ఇంటర్ ఫలితాల్లో మొదటి స్థానంలో నిలిచిన జిల్లాలు ఇవే..
నేడు తెలంగాణలో ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలు విడుదలైన విషయం తెలిసిందే. ఇంటర్ బోర్డు కార్యాలయంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్ రెడ్డి ఫలితాలను విడుదల చేశారు. ఈ ఏడాది ఇంటర్ ఫస్టియర్, సెకండియర్‌తో కలిపి మొత్తం దాదాపు 9.97 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఫస్టియర్‌లో 66.89 శాతం, ద్వితీయ సంవత్సరంలో 71.37 శాతం ఉత్తీర్ణత సాధించారు. కాగా.. ఈ ఏడాది కూడా బాలికలదే పై చేయి.
బాబా రాందేవ్ వ్యాఖ్యలపై ఢిల్లీ హైకోర్టు సీరియస్
యోగా గురువు బాబా రాందేవ్ వ్యాఖ్యలను ఢిల్లీ హైకోర్టు తీవ్రంగా ఖండించింది. ‘షర్బత్ జిహాద్’ అనే పదాన్ని వాడడం ఏ మాత్రం సమర్థించలేమని పేర్కొంది. కోర్టు మనస్సాక్షిని దిగ్భ్రాంతికి గురిచేసిందని న్యాయస్థానం అభిప్రాయపడింది. ఇటీవల పతంజలి గులాబీ షర్బత్ కోసం ఒక ప్రమోషనల్ వీడియోను రాందేవ్ విడుదల చేశారు. అందులో కంపెనీ పేరు ప్రస్తావించకుండా ప్రముఖ స్క్వాష్ పానీయం రూహ్ అఫ్జాపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆ కంపెనీ షర్బత్ అమ్మడం వల్ల వచ్చే డబ్బును మసీదులు, మదర్సాలు నిర్మించడానికి ఉపయోగిస్తుందన్నారు. అదే పతంజలి గులాబీ షర్బత్ తాగితే వచ్చే డబ్బును గురుకులాలు, విశ్వవిద్యాలయాలు నిర్మించడానికి ఉపయోగపడతాయని చెప్పుకొచ్చారు. లవ్ జిహాద్, ఓటు జిహాద్ లాగానే ప్రస్తుతం షర్బత్ జిహాద్ కూడా జరుగుతోందని సంచలన వ్యాఖ్యలు చేశారు.
బ్యాంకాక్‌లో ఉద్యోగాలిప్పిస్తామని ఎర.. బందీగా రంగారెడ్డి యువత
బ్యాంకాక్ లో మంచి ఉద్యోగం ఇప్పిస్తామని ఆశ చూపి మయన్మార్ కేంద్రంగా సైబర్ ఫ్రాడ్ కేఫ్ లో బందీలుగా మారి బలవంతంగా సైబర్ వెట్టిచాకిరికి గురవుతున్న తెలంగాణకు చెందిన యువతకు విముక్తి లభించింది. వీరిలో ముగ్గురు తెలంగాణకు చెందిన వారు కాగా, మరొకరు ఏపీకి చెందిన వ్యక్తి. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆదేశాల మేరకు కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ప్రత్యేక చొరవ తీసుకుని వీరిని స్వదేశానికి రప్పించారు. బ్యాంకాక్ లో మంచి జాబ్ ఉందని, ప్రతినెలా లక్షల రూపాయల జీతం వస్తుందని బ్రోకర్ ఆశ చూపడంతో వీరంతా నిజమేనని నమ్మి మోసపోయారు. ఇదే విషయంపై రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ మండలం కోహెడకు చెందిన మయన్మార్ బాధితుడు రాకేష్ రెడ్డి మాట్లాడుతూ.. ‘‘మా ఏరియాలో ఉండే యశ్ నాథ్ గౌడ్ అనే వ్యక్తి బ్యాంకాక్ లో మంచి ఉద్యోగం ఉందని ఆశ చూపడంతో నిజమేనని నమ్మా. జగిత్యాలలోని బ్రోకర్ల ఏజెంట్ ( టీం లీడర్) వంశీకృష్ణ వద్దకు తీసుకుపోయిండు. వంశీకృష్ణే నన్ను ఇంటర్వ్యూ చేశాడు. బ్యాంకాక్ కు 200 కి.మీల దూరంలోనే జాబ్ అని చెప్పి తీసుకుపోయారు. తీరా అక్కడికిపోతే రోజుకు 16 గంటల పని అప్పగించారు. ఆ పని ఏందంటే సైబర్ క్రైమ్. ఆ పని చేయకపోతే భోజనం కూడా పెట్టకపోయేవాళ్లు. 5 నెలలు ఆ కంపెనీలో పనిచేశా. అట్లాంటి పనిచేయడం నాకిష్టం లేక మొండికేశా. దీంతో అక్కడున్న చైనీస్ వాళ్లు నా పాస్ పోర్టు గుంజుకున్నరు. అన్నం కూడా పెట్టకుండా హింసించారు. అయినా వినకపోవడంతో వాళ్లు అక్కడున్న ఆర్మీ వాళ్లకు చెప్పి మేం దొంగతనంగా ఆ దేశానికి వచ్చామని చెప్పి ఆర్మీ వాళ్లకు పట్టించారు. వాళ్లు మమ్ముల్ని జైల్లో వేశారు’’ అని బాధితుడు వాపోయారు.
22 ఏళ్ళ తర్వాత హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎన్నికలకు పోలింగ్.. సర్వం సిద్ధం!
హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక కు సర్వం సిద్ధమైంది. రేపు జీహెచ్ఎంసీలో హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 వరకు పోలింగ్ జరగనుంది. రేపు జరిగే ఎన్నికకు ఏప్రిల్ 25న కౌంటింగ్ చేసి ఫలితాల ప్రకటిస్తారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలోనే పోలింగ్, కౌoటింగ్ కు ఏర్పాట్లు చేశారు. రేపటి ఎన్నికకు ఎక్స్ అఫిషియో సభ్యులు, కార్పొరేటర్లకు రెండు వేరువేరు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఎంఐఎం, బీజేపీ పార్టీల మధ్య జరగనున్న ఎమ్మెల్సీ పోటీ జరగనుంది.. ఎంఐఎం అభ్యర్థిగా మీర్జా రియాజ్ ఉల్ హాసన్, బీజేపీ అభ్యర్థిగా గౌతమ్ రావు బరిలోకి దిగనున్నారు.. ఎన్నికలో మొత్తం ఓటర్లు సంఖ్య 112.. అందులో కార్పొరేటర్ల సంఖ్య 81.. ఎక్స్ ఆఫీషియో సభ్యుల సంఖ్య 31 ఉంది..
సుప్రీంకోర్టుపై మరోసారి ఉప రాష్ట్రపతి సంచలన వ్యాఖ్యలు
దేశ సర్వోన్నత న్యాయస్థానంపై ఉప రాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్‌ఖర్ మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుప్రీంకోర్టు కంటే పార్లమెంటే ఎక్కువ అని వ్యాఖ్యానించారు. మంగళవారం ఉదయం ఢిల్లీ విశ్వవిద్యాలయంలో పాల్గొన్న ఆయన ఈ మేరకు న్యాయస్థానంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగ పరమైన అంశాల్లో ఎన్నికైన ప్రజాప్రతినిధులే అల్టిమేట్ మాస్టర్స్ అని పేర్కొన్నారు. పార్లమెంట్ కంటే అత్యుత్తమమైంది ఉందని రాజ్యాంగంలో ఎక్కడా లేదన్నారు. పార్లమెంటే అన్నింటికీ సుప్రీం అని తేల్చి చెప్పారు. ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీ సమయంలో ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరిగిందని గుర్తుచేశారు.
అధికారులు భూ భారతి చట్టాన్ని దుర్వినియోగం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం..
యాదాద్రి జిల్లాలోని వలిగొండ మండల కేంద్రంలో భూ భారతి అవగాహన సదస్సులో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ధరణి పోర్టల్ ప్రజలకు భారంగా మారింది అందుకే భూ భారతి తీసుకొచ్చాం అని పేర్కొన్నారు. ఇక, నలుగురు వ్యక్తులు చేసిన చట్టమే ధరణి.. ధరణి పోర్టల్ అమలు చేసే సమయంలో వంద రోజులు రిజిస్ట్రేషన్లు జరగలేదని ఆరోపించారు. భూ భారతి చట్టం అందరి ఆమోదయోగ్యంతో చేశామని తేల్చి చెప్పారు. మే 1వ తేదీ నుంచి 28 జిల్లాలోని ఒక్కో మండలాన్ని పైలట్ ప్రాజెక్టుగా సెలెక్ట్ చేసుకుని అమలు చేస్తాం అని మంత్రి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు.
రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రత.. అధికార యంత్రాంగం సంసిద్ధంగా ఉండాలని ఆదేశాలు..
వడ దెబ్బతో మృతి చెందినవారి కుటుంబానికి రూ.4 లక్షల పరిహారం ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించినట్టు హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత… తాడేపల్లిలోని విపత్తు నిర్వహణ సంస్థ కార్యాలయంలో హోంమంత్రి అనిత సమీక్ష నిర్వహించారు.. వడగాల్పులు, రాబోయే వర్షాకాలానికి సంసిద్ధతపై చర్చించారు.. ఈ సమీక్షలో హోం, విపత్తు నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత.. వాతావరణ మార్పులకు తగ్గట్లు అధికార యంత్రాంగం సంసిద్ధంగా ఉండాలని తెలిపారు.. ప్రణాళికతో సమయం నిర్దేశించుకుని ముందుకెళ్లాలి.. రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు పెరిగి వడగాల్పులు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.. గతేడాది నంద్యాలలోని గోస్పాడులో అత్యధికంగా 47.7డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయ్యింది.. రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలి.. 2025 ఏప్రిల్‌లో పల్నాడు జిల్లా నరసరావుపేటలో 43.7 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదు అయ్యిందని తెలిపారు.. 2014, 15, 16 సంవత్సరాల్లో అత్యధికంగా 49.1, 50.3, 48.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయ్యిందన్నారు.
పంచాయతీ సెక్రెటరీ మిస్సింగ్.. ఓ పార్టీకి చెందిన నాయకుడి టార్చర్తోనే..
రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లి గ్రామానికి చెందిన గ్రామ పంచాయతీ సెక్రటరీ అధికారిని మిస్సింగ్ లెటర్ జిల్లాలో కలకలం రేపుతుంది. గ్రామ పంచాయతీ సెక్రటరీ కనిపించకుండా పోయి తన తండ్రికి పంపిన లెటర్ వారిని తీవ్ర భయందోళనకు గురి చేస్తుంది. అయితే, ఓ పార్టీకి చెందిన స్థానిక నాయకుడి వల్ల విధులు చేయలేక పోతున్నాను అని కుటుంబ సభ్యులకు గ్రామ పంచాయతీ కార్యదర్శి ప్రియాంక తెలిపారు. అయితే, సోమవారం రోజున జిల్లా పంచాయతీ అధికారికి, తంగళ్లపల్లి ఎంపీడిఓకి తన రాజీనామా లెటర్ ను పంచాయతీ సెక్రటరీ ప్రియాంక వాట్సాప్ ద్వారా పంపించారు. దీంతో డీఎస్పీ కార్యాలయంలో కుటుంబ సభ్యులు మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చారు. ఇక, రంగంలోకి దిగిన పోలీసులు ప్రియాంక మొబైల్ నెంబర్ ట్రెస్ చేయగా.. ఆంధ్రప్రదేశ్ లో ఉన్నట్లు గుర్తించారు. పోలీసుల సహకారంతో హుటాహుటిన కుటుంబ సభ్యులు ఏపీకి బయలుదేర వెళ్లారు.
అమిత్‌షాతో చంద్రబాబు కీలక చర్చలు..
ఢిల్లీ పర్యటనలో బిజీబిజీగా గడుపుతున్నారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు.. పలువురు కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రానికి సంబంధించిన పలు సమస్యలపై చర్చించిన సీఎం చంద్రబాబు.. కేంద్ర హోంశాఖ మంత్రితో కీలక చర్చలు జరిపారు.. ప్రధానంగా రాజ్యసభ ఉప ఎన్నికలపై చర్చించినట్టుగా తెలుస్తోంది.. ఏపీ నుంచి ఖాళీ అయిన రాజ్యసభ స్ఖానాన్ని భర్తీ చేసే అంశంపై నిర్ణయం తీసుకున్నట్టుగా సమాచారం.. విజయసాయి రెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన రాజ్యసభ స్థానం భర్తీపై ప్రధానంగా చర్చ జరిగినట్టుగా చెబుతున్నారు.. నామినేషన్ దాఖలుకు ఈ నెల 29వ తేదీ తుది గడువు ముగియనుంది.
మళ్లీ అధికారం మాదే.. రాబోయే ఎన్నికల్లో 90 నుంచి 100 సీట్లు గెలుస్తాం..
నిజామాబాద్ జిల్లాలో పర్యటించిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ.. మాది రైతు ప్రభుత్వం.. అందుకే నిజామాబాద్ లో రైతు మహోత్సవం నిర్వహిస్తున్నామన్నారు. నూతన సాంకేతిక పరిజ్ఞానం రైతులకు అందించటమే రైతు మహోత్సవం యొక్క ప్రధాన లక్ష్యం అని తేల్చి చెప్పారు. ఇక, నిజాం సాగర్, శ్రీరాం సాగర్ ప్రాజెక్టుల పూడికను తీయటానికి త్వరలో టెండర్లు పిలుస్తామని ఆయన వెల్లడించారు. అయితే, బీఆర్ఎస్ రైతుల వ్యతిరేక పార్టీ.. బీఆర్ఎస్ రైతులను నట్టేటా ముంచింది అని ఆరోపించారు. రైతుల గురించి మాట్లాడే అర్హత బీఆర్ఎస్ పార్టీకి లేదని ఎమ్మెల్సీ మహేష్ గౌడ్ పేర్కొన్నారు.