*నేడే ఇంటర్ రిజల్ట్
తెలంగాణ ఇంటర్ ఫలితాలు నేడు ఉదయం 11 గంటలకు విడుదల కానున్నాయి. ఇంటర్ విద్యా మండలి కార్యాలయంలో విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం విడుదల చేయనున్నట్లు ఇంటర్ విద్యా మండలి కార్యదర్శి శృతి ఓజా తెలిపారు. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షల ఫలితాలు ఒకేసారి విడుదల కానున్నట్లు వెల్లడించారు. ఫలితాల కోసం https://ntvtelugu.com/telangana-first-year-intermediate-results-2024 NTV వెబ్‌సైట్‌లోనూ చెక్ చేసుకోవచ్చు. రాష్ట్రంలో ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు జరిగిన సంగతి తెలిసిందే.ఈ ఏడాది ఇంటర్ పరీక్షలకు దాదాపు 9,80,978 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇందులో.. ఇంటర్ ప్రథమ సంవత్సరం విద్యార్థులు 4,78,527 మంది కాగా, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 4,43,993 మంది ఉన్నారు. వృత్తి విద్యా కోర్సులకు సంబంధించి మొదటి సంవత్సరం 48,277 మంది విద్యార్థులు, ద్వితీయ సంవత్సరంలో 46,542 మంది విద్యార్థులు ఉన్నారు. మరోవైపు తెలంగాణ 10వ తరగతి పరీక్ష ఫలితాలు ఈ నెల 30న విడుదల కానున్నాయి. ఆ రోజు ఉదయం 11 గంటలకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కార్యాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి బుర్రా వెంకటేశం దీనిని విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని SSC బోర్డు అధికారికంగా ప్రకటించింది. తెలంగాణలో మార్చి 18 నుంచి ఏప్రిల్ 2 వరకు పదో తరగతి పరీక్షలు నిర్వహించగా.. రాష్ట్రవ్యాప్తంగా 5,08,385 మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో 2,57,952 మంది బాలురు కాగా, 2,50,433 మంది బాలికలు. సమాధాన పత్రాల స్పాట్ వాల్యుయేషన్ ప్రక్రియ ఏప్రిల్ 3 నుంచి ప్రారంభమైంది. ఏప్రిల్ 20న మూల్యాంకనం పూర్తికాగా.. రాష్ట్రంలోని 11 జిల్లాల్లోని 19 కేంద్రాల్లో ఈ వాల్యుయేషన్ ప్రక్రియ చేపట్టారు.
*విద్యార్థులకు గుడ్ న్యూస్.. నేటి నుంచి వేసవి సెలవులు..
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విద్యార్థులు ఎగిరి గంతేసే వార్తను విద్యాశాఖ ప్రకటించింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులకు వేసవి సెలవులను నేటితో ప్రారంభం కానున్నాయని ప్రకటన జారీ చేసింది. ఇవాల్టి నుంచి 50 రోజుల పాటు ఎంజాయ్ చేసేందుకు ప్లాన్ వేసుకున్నారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో వన్ డే స్కూల్స్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే… తెలంగాణలో మార్చి 15 నుంచి హాఫ్ డే స్కూల్స్ ప్రారంభంకాగా నిన్నటితో ముగిసాయి. దీంతో రాష్ట్రంలోని అన్ని పాఠశాలలు నేటి నుంచి జూన్ వరకు వేసవి సెలవులను ప్రభుత్వం ప్రకటించింది. సమ్మేటివ్ అసెస్‌మెంట్-2 పరీక్షలు సోమవారం జరిగింది. పేరెంట్స్ మీటింగ్ నిర్వహించి ఆన్ లైన్ ప్రోగ్రెస్ కార్డులు ఇచ్చారు. నేటి నుంచి జూన్ 11 వరకు విద్యార్థులకు దాదాపు 50 రోజుల పాటు వేసవి సెలవులు ఉండనున్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత జూన్ 12 నుంచి ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు పునఃప్రారంభమవుతాయి. ఈ మేరకు అధికారులు ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేశారు. ఇక ఇంటర్ కాలేజీ విద్యార్థులకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులను ప్రకటించిన విషయం తెలిసిందే. మార్చి 30 నుండి మే 31 వరకు ఉంటాయని తెలిపింది. అంటే వారు సుమారు రెండు నెలల పాటు సెలవులు ఆనందించనున్నారు. ఇంటర్ విద్యార్థులకు జూన్ 1న కాలేజీలు పునఃప్రారంభంకానున్నాయి. ఇక ఏపీలో కూడా నేటి నుంచి వేసవి సెలవులు ప్రారంభం కానున్నాయి. జూన్ 12న పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. ఇంటర్ కాలేజీ విద్యార్థులకు ఇప్పటికే సెలవులు ప్రారంభమయ్యాయి. మే 31 వరకు ఇవి కొనసాగనున్నాయి.జూన్ 1 నుంచి కాలేజీలు పున:ప్రారంభం కానున్నాయి.ఇప్పటికే రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. మే నెలకు ముందే భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. జూన్ మూడో వారం వరకు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. అదే జరిగితే.. పాఠశాలలకు వేసవి సెలవులు పొడిగించే అవకాశం ఉందని, అప్పటి పరిస్థితిని బట్టి అధికారులు నిర్ణయం తీసుకుంటారు.
*నేటితో ముగియనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర.
వై నాట్ 175 టార్గెట్‌గా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన బస్సు యాత్ర నేటితో ముగియనుంది. సాయంత్రం అక్కవరం సభ తర్వాత తాడేపల్లికి చేరుకోనున్నారు సీఎం జగన్. రేపు(ఏప్రిల్ 25) పులివెందులలో నామినేషన్ వేస్తారు. సిద్ధం, మేమంతా సిద్ధం తరహాలోనే.. మరో విడత ప్రచారానికి కూడా వైసీపీ నేతలు ప్రణాళిక సిద్ధం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఇవాళ్టితో ముగియనుంది. నేడు శ్రీకాకుళం జిల్లాలోకి జగన్ బస్సు యాత్ర ప్రవేశించనుంది. ఈరోజుకు జగన్ బస్సు యాత్ర 22వ రోజుకు చేరుకుంది. రాత్రి బస చేసిన అక్కివలస నుంచి ఉదయం 9 గంటలకు బయలుదేరుతారు. రోడ్ షో ద్వారా ఎచ్చెర్ల బైపాస్, శ్రీకాకుళం బైపాస్, నరసన్న పేట బైపాస్, కోటబొమ్మాళి, కన్నెవలస మీదుగా పరుశురాంపురం జంక్షన్ వద్దకు చేరుకుంటారు. టెక్కలిలో బహిరంగ సభ… అక్కడ భోజన విరామానికి ఆగుతారు. అనంతరం కె. కొత్తూరు మీదుగా టెక్కలి వద్దకు చేరుకుని అక్కడి జరిగే సభలో జగన్ ప్రసంగిస్తారు. దీంతో జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర ముగిస్తుంది. అనంతరం హెలిప్యాడ్ నుంచి విశాఖ ఎయిర్‌పోర్ట్ చేరుకుని.. అక్కడి నుంచి గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు చేరుకోనున్నారు. రోడ్డు మార్గాన తాడేపల్లిలోని సీఎం క్యాంప్ ఆఫీస్‌కు చేరుకోనున్నారు. రేపు ఏఫ్రిల్ 25న పులివెందుల అభ్యర్థిగా నామినేషన్ వేస్తారు సీఎం వైఎస్ జగన్. పులివెందుల బహిరంగ సభ ద్వారా మరో విడత ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. సిద్ధం, మేమంతా సిద్ధం తరహాలోనో అంతకుమించి అన్నట్టు ప్రచారాన్ని పరుగులు పెట్టించేలా ప్రణాళిక సిద్ధం చేశారు ముఖ్యమంత్రి జగన్. ప్రతీరోజు మూడు నుంచి నాలుగు సభల్లో పాల్గొనేలా సీఎం జగన్ ప్రచార షెడ్యూల్ సిద్ధమవుతోంది. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా మార్చి 27న కడప జిల్లా ఇడుపులపాయ నుంచి మేమంతా సిద్ధం బస్సు యాత్ర ప్రారంభమైంది. సభలూ, వివిధ వర్గాలతో ముఖాముఖీలు, రోడ్ షోలు, జనానికి ఆత్మీయ పలకరింపులతో ముఖ్యమంత్రి జగన్ బస్సు యాత్ర సాగింది. మేమంతా సిద్ధం బస్సు యాత్రకు జనం బ్రహ్మరథం పట్టారు. మండుటెండలోనూ సీఎం జగన్‌కు అడుగడుగునా జనం నీరాజనం పలికారు. ఇప్పటివరకు 21 రోజుల పాటు 22 జిల్లాల్లో సాగిన బస్సు యాత్రలో 15 భారీ బహిరంగ సభల్లో పాల్గొని సీఎం జగన్ ప్రసంగించారు.
*నేటి నుంచి కేసీఆర్ బస్సు యాత్ర.. నేడు ఉమ్మడి నల్గొండ జిల్లాలో..
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర నిర్వహించనున్నారు. ఈ బస్సు యాత్ర మే 10వ తేదీ వరకు కొనసాగనుంది. సుమారు 17 రోజుల పాటు సాగే ఈ యాత్రకు ఎన్నికల సంఘం అనుమతి ఇవ్వడంతో పార్టీ అవసరమైన ఏర్పాట్లు చేస్తోంది. నేడు ఉమ్మడి నల్గొండ జిల్లాలో కేసీఆర్ బస్సుయాత్ర.. మిర్యాలగూడ నుంచి సూర్యాపేట వరకు కేసీఆర్ బస్సుయాత్ర కొనసాగనుంది. బీఆర్‌ఎస్ విడుదల చేసిన టూర్ షెడ్యూల్ ప్రకారం సూర్యాపేట, వరంగల్, కరీంనగర్, మహబూబ్‌నగర్, ఖమ్మం, నిజామాబాద్ జిల్లా కేంద్రాలతో పాటు రామగుండం, కొత్తగూడెం, వీణవంక ప్రాంతాల్లో కేసీఆర్ బస చేస్తారు. కేసీఆర్ పాల్గొనే ఒక రోడ్‌షోకి మరో రోడ్‌షోకి మధ్య దాదాపు 10 నుంచి 12 గంటల సమయం ఉంది. కాగా.. కేసీఆర్ బస్సు యాత్ర మిర్యాలగూడలో ప్రారంభమై సిద్దిపేట బహిరంగ సభతో ముగుస్తుంది. లోక్‌సభ ఎన్నికల్లో మెజారిటీ సీట్లను కైవసం చేసుకోవడమే లక్ష్యంగా కేసీఆర్ బస్సుయాత్ర ప్రారంభించనున్నారు. దాదాపు ప్రతి పార్లమెంట్ నియోజకవర్గం, ఒకటి రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో రోడ్ షోలు నిర్వహించే విధంగా బస్సు యాత్రను ప్లాన్ చేశారు బీఆర్ఎస్ వర్గాలు. తమ నియోజకవర్గాల్లోనూ కేసీఆర్ బస్సుయాత్ర చేయాలని వివిధ నియోజకవర్గాల నేతల నుంచి డిమాండ్ ఉండటంతో.. సమయాభావం, ఎండ వేడిమిని దృష్టిలో ఉంచుకుని పలు నియోజకవర్గాల్లో మాత్రమే బస్సుయాత్ర చేపట్టాలని నిర్ణయించారు. కేసీఆర్ బస్సు యాత్ర పొడవునా 100 మందికి పైగా వాలంటీర్లు వాహన శ్రేణి వెంట రానున్నారు. ఇప్పటికే ఎంపికైన వారికి తెలంగాణ భవన్‌లో అవగాహన కల్పించారు. ఇవాళ తొలిరోజు బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ముందుగా తెలంగాణ భవన్‌కు చేరుకోనున్నారు. అక్కడ తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తారు. పార్టీ క్యాడర్, నేతలతో భేటీ అనంతరం అక్కడి నుంచి మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత నల్గొండ జిల్లా మిర్యాలగూడలో తొలిరోడ్డు షోలో పాల్గొనేందుకు బయల్దేరి వెళ్లనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లనున్నారు. యాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన వస్తుందని, ప్రజలు ఉత్సాహంగా, స్వచ్ఛందంగా పాల్గొనేందుకు ముందుకు వస్తారని పార్టీ నేతలు చెబుతున్నారు. దీంతో ప్రజలు పెద్దఎత్తున నిలబడి ప్రసంగాన్ని దూరం నుంచి వినేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలకు ప్రజల్లో భారీ స్పందన వస్తుందని స్పష్టంగా భావిస్తున్నారు. కేసీఆర్ బస్సు యాత్ర, ప్రసంగాలతో మళ్లీ ప్రజల్లో వెళ్లనుండటంతో బీఆర్ఎస్ వర్గాల్లో జోష్ పెరిగింది.
*ఘోర రోడ్డు ప్రమాదం.. లారీని ఢీకొన్న కారు, ముగ్గురు దుర్మరణం
నెల్లూరు జిల్లా కావలి రూరల్ మండలం ముసునూరు టోల్ ప్లాజా దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీని ఓవర్ టేక్ చేయబోయి కారు వెనుక నుంచి ఢీకొన్న ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. వారిని ఆస్పత్రికి తరలించారు. మృతి చెందిన వారిలో ఇద్దరు మహిళలు ఉన్నారు. మృతులు పశ్చిమగోదావరి జిల్లా కొయ్యలగూడెంకు చెందిన వారిగా గుర్తించారు. చెన్నైలో ఇమిటేషన్ గోల్డ్ కొనుగోలు చేసి తిరిగి వెళుతుండగా ప్రమాదం చోటుచేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు.
*బీహార్‌లో ఘోర ప్రమాదం, గ్యాస్ సిలిండర్ పేలి చిన్నారి సహా 8 మంది మృతి
బీహార్‌లోని వైశాలిలోని బిదుపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నవనగర్ గ్రామంలోని ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ అకస్మాత్తుగా పేలడంతో ఇంట్లో ఉన్న సభ్యులు తీవ్రంగా కాలిపోయారు. ఇంట్లో గ్యాస్ సిలిండర్ శబ్దం వినిపించడంతో చుట్టుపక్కల గ్రామస్థులు గుమిగూడి, కాలిపోయిన వారందరినీ గ్రామస్థుల సాయంతో చికిత్స నిమిత్తం బీదుపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ఇక్కడ డాక్టర్ ప్రథమ చికిత్స తర్వాత అందరినీ హాజీపూర్ సదర్ ఆసుపత్రికి రెఫర్ చేశారు. గ్యాస్ సిలిండర్ పేలుడు ఘటనలో చిన్నారులు, మహిళలు, యువకులు అందరూ తీవ్రంగా కాలిపోయారు. గ్రామస్తుల సహాయంతో కాలిపోయిన వారందరినీ సదర్‌కు తీసుకురాగా, వారి పరిస్థితి విషమంగా ఉంది. ఇల్లు చిన్నది కావడం.. ఒక్కసారిగా గ్యాస్ సిలిండర్ నుంచి గ్యాస్ లీకేజీ వచ్చి ఆ తర్వాత గ్యాస్ సిలిండర్ పేలి పరిస్థితి తీవ్రమైందని స్థానికులు చెబుతున్నారు. ఆ తర్వాత సిలిండర్‌కు మంటలు అంటుకున్నాయి. దీని తర్వాత, ఒకరినొకరు రక్షించుకునే ప్రయత్నంలో, అందరూ ఒకరి తర్వాత ఒకరు కాలిపోయారు. అందరి శరీరం 50శాతం పైగా కాలిపోయిందని చెబుతున్నారు. ఇంట్లో పిల్లలతో సహా ఎనిమిది మంది ఉన్నారు. ఒకరి తర్వాత ఒకరు మంటల భారిన పడడంతో పూర్తిగా కాలిపోయారు. కాలిపోయిన వారందరినీ చందాదేవి భర్త మనోజ్ కుమార్, సోనమ్ దేవి భర్త సంజీవ్ కుమార్, సుధాంషు కుమార్ తండ్రి మనోజ్ కుమార్, హిమాన్షు కుమార్ తండ్రి మనోజ్ కుమార్, లక్ష్మి కుమారి తండ్రి సంజీవ్ కుమార్, రాజన్ కుమార్ తండ్రి మహేష్ షా, లీలాదేవి భర్త దివంగత మహేష్ సా. శంకర్ కుమార్ తండ్రి దివంగత మహేష్ సా. ప్రథమ చికిత్స అనంతరం అందరినీ మెరుగైన వైద్యం కోసం పీఎంసీహెచ్ పాట్నాకు తరలించామని సదర్ ఆస్పత్రి వైద్యుడు సంజయ్ కుమార్ సిన్హా తెలిపారు. ఈ ఘటనపై సమాచారం అందిన వెంటనే సదర్ ఆస్పత్రి వద్ద జనం గుమిగూడారు.
*మణిపూర్‌లో మళ్లీ కాల్పులు, అదనపు భద్రతా బలగాల మోహరింపు
మణిపూర్‌లో మైతేయి, కుకీ వర్గాల మధ్య మొదలైన కుల హింస అంతం కావడం లేదు. మణిపూర్‌లో మంగళవారం రాత్రి మరోసారి కాల్పుల ఘటన వెలుగు చూసింది. మణిపూర్‌లోని కుల హింస ప్రభావిత ప్రాంతమైన పశ్చిమ ఇంఫాల్‌లో ఈ కాల్పులు జరిగాయి. కాల్పుల అనంతరం ఆ ప్రాంతంలో శాంతిభద్రతల పరిరక్షణకు అదనపు భద్రతా బలగాలను కూడా మోహరిస్తున్నారు. అయితే ఈ కాల్పుల ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం లేదు. మణిపూర్‌లో ఇప్పటివరకు జరిగిన హింసలో 200 మందికి పైగా మరణించారు. వేలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. బలవంతంగా ఉన్న ప్రాంతాలను వదిలి పారిపోయారు. సోమవారం సాయంత్రం ఇక్కడ మళ్లీ కాల్పులు జరిగిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. భద్రతా బలగాలు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చాయి. ఇరువర్గాల మధ్య జరిగిన ఈ ఎన్‌కౌంటర్‌లో ఎలాంటి ప్రాణనష్టం జరిగినట్లు ప్రస్తుతం ఎలాంటి సమాచారం లేదని పోలీసులు తెలిపారు. పోలీసుల ప్రకారం, పశ్చిమ ఇంఫాల్‌లోని అవాంగ్ సెక్మాయ్, పొరుగున ఉన్న లువాంగ్‌సంగోల్ గ్రామాల నుండి భారీ కాల్పులు జరిగాయి. కాంగ్‌పోక్పి జిల్లాలోని ఎత్తైన ప్రదేశం నుండి ఒక వర్గానికి చెందిన సభ్యులు దిగి, అకస్మాత్తుగా ప్రత్యర్థి వర్గాలపై కాల్పులు జరపడం ప్రారంభించారు. దీనికి ప్రతిగా ఇతర వర్గాలు కూడా కాల్పులు జరిపాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఒక్కసారిగా కాల్పులు జరగడంతో భయాందోళనకు గురైన గ్రామస్తులు సురక్షిత ప్రాంతాలకు వెళ్లి కమ్యూనిటీ భవనాల్లో తలదాచుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అడపాదడపా కాల్పులు ఇంకా వెలుగులోకి వస్తున్నాయి. పరిస్థితిని అదుపు చేసేందుకు అదనపు భద్రతా బలగాలను రప్పించారు. అంతకుముందు, లోక్‌సభ ఎన్నికల మొదటి దశ సందర్భంగా, మణిపూర్‌లోని బిష్ణుపూర్ జిల్లా తమన్‌పోక్పిలో పోలింగ్ బూత్‌లో కాల్పులు జరిగాయి. ఇందులో ముగ్గురికి గాయాలయ్యాయి. కుకీ సంస్థలు ఎన్నికలకు ముందే లోక్‌సభ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించాయి. న్యాయం చేయకుంటే ఓటేయని నినాదం కూడా ఇచ్చారు.
*వీవీప్యాట్ లపై నమోదైన పిటిషన్ పై నేడు సుప్రీంకోర్టులో విచారణ
ఓటర్ వెరిఫైయబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్ (వీవీపీఏటీ)తో ఈవీఎంలను ఉపయోగించి పోలైన అన్ని ఓట్లను వెరిఫై చేయాలంటూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు బుధవారం తీర్పు వెలువరించనుంది. జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాలతో కూడిన ధర్మాసనం ఏప్రిల్ 18న నిర్ణయాన్ని రిజర్వ్ చేసింది. ఓటరు సంతృప్తి, ఎన్నికల వ్యవస్థపై విశ్వాసం, అతి ముఖ్యమైన ప్రాముఖ్యతను పరిగణనలోకి తీసుకున్న అత్యున్నత న్యాయస్థానం, ప్రతిదానిని అనుమానించకూడదని విచారణ సందర్భంగా పిటిషనర్లకు తెలిపింది. ఎన్నికల ప్రక్రియలో స్వచ్ఛత ఉండాలని గత విచారణలో సుప్రీంకోర్టు ఎన్నికల కమిషన్‌కు తెలిపింది. ఎన్నికలను స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు తీసుకున్న చర్యలను వివరంగా వివరించాలని ఎన్నికల సంఘాన్ని కోర్టు కోరింది. ఇది ఎన్నికల ప్రక్రియ అని జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాలతో కూడిన ధర్మాసనం పేర్కొంది. అందులో స్వచ్ఛత ఉండాలి. ఉన్న అవకాశాలను పూర్తి చేయడం లేదని ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు. వీవీప్యాట్‌తో పోలైన ఓట్లను ధృవీకరించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను విచారించిన సుప్రీంకోర్టు ధర్మాసనం ముందు హాజరైన ఈసీ అధికారి ఈవీఎంలు, వీవీప్యాట్‌ల పనితీరు గురించి వివరించారు. అంతకు ముందు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ (ఈవీఎం)పై విమర్శలు చేసిన వారిని సుప్రీంకోర్టు ఖండించింది. దేశంలో ఎన్నికలు నిర్వహించడం పెద్ద సవాలేనని, ఇలాంటి పరిస్థితుల్లో వ్యవస్థను వెనక్కు తీసుకెళ్లకూడదని కోర్టు పేర్కొంది. బ్యాలెట్ పేపర్‌తో ఎన్నికలు నిర్వహించి బ్యాలెట్ బాక్సులను దోచుకున్న సమయాన్ని కూడా సుప్రీంకోర్టు తన వ్యాఖ్యలో ప్రస్తావించింది. ఎన్జీవో ఏడీఆర్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్య చేసింది. వాస్తవానికి ఈవీఎంలలో పోలైన ఓట్లను వీవీప్యాట్ మెషీన్‌తో 100% క్రాస్ వెరిఫికేషన్ చేయాలని, తద్వారా ఓటరు సరైన ఓటు వేశారో లేదో తెలుసుకునేలా చూడాలని పిటిషన్‌లో కోరారు. అనేక యూరోపియన్ దేశాలు కూడా ఈవీఎంలను ఉపయోగించి బ్యాలెట్ పేపర్ ఓటింగ్‌కు తిరిగివచ్చాయని పిటిషన్‌లో పేర్కొంది. దీనిపై జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తా ధర్మాసనం మాట్లాడుతూ దేశంలో ఎన్నికలు నిర్వహించడం పెద్ద సవాల్ అని, ఏ యూరోపియన్ దేశమూ దీన్ని చేయలేదని అన్నారు. ఈవీఎంల పనితీరు, వాటి నిల్వకు సంబంధించిన మొత్తం సమాచారంతో సహా ఈవీఎంలకు సంబంధించిన మొత్తం సమాచారాన్ని కోర్టుకు అందించాలని ఎన్నికల సంఘం తరఫున హాజరైన న్యాయవాది మణీందర్ సింగ్‌ను ధర్మాసనం కోరింది. ఈవీఎంల ట్యాంపరింగ్‌కు పాల్పడిన వారికి శిక్ష విధించే నిబంధన ఏంటని ఎన్నికల సంఘం తరఫు న్యాయవాదిని కోర్టు ప్రశ్నించింది.