మంత్రి రోజా భర్త ఆర్కే సెల్వమణిపై అరెస్ట్ వారెంట్..
ఆంధ్రప్రదేశ్ మంత్రి ఆర్కే రోజా భర్త ఆర్కే సెల్వమణికి అరెస్ట్ వారెంట్ జారీ చేసింది చెన్నై కోర్టు.. 2016లో చెన్నైలో ఓ తమిళ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు సెల్వమణి.. ఆ ఇంటర్వూయే ఆయనకు చిక్కులు తెచ్చిపెట్టింది.. ఎందుకంటే.. ఆ ఇంటర్వ్యూలో తనను కించపర్చేలా మాట్లాడారంటూ సెల్వమణిపై సినీ ఫైనాన్షియర్.. సెల్వమణిపై జార్జిటౌన్ కోర్టులో పరువునష్టం దావా కేసు వేశారు.. ఇక, కేసు విచారణకు హాజరుకాకపోవడంతో ఆర్కే సెల్వమణిపై అరెస్ట్ వారెంట్ జారీ చేసింది జార్జిటౌన్ కోర్టు.. మరి.. సెల్వమణి ఈ అరెస్ట్ వారెంట్‌ను ఎలా ఎదుర్కోబోతున్నారు అనేది ఆసక్తికరంగా మారింది.
ఏపీకి భారీ వర్ష సూచన.. ఇక, వానలే వానలు..
తెలుగు రాష్ట్రాలను వర్షాలు పలకరించడమే మానేశాయి.. అప్పుడప్పుడు.. ఓ మోస్తరు జల్లులు తప్ప.. పెద్ద వర్షం చూసి ఎన్ని రోజులు అయ్యిందోనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు.. ఇక, వర్షాలు ముఖంచాటేయడంతో.. మెట్ట పంటలకు నష్టం తప్పేలా లేదని గొల్లుమంటున్నారు రైతులు.. నైరుతి రుతు పవనాలు హ్యాండ్ ఇవ్వడంతో ఈ సీజన్‌లో వర్షాలు కానరాకుండా పోయాయి.. అయితే, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు గుడ్‌న్యూస్ చెప్పింది వాతావరణశాఖ.. వచ్చే నెలలో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తుంది.. నాలుగైదు రోజుల్లో తిరిగి వర్షాలు ప్రారంభమవుతాయని వాతావరణ నిపుణులు పేర్కొంటున్నారు.. ఆగస్టు ఆరంభం నుంచే రుతుపవన ద్రోణి హిమాలయాల వైపు ప్రయాణం చేసింది.. సాధారణంగా వారం పది రోజుల తర్వాత తిరిగి ఇది దక్షిణాది వైపు రావడం సహజంగా జరిగే ప్రక్రియ.. ఇక, ఈ ద్రోణి హిమాలయాల నుంచి కదిలి మధ్యప్రదేశ్‌పై కొన్నాళ్లు స్థిరంగా కొనసాగుతోంది.. ఇది క్రమంగా ఏపీకి విస్తరించనుంది.. దాని ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురవడానికి దోహదపడుతుందని అంచనా వేస్తున్నారు.. అయితే, ఈసారి భిన్నంగా మూడు వారాలకు పైగా హిమాలయాల వద్దే రుతుపవన ద్రోణి విస్తరించింది ఉంది.. ఆ ఫలితంగా హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్ ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి.. ఇక, రుతు పవన ద్రోణి దక్షిణాది వైపు కదలకపోవడంతో నైరుతి రుతుపవనాలు బలహీనమైపోయి.. ఏపీ సహా దక్షిణాది రాష్ట్రాల్లో వర్షాభావ పరిస్థితులు ఏర్పాడమే ప్రమాదం పొంచిఉంది. కానీ, ఈ ద్రోణి సెప్టెంబర్ 1వ తేదీ వరకు హిమాలయాల వద్దే కొనసాగి, ఆ తర్వాత దక్షిణాదికి మారుతుందని భారత వాతావరణ శాఖ తాజాగా అంచనా వేస్తుంది.. ఈ ప్రక్రియ మొదలైన నాలుగైదు రోజులకు రాష్ట్రంలో వర్షాలు స్టార్ట్ అవుతాయని.. సెప్టెంబర్ మొదటి వారం నుంచి వానలు సమృద్ధిగా కురిసేందుకు ఆస్కారం ఉంటుందంటున్నారు.. అంటే వచ్చే నెలలో ఏపీలో సాధారణం లేదా అంతకు మించి ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తోంది వాతావరణశాఖ.
ఎన్టీఆర్ స్మారక నాణెం.. హైదరాబాద్‌లో ఎక్కడ అమ్ముతారంటే?
తెలుగు జాతి గర్వించదగ్గ వ్యక్తి నందమూరి తారక రామారావు. సినీ నటుడిగా అగ్రగామిగా ఉన్న ఎన్టీఆర్ 9 నెలల్లోనే తెలుగుదేశం పార్టీని స్థాపించి అధికారంలోకి వచ్చి చరిత్ర సృష్టించారు. సినిమాలతో పాటు రాజకీయాల్లో కూడా రాణించిన అతి కొద్ది మందిలో ఎన్టీఆర్ ఒకరు. ఆయన శతజయంతి వేడుకల సందర్భంగా… నిన్న (ఆగస్టు 28) రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వంద రూపాయల స్మారక నాణాన్ని విడుదల చేశారు. నందమూరి కుటుంబసభ్యుల సమక్షంలో రాష్ట్రపతి భవన్‌లో ఈ కార్యక్రమం జరిగింది. ఈ నాణెం 50 శాతం వెండి, 40 శాతం రాగి, 5 శాతం నికెల్, 5 శాతం జింక్‌తో తయారు చేయబడింది. దేశంలోని ప్రముఖుల సేవలకు గుర్తుగా ఈ నాణేలను విడుదల చేశారు. రిజర్వ్ బ్యాంక్ ఇప్పటివరకు జవహర్‌లాల్ నెహ్రూ, నేతాజీ సుభాష్ చంద్రబోస్, రాజా రామ్మోహన్ రాయ్, మహాత్మా గాంధీ.. ఇతరుల స్మారక నాణేలను విడుదల చేసింది. ప్రత్యేక సందర్భాలలో గుర్తుగా RBI ఈ ప్రత్యేక నాణేలను విడుదల చేస్తుంది. తాజాగా ఎన్టీఆర్ సినిమాతో నాణెం విడుదల కావడంతో చాలా మంది తెలుగు వారు దీన్ని సొంతం చేసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. ఈ నాణెం ఎక్కడ, ఎలా కొనుగోలు చేయాలనే దానిపై ఆరా తీస్తున్నారు. ఈ నాణేలను భారత ఆర్థిక మంత్రిత్వ శాఖ అనుబంధ సంస్థ సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ విక్రయిస్తోంది. ఎన్టీఆర్ నాణెంతో సహా స్మారక నాణేలను www.indiagovtmint.in వెబ్‌సైట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఎన్టీఆర్ స్మారక నాణేలను నేటి నుంచి ఈ వెబ్‌సైట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఒక్కో నాణెం ధర రూ.4850గా నిర్ణయించారు. ఈ నాణేలు పసుపు, గోధుమ రంగులలో లభిస్తాయి. ఈ వెబ్‌సైట్‌లో ఎన్టీఆర్‌కు సంబంధించిన ముఖ్యమైన వివరాలు క్లుప్తంగా వ్రాయబడ్డాయి. ఈ సైట్‌లో బంగారం, వెండి నాణేలు కూడా అమ్ముడవుతాయి. హైదరాబాద్‌లో కొనుగోలు చేయాలనుకునే వారు నేరుగా సైఫాబాద్‌లోని మింట్ సేల్ కౌంటర్‌లో కొనుగోలు చేయవచ్చు. చర్లపల్లిలోని ఐజీ మింట్ సేల్ కౌంటర్‌లో కూడా వీటిని కొనుగోలు చేయవచ్చు. ఒక్కో నాణెం దాదాపు రూ.5 వేలు? అని ఆశ్చర్యపోతున్నారా..? అధిక ధర ఉన్నప్పటికీ, అన్నగారిని అభిమానించే చాలా మంది ఈ నాణేన్ని కొనుగోలు చేస్తారనడంలో సందేహం లేదు.
సోలార్ మిషన్ ఆదిత్య ఎల్-1 ఎప్పుడు లాంచ్ అవుతుంది.. బడ్జెట్ ఎంత ?
చంద్రయాన్-3 మిషన్ విజయవంతం అయిన తర్వాత భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఇప్పుడు సూర్యుని గురించి సమాచారాన్ని సేకరించేందుకు సెప్టెంబర్ 2, 2023న సూర్యుని దగ్గరకు ప్రయాణం చేయనుంది. ఇది భారతదేశం మొదటి సోలార్ మిషన్. భారతదేశపు మొట్టమొదటి సోలార్ మిషన్ ఆదిత్య-ఎల్1 శ్రీహరికోట నుండి 2 సెప్టెంబర్ 2023న భారత కాలమానం ప్రకారం ఉదయం 11.50 గంటలకు ప్రయోగించబడుతుంది. ఆదిత్య-L1 సూర్యుని బయటి పొర పరిశీలన కోసం తయారు చేయబడింది. L1 లాగ్రాంజ్ పాయింట్ ద్వారా భూమి నుండి 1.5 మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉన్న సూర్యుని దగ్గరకు ప్రయాణిస్తుంది. సూర్యుడు, భూమి గురుత్వాకర్షణ శక్తులు ఆకర్షణ, వికర్షణ క్షేత్రాన్ని సృష్టించే ప్రదేశంలో ‘లాగ్రాంజ్ పాయింట్లు’ అనేవి. నాసా ప్రకారం వ్యోమనౌక స్థిరమైన స్థితిలో ఉండటానికి అవసరమైన ఇంధన వినియోగాన్ని తగ్గించడానికి వీటిని ఉపయోగించవచ్చు. ఆదిత్య-ఎల్1 మిషన్ ఇస్రో PSLV-XL రాకెట్‌లో సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ (SDSC-SHAR) శ్రీహరికోట నుండి ప్రయోగించబడుతుంది. ప్రారంభంలో వ్యోమనౌక భూమి దిగువ కక్ష్యలో ఉంచబడుతుంది. ఆ తర్వాత ఈ కక్ష్య అనేక రౌండ్లలో భూమి కక్ష్య నుండి బయటకు తీయబడే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. తర్వాత దానిని ఉపయోగించి లాగ్రాంజ్ పాయింట్ (L1) వైపు ప్రయోగించబడుతుంది.
ప్రపంచకప్ జట్టులో చోటు దక్కకుంటే.. ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు: రోహిత్ శర్మ
ప్రపంచకప్ జట్టులో ఆడాలని ప్రతి క్రికెటర్ కలలు కంటాడు. బాగా ఆడినా కూడా కొన్నిసార్లు జట్టులో చోటు దక్కదు. జట్టు కూర్పు కారణంగా ఇలా జరుగుతుంటుంది. 2007 టీ20 ప్రపంచకప్‌లో ఆడిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు 2011 వన్డే ప్రపంచకప్‌లో చోటు దక్కలేదు. దాంతో ఎంతో బాధతో గదిలో కూర్చుని ఏడ్చాడు. 2023 వన్డే ప్రపంచకప్ నేపథ్యంలో ఆనాటి చేదు జ్ఞాపకాలను రోహిత్ గుర్తుచేసుకున్నాడు. బెంగళూరులో ఆసియా కప్ 2023 శిబిరంలో చేరడానికి ముందు పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో రోహిత్ పలు విషయాలు పంచుకున్నాడు. ‘2011 ప్రపంచకప్ జట్టును ప్రకటించాక నేను నా గదిలో భాదతో కూర్చుని ఉన్నా. ఏం చేయాలో తెలియలేదు. ఆ సమయంలో యువరాజ్ సింగ్ నన్ను తన గదికి పిలిచాడు. ఇద్దరం కలిసి డిన్నర్‌కు వెళ్లాం. ప్రపంచకప్ జట్టులో చోటు దక్కకుంటే ఎంత బాధ ఉంటుందో చెప్పాడు. నువ్వు ఇంకా చాలా ఏళ్లు క్రికెట్ ఆడగలవు, బాగా కష్టపడు అని సలహా ఇచ్చాడు. నైపుణ్యాలను పెంచుకుని జట్టులోకి వస్తే.. నువ్వు మళ్లీ భారత్‌కు ఆడకుండా ఉండే అవకాశం లేదన్నాడు. నీకు ప్రపంచకప్‌లో ఆడే అవకాశం తప్పక వస్తుందని యువీ చెప్పాడు’ అని రోహిత్ శర్మ తెలిపాడు.
స్విట్జర్లాండ్‌లో ఉద్యోగం వదిలేశాడు.. అరటి సాగుతో రూ.100కోట్లు సంపాదించాడు
అరటిపండు తినడానికి దాదాపు అందరూ ఇష్టపడతారు. విటమిన్ సి, డైటరీ ఫైబర్, విటమిన్ B6, మాంగనీస్‌తో సహా అనేక రకాల పోషకాలు అరటిపండులో ఉంటాయి. ఇది దాదాపు భారతదేశం అంతటా సాగు చేయబడుతుంది. అరటి సాగు చేసి లక్షాధికారులుగా మారిన ఇలాంటి రైతులు దేశంలో ఎందరో ఉన్నారు. అయితే విదేశాల్లో మంచి ఉద్యోగం వదిలేసి ఇండియాకి వచ్చి అరటి సాగు ప్రారంభించి అనతికాలంలోనే కోట్లాది రూపాయల సామ్రాజ్యాన్ని నెలకొల్పిన అలాంటి వ్యక్తి గురించి తెలుసుకుందాం. ఇప్పుడు అతను విదేశాలకు కూడా అరటి పండ్లను సాగు చేస్తున్నాడు. ఈ రైతు పేరు అలోక్ అగర్వాల్. అతను ముంబై నివాసి. గతంలో అలోక్ స్విట్జర్లాండ్‌లోని బనానా ఎక్స్‌పోర్ట్‌లో లాజిస్టిక్స్ పని చేసేవాడు. ఇక్కడ అతను అరటిపండ్ల ఎగుమతి-దిగుమతుల గురించి పూర్తి సమాచారాన్ని సంపాదించాడు. ఆ తర్వాత ఉద్యోగం వదిలేసి ఇండియా వచ్చి అరటిపండు వ్యాపారం మొదలుపెట్టాడు. 2015లో ట్రైడెంట్ ఆగ్రో పేరుతో కంపెనీని ప్రారంభించాడు. ఆ తర్వాత ఈ కంపెనీ ద్వారా భారత్‌కు అరటిపండ్లను ఎగుమతి చేయడం ప్రారంభించాడు. విశేషమేమిటంటే ఈ కంపెనీ కూడా కాంట్రాక్ట్ ఫార్మింగ్ ద్వారా అరటి సాగు చేస్తోంది. అలోక్ అగర్వాల్ అరటిపండ్లను ఎగుమతి చేయడమే కాకుండా చిప్స్, స్నాక్స్‌లను కూడా తయారు చేస్తున్నాడు. దీనితో పాటు ఇతర అరటి ఉత్పత్తులను కూడా తయారు చేస్తారు. ప్రస్తుతం అతని కంపెనీ ఏటా రూ. 100 కోట్ల టర్నోవర్‌ను కలిగి ఉంది.
కనీసం అలాంటప్పుడు కూడా సెలవు ఇవ్వరు: కానిస్టేబుల్ ఆవేదన
ఒత్తిడితో కానిస్టేబుల్స్ చాలా మంది ఆత్మహత్య చేసుకున్న ఘటన ఈ మధ్యకాలంలో కలకలం రేపింది. ఉత్తరప్రదేశ్ లో వీరి పరిస్థితి మరీ దారుణంగా మారింది. దీని గురించి ఆవేదన వ్యక్తం చేస్తూ ఓ కానిస్టేబుల్ సోషల్ మీడియాలో 4 నిమిషాల వీడియోను పోస్ట్ చేశాడు. ఈ వీడియో చూస్తే కన్నీళ్లు వచ్చేలా ఉంది. వివరాల ప్రకారం యూపీలోని బాగ్‌పట్ పోలీస్ డిపార్టుమెంట్‌కు చెందిన కానిస్టేబుల్ ఓం వీర్‌సింగ్ రాష్ట్రంలో వారి దుస్థితి గురించి ఓ వీడియో పోస్ట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.గడిచిన రెండేళ్లలో దాదాపు 10 నుంచి 12 మంది కానిస్టేబుళ్లు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఈ విషయాన్ని ఉటంకిస్తూ తమపై చాల ఒత్తిడి ఉంటుందని, తమకు ఎందుకు ఇలాంటి దుస్థితి అని ఓం వీర్ ప్రశ్నించారు. పాల్పడ్డారని, రెండు రోజుల క్రితం కూడా అయోధ్యలో ఒక కానిస్టేబుల్, మీరట్‌లో ఒక కానిస్టేబుల్ తమ సర్వీస్ రైఫిల్స్‌లో కాల్చుకుని ప్రాణాలు తీసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ఓం వీర్‌సింగ్ దుఃఖం ఆపుకుంటూ చెప్పిన ఓ విషయం గుండెలను పిండేస్తుంది. ఈ ఏడాది జూలై 20న తన సోదరి మరణించిందని, దాంతో సెలవు కావాలని అడిగితే పై అధికారులు ఇవ్వలేదని, తాము మనుషులం కాదా అని ప్రశ్నించారు. ఇక స్వస్థలంలో కాకుండా వేరే చోట తమ పోస్టింగ్ ఉంటుందని, కనీసం స్వగ్రామంలో పోస్టింగ్ వేసిన తమ వారి సెలవులు లేనప్పటికి తమ వారిని చూసుకుంటూ ఉంటామని వీర్ సింగ్ పేర్కొ్న్నారు. దూరప్రాంతంలో పోస్టింగ్ వల్ల రోజులు తరబడి అక్కడే ఉండాల్సి వస్తుందని, ఆఖరికి మనుషులు మరణించినా వెళ్లలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఉన్నతాధికారులు ఇప్పటికైనా కానిస్టేబుళ్ల పరిస్థితి అర్థం చేసుకోవాలని కోరుతున్నారు. ఈ వీడియో చూస్తే గుండె తరుక్కపోతుందని, చాలా బాధగా ఉందని నెటిజన్లు పేర్కొంటున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ వీడియో చూసి అయినా ఉన్నతాధికారులు మారతారో లేదో చూడాలి మరి.
తెలుగు సినిమా రాతని మార్చిన ఈయన్ని కింగ్ అనకుండా ఎలా ఉంటారు?
ఈరోజు తెలుగు సినిమా బౌండరీలు దాటి మార్కెట్ పెంచుకుంది, మన మేకింగ్ స్టాండర్డ్స్ కి హాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ కూడా ఫిదా అవుతున్నారు. ఇప్పుడున్న టాప్ మోస్ట్ డైరెక్టర్స్ అందరినీ ఇన్స్పిరె చేసింది నిస్సందేహంగా రామ్ గోపాల్ వర్మ మాత్రమే. మూస ధోరణిలో సాగుతున్న తెలుగు సినిమా మత్తుని వదిలించిన వాడు రామ్ గోపాల్ వర్మ. మేకింగ్ అంటే ఇలా ఉండాలి, సౌండ్ ని ఇలా వాడాలి, లైటింగ్ ఇలా చేయాలి, కెమెరా ఇలా కదలాలి అని చేసి చూపించి తెలుగు సినిమా మాత్రమే కాదు ఇండియన్ సినిమా మేకింగ్ ని పూర్తిగా మార్చేశాడు రామ్ గోపాల్ వర్మ. ఆర్జీవీ ఇంత గొప్ప వాడు అయితే అతనిలోని టాలెంట్ ని గుర్తించి, అతనికి మొదటి అవకాశం ఇచ్చిన నాగార్జున విజన్ ఇంకెలాంటిదో అర్ధం చేసుకోవచ్చు. రామ్ గోపాల్ వర్మని నమ్మి నాగార్జున చేసిన శివ సినిమా ఇండియన్ సినిమా ఫేట్ ని మార్చేసింది. ఆర్జీవీని మాత్రమే కాదు నాగార్జున ఏ కొత్త దర్శకుడితో టాలెంట్ ఉన్నాఅందరికన్నా ముందు గుర్తించి అవకాశం ఇచ్చేవాడు. అందుకే నాగార్జున చేసినన్ని ప్రయోగాలు, నాగార్జున ఇంట్రడ్యూస్ చేసినంత మంది కొత్త దర్శకులని ఇంకొకరు ఇంట్రడ్యూస్ చేయలేదు. మూడున్నర దశాబ్దాల సినిమా కెరీర్ లో ఇప్పటివరకూ 98 సినిమాలు చేసిన నాగార్జున, దాదాపు 42 మంది కొత్త దర్శకులని ఇండస్ట్రీకి పరిచయం చేసాడు. ఈరోజు అనౌన్స్ అవ్వనున్న 99వ సినిమాతో 43వ కొత్త దర్శకుడు ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాడు. డైరెక్టర్స్ ని మాత్రమే కాదు నాగార్జున దాదాపు 100 మంది కొత్త టెక్నీషియన్స్ ని ఇండస్ట్రీకి ఇచ్చాడు. నాగార్జున ఇంట్రడ్యూస్ చేసిన డైరెక్టర్స్ లిస్టులో మలయాళ స్టార్ డైరెక్టర్ ప్రియదర్శన్, ఫాజిల్, మహేష్ భట్, వైవీఎస్ చౌదరి, వీఆర్ ప్రతాప్, ఆర్ ఆర్ షిండే, దశరథ్, సూర్య కిరణ్, లారెన్స్, కళ్యాణ్ కృష్ణ లాంటి డైరెక్టర్స్ ఉన్నారు. ఈరోజు లారెన్స్ లాంటి ఖోరియోగ్రాఫర్, వంద కోట్ల హీరో-డైరెక్టర్ గా మారాడు అంటే అది నాగార్జున ఇచ్చిన సపోర్ట్ కారణంగానే అని ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇలా కెరీర్ ఆసాంతం తన మార్కెట్ ని రిస్కుతో పెడుతూ కొత్త టాలెంట్ కి అవకాశాలు ఇస్తున్న ఉన్న ఏకైక హీరో నాగార్జున మాత్రమే, అందుకే ఆయన్ని కింగ్ అంటారందరు.
కింగ్ నాగ్ నటించిన ఐకానిక్ మూవీస్ ఇవే…
అక్కినేని నాగేశ్వర రావు నట వారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు నాగార్జున. యువసామ్రాట్ నాగార్జున నుంచి కింగ్ నాగ్ అనిపించుకునే వరకూ ఎదిగిన నాగార్జున, తెలుగు సినిమా సీనియర్ హీరోల్లో మోస్ట్ స్టైలిష్ అండ్ హ్యాండ్సమ్ హీరో. ఫ్యామిలీస్ లో ఈయనకున్న క్రేజ్, అమ్మాయిల్లో ఈయనకున్న ఫాలోయింగ్ మరో హీరోకి లేదు. చూడగానే లాంగ్ హెయిర్ తో, వెల్ బిల్ట్ బాడీతో బాలీవుడ్ హీరోల ఉంటాడు నాగార్జున. ఈ కారణంగానే అప్పట్లో నాగార్జున నుంచి ప్రేమ కథా చిత్రం వచ్చింది అంటే చాలు అమ్మాయిలు థియేటర్స్ కి వెళ్లడానికి ముందుండే వాళ్లు. ఆ తర్వాత అన్నమయ్య లాంటి సినిమాలు చేసి ఫ్యాన్స్ కి కూడా షాక్ ఇచ్చాడు నాగార్జున. ఇక్కడి నుంచి నాగార్జున చూపించిన వేరియేషన్స్, ఆయన ఫ్యాన్ బేస్ ని మరింత పెంచింది. ఆ రేంజ్ ఫాలోయింగ్ నాగార్జున సొంతం చేసుకోవడానికి హెల్ప్ అయిన సినిమాలేంటో చూద్దాం. ఇప్పటివరకూ 98 సినిమాలు చేసాడు నాగార్జున… అందులో ఐకానిక్ గా నిలబడిన సినిమాలు ఎన్నో ఉన్నాయి. విక్రమ్ నుంచి మొదలుపెడితే మజ్ను, ఆఖరి పోరాటం, విక్కీ దాదా, గీతాంజలి, శివ, కిల్లర్(సినిమా యావరేజ్ అయ్యింది కానీ నాగార్జున లుక్స్ కి సూపర్ క్రేజ్ వచ్చింది), ఖుదాగవా, అల్లరి అల్లుడు, హలో బ్రదర్, క్రిమినల్, ఘరానా బుల్లోడు, సిసింద్రీ, నిన్నే పెళ్లాడతా, అన్నమయ్య, నువ్వు వస్తావని, సంతోషం, మన్మథుడు, శివమణి, మాస్, కింగ్, రగడ, శ్రీ రామదాస్, మనం, సోగ్గాడే చిన్ని నాయన, ఊపిరి లాంటి సినిమాలు నాగార్జున టాప్ హీరోగా నిలబెట్టాయి.కమర్షియల్, ఎక్స్పరిమెంటల్, ఎంటైనర్స్ అనే తేడా లేకుండా కథ నచ్చితే మార్కెట్ గురించి ఆలోచించకుండా డేర్ చేసి నాగార్జున సినిమా చేసే వాడు. అందుకే నాగార్జున ఫిల్మోగ్రఫీలో అన్ని వేరియేషన్స్ ఉన్నాయి. ఏ స్టార్ హీరోకి కూడా ఇన్ని వేరియేషన్స్ ఉన్న ఫిల్మోగ్రఫీ లేదేమో.