల గురించి మరో ప్రకటన రాబోతుందని తెలుస్తుంది..
న్యూ స్టైలిష్ లుక్ లో సోదరా హీరో సంజోష్
హృదయ కాలేయం సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యారు సంపూర్ణేష్ బాబు. తనదైన నటనతో బర్నింగ్ స్టార్ గా కెరీర్ కొనసాగిస్తున్నాడు. ఆయన ఇటీవల ‘మార్టిన్ లూథర్ కింగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకున్నాడు. తమిళ నటుడు యోగిబాబు నటించిన బ్లాక్ బస్టర్ మూవీ ‘మండేలా’ చిత్రానికి రీమేక్‌గా ఈ సినిమా వచ్చింది. తెలుగులో ఈ సినిమాకు పూజ అపర్ణ కొల్లూరు దర్శకత్వం వహించింది. ఈ సినిమా ఇచ్చిన జోష్‌తో మరో క్రేజీ ప్రాజెక్ట్‌తో మన ముందుకు వస్తున్నాడు. సంపూర్ణేష్, సంజోష్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్న తాజా చిత్రం ‘సోదరా’. ఇట్స్ ఏ బ్రోమాంటిక్ స్టోరీ అనేది ఉప శీర్షిక. తాజాగా ఈ సినిమా నుంచి మరో లుక్ విడుదల చేశారు. ఇందులో మరో హీరో సంజోష్.. గతంలో రాజేంద్రప్రసాద్ లాంటి విలక్షణ నటుడితో ‘బేవర్స్’ సినిమాలో నటించారు. ఆ సినిమాలోని ‘తల్లి తల్లి.. నా చిట్టి తల్లి’ పాటకు ఇప్పటికీ జనాల్లో మంచి ఆదరణ ఉంది. ఇప్పుడు తన రెండో సినిమాగా సంపూర్ణేష్ బాబుతో సోదరా సినిమాతో వస్తున్నడు. ఇప్పటికే ఆ సినిమాకు సంబంధించిన రెండు పాటలు, ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. అతి త్వరలో సోదరా సినిమాని ప్రేక్షకులు ముందు తీసుకురానున్నారు మేకర్స్. ఈ సినిమాలో సంజోష్, బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబుతో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. అదే ఊపులో ఇంకొక రెండు ప్రాజెక్టులు ఒప్పుకున్నట్టుగా వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఈ యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో తన తదుపరి చిత్రాలకు ఎలాంటి కథలు ఎలా ఎంచుకోబోతున్నాడు.. ఎలా ప్రేక్షకులకు దగ్గరవుబోతున్నాడో చూడాలి. ప్రేక్షకులకు ఎలా దగ్గరవబోతున్నాడు అనేది వేచి చూడాల్సిందే. ఇది ఇలా ఉంటే కామెడీ బ్యాక్‌డ్రాప్‌లో వస్తున్న ఈ సినిమాకు మన్ మోహన్ మీనాంపల్లి దర్శకత్వం వహిస్తుండగా.. కాన్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ & మాంక్ ఫిల్మ్స్ బ్యానర్‌పై చంద్ర చాగన్ల నిర్మిస్తున్నాడు.
‘ది రాజా సాబ్’గా వస్తున్న ప్రభాస్.. ఫస్ట్ లుక్ చూశారా?
పాన్ ఇండియా హీరో ప్రభాస్.. డైరెక్టర్ మారుతి కాంబినేషన్ లో ఓ సినిమా రూపోందుతున్న సంగతి తెలిసిందే.. ఇటీవలే సలార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. ఆ సినిమా భారీ విజయాన్ని అందుకుంది.. ఇప్పుడు ప్రభాస్, మారుతీ సినిమా అప్డేట్ గురించి ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.. తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు.. ఈ సినిమా అప్డేట్ కోసం ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కు సంక్రాంతి ట్రీట్ ఇచ్చారు మేకర్స్.. సంక్రాంతి సందర్భంగా ఈ సినిమాను అధికారికంగా ప్రకటించారు. సినిమా అనౌన్స్మెంట్తో పాటు టైటిల్, ఫస్ట్ లుక్ కూడా ఇచ్చి ఫ్యాన్స్ను ఖుషీ చేశారు. ఈ సినిమాకు ‘ది రాజా సాబ్’ అని టైటిల్ ఫిక్స్ చేశారు. ప్రభాస్ కామెడీ టైమింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కానీ స్క్రీన్పై తన కామెడీ చూసి చాలా కాలం అయిపోయింది. రాజమౌళి ‘బాహుబలి సిరీస్’ తర్వాత ప్రభాస్ పూర్తిగా యాక్షన్ మోడ్లోకి వెళ్లిపోయారు. మధ్యలో ‘రాధే శ్యామ్’ చేసినా అది లవ్ స్టోరీ కాబట్టి తన కామెడీ కనిపించలేదు. మారుతి అంటే కామెడీ, కుటుంబ కథా చిత్రాలకు పెట్టింది పేరు.. ఈ సినిమా ప్రభాస్ కేరీర్ లో మరో సాలిడ్ హిట్ ను అందిస్తుందని ఫ్యాన్స్ అభిప్రాయ పడుతున్నారు.. ఈ సినిమా ఫస్ట్ లుక్ కూడా ప్రభాస్ గత చిత్రాల్లా పవర్ఫుల్గా కాకుండా బాగా కూల్గా, కొత్తగా, కలర్ఫుల్గా ఉంది. ఈ సినిమా ఒక హార్రర్ కామెడీగా తెరకెక్కనుందని ఓ ఇంటర్వ్యూ లో ప్రభాస్ చెప్పారు.. ఈ సినిమాలో హీరోయిన్, నటీ నటుల గురించి త్వరలోనే మేకర్స్ అనౌన్స్ చెయ్యనున్నారు..
గుంటూరు కారం 3రోజు కలెక్షన్స్.. అన్ని కోట్లు రాబడుతుందా?
మహేష్ బాబు,త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ గుంటూరు కారం.. సంక్రాంతి కానుకగా జనవరి 12 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.. ఈ సినిమా ఒకవైపు పాజిటివ్ టాక్ ను అందుకున్నా కూడా మరోవైపు కలెక్షన్స్ భారీగా తగ్గినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. ఎన్నో అంచనాలతో విడుదలైన ఈ సినిమాకు మిక్స్‌డ్ టాక్ వచ్చింది. కానీ, రెస్పాన్స్ మాత్రం భారీగానే లభిస్తోంది. ఈ నేపథ్యంలో మహేశ్ బాబు నటించిన ‘గుంటూరు కారం’ 3 రోజుల వసూళ్లను ఇప్పుడు చూద్దాం.. ఈ సినిమా మహేష్ బాబు హీరోగా నటించగా.. శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా చేశారు. అలాగే, ప్రకాశ్ రాజ్, జగపతిబాబు, జయరాం, రమ్యకృష్ణలు కీలక పాత్రలను పోషించారు. ఈ మూవీని హారిక హాసినీ క్రియేషన్స్ బ్యానర్‌పై రాధాకృష్ణ నిర్మించారు. థమన్ ఈ సినిమాకు సంగీతాన్ని సమకూర్చాడు… ఈ సినిమాకు నైజాంలో రూ. 42 కోట్లు, సీడెడ్‌లో రూ. 13.75 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ప్రాంతాలు అన్నీ కలిపి రూ. 46.25 కోట్ల బిజినెస్ అయింది. ఇలా మొత్తంగా తెలుగులో రూ. 102 కోట్లకు అమ్ముడైంది. అలాగే, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 9 కోట్లకు, ఓవర్సీస్ హక్కులు రూ. 20 కోట్లతో కలిపి మొత్తంగా రూ. 132 కోట్లు బిజినెస్ అయింది.. ఇక మూడో రోజు కలెక్షన్స్ ను చూస్తే.. ప్రేక్షకుల నుంచి స్పందన ఆశించిన స్థాయిలో రాలేదు. ఫలితంగా ఈ చిత్రం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలిపి రూ. 8 కోట్లు షేర్ వసూలు చేసింది. ప్రపంచ వ్యాప్తంగా రూ. 11 కోట్లు వరకూ రాబట్టింది.. ఇకపోతే ఏ ఏరియాలో ఎంత వసూల్ చేసిందనే విషయం తెలియాల్సి ఉంది.. హనుమాన్ సినిమా ఎఫెక్ట్ తోనే కలెక్షన్స్ తగ్గినట్లు ఫ్యాన్స్ అభిప్రాయ పడుతున్నారు..